గూగుల్ 21వ పుట్టిన రోజు... 21 ఆసక్తికరమైన విషయాలు

  • 27 సెప్టెంబర్ 2019
గూగుల్ Image copyright Reuters

ఇంటర్నెట్‌లో అందరి సందేహాలూ తీర్చే గూగుల్‌కు నేటితో 21 ఏళ్లు నిండాయి.

ఆధునిక సమాజంలో నిత్యావసరం అయిపోయిన ఈ సెర్చ్ ఇంజిన్ సెప్టెంబర్ 27న పుట్టిన రోజు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా గూగుల్ గురించి ఆసక్తికరమైన 21 విషయాలు ఇవిగో..

1. ప్రపంచంలో అత్యధిక మంది సందర్శించే వెబ్‌సైట్ గూగుల్ అనేది చాలా మందికి తెలుసు. కానీ, గూగుల్ పోటీదారు అయిన బింగ్ సెర్చ్ ఇంజిన్‌లో జనాలు ఎక్కువగా వెతికే పదాల్లో గూగుల్ కూడా ఒకటి.

2. ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్ అనే ఇద్దరు కాలేజీ విద్యార్థులు కలిసి గూగుల్‌ను ప్రారంభించారు. వెబ్‌సైట్‌ల ర్యాంక్‌లను వాటికి అనుసంధానమయ్యే లింక్‌లు మిగతా వెబ్‌పేజీల్లో ఎంత ఎక్కువగా ఉన్నాయనేది పరిగణనలోకి తీసుకుని నిర్ణయించేలా ఈ సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించారు.

3. 'గూగోల్' అన్న పదం నుంచి గూగుల్ వచ్చింది. ఒకటి పక్కన వంద సున్నాలు ఉండే సంఖ్యను గూగోల్ అంటారు. తమ వెబ్‌సైట్‌లో చాలా సమాచారం దొరుకుతుందన్న విషయాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఎంచుకున్నారు.

4. ముఖ్యమైన సందర్భాల్లో గూగుల్ హోం పేజీలో లోగో స్థానంలో డూడుల్స్‌ను పెట్టే పద్ధతి 1998లో బర్నింగ్ మ్యాన్ అనే ఉత్సవంతో మొదలైంది. తాము ఆఫీస్ వదిలిపెట్టి, అక్కడికి వెళ్లామని వేరేవాళ్లకు తెలిపేందుకు గూగుల్ ఫౌండర్స్ ఆ పని చేశారు.

Image copyright Google

5. ఇంగ్లిష్ గాయకుడు జాన్ లెనన్ 70వ జన్మదినం సందర్భంగా తొలిసారిగా గూగుల్ వీడియో డూడుల్‌ను తెచ్చింది.

6. మొట్ట మొదటి గూగుల్ సర్వర్‌ను పెట్టేందుకు లెగోలతో తయారు చేసిన ఓ పెట్టె ఉపయోగించారు.

7. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్‌ప్లెక్స్ ఉంది.

8. గూగుల్‌ప్లెక్స్‌లో ఒక పెద్ద టీ-రెక్స్ డైనోసార్ బొమ్మ ఉంది. డైనోసార్లలా కంపెనీ అంతరించిపోకూడదని ఉద్యోగులకు గుర్తుచేసేందుకు దీన్ని పెట్టారని చెబుతుంటారు.

9. గూగుల్‌ప్లెక్స్‌లోని పచ్చిక బయళ్లలో గడ్డిని కత్తిరించేందుకు గూగుల్ లాన్‌మూవర్స్‌ను వినియోగించదు. గడ్డి బాగా పెరిగినప్పుడు, అక్కడ మేకలను మేపుతుంటారు.

10. ఉద్యోగులకు ఉచితంగా భోజనం పెట్టడం మొదలుపెట్టిన తొలి భారీ టెక్ సంస్థ గూగులే. ఉద్యోగులు వారి పెంపుడు కుక్కలను కూడా ఆఫీస్‌కు వెంట తెచ్చుకోవచ్చు.

