నోబెల్ శాంతి పురస్కారం: ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్‌కు అరుదైన గౌరవం

  • 11 అక్టోబర్ 2019
ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ Image copyright Reuters
చిత్రం శీర్షిక ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్

ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ సంవత్సరం ఆఫ్రికా దేశమైన ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్‌కు దక్కింది.

శాంతి స్థాపనకు, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా అహ్మద్‌ను నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

ఈ మేరకు నార్వే రాజధాని ఓస్లోలో కమిటీ సారథి బెరిట్ రీస్-ఆండర్సన్ ప్రకటన చేశారు.

1998-2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధం తర్వాత దాదాపు 20 ఏళ్లపాటు రెండు దేశాల మధ్య కొనసాగిన సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ, ఎరిట్రియాతో ఇథియోపియా నిరుడు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఎరిట్రియాతో సరిహద్దు సమస్య పరిష్కారానికి అహ్మద్ నిర్ణయాత్మకమైన చొరవ చూపారని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన్ను పురస్కారానికి ఎంపిక చేయడంలో ఇథియోపియా, తూర్పు, ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాల్లో శాంతి, సయోధ్యల కోసం కృషి చేస్తున్న అందరినీ గుర్తించాలనే ఉద్దేశం కూడా ఉందని చెప్పింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్, ఎరిట్రియా అధ్యక్షుడు ఇసాయియాస్

"ఏ ఒక్కరి ప్రయత్నాలతోనే శాంతి సాకారం కాదు. ఇథియోపియా ప్రధాని అహ్మద్ స్నేహహస్తం అందించినప్పుడు ఎరిట్రియా అధ్యక్షుడు ఇసాయియాస్ అఫ్‌వర్కీ దానిని అందుకున్నారు. ఉభయ దేశాల మధ్య శాంతి ప్రక్రియ విషయంలో తన వంతు పాత్ర పోషించారు. ఇథియోపియా, ఎరిట్రియా ప్రజల జీవితాల్లో ఈ శాంతి ఒప్పందం సానుకూల మార్పును తీసుకొస్తుందని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆశిస్తోంది" అని కమిటీ వ్యాఖ్యానించింది.

శాంతి, పరస్పర సహకారం, అందరం కలసిమెలసి జీవించాలనే ఆదర్శాల సాకారం కోసం ప్రధాని అహ్మద్ నిరంతరం కృషి చేస్తున్నారని, నోబెల్ పురస్కార ప్రకటన వీటి ఆవశ్యకతను చాటుతోందని అహ్మద్ కార్యాలయం చెప్పింది.

ఇది నోబెల్ వందో శాంతి పురస్కారం

అహ్మద్ డిసెంబరు 10న ఓస్లోలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఇది నోబెల్ వందో శాంతి పురస్కారం కావడం విశేషం.

పురస్కారం కింద అహ్మద్‌కు ఒక నోబెల్ మెడల్, నోబెల్ డిప్లొమా, 90 లక్షల క్రోనార్ల (దాదాపు 6.48 కోట్ల రూపాయల) నగదు బహుమానం లభిస్తాయి.

ఈసారి శాంతి పురస్కారానికి 223 మంది వ్యక్తులతోపాటు 78 సంస్థలు నామినేట్ అయ్యాయి.

ఈ సారి ఎవరు ఎంపికవుతారనేదానిపై బాగా చర్చ జరిగింది. 16 ఏళ్ల స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం సాగింది.

నోబెల్ ఫౌండేషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ల తుది జాబితాలో ఎవరెవరు ఉన్నారనే వివరాలను 50 ఏళ్ల వరకు వెల్లడించకూడదు.

Image copyright ADAM BERRY / GETTY IMAGES
చిత్రం శీర్షిక పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్

భారీ సంస్కరణలు చేపట్టిన అహ్మద్

ప్రస్తుతం ఆఫ్రికాలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రభుత్వాధినేత అహ్మదే.

ఆయన ఇథియోపియా దక్షిణ ప్రాంతంలోని జిమా జోన్‌లో 1976లో జన్మించారు. తండ్రి ఒరోమో ముస్లిం, తల్లి అమ్హారా క్రిస్టియన్.

అహ్మద్ టీనేజర్‌గా ఉన్నప్పుడు ఒకప్పటి 'డెర్గ్యూ' పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ పోరాటంలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు.

1995లో ఆయన రువాండాలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుడిగా సేవలందించారు. 1998-2000 మధ్య సరిహద్దు వివాదం సమయంలో ఎరిట్రియా రక్షణ బలగాల అధీనంలోని ప్రాంతాల్లోకి తన నాయకత్వంలో ఒక గూఢచార బృందాన్ని తీసుకెళ్లి విధులు నిర్వహించారు.

అహ్మద్ 2010లో రాజకీయాల్లోకి వచ్చారు.

నిరుడు ఏప్రిల్లో ప్రధాని అయిన తర్వాత అహ్మద్ ఇథియోపియాలో పెద్దయెత్తున సరళీకృత విధానాలను ప్రవేశపెట్టారు. సంస్కరణలు చేపట్టారు.

వేల మంది ప్రతిపక్ష కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేశారు. విదేశాల్లో ఉంటున్న ఇథియోపియా అసమ్మతి నాయకులు స్వదేశానికి వచ్చేందుకు వీలు కల్పించారు.

అహ్మద్ చేపట్టిన సంస్కరణలు ఇథియోపియాలో కొన్ని ప్రతికూల ఫలితాలనూ ఇచ్చాయి. జాతుల మధ్య ఉద్రిక్తతలు పెరిగి హింస చోటుచేసుకొంది. దీంతో సుమారు 25 లక్షల మంది ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు.

చిత్రం శీర్షిక 2014 నోబెల్ శాంతి పురస్కారం విజేతలు మలాలా యూసఫ్‌జాయ్(పాకిస్తాన్), కైలాస్ సత్యార్థి (భారత్)

నోబెల్ ప్రైజ్ విజేతల్లో పలువురు ప్రముఖ వ్యక్తులు, సంస్థలు...

అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా(2009), జిమ్మీ కార్టర్(2002), పాకిస్తాన్‌కు చెందిన బాలల హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసుఫ్‌జాయ్(2014), యూరోపియన్ యూనియన్(2012), ఐక్యరాజ్యసమితి, నాటి ఐరాస సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్(2001), మదర్ థెరీసా(1979).

2014లో మలాలాతోపాటు భారత్‌కు చెందిన బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థికి కలిపి ఈ పురస్కారాన్ని ఇచ్చారు.

వీడియో: నోబెల్ పురస్కారం ఎలా పుట్టింది?

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: నోబెల్ ఎలా పుట్టింది?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

‘కడుపు కాలే రోడ్లపైకి వచ్చాం.. తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి ఆర్టీసీ సమ్మె నాంది కావాలి’

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలిచ్చి అర్హత లేదని వెనక్కి తీసుకున్నారు.. ఎందుకు

భూమిలో మూడు అడుగుల లోతులో పాతిపెట్టారు.. బతికి బయటపడ్డ చిన్నారి

ఏనుగులు వేరే వాటిని కాపాడ్డానికి తమ ప్రాణాలనే పణంగా పెడతాయా

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

‘‘జీతంపైనే ఆధారపడి బతికే కుటుంబం.. అందరం కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది’’

ఉప్పల‌పాడు పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి