చైనాలో కమ్యూనిస్టు పాలనకు 70 ఏళ్లు.. భారీ మిలిటరీ పరేడ్

  • 1 అక్టోబర్ 2019
జిన్ పింగ్ Image copyright EPA

చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి నేటితో 70ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని చైనా ప్రభుత్వం ఘనంగా జరుపుకుంటోంది. తియనాన్మెన్ స్క్వేర్‌లో ఆయుధ సంపత్తిని ప్రదర్శించడంతో పాటు దేశాధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రసంగించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionతియనాన్మెన్ స్క్వేర్ వద్ద భారీ మిలిటరీ పరేడ్

ఆర్థికంగా, రాజకీయంగా 20వ శతాబ్దంలో చైనా సాధించిన అనూహ్యమైన ఎదుగుదల, అభివృద్ధి కచ్చితంగా అందరూ గుర్తించాల్సిందే. అయితే ఇదంతా సాధించడానికి చైనా ఏక పార్టీ పాలనలోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రతిపక్షమే లేకుండా చేయాల్సివచ్చింది.

ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘన అత్యధికంగా జరిగే దేశం చైనానే అనే అపఖ్యాతిని సంపాదించుకుంది. జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారిని జైళ్లలో పెట్టేందుకు ఏమాత్రం వెనకాడలేదు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక హాంకాంగ్‌లో నిరసనలో పాల్గొన్నవారిని అరెస్టు చేస్తున్న పోలీసులు

70 వసంతాల కమ్యూనిస్టు పాలన చైనా ప్రభుత్వానికి గొప్ప మైలురాయే కానీ హాంకాంగ్‌లో నెలల తరబడి జరుగుతున్న నిరసనలు అక్కడి ప్రభుత్వం పైన, బీజింగ్ నాయకత్వం పైన వ్యతిరేకతను పెంచుతున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బీజింగ్ లోని ప్రధాన ప్రాంతాలన్నీ భద్రతావలయంలోకి వెళ్లిపోయాయి.

చైనా ప్రభుత్వం 70 ఏళ్ల కమ్యూనిస్టు పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఎప్పుడో ఏర్పాట్లు మొదలుపెట్టింది. దానిలో భాగంగా వారం రోజుల ముందు నుంచే తియనాన్మెన్ స్క్వేర్, మావో జెడాంగ్ మాసోలియమ్, ప్రభుత్వ భవనాలు, పార్లమెంటు వంటి ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి, పూర్తిగా అదుపులోకి తీసుకుంది.

సెప్టెంబర్ 15వ తేదీ నుంచి రోడ్లపై పావురాలు కనిపించకూడదని, అవి ఎగరకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. దీనిపై కొందరు విమర్శలు వ్యక్తం చేశారు.

Image copyright CGTN

ఎందుకీ ఉత్సవాలు?

ఆధునిక చైనాగా పిలుచుకునే ప్రస్తుత చైనాలో పౌరయుద్ధం, దాని తర్వాత రెండో ప్రపంచయుద్ధం ముగిశాక 1949లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది.

చైనా ప్రపంచ శక్తిగా ఎదిగిన తర్వాత నిర్వహిస్తున్న ఉత్సవం ఇదే. పదేళ్ల క్రితం చైనా తయారీ రంగంలో అగ్రగామి, కానీ ప్రస్తుతం అది అమెరికాను సైతం ఆర్థికంగా ఢీకొట్టగలిగే స్థాయికి ఎదిగింది.

Image copyright CCTV

ఇప్పుడు చైనా అంతా ఎక్కడ చూసినా కమ్యూనిస్టు పార్టీ జెండాలు, భద్రతాధికారులే.

అయితే అధ్యక్షుడు జిన్ పింగ్‌ ముందున్నది పూల బాటేమీ కాదు.

అమెరికాతో వాణిజ్య యుద్ధం, హాంకాంగ్‌లో తీవ్రరూపం దాలుస్తున్న నిరసనలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం, పంది మాంసం ధరల పెరుగుదల ఆయనకు ఈ సమయంలో ఇబ్బంది కలిగించే అంశాలే.

Image copyright CGTN

సెప్టెంబర్ 3న తన ప్రసంగంలో 'ఇబ్బంది' అనే పదాన్ని జిన్ పింగ్ 50 సార్లకు పైగా ఉపయోగించడమే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

ఎప్పుడూ చైనా విజయాల్ని పెద్దగా చెప్పుకునే ఆ దేశ మీడియా సైతం అసాధారణ సవాళ్లు ముందున్నాయి అని వ్యాఖ్యానించింది.

ఏం చేస్తోంది?

చైనా తన సైనిక పాఠవాన్ని, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి ప్రదర్శించేందుకు ఈ సందర్భాన్ని గొప్పగా ఉపయోగించుకుంటోంది.

ఇతర ప్రముఖ నేతలతో కలిసి అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తియనాన్మెన్ స్క్వేర్ ప్రాంతానికి చేరుకున్నారు. ఆయనకు గత సంవత్సరమే చైనాకు జీవితకాల అధ్యక్షుడిగా ఉండడానికి మార్గం సుగమమైంది. జిన్ పింగ్ సిద్ధాంతం (జిన్ పింగ్ థాట్) అధికారికంగా రాజ్యాంగంలో చేరింది. మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా పేరుపొందారు.

Image copyright CGTN

భారీ సంఖ్యలో తుపాకులను గాలిలో పేల్చడం ద్వారా వేడుకలు ప్రారంభమైనట్లుగా ప్రీమియర్ లీ కెకియాంగ్ ప్రకటించారు. 56 తుపాకులు ఒక్కొక్కటి 70 రౌండ్లపాటు కాల్చారు. చైనాలోని 56 వర్గాల ప్రజలను సూచిస్తూ 56 తుపాకులు, 70 ఏళ్ల పాలనను సూచిస్తూ 70 రౌండ్ల బులెట్లు గాలిలోకి పేలాయి.

Image copyright CGTN

ఈ సందర్భంగా జిన్ పింగ్ ప్రసంగించారు.

"పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటును 70 ఏళ్ల క్రితం ఇదే రోజు కామ్రేడ్ మావో జెడాంగ్ ప్రపంచానికి వెల్లడించారు. మన చరిత్రలోనే అత్యంత దుర్భరమైన రోజులకు ఆరోజుతో అంతం పలికాం. అప్పటి నుంచి చైన ప్రజలు అద్భత ప్రగతిని సాధించారు" అని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకే ప్రథమ ప్రాధాన్యమిస్తుందని, వారికి మెరుగైన జీవితాన్ని అందించేందుకు, వారి ఆశలను నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.

Image copyright CGTN
Image copyright CGTN

అంతకు ముందు, ఓపెన్ టాప్ లైమోసీన్‌లో పరేడ్ చేస్తూ సైనికుల అభివాదాన్ని స్వీకరించారు.

"గుడ్ జాబ్, కామ్రేడ్స్, మీరు చేసిన కృషికి ధన్యవాదాలు, కామ్రేడ్స్" అంటూ ఆయన ముందుకు సాగారు. ఆయన తిరిగే మార్గానికి అటూ ఇటూ నిలబడిన సైనికులు, ఆయుధ సంపత్తిని చూస్తూ ఆయన ముందుకెళ్లారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ పరేడ్‌ ప్రత్యక్ష ప్రసారాల సమయంలో ప్రభుత్వ మీడియా సీసీటీవీ యూజర్లకు కామెంట్లు చేసే అవకాశం కల్పించింది.

Image copyright CGTN

చాలా వరకూ చైనాను, జిన్ పింగ్‌ను అభినందిస్తూ వచ్చే కామెంట్లే ఉన్నా, కొన్ని కామెంట్లలో మాత్రం విమర్శలు, అసభ్య పదజాలం కూడా వచ్చాయి.

ఈవిల్ చైనీస్ ఎంపైర్ (దుష్ట చైనా రాజ్యం) అని, జూన్ 4ను గుర్తుపెట్టుకో (తియనాన్మెన్ నరమేథం) అని, హాంకాంగ్‌కు స్వాతంత్ర్యం కావాలని.. రకరకాల కామెంట్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం