జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?

  • 7 అక్టోబర్ 2019
గింజను ముక్కుతో పట్టుకెళ్తున్న కాకి

మీరుండే ప్రాంతంలో వివిధ జంతువులు, పక్షులు పట్టణ జీవనానికి ఎలా అలవాటు పడుతున్నాయో ఎప్పుడైనా గమనించారా?

జపాన్‌లోని సెండాయ్ నగరం కాకులకు వాల్నట్ అంటే చాలా ఇష్టం. వాల్నట్ గుల్ల గట్టిగా ఉండటంతో ముక్కుతో పగలగొట్టుకోవడం వాటికి చాలా కష్టమయ్యేది. వాల్నట్‌ను గాల్లోకి తీసుకెళ్లి కింద పడేసి పగిలిన తర్వాత తినేవి. కొన్ని వేల సంవత్సరాలు ఇలాగే చేశాయి. 1970ల్లో ఈ కాకులు వాల్నట్ తినే పద్ధతిలో తేడా వచ్చినట్లు ఒక స్థానిక శాస్త్రవేత్త గుర్తించారు.

కాకులు రోడ్డుపై వాల్నట్ గుల్లలు పడేసి, వాటి మీద వాహనాలు వెళ్లి అవి పగిలిన తర్వాత తినడం మొదలుపెట్టాయి. వాల్నట్ గుల్లను పగలగొట్టేందుకు కాకులు వాహనాలను వాడుకొన్నాయి.

జంతువులు, పక్షులు, కీటకాల ప్రవర్తనలో వేలు, లక్షల సంవత్సరాల్లో రావాల్సిన మార్పులు అంతకంటే చాలా తక్కువ కాలంలో రావడానికి పట్టణీకరణ ఎలా కారణమవుతుందో చెప్పేందుకు సెండాయ్ కాకులను ఉదాహరణగా చూపిస్తారు.

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ముందెన్నడూ లేనంత ఎక్కువగా ఇప్పుడు ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. 1960లో ప్రపంచ జనాభాలో 34 శాతం మంది పట్టణాల్లో నివసించగా, ఐరాస 2018 గణాంకాల ప్రకారం 55 శాతం మంది పట్టణాల్లో ఉన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఐరాస 2018 గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభాలో 55 శాతం మంది పట్టణాల్లో ఉన్నారు.

వేగవంతమైన పట్టణీకరణతో జీవవైవిధ్యంపై ప్రభావం

2050 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం మంది పట్టణాల్లోనే ఉంటారనే అంచనాలు ఉన్నాయి.

వేగవంతమైన పట్టణీకరణతో వన్యప్రాణులు, జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. జంతువులు, పక్షులు వాటి ఆవాసాలను కోల్పోతున్నాయి. ఈ పరిణామాలతో అనేక జీవజాతుల్లో మార్పులు వస్తున్నాయి. అలా ఇవి నగర జీవనానికి అలవాటు పడుతున్నాయి.

పట్టణీకరణ, వన్యప్రాణుల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని డచ్ పరిణామక్రమ జీవశాస్త్రవేత్త మెన్నో షిల్తూజెన్ చెప్పారు.

2018లో విడుదల చేసిన 'డార్విన్ కమ్స్ టు టౌన్: హౌ ద అర్బన్ జంగిల్ డ్రైవ్స్ ఎవొల్యూషన్' పుస్తకంలో ఆయన ఈ అంశంపై చర్చించారు.

భవిష్యత్తులో అత్యధిక ప్రజలకు పట్టణ ప్రాంత ప్రకృతి తప్ప మరో ప్రకృతి తెలియదని, అలాంటి పరిస్థితిలోకి మనం వెళ్తున్నామని షిల్తూజెన్ అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంత జీవజాలం సాధ్యమైనంత వైవిధ్యంగా, సుసంపన్నంగా ఉండేలా చూడాల్సి ఉందని తెలిపారు.

శతాబ్దాల్లో రావాల్సిన మార్పులు దశాబ్దాల్లో లేదా సంవత్సరాల్లో వచ్చేలా అత్యంత వేగంగా జీవులు అలవాటు పడటాన్ని మానవ ప్రేరేపిత జీవపరిణామ క్రమం(హెచ్ఐఆర్‌ఈసీ)గా చెప్పొచ్చు. కొన్ని మార్పులను షిల్తూజెన్, ఇతర శాస్త్రవేత్తలు ఇందుకు ఉదాహరణలుగా చెబుతారు.

'బ్రిడ్జ్ స్పైడర్' అనే సాలీడు, చిమ్మట పురుగుల్లో మార్పుల గురించి షిల్తూజెన్ 'డార్విన్ కమ్స్ టు టౌన్' పుస్తకంలో వివరించారు.

Image copyright Getty Images

సాలీడు - చిమ్మట పురుగులు

"సాధారణంగా బ్రిడ్జ్ స్పైడర్స్ కాంతికి దూరంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి చిమ్మట పురుగులను ఆకర్షించే వీధిదీపాలకు దగ్గర్లో గూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మరోవైపు కొన్ని నగరాల్లో చిమ్మట పురుగులు కాంతిని తట్టుకోవడానికి అలవాటు పడుతున్నాయి" అని ఆయన తెలిపారు. ఒకవైపు ఈ సాలీళ్లు చిమ్మట పురుగులను తినేందుకు వీధిదీపాల వద్ద గూడు కట్టుకోవడం నేర్చుకొంటుండగా, ఇంకోవైపు ఈ పురుగులు వాటికి చిక్కకుండా ఉండే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇలాంటి మార్పులు వివిధ జీవజాతుల్లో కనిపిస్తున్నాయి. నగరాల్లో ఈ మార్పులను బాగా గమనించవచ్చు.

2017లో 'సైన్స్' జర్నల్‌లో వెలువడిన పరిశోధన పత్రంలో- పట్టణ పరిస్థితులకు అనుగుణంగా జీవజాతులు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడానకి సంబంధించిన 192 అధ్యయనాల గురించి ఉంది.

ఆయా జీవజాతులు పట్టణ వాతావరణంలోనే తమ మనుగడకు అనువైన ఆవాసాలను గుర్తించాయని ఈ పత్రం చెబుతోంది.

పెరిగ్రిన్ ఫాల్కన్ అనే పక్షి ఇందుకు ఉదాహరణ. ఇరవయ్యో శతాబ్దం మధ్యలో చాలా ప్రాంతాల్లో రసాయన ఎరువుల కారణంగా ఈ పక్షి మనుగడకే ముప్పు ఏర్పడింది.

Image copyright MTA handout
చిత్రం శీర్షిక పెరిగ్రిన్ ఫాల్కన్

పెరిగ్రిన్ ఫాల్కన్: భవనాలపై గూళ్లు

పెరిగ్రిన్ ఫాల్కన్ పక్షులు కీటకాలను తినే వలస పక్షులను తింటాయి. ఈ క్రమంలో డీడీటీ అనే రసాయన ఎరువును ప్రమాదకర స్థాయుల్లో తీసుకోవడం వల్ల వీటికి అంతరించిపోయే ముప్పు ఎదురైంది. తర్వాత డీడీటీపై నిషేధం, పక్షుల సంతానోత్పత్తి దిశగా చర్యలు చేపట్టడంతో తిరిగి వీటి సంఖ్య పెరగడం మొదలైంది. అంతకుముందు తమ ఆవాసాలు ధ్వంసమవుతుండటంతో ఈ పక్షులు పట్టణాల్లో ఆశ్రయం పొందాయి.

ఇవి నగరాల్లో ఎత్తైన భవంతులు, ఇతర నిర్మాణాలపై గూళ్లు ఏర్పాటు చేసుకోవడం నేర్చుకున్నాయి. నగరాల్లో కనిపించే పావురాలు, గబ్బిలాలు వంటి జీవులను తిని ఇవి బతికాయి. గ్రామీణ ప్రాంతాలు, అడవులతో పోలిస్తే నగరాల్లో ఇలాంటి జీవులు తక్కువగానే ఉంటాయి.

డార్విన్స్ ఫించెస్: మారిన ముక్కు

డార్విన్స్ ఫించెస్‌ పక్షులకు జీవశాస్త్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.

పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశానికి చెందిన గాలపగోస్ ఐలాండ్స్‌లో ఈ పక్షులపై చార్లెస్ డార్విన్ అధ్యయనం చేశారు. 'సహజ ఎంపిక' సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో ఈ అధ్యయనం డార్విన్‌కు ఎంతగానో ఉపయోగపడింది.

ఈ పక్షుల ముక్కులు వేర్వేరు పరిమాణాల్లో, ఆకారాల్లో ఉండేవి. వివిధ దీవుల్లో కొన్ని రకాల నిర్దిష్టమైన ఆహారానికి ఇవి అలవాటుపడ్డాయి.

అమెరికాలో అరిజోనా రాష్ట్రం టుక్సన్ నగరంలోని ఫించెస్ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. గ్రామీణ ప్రాంత ఫించెస్‌తో పోలిస్తే టుక్సన్‌లోని పొడవైన, వెడల్పైన ముక్కులు ఉన్నాయి.

ముక్కు ఈ ఆకారంలో ఉండటం వల్ల, పక్షులకు ఆహారం కోసం పెట్టే 'ఫీడర్ల'లో పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోవడం వీటికి తేలికవుతోంది.

వన్యప్రాణులకు ఏవైనా కొత్త ఆహారాన్ని, వనరులను ఏర్పాటు చేసినప్పుడు 'సహజ ఎంపిక' విధానం గందరగోళంగా మారుతుందనేందుకు ఈ మార్పు ఒక బలమైన ఉదాహరణని అమెరికాలోని 'మ్యూజియం ఆఫ్ సౌత్‌వెస్టర్న్ బయాలజీ'లో పక్షుల విభాగం సంచాలకుడు, సంరక్షకుడు అయిన క్రిస్టఫర్ విట్ చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ భూగర్భ స్టేషన్లలో తలదాచుకొన్న పౌరులు ఏవో జీవులు తమను తీవ్రంగా కుట్టాయని చెప్పారు. అవే క్యూలెక్స్ మాలెస్టస్ దోమలు

లండన్ అండర్‌గ్రౌండ్ దోమ: మనిషి రక్తం రుచిమరిగిన దోమ

'క్యూలెక్స్ పీపియన్స్' అనే దోమ జాతి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎలాంటి పరిస్థితులకైనా ఈ దోమలు ఇట్టే అలవాటు పడిపోతాయి. ఈ జాతి దోమల్లో 'లండన్ అండర్‌గ్రౌండ్' దోమ ప్రత్యేకమైనది. పరిస్థితులకు అలవాటు పడటంలో ఇది ఒక అడుగు ముందుంది.

క్యూలెక్స్ పీపియన్స్ దోమలు భూ ఉపరితలంపై నివసిస్తాయి. క్యూలెక్స్ మాలెస్టస్ దోమలు భవనాలు, ఇతర నిర్మాణాల్లో, భూగర్భంలో మనుగడ సాగిస్తాయి.

క్యూలెక్స్ పీపియన్స్ సాధారణంగా పక్షులను కుడతాయి. క్యూలెక్స్ మాలెస్టస్ మనిషి రక్తం రుచిమరిగాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 'లండన్ అండర్‌గ్రౌండ్' దోమ

క్యూలెక్స్ మాలెస్టస్ దోమను తొలిసారి 18వ శతాబ్దంలోనే గుర్తించారు. మరి దీనికి లండన్లోని ప్రఖ్యాత భూగర్భ రవాణా వ్యవస్థ పేరు ఎలా వచ్చింది?

రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ బలగాల బాంబు దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు లండన్ వాసులు నగరంలోని ఈ సొరంగాల్లో తలదాచుకొన్నారు. సొరంగాల్లో తమను ఏవో జీవులు తీవ్రంగా కుట్టాయని అక్కడ గడిపిన పౌరులు చెప్పారు. ఆ విధంగా ఈ దోమలకు 'లండన్ అండర్‌గ్రౌండ్' దోమలనే 'నిక్‌నేమ్' వచ్చింది.

క్యూలెక్స్ మాలెస్టస్ దోమలు భూగర్భంలోని పరిస్థితులకు అలవాటు పడ్డాయి. నిల్వ ఉన్న నీటికీ అలవాటు పడ్డాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పెప్పర్డ్ మోత్స్

పారిశ్రామికీకరణ: తెలుపు, నలుపు చిమ్మట పురుగులు

మనిషి కారణంగా మార్పులకు లోనయిన మరో కీటకం - 'పెప్పర్డ్ మోత్' అనే చిమ్మట పురుగు.

బ్రిటన్లో పెద్దయెత్తున పారిశ్రామికీకరణ జరిగిన దశాబ్దాల్లో ఈ కీటకాల్లో నల్లరకం కీటకాల సంఖ్య పట్టణ ప్రాంతాల్లో విపరీతంగా పెరిగింది.

పరిశ్రమల చిమ్నీల్లోంచి వెలువడే మసి, శత్రువుల బారి నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు ఈ కీటకాలకు ఉపయోగపడింది.

తెల్లరంగు కీటకాల ప్రయత్నాలు మరో రకంగా ఉండేవి. చెట్లపై బూడిద, ఆకుపచ్చ, లేదా పసుపు వర్ణంలో పెరిగే మొక్క లాంటి జీవమైన 'లిచెన్' చాటున ఇవి దాక్కొనేవి. శత్రుజీవులకు వీటి జాడ తెలిసిపోయేది. దీంతో వీటి సంఖ్య తగ్గిపోయింది.

1960ల్లో వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించిన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. దీంతో కాలుష్యం తగ్గింది. ఈ కీటకాల్లో తేలిక వర్ణం కీటకాల సంఖ్య మళ్లీ పెరిగింది.

Image copyright Smithsonian Tropical Research Institute
చిత్రం శీర్షిక టుంగారా కప్ప

మెట్రో కప్పలు

టుంగారా కప్పలు మెక్సికో నుంచి దక్షిణ అమెరికా ఖండంలోని ఉత్తర భాగం వరకు ఉష్ణమండల అటవీ ప్రాంతంలో ఉంటాయి. శృంగారం కోసం ఆడకప్పలను ఆకర్షించేందుకు మగకప్పలు తమదైన రీతిలో శబ్దాలు చేస్తాయి.

ఈ కప్పలను తినే జీవులు కూడా వీటి జాడను గుర్తించేందుకు కూడా మగకప్పల మాదిరే అరుస్తాయి.

గ్రామీణ ప్రాంత కప్పలతో పోలిస్తే నగర ప్రాంత కప్పల్లో ఈ అరుపుల్లో స్పష్టమైన తేడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

పట్టణ ప్రాంతాల్లో ఆడకప్పలను ఆకర్షించేందుకు మగకప్పలు సంక్లిష్టమైన శబ్దాలు చేయడం అలవాటు చేసుకొన్నాయని వారు కనుగొన్నారు.

పట్టణ ప్రాంత కప్పలకు ('మెట్రో ఫ్రాగ్స్‌'కు) శత్రుభయం కూడా తక్కువే.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాడుతున్న బ్లాక్‌బర్డ్

బ్లాక్‌బర్డ్: పాడే వేళల్లో మార్పులు

కామన్‌ బ్లాక్‌బర్డ్ (కోకిల తరహా పక్షి) ప్రపంచంలో అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉన్న, పరిశోధకులు బాగా అధ్యయనం చేసిన పట్టణ జీవుల్లో ఒకటి.

ఈ పక్షుల్లో గ్రామీణ ప్రాంత పక్షులతో పోలిస్తే పట్టణ ప్రాంత పక్షుల్లో నగర జీవనం పెను మార్పులు తీసుకొచ్చింది.

ఐరోపా, ఉత్తర అమెరికాల్లో పట్టణ ప్రాంత బ్లాక్‌బర్డ్స్ ఏకంగా ఒక కొత్త జాతిగా రూపాంతరం చెందుతున్నాయని డచ్ శాస్త్రవేత్త మెన్నో షిల్తూజెన్ అభిప్రాయపడ్డారు. జన్యుపరంగానే గ్రామీణ, నగర ప్రాంత పక్షుల మధ్య తేడాలు ఉన్నాయని తెలిపారు.

ఈ పక్షుల్లో నగర ప్రాంత పక్షులు పొట్టిగా ఉంటాయి. వీటికి మొద్దు ముక్కు ఉంటుంది. ఇవి చలికాలంలో వలస వెళ్లవు.

నగరాల్లో శబ్ద కాలుష్యం ఈ పక్షులు పాడే తీరులో, పాడే వేళల్లో మార్పులు తెచ్చింది.

అడవుల్లోని పక్షులు సూర్యోదయాన కూస్తుండగా, పట్టణ పక్షులు సూర్యోదయానికి కొన్ని గంటల ముందే కూస్తున్నాయి.

Image copyright Kristin Winchell
చిత్రం శీర్షిక అనోల్ బల్లి

అనోల్ బల్లుల కథ

కరీబియన్ సముద్రంలోని ప్యూర్టోరికోలో ఉండే అనోల్ అనే బల్లులది మరో కథ. పట్టణ ప్రాంత జీవనానికి బాగా అలవాటుపడిన జీవుల్లో ఇది ఒకటి.

ఇవి సాధారణంగా రాళ్లు, చెట్లపై తిరుగుతాయి. పట్టణీకరణతో వీటికి పెద్ద సవాలే ఎదురైంది. నున్నటి గోడలు, కిటికీలతో వీటికి పాకడం కష్టమైపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనుగడ సాగించేందుకు అవసరమైన మార్పులు ఈ జీవుల్లో వచ్చాయి.

ఉపరితలానికి శరీరం మరింత బాగా అతుక్కునే మరింత పొడవైన కాళ్లను పట్టణ ప్రాంత అనోల్ బల్లులు వృద్ధి చేసుకున్నాయి.

Image copyright Kristin Winchell
చిత్రం శీర్షిక అనోల్ బల్లుల పాదాలు

అధిక ఉష్ణోగ్రతలను కూడా పట్టణ బల్లులు తట్టుకోగలగుతున్నాయని అమెరికాలో సెయింట్ లూయీలోని వాషింగ్టన్ యూనవర్శిటీకి చెందిన జీవశాస్త్రవేత్త కిర్‌స్టిన్ వించెల్ చెప్పారు.

పట్టణీకరణకు వివిధ జీవులు అలవాటు పడుతున్నాయని చెబుతూనే, ఈ మార్పులను తప్పుగా అన్వయించుకొని పర్యావరణ పరిరక్షణలో రాజీపడకూదని ఆమె హెచ్చరిస్తున్నారు. పట్టణీకరణకు ఈ జీవులు అలవాటుపడుతున్నంత మాత్రాన వీటి మనుగడకు ముప్పు లేదనుకోరాదని చెప్పారు.

నగరాల అభివృద్ధిలో జీవుల మనుగడకు స్థానం కల్పించకపోతే సాధారణమైన ప్రాణులు కూడా అంతరించిపోతాయని ఆమె హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బోరిస్ జాన్సన్: బ్రిటన్ ప్రధానిగా మళ్ళీ కన్సర్వేటివ్ నేత... ఎన్నికల్లో టోరీల ఘన విజయం

'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు

ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు

అస్సాంలో ఆందోళనలు: పౌరసత్వ సవరణ బిల్లుపై పెరిగిన నిరసనలు... ఇద్దరు మృతి