ట్రంప్‌పై అభిశంసన విచారణను బహిష్కరిస్తామని ప్రకటించిన వైట్‌హౌస్

  • 9 అక్టోబర్ 2019
ట్రంప్ Image copyright Reuters

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై అభిశంసన విచారణకు సహకరించబోమని వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది.

''ట్రంప్‌పై ఆరోపణలు నిరాధారం, అభిశంసన రాజ్యాంగపరంగా చెల్లద''ని డెమొక్రటిక్ నేతలకు పంపిన ఓ లేఖలో వైట్‌హౌస్ పేర్కొంది. డెమొక్రాట్ల నేతృత్వంలోని మూడు కమిటీలు ట్రంప్‌పై విచారణ జరుపుతున్నాయి.

ఈ అభిశంసన విచారణకు హాజరుకాకుండా యూరోపియన్ యూనియన్‌లో అమెరికా రాయబారిని ట్రంప్ ప్రభుత్వం నిరోధించిన కొద్ది గంటల్లోనే వైట్‌హౌస్ ఈ లేఖ రాసింది.

లేఖలో ఇంకా ఏం చెప్పారు...

డెమొక్రటిక్ నేతలు, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ, డెమొక్రటిక్ కమిటీల ముగ్గురు చైర్మన్లను ఉద్దేశిస్తూ వైట్‌హౌస్ కౌన్సిల్ పాట్ సిపోలన్ పేరిట ఈ ఎనిమిది పేజీల లేఖ రాశారు.

అభిశంసన ప్రక్రియలో భాగంగా చేపడుతున్న విచారణ రాజ్యాంగపరంగా పాటించాల్సిన పద్ధతులకు, ప్రాథమిక న్యాయానికి విరుద్ధంగా ఉందని ఈ లేఖలో ఆరోపించారు. అభిశంసన ప్రక్రియలో ఓటింగ్ చేపట్టకపోవడంతో అది రాజ్యాంగపరంగా చెల్లుబాటు కాదని ఆ లేఖలో స్పష్టం చేశారు.

2016 నాటి ఎన్నికల ఫలితాలను కూడా డెమొక్రాట్లు మార్చాలని ప్రయత్నించారనీ ఆ లేఖలో ఆరోపించారు.

''అమెరికా ప్రజల పట్ల తన బాధ్యతను నిర్వర్తించాల్సిన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆయన ప్రభుత్వం మీరు చేపట్టబోయే విభజన, రాజ్యాంగవిరుద్ధ విచారణలో పాలుపంచుకోలేదు'' అని రాశారు.

కాగా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ దీనిపై స్పందిస్తూ లేఖను ''ఉద్దేశపూర్వక తప్పు''గా అభివర్ణించారు. చట్టాల్లేని పాలనను ఇది సాధారణమే అనే స్థాయికి తెచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని నాన్సీ ఆరోపించారు.

ప్రతినిధుల సభలో అభిశంసన విచారణ నేపత్యంలో అమెరికా రాజ్యాంగ సంక్షోభం దిశగా కదులుతోంది.

వైట్‌హౌస్ రాసిన లేఖ ఎనిమిది పేజీలున్నప్పటికీ అందులో సారాంశం మాత్రం సుస్పష్టం. ఇంతకుముందులా సహకారం కానీ, పత్రాలు ఇవ్వడం కానీ ఏమీ ఉండబోదన్నది దాని సారాంశం.

విచారణ ప్రక్రియ చట్టబద్ధతను ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అదంతా రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తోంది.

మరోవైపు డెమొక్రాట్లు అంతేస్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు. అభిశంసన చేపట్టేలా ప్రతినిధుల సభకు పూర్తి అధికారం ఉందని రాజ్యాంగం చెబుతోందని, వైట్‌హౌస్ సమ్మతి ఉన్నా లేకున్నా ఆ ప్రక్రియ కొనసాగుతుందని అంటున్నారు.

దీనికి సంబంధించి డెమొక్రాట్ల ముందు కొన్ని మార్గాలున్నాయి.

* వైట్‌హౌస్ సహాయ నిరాకరణనే ఉదాహరణగా చూపుతూ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్న కారణాన్ని అభిశంసనకు స్వీకరించవచ్చు.

* వైట్‌హౌస్ బయటకు చెప్పని డిమాండ్లకు అంగీకరించి వారి నుంచి సహకారం పొందే ప్రయత్నం చేయొచ్చు.

* సహకరించాలని ఆదేశించేలా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.

అభిశంసన విచారణలో తాజాపర్వం ఏమిటి?

డెమొక్రటిక్ కమిటీలు చేపడుతున్న అభిశంసన విచారణకు హాజరుకాకుండా యూరోపియన్ యూనియన్‌లో అమెరికా రాయబారి గోర్డాన్ సోండ్లాండ్‌ను ట్రంప్ ప్రభుత్వం నిరోధించిన కొద్ది గంటల్లోనే వైట్‌హౌస్ ఈ లేఖ రాసింది.

జో బిడెన్ విషయంలో ఉక్రెయిన్‌‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఇతర దౌత్యాధికారులతో సోండ్లాండ్ జరిపిన చర్చలకు సంబంధించిన కొన్ని సందేశాలు గతవారం బయటకొచ్చాయి.

సోండ్లాండ్ న్యాయవాది రాబర్ట్ లస్కిన్ మాట్లాడుతూ.. ''ఈ విచారణ కోసం ఆయన బ్రసెల్స్ నుంచి వాషింగ్టన్ వచ్చారు. ఇక్కడ విచారణకు హాజరుకాకుండా అడ్డుకోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యార''న్నారు.

''రాయబారి సోండ్లాండ్ ఎల్లప్పుడూ అమెరికా ప్రయోజనాల కోసమే పనిచేశారు. కమిటీ అడిగే ప్రశ్నలన్నిటికీ నిజాయితీగా సమాధానం చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నార''ని లస్కిన్ తన ప్రకటనలో తెలిపారు.

సోండ్లాండ్ విచారణ నేపథ్యంలో ట్రంప్ ఓ ట్వీట్ చేశారు.. అందులో ఆయన 'రిపబ్లికన్ల హక్కులను తోసిరాజంటున్న ఒక కంగారు కోర్టు ముందు సోండ్లాండ్ హాజరయ్యుండేవారు'' అన్నారు.

మరోవైపు ప్రతినిధుల సభ నిఘా కమిటీ చైర్మన్ ఆడమ్ చిఫ్ 'సాక్షిని హాజరుపరచడంలో విఫలం కావడం, పత్రాలను సమర్పించకపోవడం వంటివన్నీ సభా నిర్వహణకు అడ్డంకులు సృష్టించడం కిందకే వస్తాయ'న్నారు.

అసలెందుకీ అభిశంసన?

జో బిడెన్‌పై ఉక్రెయిన్‌లో విచారణ చేపట్టాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఆ దేశానికి అందించాల్సిన 40 కోట్ల డాలర్ల సహాయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలుపుదల చేశారన్న అనుమానాలు, ఆరోపణలపై డెమొక్రాట్ల కమిటీ విచారణ జరుపుతోంది.

ఉక్రెయిన్ ఇంధన సంస్థ బోర్డులో జో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ బోడర్ ఉండేవారు. అప్పటికి అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బిడెన్ తన పదవిని వాడుకుని తన కుమారుడికి వ్యతిరేకంగా జరగాల్సిన విచారణను నిలిపివేయించారన్నది ట్రంప్, ఆయన మద్దతుదారుల అనుమానం. ఈ ఆరోపణలను డెమొక్రాట్లు ఖండిస్తూ వస్తున్నారు.

ఈ ఏడాది జులై 25న జరిపిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ హంటర్ బిడెన్‌పై విచారణ జరపాలని కోరినట్లుగా ఆరోపణలున్నాయి.

అయితే, అమెరికాకు చెందిన ఒక ప్రజావేగు ఈ ఫోన్ కాల్‌పై ఆందోళన వ్యక్తంచేశారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన విచారణ చేపడుతున్నట్లు ప్రకటించారు.

మరోవైపు 2016 అధ్యక్ష ఎన్నికల నాటి ట్రంప్ ప్రచారం, రష్యా పాత్రకు సంబంధించిన మ్యూలర్ నివేదిక పూర్తిపాఠాన్ని ఎలాంటి దాపరికాల్లేకుండా బయటపెట్టాలని డెమొక్రాట్లు న్యాయపోరాటం చేస్తున్నారు.

అసలు అభిశంసన అంటే?

అధ్యక్షుడిని తొలగించడానికి అమెరికా చట్టసభ చేపట్టే రెండు దశల ప్రక్రియలో అభిశంసన అనేది మొదటిది. ప్రతినిధుల సభలో చేపట్టిన ఓటింగులో అభిశంసన అధికరణలు ఆమోదం పొందితే సెనేట్ విచారణ చేపడుతుంది.

అధ్యక్షుడు దోషిత్వాన్ని తేల్చాలంటే అందుకు సెనేట్‌లో మూడింట రెండొంతుల మంది ఓట్ల అవసరం ఉంటుంది. అయితే, ప్రస్తుతం సెనేట్‌లో ట్రంప్ పార్టీదే ఆధిపత్యం కావడంతో అది సాధ్యం కాకపోవచ్చు.

అమెరికా చరిత్రలో ఇద్దరు అధ్యక్షులు బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్ మాత్రమే అభిశంసనకు గురయ్యారు. అయితే, వారు కూడా దోషులుగా తేలలేదు, వారిని తొలగించలేదు.

రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అభిశంసన ప్రక్రియ చేపట్టగా ఆయన ముందే రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)