Image copyright Getty Images

11. 2000 ఏడాదిలో గ్రామీ అవార్డుల కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్ ధరించిన ఓ పచ్చని రంగు డ్రెస్‌ కోసం గూగుల్‌లో చాలా మంది వెతికారు. అయితే, అప్పట్లో గూగుల్‌లో ఫొటోలు చూపించే సదుపాయం లేదు. ఈ పరిణామమే 2001లో గూగుల్ ఇమేజ్ సెర్చ్‌ను మొదలుపెట్టేందుకు కారణమైంది.

12. 2004లో ఏప్రిల్ 1న గూగుల్ జీమెయిల్‌ను ప్రారంభించింది. దీంతో, చాలా మంది గూగుల్ జోక్ చేస్తోందనే అనుకున్నారు.

13. 2006లో 'గూగుల్' అన్న పదాన్ని మెరియం-వెబ్‌స్టర్ డిక్షనరీలో చేర్చారు. ఆ పదానికి ''ఇంటర్నెట్‌లో సమాచారం వెతికేందుకు గూగుల్‌ను వినియోగించడం' అని నిర్వచనం ఇచ్చారు.

14. 2006లో గూగుల్‌ సంస్థలో యూట్యూబ్ కలిసింది. అప్పట్లో సుమారు రూ.10,500 కోట్లకు పైగా మొత్తానికి యూట్యూబ్‌ను గూగుల్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం యూట్యూబ్‌ను ప్రతి నెలా 200 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ప్రతి నిమిషానికీ 400 గంటల నిడివి ఉండే వీడియోలు ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి.

Image copyright Getty Images

15. 2009లో గూగుల్ ప్రోగ్రామర్ చేసిన ఓ పొరపాటుతో ఇంటర్నెట్ స్తంభించిపోయింది. గూగుల్ బ్లాక్ చేసే సైట్‌ల జాబితాలో ఆ ప్రోగ్రామర్ '/'ను చేర్చారు. దీంతో ఇంటర్నెట్‌లో ఉన్న ప్రతి సైట్‌నూ గూగుల్ ప్రమాదకర సైట్‌గా వినియోగదారులకు చూపించింది.

16. జనాలు రోజూ గూగుల్‌ సెర్చ్‌లో టైప్ చేస్తున్న పదాల్లో సుమారు 16.15% అంతకుముందెప్పుడూ ఎవరూ వెతకనివే.

17. 2018 ఏప్రిల్‌లో వంద శాతం పునరుత్పాదక శక్తి వనరులపై పనిచేస్తున్న తొలి సంస్థగా గూగుల్ అవతరించింది.

18. గూగుల్‌కు ఆరుకుపైగా పుట్టిన రోజులున్నాయి. కానీ, ఆ సంస్థ సెప్టెంబర్ 27నే ఎంచుకుంది.

19. గూగుల్ హోం పేజీలో మనం చాలా ట్రిక్‌లు చూడొచ్చు. ఉదాహరణకు.. askew లేదా do a barrel roll అని గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి.

20. చంద్రుడిపైకి అపోలో 11 ద్వారా వ్యోమగాములు వెళ్లేందుకు ఎంత కంప్యూటింగ్ సామర్థ్యం అవసరమైందో, గూగుల్‌లో మనం చేసే ప్రతి సెర్చ్‌కూ దాదాపు అంతే సామర్థ్యం అవసరమవుతుంది.

21. గూగుల్ ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు, చాలా రకాల సేవలు అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్‌ స్ట్రీమింగ్ సర్వీస్, డ్రైవర్‌లెస్‌ కార్లకు సంబంధించిన సేవలను కూడా అందించేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లు: అస్సాం ఎందుకు రగులుతోంది.. ప్రజల్లో భయం దేనికి

'అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'.. బాలీవుడ్ సినిమాపై పొరుగు దేశంలో ఆగ్రహం

హైదరాబాద్ ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరు మైనర్లని చెప్తున్న 'బోనఫైడ్' సర్టిఫికెట్లు.. ఎన్‌హెచ్‌ఆర్సీకి అందించిన కుటుంబ సభ్యులు

మిస్ యూనివర్స్ 2019 జోజిబిని తుంజీ: ఫైనల్ రౌండ్‌ ప్రశ్న, సమాధానం ఏంటి

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ అంశం ప్రభావం చూపుతుందా

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి