చైనా @70: ఈ కమ్యూనిస్ట్ దేశ ప్రగతిలో విజేతలెవరు... అక్కడి పాఠ్య పుస్తకాల్లో కనిపించని చరిత్ర ఏంటి?

  • 30 సెప్టెంబర్ 2019
చైనా జెండాలు పట్టుకున్న పిల్లలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక చైనా దృష్టిలో తమ చరిత్ర అంటే సంపద, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం త్యాగాలు చేయడం... ఇదే.

చైనా అసాధారణ స్థాయిలో సాధించిన అభివృద్ధి, ఎదుగుదల 20వ శతాబ్దపు గొప్ప గాథల్లో ఒకటి. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. అక్టోబర్ 1న ఆ దేశం ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది.

అయితే, చైనాలోని కమ్యూనిస్టు పాలనలో నిజమైన విజయం ఎవరిదినే ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నం చేశారు బీబీసీ ప్రతినిధి జాన్ సుడ్వర్త్.

చైనాలోని తియాంజిన్ నగరంలోని తన టేబుల్ ముందు కూర్చొన్న జావో జింగ్జియా చేతిలోని కత్తి ముఖంలోని వివిధ కవళికలను చెక్కుతోంది.

చాలా సున్నితంగా ఆయన చెక్కుతున్నారు, చివరికి దానికో రూపం వచ్చింది - అదే మావో జెడాంగ్, ఆధునిక చైనా సృష్టికర్త.

ఒకప్పుడు అయిల్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆయన పదవీ విరమణ తర్వాత బ్లేడుతో ఇలా కాగితాలపై ముఖాలను చెక్కే పురాతన చైనా కళలో నైపుణ్యం సాధించారు. ఆ దేశ నాయకులు, చైనా కమ్యూనిజం చరిత్రలోని ముఖ్య ఘట్టాలకు తన కళతో ఒక రూపం ఇస్తున్నారు.

‘‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా(పీఆర్సీ)కు నాకు ఒకే వయసు ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. ‘‘నా మాతృభూమి, ప్రజలు, పార్టీ మీద నాకు బలమైన భావాలున్నాయి’’ అని పేర్కొన్నారు.

చిత్రం శీర్షిక చైనా సాధించిన ప్రగతి వల్ల అక్కడి నాయకులు చేసిన తప్పిదాలను జావో జింగ్జియాలాంటివారు పట్టించుకోవడం లేదు.

మావో ప్రకటించిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అమల్లోకి వచ్చిన 1949 అక్టోబర్ ఒకటో తేదీకి కొన్ని రోజుల ముందు జావో జన్మించారు. పేదరికం, అణచివేతల నుంచి సంపద వైపు పయనించిన చైనా నాటకీయ అభివృద్ధిని ఆయన జీవితం అనుసరించింది.

ఇప్పుడాయన నిరాడంబరంగా ఉన్నారు. ఒక సౌకర్యవంతమైన అపార్ట్‌మెంట్‌లో తన కళకు పదును పెట్టుకుంటున్నారు. మానవ చరిత్రలోని అత్యంత గందరగోళ పరిస్థితులకు ఒక రూపం ఇస్తున్నారు.

‘‘కోటి మంది చావుకు బాధ్యుడైన మావో రాక్షసుడు కాదా?’’ అని నేను ఆయనను అడిగాను.

‘‘నేను ఆ కాలం వాడినే. చైర్మన్ మావో తప్పులు చేసి ఉండొచ్చు. కానీ, ఆయన ఒంటరిగా ఈ పనులు చేయలేదు’’ అని ఆయన సమాధానం ఇచ్చారు.

‘‘నేను ఆయనను గౌరవిస్తాను. ఆయన వల్లే మా దేశానికి స్వాతంత్ర్య వచ్చింది. సాధారణ వ్యక్తులు ఇలాంటి పనులు చేయలేరు’’ అని ఆయన పేర్కొన్నారు.

అక్టోబర్ 1న చైనా 70 ఏళ్ల వార్షికోత్సవాలకు ముస్తాబవుతోంది.

ఈ సందర్భంగా అధికార కమ్యూనిస్టు పార్టీ తన రాజకీయ విజయాలకు గుర్తుగా 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద మిలిటరీ పెరేడ్‌ను నిర్వహించనుంది.

తియానన్మెన్ స్క్వేర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమక్షంలో ఆ దేశ శక్తి, సామార్థ్యాలను ప్రదర్శించే యుద్ధ ట్యాంకులు, క్షిపణి లాంచర్లతో చేసే సైనిక పేరేడ్‌తో బీజింగ్ వణకనుంది.

Image copyright Xinhua/AFP
చిత్రం శీర్షిక అక్టోబర్1న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ప్రకటిస్తున్న మావో జెడాంగ్

పురోగతి.. ఓ అసంపూర్ణ కథనం

పైకి చూస్తే పేదరికం నుంచి అభివృద్ధి వైపు చైనా పరివర్తన అసాధారణమని చెప్పొచ్చు.

1949 అక్టోబర్ 1న తియానన్మెన్ స్క్వేర్‌ వేదికగా యుద్ధంతో వినాశనమైన, పాక్షిక భూస్వామ్య వ్యవస్థతో ఉన్న చైనాలో తన ప్రసంగంతో వ్యవస్థాపక చైర్మన్ మావో ఒక కొత్త శకం ప్రారంభించారు. కేవలం 17 యుద్ధ విమానాలతో నాడు పెరేడ్ జరిగింది.

కానీ, ఈసారి పెరేడ్ భారీ స్థాయిలో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఖండాంతర అణు క్షిపణులు, సూపర్ సోనిక్ స్పై డ్రోన్‌లతో చైనా అమేయ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ విన్యాసాలు కొనసాగుతాయి.

చైనా రాజకీయ, ఆర్థిక ప్రగతికి ఇదో సూచిక కానీ, మొత్తంగా చూస్తే పురోగతి అనేది ఒక అంసపూర్ణ కథనం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక షాంఘైలోని ఆకాశహార్మ్యాలు అక్కడి ప్రగతికి నిదర్శనంగా కనిపిస్తుంటాయి.

చైనాకు కొత్తగా వచ్చే పర్యాటకులు ఇక్కడి ఆకాశ హార్మ్యాలను, హైటెక్ మెగా సిటీలను, అతి పెద్ద హైస్పీడ్ రైల్ నెట్ వర్క్‌లను చూసి ఆశ్చర్యపోతుంటారు.

డిజైనర్‌ వస్తువులను కొనుగోలు చేసే, స్వేచ్ఛగా తిరిగే, ఇంటర్నెట్‌ను వాడే వినియోగదారులను చూస్తారు.

చైనాలోని ప్రధాన నగరాల్లో చాలా మంది పెరిగిన భౌతిక సంపద, అవకాశాల వల లబ్ది పొందారు. వీరు కమ్యూనిజానికి కృతజ్ఞతతో విధేయులుగా ఉన్నారు.

స్థిరత్వం, అభివృద్ధి విషయంలో పురోగతిమూలంగా రాజకీయ స్వేచ్ఛ లేకపోవడం, విదేశీ మీడియాలో తరచుగా కనిపించే సెన్సార్‌షిప్‌ను సైతం వారు ఆమోదిస్తారు. లేదా కనీసం సహిస్తారు.

వారి పెరేడ్‌ను జాతీయ విజయ గాథకు సూచికగా చూస్తారు.

కానీ, అభివృద్ధి అనే కత్తి చైనాను చెక్కుతున్న సమయంలో కాస్త లోతుగా, మరింత పెద్దగా చెక్కింది.

Image copyright Getty/Topical
చిత్రం శీర్షిక చైనాలో వ్యవసాయ విధానంలో తీసుకొచ్చిన భారీ మార్పుల వల్ల లక్షలాది మంది ఆకలితో చనిపోయారు.

చావులు, పేదిరకం, ఖైదీలు

వ్యవసాయ విధానంలో మావో తీసుకొచ్చిన మార్పుల వల్ల తీవ్రమైన పరిణామాలు సంభవించి లక్షలాది మంది చనిపోయారని అంటారు. ఇక సాంస్కృతిక విప్లవం వల్ల వేలాది మంది హత్యకు గురయ్యారు, కొందరు ఏళ్ల తరబడి హింసకు, విచారణకు గురయ్యారు. నిజాలు చైనా పాఠ్యపుస్తకాల్లో కనిపించకుండా పోయాయి.

మావో మరణం తర్వాత, జనాభా నియంత్రణ కోసం తీసుకొచ్చిన ఒక బిడ్డ విధానం 40 ఏళ్ల పాటు క్రూరంగా అమలైంది.

ఇప్పటికి కూడా, కొత్తగా వచ్చిన ఇద్దరు బిడ్డల విధానంపై ఆ పార్టీ సుముఖంగా లేదు. ఎంతమంది పిల్లలను కనాలనే ప్రజల వ్యక్తిగత స్వేచ్చను హరించాలని అనుకుంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. ఏక పార్టీ పాలనలో చైనాలోని విధ్వంసం అనేక విభాగాల్లో భారీ స్థాయిలో జరిగింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎంతమంది పిల్లలను కనాలనే ప్రజల వ్యక్తిగత స్వేచ్చపై కూడా చైనాలో ఆంక్షలు ఉన్నాయి.

మతపరమైన అణచివేత, స్థానిక ప్రభుత్వ భూకబ్జాలు, అవినీతి బాధితులు ఎంతో మంది ఉన్నారు.

చైనా పారిశ్రామిక విజయంలో వెన్నెముకగా ఉన్న కోట్లాది మంది వలస కార్మికులు ఆ దేశ పౌరసత్వం, ప్రయోజనాలు పొందకుండా చాలా ఏళ్ల నుంచి ఉన్నారు.

కఠినమైన నివాస అనుమతి విధానం వల్ల వలస కార్మికులు, వారి కుటుంబాలు విద్య, ఆరోగ్య సంరక్షణ హక్కులు లేకుండానే పనులు చేస్తున్నారు.

