మంచుకొండల్లో 18 వేల అడుగుల ఎత్తున గాయపడి రక్తమోడుతున్న స్నేహితుడిని ఆ పర్వతారోహకుడు ఎలా రక్షించుకున్నాడంటే..

  • 13 అక్టోబర్ 2019
ఎల్లీ స్వింటన్ Image copyright ALLY SWINTON/TOM LIVINGSTONE
చిత్రం శీర్షిక ఎల్లీ స్వింటన్

పాకిస్తాన్‌లోని 22,500 అడుగుల ఎత్తయిన కోయో జుమ్ పర్వతంపై చావుబతుకుల్లో ఉన్న స్కాట్లాండ్‌ పర్వతారోహకుడిని ఆయన స్నేహితుడు ఎలా కాపాడాడో చెప్పే కథ ఇది.

పర్వతారోహణలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ అక్కడే చచ్చిపోతాడేమో అనుకున్న స్నేహితుడిని సజీవంగా తీసుకొచ్చిన సాహస గాథ ఇది.

పర్వతారోహణలో అప్పటికే మంచి అనుభవమున్న ఆ అయిదుగురు మిత్రులు బృందంగా కోయో జుమ్ శిఖరంపైకి చేరుకునేందుకు తమ ప్రయాణం ప్రారంభించారు. ఆ ప్రయాణంలో టామ్ లివింగ్‌స్టన్, ఎల్లీ స్వింటన్‌లకు మాత్రం మిగతావారికి భిన్నంగా భయానక అనుభవం ఎదురైంది.

పర్వత శిఖరంపై వేల అడుగుల ఎత్తున ఉన్నప్పుడు అడుగుతడబడి ఎల్లీ స్వింటన్ 65 అడుగుల లోయలో అమాంతం పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

అక్కడికి వారం రోజుల ముందు ఆ అయిదుగురు మిత్రులు ఒక వ్యూహం ప్రకారం ఆ కోయ జుమ్ పర్వతంపై వేర్వేరు ప్రాంతాలను చేరుకునేందుకు జట్లుగా విడిపోయారు.

Image copyright ALLY SWINTON/TOM LIVINGSTONE

కోయోజుమ్ సన్నని సుదూర పర్వతశ్రేణి. నిటారుగా ఉండే అక్కడి రాళ్లు నిండా మంచుతో కప్పేసి ఉంటాయి.

శిఖరాన్ని చేరుకునే క్రమంలో అయిదుగురూ మూడు జట్లుగా విడిపోయారు.

సిమ్, జాన్ క్రూక్ ఒకవైపు.. టామ్ లివింగ్‌స్టన్, ఎల్లీ స్వింటన్‌లు మరోవైపు కదిలారు. యూస్డియన్ హాతర్న్ అక్కడి నుంచి బేస్ క్యాంప్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు.

టామ్, ఎల్లీలు 18 వేల అడుగుల ఎత్తున ఉన్నప్పుడు ఎల్లీ ఓ హిమనీనదంలో పడిపోయాడు.

అప్పుడు టామ్ ఆయన్ను రక్షించాడు. ''ఆ పరిస్థితుల్లో ఎవరున్నా ఏం చేస్తారో నేనూ అదే చేశాను. ఎల్లీ పట్ల అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాను'' అని చెప్పాడు టామ్.

Image copyright ALLY SWINTON/TOM LIVINGSTONE

మానవ సంచారం లేని చోట

''ఎల్లీ తలకు తీవ్ర గాయం కావడంతో రక్తంలో తడిసిముద్దయ్యాడు. నేనతని కాలి గాయాన్ని పరీక్షించి చూశాను. అతని కాలి ఎముక కానీ, మాంసం కానీ తగలకూడదని కోరుకుంటూనే చేత్తో గాయాన్ని పరీక్షించాను.. నేను భయపడినట్లుగా ఏమీ జరగలేదు. ఆ గాయం చర్మం దాటి వెళ్లలేదు. హమ్మయ్య అనుకున్నాను'' అని చెప్పాడు టామ్.

''పాకిస్తాన్‌లో జనసంచారమన్నది లేని పర్వతాల్లో మేం ఉన్నామని తెలుసు. ఎల్లీ తల నుంచి రక్తం ధారాపాతంగా కారుతోంది. రక్తం పోతుండడంతో అతడి ఒళ్లంతా వణుకుతోంది. మా దగ్గర గ్యాస్ అయిపోయింది. తినడానికి కూడా పెద్దగా ఏమీ లేవు. శక్తినిచ్చే చాక్లెట్లు, కొన్ని గింజలు మాత్రమే ఉన్నాయి'' అంటూ అప్పటి పరిస్థితిని చెప్పుకొచ్చాడు టామ్.

Image copyright ALLY SWINTON/TOM LIVINGSTONE
చిత్రం శీర్షిక ఎల్లీ స్వింటన్, టామ్ లివింగ్‌స్టన్

బతుకుతాడనుకోలేదు

''ఎల్లీకి వెంటనే వైద్యం అందాలని అర్థమైంది. నా దగ్గరున్న బ్యాండేజి కట్టినంత మాత్రాన అతను కోలుకోలేడు. వెంటనే శాటిలైట్ కమ్యూనికేటర్‌లోని ఎస్‌ఓఎస్ బటన్ నొక్కాను. వారున్న ప్రాంతానికి రెస్క్యూ హెలికాప్టర్ వచ్చేలోగా ఎల్లీ స్పృహ తప్పే స్థితికి చేరుకున్నాడు. బలహీనంగా మారిపోయాడు, స్పందన లేదు. ఎల్లీకి ఆ రోజు రాత్రి గడవడం కష్టమే అనుకున్నాను నేను.

రాత్రంతా రక్తపు వాసనలో ఎల్లీ పక్కనే ఉన్నాను. చెవులప్పగించి అతని శ్వాస వింటూ కూర్చున్నాను.. శ్వాస తీసుకోలేకపోతున్న ప్రతిసారి నోటితో శ్వాస అందిస్తూనే ఉన్నాను.

తెల్లారే సరికి ఎల్లీ శ్వాస తీసుకోవడం మెరుగైంది. కాసేపటికి హెలికాప్టర్ శబ్దం వినిపించింది. పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్ నన్ను, ఎల్లీనే కాదు మిగతా ముగ్గురు మిత్రులనూ రక్షించింద''ని టామ్ ఆ అనుభవాన్ని వివరించాడు.

Image copyright ALLY SWINTON/TOM LIVINGSTONE
చిత్రం శీర్షిక ఎల్లీ స్వింటన్

సెప్టెంబరు 30న వీరిని కోయో జుమ్ పర్వతం పైనుంచి రక్షించారు. ఎల్లీకి గిల్గిత్ బాల్టిస్తాన్‌లో చికిత్స అందించారు.

ప్రస్తుతం ఎల్లీ, టామ్ ఇద్దరూ ఇళ్లకు చేరుకున్నారు. మృత్యువు అంచువరకు వెళ్లినప్పటికీ తమ పర్వతారోహణలో దీన్నే అత్యుత్తమైనదిగా భావించి చిరకాలం గుర్తుంచుకోవాలనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు