చంద్రయాన్ 2: ల్యాండర్ ‘విక్రమ్’ దిగాల్సిన ప్రదేశం ఫొటోలు తీసిన నాసా

  • 27 సెప్టెంబర్ 2019
విక్రమ్ దిగాల్సిన ప్రాంతం.. నాసా తీసిన ఫొటోలు Image copyright NASA/twitter

చంద్రయాన్ 2లో ఇస్రో ప్రయోగించిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని అమెరికా అంతరిక్ష సంస్థ నానా వెల్లడించింది. నాసా తాజాగా చంద్రయాన్ 2 ల్యాండింగ్ సైట్‌కి చెందిన హై రిజల్యూషన్ చిత్రాలను విడుదల చేసింది.

చంద్రయాన్ 2 ల్యాండర్ ఆచూకీ కనిపెట్టేందుకు నాసా కూడా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమ లూనార్ రికన్సిలేషన్ ఆర్బిట్ కెమెరా తీసిన చిత్రాలను సెప్టెంబర్ 26న ట్వీట్ చేసింది.

అయితే ఈ చిత్రాలను రాత్రి వేళ తీసినందున విక్రమ్ ఆచూకీ స్పష్టంగా కనిపెట్టలేకపోయామని నాసా స్పష్టం చేసింది.

అక్టోబరులో ఆ ప్రాంతంలో వెలుగు వస్తుందని అప్పుడు కచ్చితంగా ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కనిపెడతామని నాసా తెలిపింది.

Image copyright NASA

చీకట్లో ఉండొచ్చు

నాసా తన వెబ్ సైట్లో పేర్కొన్న కథనం ప్రకారం... సెప్టెంబర్ 7న చంద్రయాన్ 2 ల్యాండర్ చంద్రుడి మీద హార్డ్ ల్యాండ్ అయ్యింది. అంటే అది చంద్రుడి ఉపరితలాన్ని నేరుగా ఢీకొట్టింది.

ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 17న తమ లూనార్ రికన్సిలేషన్ ఆర్బిటర్ కెమెరా 150 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ తీసిన ఫోటోలను ఇప్పుడు విడుదల చేసింది.

అయితే తమ బృందాలు విక్రమ్ ల్యాండర్‌ను కానీ, అది కూలిన ప్రదేశాన్ని కూడా గుర్తించలేకపోయాయని తెలిపింది.

ఈ చిత్రాలు తీసే సమయంలో చంద్రుడి మీద ప్రాంతమంతా చీకటిగా ఉంది. ఆ పెద్ద పెద్ద చీకటి ప్రాంతాల్లో ఎక్కడో విక్రమ్ ఉండి ఉండవచ్చని నాసా తన వెబ్ సైట్లో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)