ఇటీవల, చైనా పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్‌లో ఉంటున్న 15 లక్షల మంది ముస్లిం( వీగర్స్, కజక్స్ ఇతరులు)లను వారి జాతి, నమ్మకాలు వేరనే కారణంతో భారీ శిబిరాలలో ఉంచారు.

వారి మదర్సాలను మూసివేసేందుకు చైనా పట్టుబడుతోంది. ఉగ్రవాదులను కొత్త తరహాలో నిరోధిస్తున్నామని ఈ చర్యలను సమర్థిస్తోంది.

చైనాలో విజయవంతమైన వారి చరిత్ర కంటే జైలుపాలైన, హత్యకు, హింసకు గురైన వారి చరిత్ర చాలా పెద్దది. కానీ, దీన్ని దాచిపెట్టారు.

వారి దృక్కోణం నుంచి చూస్తే, చైనా ఇటీవలి చరిత్రలో ఎక్కువ భాగం సెన్సార్‌షిప్ కావడం అనేది కేవలం దేశ స్థిరత్వం, శ్రేయస్సు కోసమే. కానీ, వాస్తవ చరిత్రను బయట పెట్టడం అనేది అక్కడున్న విదేశీ జర్నలిస్టుల పని.

గొప్పతనం ఆపాదన.. నకిలీ చరిత్ర

సెన్సార్‌షిప్‌తో ప్రజల నోళ్లను మూయించవచ్చు కానీ, గతాన్ని గుర్తు చేసుకోవడాన్ని ఆపలేరు.

బీజింగ్‌లోని సింఘువా విశ్వవిద్యాలయంలోని సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ గువో యుహువా, గత ఏడు దశాబ్దాలుగా చైనా సమాజాన్ని ప్రభావితం చేసిన కొన్ని భారీ మార్పులను రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దిమంది ప్రొఫెసర్లలో ఒకరు.

ఆమె పుస్తకాలను నిషేధించారు. ఆమెపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. సోషల్ మీడియా ఖాతాలను సైతం క్రమం తప్పకుండా తొలగిస్తారు.

‘‘అనేక తరాల నుంచి ప్రజలు తప్పుడు, నకిలీ చరిత్రను చదువుకుంటున్నారు. వాస్తవం పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది’’ అని ఆమె చెప్పారు. పెరేడ్‌కు ముందు విదేశీ మీడియాతో మాట్లాడవద్దని హెచ్చరించినప్పటికీ ఆమె మాతో మాట్లాడారు.

‘‘దేశ చరిత్రను మొత్తంగా తిరిగి అధ్యయనం చేయటం, వాస్తవాలను ప్రతిబింబించేలా చరిత్రను మార్చడం అవసరం అని నేను అనుకుంటున్నాను. మనం అలా చేస్తేనే ఈ విషాదాలు పునరావృతం కాకుండా చూసుకోవచ్చు" అని ప్రొఫెసర్ గువో పేర్కొన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తియానన్మెన్ స్క్వేర్ వద్ద జరిగే ఏ వేడుకకైనా మావో చిత్రపటం ఉంటుంది.

‘కఠోరమైన పనితోనే మాకు సంతోషం లభిస్తుంది’

చైనాలో ఆంక్షలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ పెరేడ్ ఒక రుజువుగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఆహ్వానించిన అతిథులకు మాత్రమే పెరేడ్‌ను చూసే అవకాశం ఉంది.

చైనా చరిత్రలో మరో వార్షికోత్సవం కూడా ఉంది. 30 ఏళ్ల కిందట 1989 జూన్3న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ తియానన్మెన్ స్క్వేర్ వద్ద పది లక్షల మందికి పైగా ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు.

కమ్యూనిస్టు పార్టీ పునాదులను కదిలించిన ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. అక్కడ జరిగిన వాస్తవ ఘటనను ఎప్పుడో తుడిచిపెట్టేసింది.

కానీ, ఆ ఘటనకు గుర్తుగా ప్రభుత్వం ఏటా అక్కడ ఎలాంటి నిరసన ప్రదర్శనలు జరగకుండా యుద్ధ ట్యాంకులతో కవాతు నిర్వహిస్తుంది. సామాన్య ప్రజలు దీన్ని టీవీలో మాత్రమే చూడాలి.

చిత్రం శీర్షిక జావో జింగ్జియా

తిరిగి మనం తియాంజిన్ నగరంలోని జావో జింగ్జియా నివాసానికి వస్తే, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన లాంగ్ మార్చ్ ఘటనలు ఆయన చేతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి.

''ఈ రోజుల్లో కఠోరమైన పని వల్లే మాకు సంతోషం దక్కుతుంది'' అని ఆయన చెప్పారు.

''70 ఏళ్లలో చైనా అసాధారణ స్థాయిలో అభివృద్ధి చెందింది. నిన్న మేము రెండు నావిగేషన్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాం. పౌరులందరూ ఈ ఘటనను చూసి ఆనందించవచ్చు'' అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)