నోబెల్ ప్రైజ్ - సాహిత్యం 2018 & 2019: పోలండ్ రచయిత్రి ఓల్గా, ఆస్ట్రియా రచయిత పీటర్ హాండ్కేలకు అరుదైన గౌరవం

  • 10 అక్టోబర్ 2019
ఓల్గా, పీటర్ Image copyright Reuters
చిత్రం శీర్షిక ఓల్గా, పీటర్

ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి 2018, 2019 సంవత్సరాలకు ఇద్దరు ఐరోపా రచయితలు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు మహిళ.

2018 సంవత్సరానికి పోలండ్ రచయిత్రి ఓల్గా తొకర్‌జక్, 2019 సంవత్సరానికి ఆస్ట్రియా రచయిత పీటర్ హాండ్కే ఎంపికయ్యారు.

వివాదాస్పద రచయిత అయిన పీటర్ దాదాపు ఐదేళ్ల క్రితం నోబెల్ సాహిత్య పురస్కారం రద్దుకు పిలుపునిచ్చారు. నోబెల్‌ ప్రైజ్‌కు ఎంపికైన రచయితకు 'బూటకపు క్యాననైజేషన్'‌, క్షణకాలం ప్రపంచ దృష్టి, పత్రికల్లో కొంత చోటు దక్కుతాయని, ఈ పురస్కారంతో ఉపయోగం లేదనే అర్థంలో ఆయన అప్పట్లో విమర్శలు చేశారు.

చనిపోయిన వ్యక్తిని రోమన్ కేథలిక్ చర్చ్‌లో 'సెయింట్‌'గా అధికారికంగా ప్రకటించడాన్ని 'క్యాననైజేషన్' అంటారు.

1990ల్లో యుగోస్లావ్ యుద్ధంలో సెర్బులకు మద్దతిచ్చినందుకు, జాతిసంహారం(జీనోసైడ్), యుద్ధనేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్న మాజీ సెర్బ్ నాయకుడు స్లబోడన్ మిలసోస్లిక్ అంత్యక్రియల కార్యక్రమంలో (2006లో) మాట్లాడినందుకు పీటర్ వివాదాస్పదుడయ్యారు.

పురస్కారాన్ని అందుకోవడానికి ఓల్గా, పీటర్ ఇద్దరూ అంగీకరించారని నిర్వాహకులు తాజాగా స్పష్టం చేశారు.

Image copyright Getty Images

లైంగిక దాడి ఆరోపణలతో నిరుడు వాయిదా

స్వీడిష్ అకాడమీ సభ్యురాలి భర్త లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో గత సంవత్సరం సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని స్వీడిష్ అకాడమీ ప్రకటించలేదు. పురస్కార ప్రకటనను 2019కి వాయిదా వేసింది.

గత సంవత్సరం అకాడమీ సభ్యురాలు కటారినా ఫ్రోస్టెన్సన్‌ భర్త జీన్-క్లాడ్ ఆర్నాల్ట్ లైంగిక దాడికి తెగబడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో ఆయనకు అక్టోబరులో రెండేళ్ల జైలు శిక్ష పడింది.

అకాడమీ నుంచి కటారినా ఫ్రోస్టెన్సన్ తప్పుకొన్నారు. అప్పట్లో నోబెల్ ప్రైజ్ విజేతల పేర్లు ప్రకటనకు ముందే లీక్ అవుతున్నాయనే ఆరోపణల కూడా వచ్చాయి.

సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని 1901 నుంచి ప్రదానం చేస్తున్నారు. ప్రపంచ యుద్ధాల సమయంలో ఆరేళ్లను పక్కన పెడితే ఇప్పటివరకు రెండు సంవత్సరాలు మాత్రమే పురస్కారాన్ని ప్రకటించలేదు. 1935లో ఎవరికీ ప్రకటించలేదు. 2018లో లైంగిక దాడి వివాదం వల్ల ప్రకటించలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నోబెల్ పురస్కారం కింద ఓల్గా, పీటర్‌లకు తలా 90 లక్షల క్రోనార్ల నగదు, మెడల్, డిప్లొమా అందజేస్తారు.

ఓల్గా, పీటర్‌లకు అకాడమీ ప్రశంస ఇదీ

ఓల్గా తొకర్‌జక్ నిరుడు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం 'మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌'కు కూడా ఎంపికయ్యారు.

57 ఏళ్ల ఓల్గా పోలిష్ భాషలో రాసే అత్యంత ప్రముఖ నవలాకారిణి.

ఓల్గా తన నవలల్లో ఒక అద్భుత ఊహా ప్రపంచాన్ని, సరిహద్దులకు అతీతమైన జీవన విధానాన్ని ఆవిష్కరిస్తారని, అంతేగాకుండా విషయ పరిజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలనే తపన కనిపిస్తుందని అకాడమీ ఒక ప్రకటనలో ప్రశంసించింది.

నాటక రచయిత, నవలాకారుడు అయిన పీటర్ వయసు 76 ఏళ్ళు. మానవ అనుభవాలను పీటర్ తనదైన విశిష్ట శైలిలో ప్రభావవంతంగా అక్షరబద్ధం చేశారని అకాడమీ వ్యాఖ్యానించింది.

1971లో తన తల్లి ఆత్మహత్యపై పీటర్ రాసిన 'ఎ సారో బియాండ్ డ్రీమ్స్' అనే రచన అత్యధిక ప్రజాదరణ పొందిన ఆయన రచనల్లో ఒకటి. ఇది 1975లో వెలువడింది.

పురస్కారం కింద ఈ ఇద్దరు రచయితలకు తలా 90 లక్షల క్రోనార్లు (దాదాపు 6.48 కోట్ల రూపాయలు) నగదు బహుమానం, మెడల్, డిప్లొమా అందజేస్తారు.

వీడియో: నోబెల్ పురస్కారం ఎలా పుట్టింది?

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: నోబెల్ ఎలా పుట్టింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)