సిరియాలో టర్కీ సైనిక చర్యతో ఇస్లామిక్ స్టేట్ తిరిగి పుంజుకుంటుందా? జైళ్లు, శిబిరాల్లో ఉన్న ‘ఐఎస్ తీవ్రవాదులు’ తప్పించుకుంటారా?

  • 12 అక్టోబర్ 2019
అనుమానాస్పద ఐఎస్ ఫైటర్లు Image copyright Getty Images
చిత్రం శీర్షిక అనుమానాస్పద ఐఎస్ ఫైటర్లను సిరియాలోని జైళ్లలో బంధించారు. వారి కుటుంబ సభ్యులుగా భావిస్తున్న వారిని క్యాంపుల్లో పెట్టారు

ఉత్తర సిరియా నుంచి సైనికులను ఉపసంహరించాలన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిర్ణయంతో.. టర్కీ సరిహద్దు వెంట ఉన్న ప్రాంతాన్ని నియంత్రిస్తున్న సిరియా కుర్దులు, వారి ఆధ్వర్యంలోని జైళ్లు, శిబిరాల్లో నిర్బంధంలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు, వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తు మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టర్కీ ఇప్పుడు సీమాంతర సైనిక చర్యలు చేపడుతోంది. తన సరిహద్దు వెంట ఉత్తర సిరియాలో 32 కిలోమీటర్ల పొడవున ఉన్న భూభాగం నుంచి కుర్దు బలగాలను తుడిచిపెట్టటం లక్ష్యంగా టర్కీ ఈ మిలటరీ ఆపరేషన్ నిర్వహిస్తోంది.

కానీ.. కుర్దులు ప్రస్తుతం వేలాది మంది ఇస్లామిక్ స్టేట్ బందీలు, వారి కుటుంబ సభ్యులను జైళ్లు, శిబిరాల్లో నిర్బంధించి వారికి కాపలాగా ఉంది. ఇప్పుడు వారి పరిస్థితి ఏమవుతుందనే దాని మీద స్పష్టత లేదు.

టర్కీ సైన్యం సిరియాలో అడుగుపెట్టినట్లయితే.. కుర్దుల జైళ్లలో ఉన్న ఐఎస్ బందీల బాధ్యతను కూడా ఆ దేశం తీసుకుని తీరాలని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సిరియాలో ‘సురక్షిత మండలి’ని ఏర్పాటు చేసే తమ దేశ లక్ష్యం గురించి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సెప్టెంబర్ 24న ఐక్యరాజ్యసమితిలో మాట్లాడారు

''వెన్నుపోటు''

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో పోరాడి, ఓడించింది సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్. ఈ సైనిక సంకీర్ణంలో అత్యధిక సంఖ్యలో ఉన్నది సిరియన్ కుర్దులే.

అమెరికా ఆ సమయంలో ఈ కుర్దు బలగాలనే సిరియాలో తన ప్రధాన మిత్రపక్షంగా పరిగణించింది. వారికి ఆయుధాలు సరఫరా చేయటంతో పాటు శిక్షణనూ అందించింది. ఐఎస్ తీవ్రవాదుల మీద ఈ బలగాల సైనిక చర్యలకు అమెరికా వైమానిక మద్దతునూ అందించింది.

ఈ యుద్ధంలో తమ కృషికి ప్రతిఫలంగా సిరియాలోనే అంతర్గతంగా స్వయం ప్రతిపత్తి లభిస్తుందని సిరియా కుర్దులు ఆశించారు. కానీ ఇప్పుడు వారు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమతితోనే జరుగుతున్న టర్కీ సైనిక దాడి రూపంలో కొత్త ముప్పును ఎదుర్కొంటున్నారు.

ట్రంప్ తాజా ప్రకటన ''వెన్నుపోటు'' అని సిరియా కుర్దులు అభివర్ణించారు.

సిరియాలోని కుర్దు బలగాలు తన స్వీయ భద్రతకు ప్రమాదంగా టర్కీ భావిస్తోంది. టర్కీలో ప్రభుత్వంతో దశాబ్దాలుగా పోరాడుతున్న కుర్దు తిరుగుబాటుదారుల సంస్థ పీకేకేతో సంబంధం ఉన్న ''ఉగ్రవాదులు''గా సిరియా కుర్దు బలగాలను టర్కీ అభివర్ణిస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో ప్రధానంగా పోరాడింది కుర్దు బలగాలతో ఏర్పడిన సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్

టర్కీ ''బాధ్యత''

ఐఎస్ బందీల బాధ్యత ఇప్పుడు టర్కీదేనంటూ డోనల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లతో టర్కీ అధికారులు ఏకీభివస్తున్నారా లేదా అనేది తెలియదు. ఒకవేళ అంగీకరించినట్లయితే వారి విషయంలో టర్కీ ఏం చేస్తుందనేదీ తెలియదు.

ఐఎస్ జిహాదీలతో పోరాడటానికి, వారిని బంధించటానికి సిరియా కుర్దులకు ఆర్థిక, సైనిక మద్దతు అందించటంలో అమెరికా తన న్యాయమైన భాగం కన్నా ఎక్కువే చేసిందని డోనల్డ్ ట్రంప్ అంటున్నారు.

ఐఎస్ బందీల విషయంలో తన యూరప్ భాగస్వాములు తగినంత భాగం పంచుకోలేదని ఆయన ఆరోపించారు.

ఐఎస్ బందీల్లో యూరప్ పౌరులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వారిని వారి వారి దేశాలు వెనక్కు తీసుకోవాలని యూరప్ దేశాలను కుర్దు అధికారులు కోరుతున్నారు. కానీ పెద్దగా స్పందించలేదు.

''రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కొసావో వంటి దేశాలు తమ సొంత పౌరులను వెనుకకు తీసుకెళుతుంటే.. యూరప్ దేశాలు మాత్రం తమ పౌరులను సిరియా జైళ్లు, శిబిరాల్లోనే ఉంచటానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి'' అని టర్కీ విశ్లేషకుడు ఫేహిం టాస్ట్కిన్ పేర్కొన్నారు.

ఈ దేశాలతో పాటు.. ఈజిప్టు, ట్యునీసియా, యెమెన్ తదితర ముస్లిం దేశాల నుంచి వచ్చిన వారు; స్థానిక ఇరాకీలు, సిరియన్లు వేల సంఖ్యలో ఇక్కడ బందీలుగా ఉన్నారు.

ఐఎస్ బందీల నిర్బంధాన్ని కొనసాగిస్తామని కుర్దు బలగాలు ఇప్పటివరకూ చెప్పాయి. అయితే.. సిరియా భూభాగంలో టర్కీ ఆక్రమణ ఎంత బలంగా లోతుగా ఉంటుందనే అంశం మీద ఇది ఆధారపడి ఉంటుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన తమ దేశ పౌరులను వెనుకకు తీసుకోవటానికి యూరోపియన్ దేశాలు విముఖంగా ఉన్నాయి

శిబిరాలు, జైళ్లు...

సిరియా లోపల తమ సరిహద్దు వెంట 32 కిలోమీటర్ల నిడివిలో కుర్దు బలగాలు లేని ''సురక్షిత మండలి''ని ఏర్పాటు చేయాలని తాము భావిస్తున్నట్లు టర్కీ చెప్తోంది.

అలా జరిగితే.. ప్రస్తుతం కుర్దు బలగాల నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో ఐఎస్ తీవ్రవాదులను నిర్బంధించిన రెండు శిబిరాలు కూడా టర్కీ నియంత్రణ మండలిలోకి వస్తాయి. రోజ్ శిబిరంలో సుమారు 1,700 మంది మహిళలు, పిల్లలు ఉంటే.. ఐన్ ఇస్సాలో దాదాపు 1,500 మంది నిర్బంధంలో ఉన్నారు.

అన్నిటికన్నా పెద్ద శిబిరం అల్-హాల్‌లో ఉంది. ఇది టర్కీకి దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఇరాక్ సరిహద్దు సమీపంలో ఉంది.

ఈ శిబిరంలో 70,000 మంది జనం ఉన్నారు. వారిలో 90 శాతం మందికి పైగా మహిళలు, పిల్లలు ఉంటే.. అందులో 11,000 మంది విదేశీ పౌరులు ఉన్నారు.

ఇంకా దక్షిణ దిశలో రక్కా నగరానికి సమీపంలో గల ఏడు జైళ్లలో 12,000 మంది అనుమానిత ఐఎస్ తీవ్రవాదులు బందీలుగా ఉన్నారు. వారిలో మూడో వంతు మంది విదేశీయులే.

టర్కీ సైనిక ఆక్రమణ అంత దూరం విస్తరించకపోవచ్చు. కానీ.. ఈ శిబిరాలు, జైళ్లకు గల కాపలాను టర్కీ సైనిక చర్యలు బలహీనపరిచే అవకాశముంది.

సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ.. టర్కీ సైనిక దాడులు చేస్తే తాము తమను రక్షించుకోవటం మీద దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుందని.. అందుకోసం తమ నియంత్రణలో ఉన్న జైళ్ల నుంచి, ఐఎస్ నుంచి విముక్తమైన ప్రాంతాల నుంచి సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాల్సి వస్తుందని చెప్పారు.

దీని ఫలితంగా జిహాదీలు, వారి కుటుంబాలు తప్పించుకుని తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే ప్రమాదం ఉందని పలు దేశాలు.. ముఖ్యంగా యూరప్ దేశాల ప్రభుత్వాలు భయపడుతున్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ శిబిరాల్లో వేలాది మంది చిన్నారులు ఉన్నారు

ఐఎస్ పునరుజ్జీవం భయాలు

ఐఎస్ బందీల భద్రత నిర్వహణ విషయంలో టర్కీ సామర్థ్యం మీద.. అసలు అందుకు ఆ దేశం సుముఖంగా ఉంటుందా అనే అంశం మీద కూడా ఆందోళనలు ఉన్నాయి.

ఐఎస్ బందీలున్న శిబిరాలు, జైళ్లకు సిరియా కుర్దు బలగాలు భద్రత కల్పించలేని పరిస్థితి తలెత్తితే.. ఆ ఖాళీని టర్కీ పూరించగలదా?

అలా జరగదని ఇరాక్, సిరియాల్లో ఐఎస్ వ్యతిరేక చర్యలకు అమెరికా అధ్యక్షుడి రాయబారిగా వ్యవహరించిన బ్రెట్ మెక్‌గుర్క్ అభిప్రాయపడ్డారు.

''ఇస్లామిక్ స్టేట్ పునరుజ్జీవానికి కేంద్ర బిందువు''గా పరిగణించే అల్-హోల్ శిబిరంలో ఉన్న వేలాది మంది బందీలను నిర్వహించే ''ఉద్దేశం కానీ, కోరిక కానీ, సామర్థ్యం కానీ టర్కీకి లేవు'' అని ఆయన ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.

ఈ బందీలకు సంబంధించి భద్రతా ప్రమాదాలతో పాటు.. మానవీయ కోణంలోనూ ఆందోళనలు ఉన్నాయి.

ఈ శిబిరాల్లో 40 పైగా దేశాలకు చెందిన పిల్లలు ఉన్నారని.. వీరంతా మానవతా సాయం మీదే ఆధారపడి ఉన్నారని 'సేవ్ ద చిల్డ్రన్' అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.

''ఈ శిబిరాల్లో అందించే సేవలకు ఎటువంటి అంతరాయం కలిగినా.. వారి జీవితాలు ప్రమాదంలో పడతాయి'' అని హెచ్చరించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: సిరియా యుద్ధం ఈ బాలుడి ముఖాన్ని మార్చేసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)