ఇండోనేషియా: రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’

  • 24 సెప్టెంబర్ 2019
ఇండోనేసియా ఆకాశం రక్తం Image copyright EKA WULANDARI
చిత్రం శీర్షిక ఇండోనేషియా ఆకాశం రక్తవర్ణంలోకి మారింది

ఇండోనేషియాలోని చాలా ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగడంతో దేశంలోని ఒక ప్రావిన్స్‌ అంతా ఆకాశం రక్తం చిందినట్టు ఎర్రగా మారింది.

జాంబీ ప్రావిన్సులోని ఒక మహిళ ఎర్రగా ఉన్న ఆకాశాన్ని ఫొటోలు తీశారు. పొగమంచు వల్ల కళ్లు, గొంతు మండుతున్నాయని చెప్పారు.

ఇండోనేసియాలో ప్రతిఏటా కార్చిచ్చు వల్ల పొగమంచు కమ్మేస్తుంటుంది. అది ఆగ్నేయాసియా అంతా కప్పేస్తుంది.

ఆకాశం ఎర్రగా మారే ఇలాంటి అసాధారణ దృశ్యాన్ని 'రేలీగ్ విక్షేపం' అంటారని వాతావరణ నిపుణులు చెప్పారు.

జాంబీ ప్రావిన్సులోని మెకర్ సరి గ్రామంలో ఎకా వులందరి అనే మహిళ శనివారం మధ్యాహ్నం రక్తవర్ణంలో ఉన్న ఆకాశాన్ని చాలా ఫొటోలు తీశారు.

Image copyright EKA WULANDARI

‘అంగారక గ్రహం కాదు’

పట్టపగలు పొగమంచు వల్ల ఆకాశం ఎర్రగా ఇలా కనిపిస్తోంది అని చెప్పారు. ఆమె తన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు 34 వేల సార్లు షేర్ అయ్యాయి.

బీబీసీతో మాట్లాడిన ఆమె "ఆన్‌లైన్లో చాలా మంది నా ఫొటోలపై సందేహం వ్యక్తం చేశారు. కానీ ఇది నిజం. ఈ ఫొటోలు, వీడియోను నేను నా ఫోన్‌తో తీశాను. సోమవారం వరకూ ఆకాశం అలా ఎర్రగానే కనిపించింది" అన్నారు.

మరో ట్విటర్ యూజర్ కూడా ఆకాశం ఎర్రగా ఉన్న ఇలాంటి వీడియోనే పోస్ట్ చేశారు.

"ఇది అంగారక గ్రహం కాదు, ఇది జాంబీ. మనలాంటి మనుషులకు స్వచ్ఛమైన గాలి కావాలి, పొగ కాదు" అని జునీ షోఫీ యటున్ ట్వీట్ చేశారు.

ఉపగ్రహం తీసిన ఫొటోలు జాంబీ ప్రాంతం చుట్టూ దట్టంగా పొగ అలుముకున్నట్టు చూపిస్తున్నాయని ఇండోనేసియా వాతావరణ సంస్థ బీఎంకేజీ చెప్పింది.

సింగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కోహ్ తీ యాంగ్ ఆకాశం ఇలా కావడాన్ని 'రేలీగ్ విక్షేపం' అంటారని చెప్పారు. పొగమంచు ఉన్నప్పుడు కొన్ని రకాల కణాలు ఆకాశం అలా కనిపించేలా చేస్తాయన్నారు.

Image copyright EKA WULANDARI

"పొగమంచులో చాలా ఎక్కువగా ఉండే కణాలు 1 మైక్రోమీటర్ సైజులో ఉంటాయి. కానీ ఈ కణాలు మనం చూసే వెలుతురు రంగును మార్చలేవు. కానీ, అందులో చిన్న కణాలు కూడా ఉంటాయి. అవి పెద్దగా పొగమంచు సృష్టించలేకపోయినా, అది ఉన్నప్పుడు ఎక్కువ అవుతాయి. నీలంగా కనిపించే వెలుతురును ముందుకూ, వెనక్కూ చెదరగొడుతాయి. దాంతో, మనకు ఆకాశంలో నీలం కంటే ఎక్కువ ఎర్రగా కనిపిస్తుంది" అన్నారు.

మధ్యాహ్నం తీసిన ఫొటోల్లో ఆకాశం మరింత ఎర్రగా ఎందుకు కనిపించిందో ఆయన కారణం కూడా చెప్పారు.

"అప్పుడు సూర్యుడు మన నడినెత్తిన ఉంటాడు. ఎండ తీవ్రంగా ఉంటుంది. అందుకే మనం పైకి సూర్య కిరణాల వల్ల ఆకాశం మరింత ఎర్రగా కనిపిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితి వల్ల గాల్లో ఉష్ణోగ్రతల్లో ఏ మార్పూ రాదు" అని కోహ్ అన్నారు.

వేసవికాలంలో ఎక్కువ

కానీ, ఈ ఏడాది పొగమంచు స్థాయి గత కొన్నేళ్ల కంటే ఘోరంగా ఉంది.

ఇండోనేషియాలో బహిరంగంగా తగలబెట్టడం వల్ల పొగమంచు ఏర్పడుతోంది. ఇది సాధారణంగా జులై- అక్టోబర్ మధ్యలో ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది.

ఇండోనేషియా జాతీయ విపత్తుల సంస్థ లెక్కల ప్రకారం ఈ ఏడాది మొదటి 8 నెలల్లో ఇప్పటికే 328,724 హెక్టార్ల భూముల్లో తగలబెట్టేశారు.

ఈ పొగమంచుకు పెద్ద సంస్థలు, చిన్న తరహా రైతులే కారణమని ఆరోపిస్తున్నారు.

భూముల్లో తగలబెడుతున్నారు

పామాయిల్, గుజ్జు, పేపర్ కోసం వేసిన పంటలను ఈ సీజన్లో ఒకేసారి నరికి తగలబెడుతుండడంతో ఆకాశం అంతా పొగమంచు అలుముకుంటోంది.

ఈ కోతలు ఈ ప్రాంతంలోని చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. భూమి శుభ్రం చేసుకోడానికి రైతులకు ఈ పద్ధతి చాలా సులభం.

ఇలా తగలబెట్టడం వల్ల పంటలకు వచ్చిన తెగుళ్ల నుంచి కూడా వీళ్లకు ఉపశమనం లభిస్తోంది.

కానీ తరచూ ఈ మంటలు అదుపుతప్పి రక్షిత అటవీప్రాంతంలోకి కూడా వ్యాపిస్తున్నాయి. చెట్లను కొట్టి తగలబెట్టడం ఇండోనేషియాలో చట్టవిరుద్ధం. కానీ అది అలా కొనసాగుతూనే ఉంది.

అవినీతి, బలహీనమైన ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కొందరు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)