టర్కీ-సిరియా యుద్ధం: పదుల సంఖ్యలో మృతులు... భీకరంగా కొనసాగుతున్న దాడులు

  • 11 అక్టోబర్ 2019
టర్కీ Image copyright Getty Images

టర్కీ సేనలు ఉత్తర సిరియాలో కుర్దుల నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై దాడులు తీవ్రతరం చేస్తుండడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది.

కుర్దుల నాయకత్వంలోని ఎస్.డి.ఎఫ్, టర్కీ అనుకూల వర్గాలకు చెందిన ఫైటర్లు పదుల సంఖ్యలో చనిపోయారని, మరో 11 మంది సామాన్య పౌరులు కూడా దాడుల్లో మృతి చెందారని వార్తలు వస్తున్నాయి.

టర్కీ సైనికులలో కూడా మొదటి మరణం సంభవించిందని టర్కీ మిలిటరీ వర్గాలు ధ్రువీకరించాయి.

యుద్ధ భీతితో వేల మంది సామాన్య ప్రజలు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దాడులు ఆపాలని అంతర్జాతీయ సమాజం చెబుతున్నప్పటికీ అవి పెరుగుతున్నాయి.

టర్కీ మీ ఆంక్షలు విధిస్తూ బిల్లును ప్రవేశపెడతామని అమెరికా ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు ఇప్పటికే హెచ్చరించారు. తాను మధ్వర్తిత్వం చేయడానికి సిద్ధమని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఉత్తర టర్కీ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్న తరువాత బుధవారం నాడు టర్కీ సేనలు ఆ ప్రాంతంలోకి వెళ్ళాయి.

Image copyright Reuters
చిత్రం శీర్షిక టర్కీలో కూడా సామాన్య పౌరులు దాడుల ప్రభావానికి గురవుతున్నారు

కుర్దుల నియంత్రణలోని భూభాగంలో టర్కీ దాడుల రెండోరోజైన గురువారం భారీ పోరాటం జరిగినట్లు వార్తలు వచ్చాయి.

చాలా ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నామని, పదుల సంఖ్యలో కుర్దు మిలిటెంట్లను చంపేశామని టర్కీ చెబుతోంది.

వేలాది మంది ప్రజలు ప్రాణభయంతో ఇళ్లు వదిలి వెళ్లిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. టర్కీ దాడుల్లో పౌరులు చనిపోయారని కుర్దులు ఆరోపిస్తున్నారు.

కుర్దు మిలిటెంట్లను పారదోలి సిరియా-టర్కీ సరిహద్దులో ఒక సురక్షిత జోన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, టర్కీలో ఆశ్రయం పొందుతున్న లక్షల మంది సిరియా శరణార్థుల్లో కొందరిని ఇక్కడికి చేరుస్తామని టర్కీ చెబుతోంది.

Image copyright AFP

ఈ దాడులకు టర్కీ చాలా కాలంగా ప్రణాళికలు వేస్తూ వచ్చింది. కుర్దుల నాయకత్వంలోని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (‌ఎస్‌డీఎఫ్) నియంత్రణలో ఉన్న ఉత్తర సిరియా నుంచి అమెరికా సైనిక బలగాలను అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెనక్కి పిలిపించిన తర్వాత, టర్కీ దాడులు ప్రారంభించింది.

ఐఎస్ గ్రూప్‌పై పోరాటంలో అమెరికాకు ఎస్‌డీఎఫ్ కీలక సంకీర్ణ పక్షంగా ఉంటూ వచ్చింది. ఎస్‌డీఎఫ్‌లో బలమైన భాగస్వామి అయిన కుర్దిష్ వైపీజీ మిలీషియాను నిషేధిత 'కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ'కి అనుబంధ సంస్థగా టర్కీ పరిగణిస్తుంది. ఈ పార్టీ మూడు దశాబ్దాలుగా టర్కీలో కుర్దిష్ స్వయంప్రతిపత్తి కోసం పోరాడుతోంది. ఈ కుర్దు మిలిటెంట్లను టర్కీ ఉగ్రవాదులుగా పరిగణిస్తుంది.

బలగాల ఉపసంహరణతో అమెరికా తమకు వెన్నుపోటు పొడిచిందని ఎస్‌డీఎఫ్ ఆరోపించింది.

చిత్రం శీర్షిక డోనల్డ్ ట్రంప్

ట్రంప్ ఏమన్నారు?

