హౌడీ మోదీ: హ్యూస్టన్ సభతో నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్‌ల్లో ఎవరికేంటి లాభం? అమెరికాలోని భారతీయుల ఓట్లన్నీ ట్రంప్‌కేనా?

  • 21 సెప్టెంబర్ 2019
మోదీ, ట్రంప్ Image copyright Getty Images

అయిదేళ్ల కిందట నరేంద్ర మోదీ భారత ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో అడుగు పెట్టినప్పుడు.. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద మోదీకి లభించిన ఘన స్వాగతం ఆయన విజయాన్ని ప్రతిబింబించింది.

దశాబ్ద కాలం పాటు అమెరికాలో ప్రవేశ అనుమతి తిరస్కరణకు గురైన మోదీకి అలాంటి అపూర్వ స్వాగతం లభించడం సామాన్యమైనదేమీ కాదు.

ఇప్పుడు మళ్లీ మోదీ అమెరికాలో అంతకంటే పెద్దసంఖ్యలో అభిమానులనుద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆదివారం హ్యూస్టన్‌లో నిర్వహించే ఈవెంట్‌లో మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా పాల్గొంటున్నారు.

ఇటీవల కశ్మీర్ విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయం కారణంగా అంతర్జాతీయంగా వచ్చిన విమర్శల భారం నుంచి ఇది ఆయన్ను విముక్తుడిని చేస్తుందని చాలామంది భావిస్తున్నారు.

'హౌడీ మోదీ' పేరిట నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు 50 వేల మంది హాజరవుతారని అంచనా. భారతదేశం వెలుపల మోదీ మద్దతుదారులు ఇంత పెద్దసంఖ్యలో పోగవడం ఇదే తొలిసారి.

ట్రంప్‌తో కలిసి ఇలా అమెరికాలో సభ నిర్వహించడమనేది అంతర్జాతీయ ప్రజాసంబంధాల వ్యవహారంలో మోదీ సాధించిన విజయమనే చెప్పాలి. అదేసమయంలో అమెరికా, భారత్ సంబంధాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతకూ ఇది ఉదాహరణగా నిలుస్తుంది.

Image copyright Getty Images

ట్రంప్ రావడం పెద్ద విషయమే

''ఇది అమెరికాలో భారతీయ అమెరికన్ సమాజ బలిమిని ప్రతిబింబిస్తోంది' అని ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో విదేశీ వ్యవహారాలలో భారత్, దక్షిణాసియా వ్యవహారాల విభాగంలో పనిచేసిన నిషా బిస్వాల్ తెలిపారు.

ట్రంప్ ఈ సభకు వెళ్లాలనుకోవడం గొప్ప పరిణామమని ఆమె అభిప్రాయపడ్డారు.

మోదీ, ట్రంప్ మధ్య బంధం ఇప్పుడు వ్యక్తిగత, రాజకీయాల స్థాయి దాటి ముందుకెళ్లిందని నిషా అన్నారు.

'హౌడీ మోదీ' ఈవెంట్ నిర్వాహకులు డెమొక్రటిక్ పార్టీ ప్రముఖులు స్టెనీ హోయర్ వంటివారు, పలువురు ఇతర కాంగ్రెస్ నేతలు, వివిధ రాష్ట్రాల గవర్నర్లను కూడా పిలిచి ఇది ఇరుదేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక వ్యవహారంలా మార్చే ప్రయత్నం చేశారు.

ఇందుకు హ్యూస్టన్‌ను వేదికగా ఎంచుకోవడంలోనూ ఆశ్చర్యం లేదు. భారత్‌తో వాణిజ్య భాగస్వామ్యం ఉన్న నాలుగో అతిపెద్ద నగరం హ్యూస్టన్. అమెరికాతో ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి భారత్‌కు ఇదో అవకాశం కూడా.

మరోవైపు గత ఏడాదిన్నర కాలంలో భారత్, అమెరికాల మధ్య పొడచూపిన వాణిజ్య విభేదాలను రూపుమాపుకొనేందుకూ ఈ సభ సహకరిస్తుందని.. ఉమ్మడి ప్రకటన ఏమైనా ఉండొచ్చనడానికి ఇది సంకేతమని అంచనా వేస్తున్నారు.

'ఒకవేళ అదే జరిగితే ట్రంప్ అది తాను సాధించిన విజయంగా చెప్పుకొంటారు' అని వాషింగ్టన్స్ బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న తాన్వి మదాన్ అన్నారు.

ఇక ట్రంప్ వైపు నుంచి చూస్తే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా అమెరికాలోని భారతీయులు వ్యవహరించేలా చేసుకునేందుకూ ఇది మార్గం వేస్తుంది. అనుకున్న దాని కంటే భారీగా సభకు హాజరవుతారని ట్రంప్ అంటున్నారు.

అమెరికాలో భారతీయుల జనాభా 32 లక్షలు.. ఆ దేశ జనాభాలో భారతీయులు ఒక శాతం ఉన్నారు. అంతేకాదు.. అమెరికాలోని సంపన్న వర్గాల్లో భారతీయులూ ఒకరు.

అమెరికాలోని భారతీయుల్లో అత్యధికులు డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరులు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికులు హిల్లరీ క్లింటన్‌కు ఓటేశారని 'ఆసియన్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్' చెబుతోంది.

మోదీ జాతీయవాద దృక్పథం, భారతదేశాన్ని ప్రపంచదేశాల మధ్య సగర్వంగా నిలపుతానంటూ ఆయన చేసే ప్రతిజ్ఞల కారణంగా అమెరికాలోని భారతీయుల్లో ఆయనకు విశేషాదరణ లభిస్తోంది.

''ఈ సభ తరువాత అమెరికాలోని మోదీ అభిమానుల్లో చాలామంది డెమొక్రాట్ల నుంచి తమ వైపు మళ్లుతారని రిపబ్లికన్లు ఆశిస్తున్నారు'' అని మదాన్ తెలిపారు.

Image copyright Getty Images

కశ్మీర్ విషయంలో నిరసనలు

కొద్దిరోజుల కిందటే మోదీ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది పొరుగుదేశం పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరగడానికి కారణమైంది. అంతర్జాతీయంగా ముస్లిం సంస్థలు, మానవ హక్కుల సంస్థల నుంచీ విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు మోదీతో కలిసి సభలో పాల్గొంటే మోదీ విధానాలకు ట్రంప్ కూడా వత్తాసు పలుకుతున్నట్లేనన్న అభిప్రాయం కలుగుతుందని యాక్టివిస్టులు అంటున్నారు.

''ఇది చాలా తప్పు. ట్రంప్ మోదీ సభకు వెళ్లకూడదు'' అని మానవ హక్కుల న్యాయవాది అర్జున్ శేఠీ అన్నారు.

''మోదీ తరఫున ట్రంప్ పాల్గొంటున్నారో.. ట్రంప్ తరఫున మోదీ పాల్గొంటున్నారో నాకర్థం కావడం లేదు. రెండు దేశాలకూ నా సానుభూతి'' అంటూ రట్జర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆడ్రీ ట్రచ్కీ అన్నారు.

మోదీ-ట్రంప్ సందర్భంగా ముస్లింలు, మరికొందరు మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. హ్యూస్టన్ సభ తరువాత మోదీ గేట్స్ ఫౌండేషన్ నుంచి స్వచ్ఛతా అవార్డు అందుకోబోతున్నారు. అయితే, కశ్మీర్ విషయంలో మోదీ తీరును నిరసిస్తూ కొందరు ఈ అవార్డును మోదీకి ఇవ్వరాదంటూ గేట్స్ ఫౌండేషన్‌కు లక్ష సంతకాలతో ఫిర్యాదు చేశారు.

అయితే, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దీనిపై స్పందిస్తూ 'భారతదేశ ప్రధాని ఆ దేశంలో పారిశుద్ధ్యానికి సంబంధించి సాధించిన విజయాలకు గాను ఈ అవార్డు ఇస్తున్నాం. మా నిర్ణయం సరైనదే'నని వాషింగ్టన్ పోస్ట్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం