కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు

  • 13 అక్టోబర్ 2019
రిప్రజెంటేటివ్ ఇమేజ్

యువ పాప్ గాయనిని వెంటాడి లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ జపనీయుడు విచారణ సందర్భంగా పోలీసులకు ఆశ్చర్యపోయే నిజాలు చెప్పాడు.

'ఒక ఫొటోలో ఆమె కళ్లలో ప్రతిబింబించిన పరిసరాలను చూసి ఆమె కదలికలను తెలుసుకున్నానని చెప్పాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక సెల్ఫీలో ఆమె కళ్లలో వెనుకనున్న రైల్వే స్టేషన్ కనిపించిందని చెప్పాడు' అని పోలీసులు తెలిపారు.

అది చూశాక ఆ 26 ఏళ్ల జపనీయుడు ఆ రైల్వే స్టేషన్లో ఆమె వచ్చేవరకు నిరీక్షించి అక్కడి నుంచి ఆమె ఇంటి వరకు వెంబడించాడని పోలీసులు చెప్పారు.

ఈ కేసు సైబర్ నిఘానీడపై చర్చకు తెరతీసింది.

Image copyright Getty Images

ఎలా తెలుసుకున్నాడంటే

సెప్టెంబరు 1 రాత్రి జరిగిన ఈ ఘటనలో హిబికీ సాటో అనే యువకుడు పాప్ సింగర్‌ను ఇంటి వరకు వెంబడించి వేధింపులకు గురిచేశాడన్నది ఆరోపణ.

అదే నెలాఖరులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

అరెస్టు తరువాత పోలీసులు అతడిని విచారించగా 21 ఏళ్ల ఆ పాప్ గాయనికి తాను వీరాభిమానినని చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన సెల్ఫీని జూమ్ చేయగా కళ్లలో ఒక రైల్వేస్టేషన్ కనిపించిందని.. గూగుల్ స్ట్రీట్ వ్యూ సహాయంతో అదెక్కడుందో కనిపెట్టి అక్కడకు వెళ్లానని చెప్పాడు.

ఆమె తన అపార్ట్‌మెంట్‌లో తీసుకున్న వీడియోలను సునిశితంగా విశ్లేషించి, ఎండ దిశ, బయట నుంచి వస్తున్న కాంతి స్థాయి ఆధారంగా ఆమె ఎన్నో అంతస్తులో నివసిస్తోందో కూడా కనిపెట్టాడని స్థానిక పత్రికలు రాశాయి.

Image copyright Getty Images

‘వ్యక్తిగత జీవితాన్ని ఆన్‌లైన్లో పెట్టొద్దు’

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన హైడెఫినిషన్ చిత్రాలు సోషల్ మీడియాలో పెడితే ఎలాంటి ముప్పు కలుగుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణని పోలీసులు అంటున్నారు.

హైక్వాలిటీ వీడియోలను సునిశితంగా విశ్లేషిస్తే చాలా సూక్ష్మ అంశాలు కూడా కనిపించే అవకాశముందని, గూగుల్ స్ట్రీట్ వ్యూ వంటి టూల్స్‌ సహాయం తీసుకుని ఈ అంశాల ఆధారంగా లొకేషన్ తెలుసుకోవచ్చని ఆన్‌లైన్ పరిశోధనా మెళకువల నిపుణుడు ఎలియట్ హిగ్గిన్స్ 'బీబీసీ'తో చెప్పారు.

చిన్నచిన్న డీటెయిల్స్ ఆధారంగా ఆ ఫొటో ఎక్కడ తీశారు.. అందులో ఎవరెవరున్నారనేది చాలావరకు చెప్పేయొచ్చు అంటారాయన.

''మీ బాస్‌కు కానీ, భార్యకు కానీ, శత్రువుకు కానీ తెలియకూడదన్న విషయాలను ఎప్పుడూ ఆన్‌లైన్లో పోస్ట్ చేయొద్దు. ఆన్‌లైన్ సెట్టింగ్స్‌లో ప్రైవేట్ అని పెట్టుకున్నా కూడా సురక్షితం కాదు'' అంటారాయన.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)