అమెరికా చేరుకున్న మోదీ.. 'Howdy Modi'లో ఏం జరగనుంది?

  • 22 సెప్టెంబర్ 2019
హౌడీ, మోడీ Image copyright PIB

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు.

ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో రెండు సార్లు సమావేశం అవుతారు.

మోదీ, ట్రంప్ మధ్య మొదటి సమావేశం సెప్టెంబర్ 22న హూస్టన్‌లో జరుగుతుంది.

ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ భారత సంతతి అమెరికన్లు, అక్కడ నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: హౌడీ మోదీ కార్యక్రమానికి సిద్ధమైన అమెరికా

హూస్టన్‌ నగరంలో జరిగే 'Howdy Modi' మోడీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు దేశంలోని దాదాపు 50 మంది ఎంపీలు కూడా హాజరవుతారు.

ఇద్దరు నేతలు సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో మరోసారి సమావేశం అవుతారు. అక్కడ మోదీ ఐక్యరాజ్యసమితి వార్షిక ప్లీనరీ సెషన్‌కు హాజరవుతారు.

"మోదీ, ట్రంప్ మధ్య సెప్టంబర్ 24న జరిగే సమావేశంలో అధికారిక చర్చలు జరుగుతాయని, సెప్టంబర్ 22న అమెరికా అధ్యక్షుడు అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఏర్పాటు చేసే ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారని" భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

'Howdy Modi'లో ఏం జరుగుతుంది?

'హౌ డూ యూ డూ' అనే మాటనే అమెరికన్లు సంక్షిప్తంగా 'హౌడీ' అంటూ పలకరిస్తారు. ఇప్పుడు అదే పదాన్ని మోదీ కార్యక్రమం ముందు కలిపి 'హౌడీ మోదీ’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

'Howdy Modi' కార్యక్రమాన్ని అమెరికాలోని టెక్సస్‌ రాష్ట్రంలోని భారతీయుల సంస్థ 'టెక్సస్ ఇండియా ఫోరం'(టీఐఎఫ్) మరో 600 సంస్థలతో కలిసి నిర్వహిస్తోంది.

హూస్టన్‌ నగరంలోని ఎన్ఆర్జీ స్టేడియంలో మూడు గంటలపాటు జరిగే ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8.30కు ప్రారంభమై రాత్రి 11.30 వరకూ జరగుతుంది.

ఇక్కడ మోదీ, ట్రంప్ సమక్షంలో సంగీత, నృత్య కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. తర్వాత ఇద్దరు నేతలు ప్రసంగిస్తారు.

90 నిమిషాలు సాంస్కృతిక ప్రదర్శనలు

నిర్వాహకుల అందించిన వివరాల ప్రకారం ఈ కార్యక్రమంలో మొదటి 90 నిమిషాలు సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి.

అమెరికాలోని భారతీయులు ఆ దేశంతో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పేలా 'వూవెన్: ది ఇండియన్-అమెరికన్ స్టోరీ' అనే ప్రదర్శన ఇవ్వనున్నారు.

సాంస్కృతిక ప్రదర్శనల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 400 మంది కళాకారులు, ఇతరులు పాల్గొంటారు. వీరిలో 27 గ్రూపులు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.

వీటిలో భారత శాస్త్రీయ, జానపద నృత్యాలతోపాటు 'హౌడీ, మోడీ' కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రాయించి, బాణీ కట్టిన రెండు పాటలు కూడా ఉంటాయని చెబుతున్నారు.

మూడు భాషల్లో ప్రసారం

హూస్టన్‌కు చెందిన వెయ్యి మంది గుజరాతీ కళాకారులు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ భారీ దాండియా ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమాన్ని హిందీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ప్రసారం చేస్తారు. 2 వేల మందికి పైగా వలంటీర్లు ఈ కార్యక్రమానికి సేవలు అందిస్తున్నారు.

టీఐఎఫ్ వివరాల ప్రకారం 72 వేలకు పైగా కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో కార్యక్రమానికి 50 వేల మందికి పైగా హాజరవుతారు. వీరందరూ స్టేడియంకు చేరుకోడానికి వంద బస్సులు ఏర్పాటు చేశారు.

హౌడీ, మోడీ కార్యక్రమానికి హాజరు కావడానికి అమెరికాలోని 50 రాష్ట్రాలతోపాటు, 20 దేశాల నుంచి భారతీయులు రిజిస్టర్ చేసుకున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

యువతే అధికం

ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి రిజిస్టర్ చేసుకున్నవారిలో మూడు వంతుల మంది యువతీయువకులే ఉన్నారని నిర్వాహకులు చెప్పారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 60 మంది ఎంపీలు కూడా హాజరవుతారని చెబుతున్నారు. వీరిలో హవాయి నుంచి ఎన్నికైన అమెరికా తొలి మహిళా ఎంపీ తులసీ గబ్బర్డ్, ఇలినాయ్ నుంచి ఎంపీ అయిన రాజా కృష్ణమూర్తి కూడా ఉంటారు.

మరోవైపు కొందరు హౌడీ, మోదీ కార్యక్రమానికి వ్యతిరేకంగా ర్యాలీలకు కూడా సిద్ధమయ్యారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించినందుకు నిరసనగా హూస్టన్‌లోని ముస్లిం, మైనారిటీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

సోషల్ మీడియా వేదికగా హౌడీ, మోదీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన కొందరు స్టేడియం సమీపంలో మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం