కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?

  • 9 అక్టోబర్ 2019
చైనా కశ్మీర్‌ వివాదం Image copyright NARENDRA MODI/TWITTER

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో కశ్మీర్‌పై చైనా చేసిన ప్రకటన పాక్‌కు సంతోషం కలిగించేలా లేదు.

చైనా విదేశాంగ శాఖ కశ్మీర్‌పై చేసిన ప్రకటన అంతకుముందు కంటే భిన్నంగా ఉంది. "యూఎన్ చార్టర్, దాని ప్రతిపాదనల ప్రకారం కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతకాలని" చైనా ఇటీవల చెప్పింది. కానీ, ఇప్పుడు మాత్రం "భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి" అంటోంది.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత పర్యటన ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనాలో పర్యటించడంపై చైనా విదేశాంగ శాఖను మీడియా మంగళవారం కొన్ని ప్రశ్నలు అడిగింది. "ఈ రెండు పర్యటనలకూ ఏదైనా సంబంధం ఉందా? పాక్ ప్రధాని ఈ పర్యటనలో కశ్మీర్ అంశం కూడా లేవనెత్తుతారని ఆ దేశ మీడియా చెబుతోంది, మీరేమంటారు? అంది.

సమాధానం ఇచ్చిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గ్యాంగ్ షువాంగ్, "కశ్మీర్ అంశంపై చైనా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. మా వైఖరి పూర్తిగా స్పష్టంగా ఉంది. భారత్-పాకిస్తాన్‌కు మేం చెప్పేది ఒక్కటే. కశ్మీర్‌తో పాటు మిగతా వివాదాలను కూడా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. దానివల్ల రెండు దేశాల మధ్య పరస్పరం నమ్మకం పెరుగుతుంది. ఆ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. దానివల్ల భారత్, పాక్ సమస్యలు పరిష్కారం అవుతాయి" అన్నారు.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అక్టోబర్ 11, 12 తేదీల్లో రెండు రోజుల పర్యటన కోసం భారత్ వస్తున్నారు. అంతకుముందు, "ఆర్టికల్ 370ని తొలగించిన భారత్ జమ్ము-కశ్మీర్ యధాతథ స్థితిని మార్చేస్తోందని" చైనా చెప్పింది. పాకిస్తాన్ ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వరకూ తీసుకెళ్లింది. అక్కడ దానికి చైనా మద్దతు కూడా లభించింది.

Image copyright Getty Images

అంతేకాదు, కొన్ని రోజుల కిందట పాకిస్తాన్‌లోని చైనా రాయబారి యావో జింగ్‌ "కశ్మీర్ అంశంలో చైనా పాకిస్తాన్‌కు అండగా ఉంటుందని" అన్నారు.

"మేం కశ్మీరీలకు వారి ప్రాథమిక హక్కులు, న్యాయం అందించేందుకు ప్రయత్నిస్తాం" అని కూడా చెప్పారు.

కానీ ఇప్పుడు మాత్రం, "కశ్మీర్ అంశాన్ని భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని" చైనా విదేశాంగ శాఖ చెబుతోంది.

పాకిస్తాన్‌ను చైనాకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా గెంగ్ షువాంగ్ చెప్పారు. రెండు దేశాల నేతల మధ్య సన్నిహిత చర్చల సంప్రదాయం ఉందన్నారు.

"పాకిస్తాన్‌తో మా సంబంధాలు వ్యూహాత్మకం. రెండు దేశాల మధ్య బలమైన నమ్మకం ఉంది" అని చెప్పిన గెంగ్ షువాంగ్ భారత్‌ కూడా చైనాకు ముఖ్యమైన పొరుగుదేశమని చెప్పారు.

Image copyright Getty Images

"భారత్, చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న దేశాలు. రెండూ ఎదుగుతున్న అతిపెద్ద మార్కెట్లు. గత ఏడాది వుహాన్‌లో భారత్, చైనా మధ్య ప్రారంభమైన చర్చలతో రెండు దేశాల సంబంధాల్లో మంచి మార్పులు వచ్చాయి. రెండు దేశాలు వివిధ రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాయి. అభిప్రాయ భేదాలను సున్నితంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం" అని ఆయన తెలిపారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పర్యటన గురించి చెబుతూ, "ఇమ్రాన్ ఖాన్ పర్యటన చైనాకు చాలా ముఖ్యమైనది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధానమంత్రి లీ కొచియాంగ్, చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖ నేత లె జాంగ్ షూలతో ఆయన సమావేశం అవుతారు. రెండు పక్షాలకూ ప్రయోజనంగా ఉండే అంశాలపై ఇదే పర్యటనలో విస్తృత ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి" అన్నారు.

"భారత్, చైనాలోని సంబంధిత విభాగాలు కూడా రెండు పక్షాల సహకారానికి అవసరమైన ఒప్పందాలపై సంతకాలు చేస్తాయని" గెంగ్ షువాంగ్ చెప్పారు.

చైనా విదేశాంగ శాఖ నుంచి లభించిన సమాచారం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ఇంటర్నేషనల్ హార్టికల్చర్ ఎగ్జిబిషన్ ప్రారంభ వేడుకలో పాల్గొంటారు.

ఇటు భారత్‌లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ ట్విటర్‌లో దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు కూడా చెప్పారు.

తర్వాత మరో ట్వీట్ చేసిన వెయిడాంగ్, అందులో పంచశీల సిద్ధాంతాలను ప్రస్తావించారు.

"అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితి వాతావరణం పెరుగుతుండడంతో పంచశీల ఒప్పందంపై ఒకేసారి ఎలా సంతకాలు చేశామో, అలాగే, భారత్, చైనా అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై పరస్పర సహకారం కూడా బలోపేతం చేసుకోవాలి. అంతర్జాతీయ సంబంధాలకు ఆ పంచశీల సిద్ధాంతమే పునాదిగా నిలిచింది" అన్నారు.

భారత్‌కు ఇబ్బంది కలిగించేలా కశ్మీర్‌పై చైనా చేసిన ప్రకటన పాకిస్తాన్‌లోని చైనా రాయబారి నుంచి మాత్రమే వచ్చింది.

భారత్ దీనిపై ఆదివారం చైనా ఎదుట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయనుందని ఇంగ్లిష్ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భారత సైన్యం దాడిలో ‘ఉగ్రవాదులు’, పాక్ సైనికులు మృతి: ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రకటన

తండ్రి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న కొడుకులు.. కారణమేంటి

సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

మెట్రో రైలు చార్జీల పెంపుపై నిరసన: చిలీలో హింస.. ముగ్గురి మృతి

‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల

వాట్సాప్‌పై పన్ను వేసేందుకు లెబనాన్‌లో ప్రయత్నం.. ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం

టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’

బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