సిరియాలో కుర్దులపై టర్కీ 'సైనిక చర్య' ఎందుకు? దీనివల్ల జరగబోయేది ఏమిటి?

  • 11 అక్టోబర్ 2019
సిరియాలోని కమిల్షీ నగరంలో సాయుధురాలైన సిరియన్ కుర్దిష్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ గార్డు (27 ఆగస్టు 2019) Image copyright AFP
చిత్రం శీర్షిక సిరియాలోని కమిల్షీ నగరంలో ఆయుధంతో సిరియన్ కుర్దిష్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ గార్డు (27 ఆగస్టు 2019 తేదీన తీసిన ఫొటో)

సిరియా ఈశాన్య ప్రాంతంలోని కుర్దుల నేతృత్వంలోని సేనలపై టర్కీ సైనిక చర్యను ప్రారంభించింది. టర్కీ-సిరియా సరిహద్దు నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైన అక్టోబర్ 7వ తేదీ తర్వాత టర్కీ మిలటరీ ఆపరేషన్ మొదలైంది.

కుర్దులు ఎవరు?

కుర్దుల జనాభా.. ఇరాన్, ఇరాక్, టర్కీ, సిరియా... ఈ నాలుగు దేశాల్లో ఉంది.

సిరియా జనాభాలో 7 నుంచి 10 శాతం కుర్దులు ఉంటారు.

సిరియా అధ్యక్షుడిగా వ్యవహరించిన బషర్ అల్ అసద్, అంతకు ముందు అతని తండ్రి హఫీజ్‌ల హయాంలో కొన్ని దశాబ్దాల పాటు కుర్దులు అణచివేతకు గురయ్యారు. అప్పట్లో వీరికి ప్రాథమిక హక్కులను కూడా అసద్, హఫీజ్‌లు నిరాకరించారు.

సిరియాలోని డమాస్కస్, అలెప్పో నగరాల్లోను, ఉత్తరాన టర్కీ సరిహద్దు సమీపంలోని మూడు ప్రాంతాల్లోను, పశ్చిమాన ఆఫ్రిన్‌లోను, మధ్యలోని కొబానేలోను, తూర్పున కమిష్లీలోనూ కుర్దులు ఎక్కువగా నివసించేవాళ్లు.

2011లో వీరు అసద్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక టర్కీకి వ్యతిరేకంగా రాస్ అల్ ఐన్‌లో ప్రదర్శన చేస్తున్న సిరియా కుర్దులు (2019 అక్టోబర్ 6వ తేదీన తీసిన చిత్రం)

ఈ ఉద్యమం పౌర యుద్ధంగా మారింది. దీంతో ప్రధాన కుర్దు పార్టీలు ఎవరి పక్షమూ వహించలేదు. 2012లో కుర్దు ప్రాంతాల నుంచి ప్రభుత్వ బలగాలు వెనక్కు వెళ్లిపోయాయి. వేరే చోట్ల ఉన్న రెబల్స్‌పై పోరాడేందుకు ఈ బలగాలను ఉపసంహరించారు. దీంతో కుర్దు సేనలు ఆయా ప్రాంతాలపై పట్టు సాధించాయి.

2014 చివర్లో కొబానేపై జిహాదీ సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) దాడులు ప్రారంభించింది. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. దీంతో అమెరికా నేతృత్వంలోని వివిధ దేశాల సంకీర్ణ దళాలు ఐఎస్‌కు వ్యతిరేకంగా ఏకమై.. వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ ప్రాంతాల నుంచి మిలిటెంట్లు వెళ్లిపోయిన తర్వాత.. సిరియాలో అమెరికా సంకీర్ణ దళాలకు కుర్దులే కీలక భాగస్వాములయ్యారు.

కుర్దు సేనల్లో పెద్దదైన పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ (వైపీజీ).. స్థానిక అరబ్ మిలిటెంట్లు, సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్)తో 2015లో చేతులు కలిపింది.

సంకీర్ణ బలగాల వాయుసేన, ఆయుధాలు, మార్గదర్శకుల సహాయంతో.. ఎస్‌డీఎఫ్ ఫైటర్లు సిరియాలోని ఒక పావు భాగం నుంచి ఐఎస్‌ను తరిమికొట్టారు. ఐఎస్ ఆధీనంలో ఉన్న చిట్టచివరి భూభాగాన్ని 2019 మార్చిలో ఎస్‌డీఎఫ్ ఫైటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించేందుకు 'స్వతంత్ర పరిపాలన'ను కూడా ఏర్పాటు చేశారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉత్తర సిరియాలో ‘సేఫ్ జోన్’ ఉండాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు

టర్కీ ఎందుకు వీరిపై సైనిక చర్య చేపడుతోంది?

సిరియా సరిహద్దులో ఎస్‌డీఎఫ్ పట్టున్న ప్రాంతంలో సైనిక చర్య చేపడతామని టర్కీ గతంలోనే హెచ్చరించింది. సిరియా సరిహద్దు వెంబడి 480 కిలోమీటర్ల మేర 32 కిలోమీటర్ల లోతైన 'సేఫ్ జోన్' ఏర్పాటు చేస్తామని తెలిపింది. సిరియాలో అంతర్యుద్ధం, ఐఎస్‌తో పోరాటం సమయంలో లక్షలాది మంది కుర్దులు సిరియా-టర్కీ సరిహద్దు దాటి టర్కీవైపు ఉన్న ఈ 'సేఫ్ జోన్' ప్రాంతానికి వచ్చేశారు.

టర్కీలో దశాబ్దాలుగా పోరాడుతున్న కుర్దు రెబల్ గ్రూపును ఉగ్రవాద సంస్థగా టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెబల్ గ్రూపుకు అనుబంధంగా ఏర్పడినదే సిరియాలోని కుర్దు సేనల్లో పెద్దదైన పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ (వైపీజీ) అని టర్కీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైజీపీ సభ్యులను వెనక్కు పంపించాలనుకుంటోంది.

ప్రస్తుతం 'సేఫ్ జోన్' ప్రాంతంలో ఉన్న 36 లక్షల మంది సిరియా శరణార్దుల్లో కనీసం 10 లక్షల మందికి పునరావాసం కల్పించాలని కూడా టర్కీ భావిస్తోంది.

ఎదురుదాడులను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా సరిహద్దు ప్రాంతంలో 'భద్రతా యంత్రాంగాన్ని' టర్కీ సైన్యంతో ఏర్పాటు చేసేందుకు అమెరికా సైన్యం ఆగస్టులో అంగీకరించింది.

దీనికి వైజీపీ సైతం సహకరించింది. ఈ ప్రాంతంలో రక్షణ కోసం కట్టిన కట్టడాలను కూల్చేసి, భారీగా మొహరించిన ఆయుధాలను కూడా ఉపసంహరించుకుంది.

అయితే, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సరిహద్దు దాటి సైనిక చర్య చేపడుతున్నామని, త్వరలోనే ఇది ముందుకు కదులుతుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో అక్టోబర్ 6వ తేదీన చెప్పారని అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

దీనికి ట్రంప్ స్పందిస్తూ.. ఆ ప్రాంతంలోని అమెరికా సేనలు ఈ ఆపరేషన్‌కు సహకరించవు, ఆపరేషన్‌లో భాగం కావు, ఈ ప్రాంతం నుంచి వెనక్కు వచ్చేస్తాయి అని చెప్పారని వైట్‌హౌస్ వెల్లడించింది.

ట్రంప్ నిర్ణయంపై ఎస్‌డీఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టర్కీ 'కారణం లేకుండా దాడి' చేస్తే.. 'ఈ ప్రాంతంలో (ఐఎస్)కు వ్యతిరేకంగా మనం జరిపిన పోరాటం, (నెలకొల్పిన) స్థిరత్వం, శాంతిపై ప్రతికూల ప్రభావం పడుతుంది' అని తెలిపింది.

'ఎలాగైనా సరే మా భూమిని మేం కాపాడుకోవాలని కంకణం కట్టుకున్నాం' అని వివరించింది.

కాగా, టర్కీ ఆపరేషన్ మొదట.. పెద్దగా జనాభా లేని, ప్రధానంగా అరబ్ ప్రాంతమైన తాల్ అబ్యద్, రాస్ అల్ ఐన్ పట్టణాల మధ్య సరిహద్దు వెంబడి ఉన్న 100 కిలోమీటర్ల భాగంపై దృష్టి సారిస్తోందని తెలుస్తోంది.

చిత్రం శీర్షిక టర్కీ ప్రతిపాదించిన 'సేఫ్ జోన్' ప్రాంతం, సిరియా ఈశాన్య ప్రాంతం

దీని ప్రభావం ఏంటి?

టర్కీ 'సేఫ్ జోన్' ప్రాంతం పరిధిలోకి వస్తున్న సిరియా భూభాగం సారవంతమైన, మైదాన ప్రాంతం. ఇది ఒకప్పుడు సిరియా 'అన్నపూర్ణ'గా పేరొందింది. దక్షిణ సిరియా ఎడారి, బీడు భూముల్లా కాకుండా.. ఈ ప్రాంతంలో పదుల కొద్దీ గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. సిరియా ప్రభుత్వ ఆధీనంలోని కమిష్లీ నగరంలో యుద్ధానికి ముందు 2 లక్షల మంది జనాభా ఉండేది.

ఇప్పుడు ఎస్‌డీఎఫ్ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 20 లక్షల మంది పౌరులు నివసిస్తున్నారని, వీరంతా ఇప్పటికే (ఐఎస్) క్రూరత్వాన్ని చవిచూశారని, తలదాచుకునేందుకు పలుమార్లు ఒకచోటు నుంచి మరొకచోటుకు మారారని ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ అనే ఒక మానవీయ సంస్థ తెలిపింది.

సైనిక దాడి వల్ల తక్షణం కమీసం 3 లక్షల మంది స్థానభ్రంశం చెందుతారని, ప్రాణాలు నిలిపే మానవతా సేవలకు అంతరాయం కలుగుతుందని ఈ సంస్థ అక్టోబర్ 7వ తేదీన ట్వీట్ చేసింది.

ఈ ప్రాంతంలో 16 లక్షల 50 వేల మంది పౌరులకు మానవతా సహాయం అవసరమని సేవ్ ది చిల్డ్రన్ తెలిపింది.

ఎదురుదాడి కారణంగా బలవంతంగా తమ ఇళ్లను వదిలిపెట్టాల్సివచ్చే పౌరులకు సహాయం చేసేందుకు అత్యవసర ప్రణాళికలు రచించామని ఐక్యరాజ్యసమితి సిరియా ప్రాంతీయ కోఆర్డినేటర్ పానోస్ మౌమ్‌ట్జిస్ తెలిపారు.

ఎలాంటి మిలటరీ ఆపరేషన్ అయినా సామాన్య పౌరులపై పడే ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ''మేం మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం, కానీ చెడుకు సిద్ధమవుతున్నాం'' అని తెలిపారు.

సేఫ్ జోన్ భావనతో ఐక్యరాజ్యసమితికి చేదు అనుభవం ఉందని, అందుకే వాటి ఏర్పాటుకు ఐరాస ప్రోత్సాహం ఇవ్వదని మౌమ్‌ట్జిస్ చెప్పారు. 1995లో స్రెబ్రెనికాలో జరిగిన ఊచకోతను ఆయన గుర్తు చేశారు.

చిత్రం శీర్షిక ఈశాన్య సిరియా ప్రాంతంలోని క్యాంపుల్లో ఉన్న సిరియా నిర్వాసితులు
Image copyright Reuters
చిత్రం శీర్షిక అల్-హొల్ క్యాంపులో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు సంబంధం ఉందని అనుమానిస్తున్న 68 వేల మందిని బంధించారు

క్యాంపుల్లోని ప్రజలకు ప్రమాదం ఉందా?

టర్కీ సరిహద్దుకు దక్షిణాన ఉన్న తాత్కాలిక క్యాంపుల్లో వేలాది మంది సిరియా నిర్వాసితులు ఉంటున్నారు.

మూడు క్యాంపుల్లో ఐఎస్ సభ్యుల కుటుంబాలుగా అనుమానిస్తున్న వారిని కూడా పెట్టారు. అవి.. రోజ్, ఐస్ ఇస్సా, అల్-హొల్ క్యాంపులు.

ఈ ఏడాది మే నాటికి రోజ్ క్యాంపులో 1700 మంది, ఐస్ ఇస్సా క్యాంపులో 12,900 మంది ఉన్నారు. ఈ రెండు క్యాంపులూ టర్కీ ప్రతిపాదిత 'సేఫ్ జోన్' పరిధిలోనే ఉన్నాయి.

అల్-హొల్ క్యాంపులో 68 వేల మంది నివసిస్తున్నారు. అయితే ఇది టర్కీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో ఇది జోన్ పరిధిలోకి రాదు. ఈ క్యాంపులో 94 శాతం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ఇందులో 11 వేల మంది విదేశీయులు కూడా ఉన్నారు.

ఐఎస్ సభ్యులుగా అనుమానిస్తున్న 12 వేల మంది పురుషులను అదుపులోకి తీసుకుని ఏడు జైళ్లలో బంధించినట్లు ఎస్‌డీఎఫ్ తెలిపింది. వీరిలో కనీసం 4 వేల మంది విదేశీయులే. ఈ జైళ్లలో కొన్ని టర్కీ సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి.

కాగా, బంధీలుగా ఉన్న ఐఎస్ ఫైటర్ల బాధ్యత టర్కీ సైన్యానిదేనని ఎర్డోగన్‌కు ట్రంప్ చెప్పారని వైట్‌హౌస్ వెల్లడించింది. అయితే, జైళ్లు, క్యాంపులకు తమ ఫైటర్లు రక్షణగా నిలుస్తారని.. కానీ, పరిస్థితులను బట్టి వారిని వేరే ప్రాంతాలకు పంపించాల్సి రావొచ్చునని, లేదంటే దాడులు జరిగితే వారు పారిపోవచ్చునని ఎస్‌డీఎఫ్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం