గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త

  • 22 సెప్టెంబర్ 2019
గులాలాయీ ఇస్మాయిల్ Image copyright Aware girls
చిత్రం శీర్షిక గులాలాయీ ఇస్మాయిల్

సైన్యానికి వ్యతిరేకంగా గళమెత్తిన పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త గత కొన్ని నెలలపాటు అజ్ఞాతంలో గడిపిన తర్వాత చివరికి ఆ దేశం వదిలి పారిపోయారు.

పాకిస్తాన్ మానవహక్కుల కార్యకర్త గులాలాయీ ఇస్మాయిల్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. పాక్ ప్రభుత్వం ఆమెను లక్ష్యంగా చేసుకోవడంతో, తనపై ఉన్న ప్రయాణ ఆంక్షల నుంచి తప్పించుకుని ఆమె ఎలాగోలా పారిపోగలిగారు.

ఇస్మాయిల్‌పై పాకిస్తాన్ దేశద్రోహం, హింసను రెచ్చగొట్టడం లాంటి తీవ్ర ఆరోపణలు చేసింది.

ఇస్మాయిల్ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో తను దేశం వదిలి పారిపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. పాకిస్తాన్‌లో తనకు ప్రాణాపాయం ఉందన్నారు. ఏఎఫ్‌పీతో మాట్లాడిన ఆమె "నన్ను జైల్లో పెట్టి ఏళ్ల తరబడి హింసిస్తే, నా గొంతు కూడా పెగలదేమో" అన్నారు.

"ఇస్మాయిల్‌పై పాకిస్తాన్ కోర్టుల్లో ఆరు కేసులు నమోదయ్యాయి. తన జీవితం చాలా ప్రమాదంలో పడినట్టు నాకు అనిపిస్తోంది" అని గులాలాయీ తండ్రి మొహమ్మద్ ఇస్మాయిల్ బీబీసీకి చెప్పారు.

"ఇస్మాయిల్ దేశం వదిలి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉంది, అందుకే పాకిస్తాన్‌లో ఉండకూడదని నిర్ణయించుకుంది. లేదంటే తనకు ఏదైనా జరగచ్చు" అని ఆయన అన్నారు.

పారిపోయిన తర్వాత ఒక ప్రకటన చేసిన గులాలాయీ "గత కొన్ని నెలలుగా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. నన్ను బెదిరించారు. చాలా ఇబ్బందులు పెట్టారు. నేను అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగాను" అన్నారు.

కానీ, ప్రయాణంపై ఆంక్షలు ఉన్నప్పుడు, దేశం వదిలి అమెరికా ఎలా చేరుకోగలిగారో గులాలాయీ చెప్పలేదు. ద న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడిన ఆమె "నేను విమానాశ్రయాల ద్వారా దేశం బయటకు రాలేదు" అని మాత్రం చెప్పారు.

32 ఏళ్ల మానవ హక్కుల కార్యకర్త గులాలాయీ ఇప్పుడు రాజకీయ ఆశ్రయం కోరారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో తన సోదరితోపాటు ఉంటున్నారు.

ఇస్మాయిల్ చాలా ఏళ్ల నుంచి పాకిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై జరిగే అమానుషాలకు వ్యతిరేకంగా గళమెత్తారు.

అయితే, ఇస్మాయిల్ పాక్ ప్రభుత్వం దృష్టిలో పడింది గత ఏడాదే. 2018లో అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ఆపరేషన్‌ జరిగినపుడు పాక్ జవాన్లు తమను లైంగికంగా వేధించారని ఆరోపించిన కొంతమంది మహిళలకు గులాలాయీ అండగా నిలిచారు.

ఒక బాలుడు తన తల్లితో పాక్ జవాన్లు ప్రవర్తించిన తీరు గురించి గులాలాయీకు ఫిర్యాదు చేయడంతో, ఇస్మాయిల్ ఆ ఆరోపణలను చాలా తీవ్రంగా తీసుకున్నారు.

"తమపై లైంగిక వేధింపులు జరగడం కొత్త విషయమేం కాదని, అది ఎన్నో ఏళ్ల నుంచీ జరుగుతూనే వస్తోందని నాకు చాలా మంది మహిళలు చెప్పారు" అని ఇస్మాయిల్ వాషింగ్టన్‌లో ఏఎఫ్‌పీకి చెప్పారు.

Image copyright EPA

వరుస అరెస్టులతో అజ్ఞాతంలోకి

2018 అక్టోబర్‌లో లండన్ నుంచి తిరిగిరాగానే ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఇస్మాయిల్‌ను మొటిసారి అరెస్టు చేశారు. అప్పుడు పష్తూన్ తహఫ్పుజ్ (సంరక్షణ) ఉద్యమం లేదా పీటీఎం నిర్వహించిన ఒక ర్యాలీలో దేశానికి, సైన్యానికి వ్యతిరేకంగా ప్రసంగించారని ఆరోపణలు ఎదుర్కొన్న 19 మందిలో ఆమె ఒకరు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను మళ్లీ అరెస్టు చేశారు. అప్పుడు పీటీఎం కార్యకర్త అర్మాన్ లూనీ మృతికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఆమె పాల్గొన్నారు. అర్మాన్ లూనీ కస్టడీలో చనిపోయారు. పోలీసులు మాత్రం ఆయన్ను తాము కొట్టలేదని చెబుతున్నారు. ఈ గ్రూపు సభ్యులు చాలా మంది ఇంకా కస్టడీలోనే ఉన్నారు.

