నిర్మలా సీతారామన్: కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు... లాభాలతో ఉరకలెత్తిన సెన్సెక్స్

  • 20 సెప్టెంబర్ 2019
నిర్మలా సీతారామన్ Image copyright ANI

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కంపెనీలకు విధించే కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు.

ప్రస్తుతం కార్పొరేట్ పన్ను రేటు 30 శాతంగా ఉంది. సర్‌ఛార్జ్, సెస్‌ను కూడా కలిపితే అది 34.94 శాతం.

కేంద్రం ఈ రేటును ఇప్పుడు 22 శాతానికి తగ్గించింది. రాయితీలు, ప్రోత్సాహకాలు వద్దనుకునే కంపెనీలకు ఈ రేటు వర్తిస్తుంది.

ఒక వేళ వాటిని పొందాలనుకుంటే.. సర్‌ఛార్జ్, సెస్ కలిపి కంపెనీలు 25.17 శాతం పన్ను కట్టాలి.

ఈ ఏడాది అక్టోబర్ 1 తర్వాత తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే సంస్థలకు రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోకుంటే 15 శాతం కార్పొరేట్ పన్ను రేటు వర్తిస్తుంది. సర్‌ఛార్జ్, సెస్ కలిపితే అది 17.01 శాతం. ఇదివరకు వాటికి 25 శాతం (సర్‌ఛార్జ్, సెస్ కలిపి 29.12 శాతం) కార్పొరేట్ పన్ను రేటు ఉండేది.

ఊహించని ఈ పరిణామంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా లాభాల పంట పండింది. ఒకే రోజు సెన్సెక్స్ 5.32 శాతం పెరిగింది.

గత పదేళ్లలో ఈ స్థాయి వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. మొత్తంగా సెన్సెక్స్ 1961 పాయింట్ల లాభంతో ముగిసింది.

Image copyright Getty Images

ప్రభుత్వ తాజా చర్యలు పెట్టుబడులకు, ఉద్యోగకల్పనకు ప్రోత్సాహకరంగా ఉంటుందని ఐసీఐసీఐ పరిశోధన విభాగం హెడ్ ఎ.ప్రసన్న అభిప్రాయపడ్డారు.

''చాలా కాలంగా ఎదురుచూస్తున్న చర్య ఇది. ఆర్థికమంత్రి సానుకూలమైన ప్రకటన చేశారు. కొత్త పన్ను రేట్లతో పరిశ్రమలకు ఉపశమనం దక్కుతుంది'' అని రాయిటర్స్ వార్తాసంస్థతో అన్నారు.

కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు సహా ఇతర ఉద్దీపన చర్యల వల్ల ఏటా ప్రభుత్వం రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం కోల్పోవాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

కార్పొరేట్ పన్ను తగ్గింపు చరిత్రాత్మక నిర్ణయమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇది గొప్ప ఊతమిస్తుందని ఆయన ట్వీట్ చేశారు.

‘‘ఈ చర్యతో ప్రపంచం నలుమూలల నుంచీ భారత్‌కు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ప్రైవేటు రంగంలో పోటీతత్వం పెరిగి, కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. 130 కోట్ల మంది భారతీయులకు లాభం చేసే చర్య ఇది’’ అని ఆయన ట్వీట్ చేశారు.

Image copyright Pti

జీడీపీ ఆరేళ్లలో అత్యంత కనిష్ఠం..

భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుతం ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత స్థూల జాతీయోత్పత్తి అంటే జీడీపీ, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే బలహీనంగా ఉంది.

2019-20 మొదటి త్రైమాసిక గణాంకాలను శుక్రవారం వెల్లడించారు. దాని ప్రకారం ఆర్థిక వృద్ధి రేటు 5 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం ఉంది.

అదే, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చూస్తే ఈ వృద్ధిరేటు 5.8 శాతం ఉంది.

ఇది గత 25 త్రైమాసికాల కంటే అత్యంత నెమ్మదిగా ఉన్న త్రైమాసిక వృద్ధి. మోదీ పాలనాకాలంలో అతి తక్కువ వృద్ధి ఇదే అని ఆర్థికవేత్త వివేక్ కౌల్ చెప్పారు.

ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం వరుసగా వివిధ చర్యలు తీసుకుంటోంది.

ఈ ఏడాది రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను నాలుగు సార్లు తగ్గించింది. ప్రస్తుతం వడ్డీరేట్లు పదేళ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)