ఏరియా 51: 'గ్రహాంతరవాసులను' చూడ్డానికి ఎంతమంది వచ్చారు? వచ్చినవారికి ఏమైంది

  • 21 సెప్టెంబర్ 2019
ఏరియా 51కి వచ్చినవారు Image copyright Getty Images

గ్రహాంతరవాసులను అమెరికా పట్టి బంధించి, వారిని రహస్యంగా ఉంచినట్లుగా ప్రచారంలో ఉన్న ఆ దేశ గుప్త రక్షణ స్థావరం 'ఏరియా 51'పై దండెత్తి.. గ్రహాంతరవాసులను చూసి వస్తామంటూ కొందరు ఫేస్‌బుక్ యూజర్లు చేసిన హడావుడి తేలిపోయింది.

శుక్రవారం(సెప్టెంబరు 20) వేలాది మంది ప్రజలు ఏరియా దండెత్తుతారని అమెరికా దేశ భద్రతాబలగాలు ఆందోళన చెందినా అలాంటిదేమీ జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

కేవలం పదుల సంఖ్యలో ప్రజలు మాత్రమే అక్కడకు చేరుకోగా వారిని దూరం నుంచే వెనక్కు పంపించారు.

ఫేస్‌బుక్‌లో కొందరు 'ఏరియా 51పై దండెత్తుదాం.. ఏలియన్స్‌ను చూసొద్దాం' అంటూ జూన్‌లో పిలుపునివ్వగా లక్షలాది మంది స్పందించారు.

నెవెడాలో ఉన్న ఆ గుప్త స్థావరంలో గ్రహాంతరవాసులున్నారన్న ప్రచారాలు ఉండడంతో ఆ రహస్యాలు బయటపెట్టేందుకు తామంతా బయలుదేరుతామంటూ లక్షలాది మంది ఫేస్‌బుక్ వేదికగా ఓకే చెప్పారు. అందుకు శుక్రవారం(సెప్టెంబరు 20) ముహూర్తంగా నిర్ణయించారు.

కానీ, శుక్రవారం అక్కడకు కొద్దిమందే చేరారు. వారు కూడా ఏరియా 51 వరకు రాలేదు.ఏరియా 51లోకి ఎవరూ ప్రవేశించలేదు.

అయితే, ఏరియా 51 ప్రధాన గేటు సమీపం వరకు ఒకే ఒక వ్యక్తి చేరుకున్నాడు. గేటు సమీపంలో మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణతో ఆయన్ను అరెస్ట్ చేశారు.

Image copyright Reuters

ఏరియా 51 గురించి జనం ఎందుకంతగా చర్చించుకుంటున్నారు?

కాలిఫోర్నియాకు చెందిన మేటీ రాబర్ట్స్ అనే విద్యార్థి ఈ ఏడాది జూన్‌లో.. భద్రతా దళాలను దాటుకుని ఏరియా 51లోకి వెళ్లేందుకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిస్తూ ఫేస్‌బుక్‌లో ఒక ఈవెంట్ క్రియేట్ చేశారు.

ఆ ఈవెంట్ క్రియేట్ చేసిన కొద్దిరోజులకే అది సంచలనంగా మారింది. ప్రపంచం వ్యాప్తంగా 30 లక్షల మంది తాము వస్తామంటూ ఆ ఈవెంట్‌కు స్పందించారు.

దాంతో అమెరికా వైమానిక దళం అప్రమత్తమైంది. ఏరియా 51 అమెరికా వైమానిక దళ బహిరంగ శిక్షణ స్థావరమని, ఆ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ఎవరూ రారాదని హెచ్చరించింది.

Image copyright Google maps

ఇంతకీ శుక్రవారం ఏమైంది? ఎంతమంది వచ్చారు?

ఫేస్‌బుక్‌లో స్పందించిన ప్రజల సంఖ్యతో పోల్చితే, ఏరియా 51 వరకు వచ్చిన వారి సంఖ్య చాలాచాలా స్వల్పం.

సుమారు 75 మంది ప్రధమ ప్రవేశ మార్గం వరకు వచ్చారు. అయితే, వారిలో ఎవరూ లోనికి వెళ్లేందుకు కనీసం ప్రయత్నించలేదు.

కొద్దిమంది ఏలియన్స్‌ వేషధారణల్లో, మరికొందరు ప్లకార్డులు పట్టుకుని వచ్చి హడావుడి చేశారు కానీ లోనికి వెళ్లే ధైర్యం మాత్రం ఎవరూ చేయలేదు.

'నేను చాలా నిరుత్సాహపడ్డాను, ఆన్‌లైన్లో చాలామంది స్పందించినా కొద్దిమందే వచ్చార'ని పోర్ట్‌లాండ్ నుంచి 1125 కిలోమీటర్లు కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన నాథన్ బ్రౌన్ అనే వ్యక్తి 'లాస్ వెగాస్ రివ్యూ జర్నల్' అనే పత్రికకు తెలిపారు.

Image copyright Reuters

ఇంతకీ ఈ ఏరియా 51 ఏమిటి?

అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో విమానాలను పరీక్షించే కేంద్రంగా దీన్ని ఏర్పాటుచేశారు.

ఈ స్థావరం గురించి బయటకు ఏమీ తెలియకుండా రహస్యంగా ఉంచడంతో దీని చుట్టూ అనేక ఊహాగానాలు, అనుమానాలు ముసురుకున్నాయి.

1947లో న్యూమెక్సికో ప్రాంతంలోని రాస్వెల్ వద్ద కూలిన ఓ గ్రహాంతరవాహనం, అందులో వచ్చిన రెండు గ్రహాంతరజీవుల శరీరాలు ఏరియా 51లో ఉన్నాయన్న అనుమానాలు, ప్రచారం ఒకటి ఉంది.

1947లో రాస్వెల్ వద్ద కూలింది వాతావరణ పరిశోధన బెలూన్ అని, అది గ్రహాంతరవాహనం కాదని, అందులో గ్రహాంతర జీవులు లేరని అమెరికా ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసినా ఏరియా 51పై ఇంకా చాలామందిలో అనుమానాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)