అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా రాబర్ట్ ఓబ్రియన్... ట్రంప్ హయాంలో నాలుగో అధికారి

  • 19 సెప్టెంబర్ 2019
ట్రంప్‌తో ఓబ్రియన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక కొత్త ఎన్‌ఎస్‌ఏ ఓబ్రియన్‌తో అధ్యక్షుడు ట్రంప్

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా జాన్ బోల్టన్ స్థానంలో రాబర్ట్ ఓబ్రియన్‌ను దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నియమించారు. 2017 జనవరి నుంచి ట్రంప్ హయాంలో ఎన్‌ఎస్‌ఏగా నియమితమైన నాలుగో అధికారి ఓబ్రియన్.

జాన్ బోల్టన్‌కు ముందు హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్, మైకేల్ ఫిన్ జాతీయ భద్రతా సలహాదారులుగా పనిచేశారు.

ఎన్‌ఎస్‌ఏ నియామకానికి కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదు.

ఓబ్రియన్ ప్రస్తుతం అమెరికా విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేస్తున్నారు. ఇతర దేశాల్లో బందీలైన అమెరికన్ల విడుదలకు సంబంధించిన చర్చల విభాగానికి సారథ్యం వహిస్తున్నారు.

ఆగస్టులో స్వీడన్‌లో నిర్బంధంలోంచి అమెరికా సంగీతకారుడు ఏఎస్‌ఏపీ రాకీ విడుదలలో ఓబ్రియన్ పాత్ర ఉంది.

సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై సెప్టెంబరు 14 డ్రోన్ల దాడుల తర్వాత ఇరాన్‌, అమెరికా విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ అంశంతోపాటు అణ్వస్త్రాల నిర్మూలనకు ఉత్తర కొరియాను ఒప్పించడం, అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల సమస్య ఎన్‌ఎస్‌ఏగా ఓబ్రియన్ ముందున్న ప్రధాన సవాళ్లు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఓబ్రియన్

మేం ఒకరికొకరు బాగా తెలుసు: ట్రంప్

విదేశాంగ విధానంలో ఓబ్రియన్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. అమెరికాలో ప్రధానమైన రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీలకు ఆయన సేవలందించారు.

బుధవారం ఉదయం లాస్‌ఏంజిలిస్‌లో ట్రంప్, ఓబ్రియన్ మీడియాతో మాట్లాడారు.

బందీల విడుదల చర్చల విభాగంలో ఓబ్రియన్ అద్భుతంగా పనిచేశారని అధ్యక్షుడు చెప్పారు. తాము ఒకరికొకరు బాగా తెలుసన్నారు.

జాతీయ భద్రతా సలహాదారుగా నియమితమవడం తనకు లభించిన ప్రత్యేక గౌరవమని ఓబ్రియన్ సంతోషం వ్యక్తంచేశారు.

అమెరికాకు చాలా సవాళ్లు ఉన్నాయని, వీటిని ఎదుర్కోగల మంచి బృందమూ ఉందని, అమెరికాను సురక్షితంగా ఉంచేందుకు, అమెరికా సైనిక పునర్నిర్మాణాన్ని కొనసాగించేందుకు ఆ బృందంతోను, అధ్యక్షుడితోను తాను కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక జాన్ బోల్టన్ స్థానంలో ఓబ్రియన్ నియమితమయ్యారు.

ఓబ్రియన్ వృత్తిరీత్యా న్యాయవాది. విదేశాంగ విధానంపై రిపబ్లికన్లకు ఆయన సలహాలు అందించారు. వివిధ ప్రభుత్వాల్లో వేర్వేరు హోదాల్లో సేవలందించారు.

2005లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన్ను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో అమెరికా ప్రతినిధిగా నియమించారు. అప్పట్లో జాన్ బోల్టన్ ఐరాసలో అమెరికా రాయబారిగా ఉండేవారు. బోల్టన్‌తో ఓబ్రియన్ కలిసి పనిచేశారు.

విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రులు కండోలిజా రైస్, హిల్లరీ క్లింటన్‌లకు కూడా ఓబ్రియన్ సేవలు అందించారు.

ఉత్తర అమెరికా బీబీసీ ప్రతినిధి ఆంథోనీ జుర్చర్ విశ్లేషణ ప్రకారం- ట్రంప్ ఇంతకుముందు ఎన్‌ఎస్‌ఏగా నియమించిన మైకేల్ ఫిన్, హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ ఇద్దరూ మాజీ సైనిక ఉన్నతాధికారులు. ఓబ్రియన్ నియామకాన్ని బట్టి చూస్తే ఈ పదవి విషయంలో సైనిక ఉన్నతాధికారుల పట్ల ట్రంప్‌కు మొదట్లో ఉన్న ఆసక్తి తగ్గిపోతున్నట్లు భావించవచ్చు.

Image copyright AFP
చిత్రం శీర్షిక హెచ్‌ఆర్ మెక్ మాస్టర్‌తో అధ్యక్షుడు ట్రంప్

బోల్టన్‌ను ఎందుకు తప్పించారు?

బోల్టన్‌కు యుద్ధపిపాసిగా పేరుంది. ఈ నెల 11న ఎన్‌ఎస్‌ఏ పదవి నుంచి అధ్యక్షుడు ఆయన్ను తప్పించారు.

బోల్టన్ ఎన్‌ఎస్‌ఏగా ఉన్నప్పుడు విదేశాంగ విధానంలో అధ్యక్షుడు ట్రంప్‌తో తరచూ విభేదించేవారు.

ఇరాన్ పట్ల అమెరికా కఠినంగా వ్యవహరించాలన్న ట్రంప్ విధానం వెనుక బోల్టన్ ఉన్నారని, ఇటీవల ఇరాన్ నేతలతో చర్చలకు ట్రంప్ సానుకూలత కనబర్చడాన్ని బోల్టన్ తీవ్రంగా వ్యతిరేకించారని చెబుతారు.

రష్యా, అఫ్గానిస్థాన్, ఉత్తర కొరియాలతో అమెరికా కఠిన వ్యవహారశైలి వెనుకా బోల్టనే ఉన్నారని చెబుతారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక మైకేల్ ఫ్లిన్

ఫిబ్రవరిలో ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య సమావేశం అర్ధంతరంగా ముగియడానికి బోల్టనే కారణమని అమెరికా అధికారులు విమర్శిస్తుంటారు.

ఉత్తర కొరియా రాజీపడడానికి వీల్లేని, ఆమోదించే అవకాశమే లేని డిమాండ్లను కిమ్ ముందు ఉంచడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.

తాలిబన్లతో శాంతి చర్చలు వద్దని చెప్పింది కూడా బోల్టనే. తొలుత తాలిబన్ ప్రతినిధి బృందాన్ని చర్చలకు ఆహ్వానించి తర్వాత రద్దు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)