అంతూపొంతూ లేకుండా సాగుతున్న యుద్ధాలకు ముగింపు పలికేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ట్విటర్లో చెప్పారు. సిరియాలో పరిస్థితులను తాను నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు. టర్కీ నిబంధనలను మీరితే ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని, ఇతర ఆంక్షలు విధించాలని సూచించారు. తాను రెండు పక్షాలతో మాట్లాడుతున్నానని తెలిపారు.

టర్కీ దాడిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఖండించాయి. ఈ అంశంపై షెడ్యూలు ప్రకారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గురువారం (అక్టోబరు 10) చర్చించాల్సి ఉంది. ఐదు 'యూరోపియన్ యూనియన్ (ఈయూ)' దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోలండ్ అభ్యర్థన మేరకు ఈ చర్చ చేపట్టాల్సి ఉంది.

అలా అంటే ఆ శరణార్థులను ఐరోపాకు పంపిస్తా: ఎర్దోగాన్

ఉత్తర సిరియాలో తాజా దాడులను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తాయిప్ ఎర్దోగాన్ గట్టిగా సమర్థించుకున్నారు. సిరియాలో టర్కీ దాడిని ఆక్రమణగా ఐరోపా దేశాలు ఆరోపిస్తే, టర్కీలో ఉన్న సిరియా శరణార్థులను ఐరోపాకు పంపిస్తానని ఆయన హెచ్చరించారు.

సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతంలోని రస్ అల్-అయిన్, తల్-అబ్యద్ పట్టణాల మధ్య పెద్దయెత్తున పోరాటం జరుగుతోందని కుర్దుల్లోని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. టర్కీ మద్దతున్న 'ఫ్రీ సిరియన్ ఆర్మీ'కి చెందిన తిరుగుబాటుదారులు కూడా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.

పోరాటం జరుగుతున్న ప్రాంతంలో జనసాంద్రత తక్కువ. ఇక్కడ ఎక్కువగా అరబ్‌లు ఉంటారు. రస్ అల్-అయిన్‌పై అనేక వైమానిక దాడులు జరిగాయి.

నేలపై, నింగిలో తమ ఆపరేషన్లు విజయవంతంగా సాగాయని టర్కీ రక్షణశాఖ ట్విటర్లో చెప్పింది. తల్-అబ్యాద్‌కు తూర్పున ఉన్న అనేక గ్రామాలను టర్కీ స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం వస్తోంది.

పోరాటం తొలి దశలో చనిపోయిన, గాయపడ్డ, లేదా నిర్బంధించిన మిలిటెంట్లు 108 మంది ఉన్నారని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ చెప్పారు. ఈ సంఖ్య వాస్తవ దూరమని, ఎక్కువ చేసి చూపిస్తున్నారని ఎర్దోగాన్ ప్రకటనను ఎస్‌డీఎఫ్ తోసిపుచ్చింది.

Image copyright AFP

ఎంత మంది చనిపోయారు?

పోరాటంలో 16 మంది ఎస్‌డీఎఫ్ ఫైటర్లు చనిపోయారని, పదుల సంఖ్యలో ఫైటర్లు గాయపడ్డారని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే గ్రూప్ 'సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్' చెప్పింది.

పౌరులు ఏడుగురు చనిపోయారని, వీరిలో ఇద్దరు పిల్లలని 'కుర్దిష్ రెడ్ క్రెసెంట్' పేర్కొంది. నలుగురు పిల్లలు సహా 19 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది.

టర్కీ దాడులు మొదలైనప్పటి నుంచి 60 వేల మందికి పైగా ప్రజలు ఉత్తర సిరియాలో ఇళ్లు వదిలి వెళ్లిపోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వివరించింది. రస్ అల్-అయిన్, దర్బాసియా పట్టణాలు దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయని చెప్పింది.

సరిహద్దు ప్రాంతంలోని ఖమిషాలిలో ఐఎస్ మిలిటెంట్లను ఉంచిన ఒక జైలుపై టర్కీ షెల్లింగ్ జరిపిందని కుర్దు పాలనా యంత్రాంగం ఆరోపించింది. ఇది వాళ్లను తప్పించేందుకు టర్కీ చేసిన ప్రయత్నమని చెప్పింది.

Image copyright EPA
చిత్రం శీర్షిక సిరియా సరిహద్దుల్లో తాము ప్రతిపాదిస్తున్న సేఫ్ జోన్ మ్యాప్‌ను ఇటీవల ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రదర్శించిన ఎర్దోగాన్

ఎస్‌డీఎఫ్‌లో ప్రస్తుతం దాదాపు 40 వేల మంది ఫైటర్లు ఉన్నారని, కుర్దిష్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో కొన్ని వేల మంది ఉన్నారని కుర్దుల్లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

12 వేల మందికి పైగా అనుమానిత ఐఎస్ సభ్యులు తమ అదుపులో ఉన్నారని ఎస్‌డీఎఫ్ చెబుతోంది. వీరిలో కనీసం నాలుగు వేల మంది విదేశీయులని పేర్కొంటోంది. వీరంతా కచ్చితంగా ఎక్కడ ఉన్నారనేది వెల్లడికాలేదు. వీరిలో కొందరు టర్కీ సరిహద్దుకు సమీపాన ఉన్నారనే సమాచారం వస్తోంది.

రోజ్, అయిన్ ఇస్సా అనే క్యాంపుల్లో అనుమానిత ఐఎస్ సభ్యుల కుటుంబాలు ఉన్నాయి. ఈ క్యాంపులు 'సురక్షిత జోన్' పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ పోరాటం మొదలైతే, ఈ జైళ్లపై కుర్దులు నియంత్రణ కొనసాగించగలరా అన్నది స్పష్టం కావడం లేదు.

పాశ్చాత్య దేశాలకు చెందిన దాదాపు 30 మందిని చిత్రహింసలు పెట్టి చంపేసిన ఐఎస్ సెల్‌లో పనిచేసిన ఇద్దరు బ్రిటన్ వాసులను అదుపులోకి తీసుకున్నామని అమెరికా సైన్యం ప్రకటించింది.

ఎల్ షపీ ఎల్‌షేక్, అలెగ్జాండా కోటే అనే ఈ ఇద్దరు 'ద బీటిల్స్' అనే బ్రిటిష్ ఐఎస్ సెల్‌లో పనిచేశారు. వీరు ఇంతకాలం ఉత్తర సిరియాలో కుర్దు మిలిటెంట్ల నియంత్రణలోని ఒక జైలులో ఉండేవారు.

Image copyright AFP

బీబీసీ దౌత్య ప్రతినిధి జొనాథన్ మార్కస్ విశ్లేషణ...

టర్కీ, కుర్దుల మధ్య పోరు శతాబ్దాలుగా కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు. కుర్దు ఫైటర్లు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికాకు సాయపడలేదన్నారు.

కుర్దులతో అమెరికా సంకీర్ణం ప్రాధాన్యాన్ని తగ్గించి వేస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అసాధారణంగా ఉన్నాయి.

ట్రంప్ దృష్టిలో ఇలాంటి సంకీర్ణాలు వ్యాపార ఏర్పాట్ల లాంటివి. వ్యాపారంలో స్వల్ప కాలిక లాభనష్టాల లెక్కలకు తగినట్లుగా ఇవి ఉంటాయి. ఈ భాగస్వామ్యంలో అమెరికా ఏం ఇస్తోంది, ప్రతిఫలంగా ఏం పొందుతోంది అనేదే ప్రధానం.

కుర్దుల పాత్రను ట్రంప్ దాదాపు కొట్టిపారేశారు. సిరియా ప్రాంతంలో అమెరికా మిత్రపక్షాలను తేలిగ్గా సంపాదించుకోగలదనే రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇది నిజమేనా? ఇటీవలి చరిత్రను ఆయన మరచిపోయినట్లున్నారు. ఇస్లామిక్ స్టేట్‌పై పోరాటంలో అమెరికాకు సమర్థమైన, నమ్మకమైన ఏకైక స్థానిక మిత్రపక్షంగా కుర్దులే కొనసాగారు.

టర్కీ విషయంలోనూ ట్రంప్ ఎలా వ్యవహరించనున్నారనేది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్

ఏనుగులు వేరే వాటిని కాపాడ్డానికి తమ ప్రాణాలనే పణంగా పెడతాయా

భవిష్యత్తుపై ఆందోళనే ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యలకు కారణమా

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

ఉప్పల‌పాడు పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి

టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...

ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ సేఫ్ కాదా? క్రిప్టో కరెన్సీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా...

అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...