గర్ల్‌ఫ్రెండ్‌కు నీటి లోపల ప్రపోజ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమెరికన్

  • 22 సెప్టెంబర్ 2019
నీటి లోపల ప్రపోజ్ చేస్తున్న వెబర్ Image copyright Kenesha Antoine
చిత్రం శీర్షిక నీటి లోపల ప్రపోజ్ చేస్తున్న వెబర్

ఒక అమెరికన్ తన గర్ల్‌ఫ్రెండ్‌కు విభిన్నంగా, సాహసోపేతంగా ప్రపోజ్ చేసే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు.

తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో స్టీవెన్ వెబర్, ఆయన గర్ల్‌ఫ్రెండ్ కెనెషా ఆంటోయిన్ విహార యాత్రలో ఉండగా ఈ ఘటన జరిగింది.

వీరు పెంబా ద్వీప తీరంలో 'ద మాంటా రిసార్ట్'లో నీటి లోపల ఏర్పాటైన ఒక క్యాబిన్‌(గది లాంటి ఏర్పాటు)లో బస చేశారు.

వెబర్ క్యాబిన్ వెలుపల డైవింగ్ చేస్తూ, తనను పెళ్లి చేసుకోవాలని కెనెషాను అడుగుతున్నట్లు వీడియోలోని దృశ్యాలను బట్టి తెలుస్తోంది.

Image copyright Kenesha Antoine on Facebook
చిత్రం శీర్షిక కెనెషా, వెబర్

డైవింగ్ చేస్తున్న వెబర్ చేతితో రాసిన ఒక ప్రపోజల్ నోట్‌ను క్యాబిన్ గాజు కిటికీపై అదుముతుండగా, అతడి ప్రయత్నాన్ని క్యాబిన్లోంచి కెనెషా వీడియో తీశారు.

వెబర్ మృతిని కెనెషా ఒక ఫేస్‌బుక్ పోస్టులో ధ్రువీకరించారు. అంత లోతులోంచి వెబర్ ఎంతకూ బయటకు రాలేకపోయాడని ఆమె చెప్పారు.

ఈ నెల 19న గురువారం మధ్యాహ్నం నీటిలోపలి క్యాబిన్ వెలుపల ఒంటరిగా ఫ్రీ డైవింగ్ చేస్తూ వెబర్ మునిగిపోయారని, ఇది విషాదకరమని 'ద మాంటా రిసార్ట్' బీబీసీతో చెప్పింది.

నీటి లోపల శ్వాస తీసుకోవడంలో సాయపడే సామగ్రి లేకుండా చేసే డైవింగ్‌ను 'ఫ్రీ డైవింగ్' అంటారు.

Image copyright Kenesha Antoine on Facebook
చిత్రం శీర్షిక వెబర్ మరణానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

వెబర్ ప్రమాదశాత్తూ మునిగిపోయాడని రిసార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. వెబర్ మరణం పట్ల ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందారని రిసార్ట్ ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈవో) మాథ్యూ సౌస్ చెప్పారు.

ఒడ్డుకు సుమారు 250 మీటర్ల దూరంలో, ఇంచుమించు 32 అడుగుల లోతులో ఈ క్యాబిన్ ఉంది. రిసార్టు రోజుకు 1,700 డాలర్ల చొప్పున వసూలు చేస్తుంది.

ఇందులో నాలుగు రోజులు బస చేసేందుకు వెబర్, కెనెషా ఏర్పాట్లు చేసుకున్నారు.

మూడో రోజు కెనెషాకు ప్రపోజ్ చేసేందుకు వెబర్ గాగుల్స్, ఫ్లిప్పర్స్ ధరించి క్యాబిన్లోంచి నీటి లోపలకు వెళ్లాడు.

"నీలో నేను ప్రేమించే ప్రతిదీ చెప్పాలనుంది. అయితే అవన్నీ చెప్పేంత ఎక్కువసేపు ఊపిరి బిగబట్టలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను. నీలో నేను ప్రేమించే ప్రతిదాన్నీ ప్రతి రోజూ మరింత ఎక్కువగా ప్రేమిస్తా" అని వెబర్ క్యాబిన్ కిటికీకి అతికించిన పత్రంలో ఇంగ్లిష్‌లో రాశాడు.

Image copyright Kenesha Antoine on Facebook
చిత్రం శీర్షిక వెబర్ చేతితో రాసిన ఒక ప్రపోజల్ నోట్‌ను క్యాబిన్ గాజు కిటికీపై అదుముతుండగా, అతడి ప్రయత్నాన్ని క్యాబిన్లోంచి కెనెషా వీడియో తీశారు

ఈ పత్రాన్ని ఇలా గర్ల్‌ఫ్రెండ్‌కు చూపించాక వెబర్ తన షార్ట్స్‌లోంచి ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని తీసి చూపించాడు.

అనంతరం ఈదుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు.

నీటిలో సమస్య వచ్చిందని తెలిశాక సాయం చేసేందుకు తమ సిబ్బంది వెళ్లారని, కానీ అప్పటికి చేయగలిగింది ఏమీ లేదని రిసార్ట్ సీఈవో మాథ్యూ సౌస్ బీబీసీతో చెప్పారు.

Image copyright The Manta Resort
చిత్రం శీర్షిక రిసార్ట్‌లో నీటిలోపల ఏర్పాటు చేసిన క్యాబిన్

వెబర్ పెళ్లి ప్రతిపాదనకు లక్ష సార్లు తన సమ్మతిని తెలియజేసేదాన్నని, కానీ తన సమాధానం అతడు వినేలోపే ఈ ఘోరం జరిగిపోయిందని కెనెషా తన బాధను వ్యక్తంచేశారు.

విధి క్రూర పరిహాసంతో, తమ ఇద్దరి జీవితాల్లో అత్యుత్తమ రోజు అత్యంత దుర్దినంగా మారిపోయిందని ఆమె అన్నారు. "మేమిద్దరం కలసి గడిపిన చివరి క్షణాలను ఎంతగానో ఆస్వాదించాం. ఆ జ్ఞాపకాల నుంచి సాంత్వన పొందేందుకు ప్రయత్నిస్తాను" అని ఉద్వేగంగా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)