ఇస్మాయిల్ ఆ అరెస్టు గురించి ఎఎఫ్‌పీతో మాట్లాడుతూ, "అప్పుడు నన్ను రెండు రోజులు చల్లటి గదిలో తిండి, నీళ్లూ ఇవ్వకుండా ఉంచారు. ఆ గదిలో నేలపై మూత్రంతో తడిసిన ఒక దుప్పటి ఉండేది" అని చెప్పారు.

కానీ, మేలో అరెస్టు చేసిన తర్వాత ఆమె అజ్ఞాతంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆమె ఒక ఇస్లామిక్ కేంద్రంలో ఫరిష్తా అనే 10 ఏళ్ల పష్తూన్ బాలిక అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. దాంతో ఆమెపై దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, హింసను రెచ్చగొట్టారనే ఆరోపణలు నమోదు చేశారు.

గులాలాయీ ఇస్మాయిల్ 16 ఏళ్ల వయసు నుంచే మానవ హక్కుల గురించి బహిరంగంగా మాట్లాడేవారు.

ఇస్మాయిల్ వాయవ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ ప్రాంతానికి చెందినవారు. యువతులకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఆమె 'అవేర్ గర్ల్స్' అనే ఒక ఎన్జీఓ కూడా స్థాపించారు.

ఆ తర్వాత తీవ్రవాద సంస్థలో చేరడానికి సిద్ధమైన ఒక యువకుడి గురించి తెలీడంతో, తీవ్రవాదానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలని ఆమె నిర్ణయించారు.

2014లో బీబీసీ అవుట్‌లుక్ కార్యక్రమంలో శాంతి, లైంగిక సమానత్వం గురించి మాట్లాడిన ఇస్మాయిల్.. "ఆ రెండూ పరస్పరం కలిసి ఉంటాయి. వాటిలో ఒకటి లేకపోతే ఇంకొకటి పొందడం సాధ్యం కాదు" అన్నారు.

2013లో గృహ హింస, బాల్య వివాహాలపై పోరాడేందుకు ఆమె వంద మంది మహిళలతో ఒక టీమ్ తయారు చేశారు.

గులాలాయీ ఇస్మాయిల్‌ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అయితే తను చేసే పనులన్నీ ప్రమాదాలతో నిండినవని ఆమెకు తెలుసు. కానీ, తనపై వ్యతిరేకత పెరిగేకొద్దీ, ప్రభుత్వంపై ఆమె తన పోరాటం కూడా తీవ్రం చేశారు.

2014లో బీబీసీతో మాట్లాడిన ఇస్మాయిల్ "నా పోరాటం ఫలిస్తోంది అనడానికి నాపై పెరుగుతున్న వ్యతిరేకత ఓ సంకేతంలా కనిపిస్తోంది. రెండు నెలల క్రితం నా కుటుంబంపై దాడి చేశారు. ఇక్కడితో ఆగకపోతే మరోసారి దాడి చేస్తామని బెదిరించారు. కానీ అదంతా మార్పు, సంఘర్షణలో భాగం. ఇలాంటి ఘటనలు నా నిబద్ధతను మరింత పెంచాయి" అని చెప్పారు.

శ్రీలంక నుంచి అమెరికాకు...

ఇస్మాయిల్‌ పేరును గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వ నిష్క్రమణ నియంత్రణ జాబితా (ఎగ్జాస్ట్ కంట్రోల్ లిస్ట్)లో చేర్చారు. అంటే ఆమె దేశం వదిలి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

పాక్ పత్రిక డాన్ కథనం ప్రకారం "మార్చిలో ఆమె పేరును జాబితా నుంచి తొలగించాలని ఇస్లామాబాద్ హైకోర్ట్ ఆదేశించింది. అయితే, ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోడానికి ప్రభుత్వాన్ని అనుమతించింది".

ఆ తర్వాత ఆమె పాకిస్తాన్‌లో అజ్ఞాతంలోకి వెళ్లారు. దాంతో ఆమెను వెతకడానికి భారీ పోలీస్ ఆపరేషన్ మొదలయ్యింది. కానీ కొంతమందితో కూడిన ఒక చిన్న నెట్‌వర్క్ సాయంతో ఆమె వారి నుంచి తప్పించుకుంటూ వచ్చారు. చివరికి పాకిస్తాన్ వదిలి పారిపోవడంలో సఫలం అయ్యారు.

పాకిస్తాన్ నుంచి ఎలా బయటపడ్డారనే దానిపై ఇస్మాయిల్ ఎక్కువ వివరాలు ఇవ్వలేదు. రేడియో ఫ్రీ యూరప్‌తో మాట్లాడిన ఆమె "నేను శ్రీలంక నుంచి అమెరికా చేరుకున్నా. పాకిస్తాన్ ప్రజలు వీసా లేకుండానే శ్రీలంక వెళ్లవచ్చు" అని తెలిపారు.

ద న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఆమె తన అజ్ఞాతం, పారిపోవడం గురించి చాలా తక్కువ చెప్పారు.

"ఆ వివరాలు చెబితే, నాకు ఆశ్రయం ఇచ్చి, దేశం నుంచి పారిపోయేందుకు సాయం చేసిన వారి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు" అని ఇస్మాయిల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)