నిరసన ప్రదర్శనలు, అహింసా ఉద్యమాలతో సమాజంలో మార్పు రాదా? ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ ఏమంటోంది?

  • 13 అక్టోబర్ 2019
అక్టోబర్ 11వ తేదీన లండన్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ గ్రూప్ మద్దతుదారులు Image copyright Getty Images

''విప్లవాత్మక మార్పు తేవాలంటే నిరసన ప్రదర్శనలు చేయటం, పిటిషన్ల మీద సంతకాలు చేయటం, ఎంపీలకు లేఖలు రాయటం సరిపోవు'' అంటారు అలానా బైర్న్.

లండన్‌లో గత ఏడాది వ్యవస్థాపితమైన ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ బృందం చేపట్టిన పర్యావరణ ఉద్యమానికి ఆమె అధికార ప్రతినిధి.

కర్బన ఉద్గారాలు 2025 నాటికి సున్నా స్థాయికి తగ్గిపోయేలా చేయాలన్నది ఈ గ్రూప్ లక్ష్యం. అహింసాత్మక సహాయ నిరాకరణ పద్ధతుల ద్వారా ప్రభుత్వాలు ఈ మార్పును సాధించేలా ఒత్తిడి చేయగలవని వీరు నమ్ముతున్నారు.

కానీ.. గతంలో ఈ ఎత్తుగడలు ఎంతవరకూ సఫలమయ్యాయి?

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తమ నిరసన పద్ధతులు కొందరకి కోపం తెప్పిస్తాయని ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ అంగీకరిస్తోంది

అంతర్జాతీయ నిరసన

ఈ గ్రూప్ తన ఉద్దేశాన్ని చాటిచెప్పటానికి అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల్లో రెండు వారాల నిరసనలు ప్రారంభించింది.

ఈ గ్రూప్ హింసను తిరస్కరిస్తోంది. అయితే.. తాము షాక్ వ్యూహాలను ఉపయోగిస్తున్నామని బైర్న్ అంగీకరిస్తున్నారు. వీరు సాధారణంగా.. తాము నిరసన చేపట్టిన నగరంలో అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడళ్లను అడ్డుకుంటారు. లేదంటే ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధనం చేస్తారు.

''మేం కోరుతున్న విషయంలో చర్యలు చేపట్టేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి ఆర్థిక అవాంతరాలు కలిగించటం కూడా మా ఎత్తుగడల్లో భాగమే'' అని ఆమె చెప్పారు.

సహాయ నిరాకరణ ఉద్యమంలో అన్ని సమాజంలోని వర్గాల ప్రజలూ పాల్గొనాలని ఆమె కోరుతున్నారు.

అయితే.. ఈ గ్రూప్ అనుసరిస్తున్న పద్ధతులకు బ్రిటన్‌లో కేవలం 18-24 ఏళ్ల వయసు బృందంలోని వారి మధ్యే అధికంగా మద్దతు లభిస్తోందని ఒక సర్వేలో వెల్లడైంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ ఉద్యమకారులు ప్రధాన నగరాల్లో ముఖ్య కూడళ్లను అడ్డుకుంటున్నారు

విజయాల రేటు

అయినా కూడా తాము సఫలమవుతామనే అంశం మీద ఎక్స్‌టింక్షన్ గ్రూప్‌కు ఎటువంటి సందేహం లేదు. వాతావరణ మార్పు అనేది ఒక పర్యావరణ అత్యవసర పరిస్థితి అని బ్రిటన్ పార్లమెంటు ప్రకటించటం వెనుక ప్రధాన కారణం తమ నిరసనలేనని ఈ బృందం చెప్తోంది.

ఈ అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమ బృందం.. ఎరికా చెనోవెత్, మారియా స్టెఫాన్‌ల అధ్యయనం నుంచి స్ఫూర్తి పొందింది. అహింసాత్మక నిరసనలు ఏ మేరకు విజయవంతం అయ్యాయనే దాని మీద వీరు అధ్యయనం చేశారు.

ఈ పరిశోధకులు 323 హింసాత్మక, అహింసాత్మక ఉద్యమాల సమాచారం సేకరించారు.

''1900 నుంచి 2006 వరకూ శతాబ్ద కాలానికి పైగా జరిగిన ఉద్యమాల్లో.. తాము ప్రకటించిన లక్ష్యాలు సాధించటంలో హింసాత్మక ప్రతిఘటనల కన్నా అహింసాత్మక ప్రతిఘటనలు రెండు రెట్లు అధికంగా విజయవంతం అయ్యాయి'' అని వీరు నిర్ధారించారు.

అహింసాత్మక నిరసన అంటే ఎలా ఉంటుందనేది నిర్వచించటానికి కూడా వీరు ప్రయత్నించారు.

''అధ్యయన నిపుణులు వందలాది అహింసాత్మక పద్ధతులను గుర్తించారు. వివిధ విధానాలను వ్యతిరేకించటానికి కానీ మద్దతివ్వటానికి కానీ, వ్యతిరేక శక్తులను బలహీనపరచటానికి కానీ, వ్యతిరేక శక్తుల అధికార వనరులను తొలగించటం లేదా పరిమితం చేయటానికి కానీ ప్రజలను సమీకరించటం కోసం.. ప్రతీకాత్మక నిరసనలు, ఆర్థిక బహిష్కరణలు, కార్మిక సమ్మెలు, రాజకీయ - సామాజిక సహాయ నిరాకరణ, అహింసాత్మక జోక్యం వంటి అనేక పద్ధతులను ఉపయోగించారు'' అని వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అహింసాత్మక నిరసనలతో విజయాల రేటు అధికంగా ఉందని ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన రోజర్ హాలమ్ పేర్కొన్నారు

ప్రత్యక్ష చర్య

ఈ పద్ధతులు తమ లక్ష్యాలను సాధించటానికి ప్రభావవంతంగా పనిచేస్తాయని ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ చెప్తోంది.

''పాతుకుపోయిన రాజకీయ అధికారం మీద పైచేయి సాధించటానికి.. భారీ స్థాయి అహింసాత్మక ప్రత్యక్ష చర్యలతో విస్తృత ఉద్యమాలు ఒక్కటే మార్గమని మేం నిర్ధారణకు వచ్చాం'' అని ఈ గ్రూప్ సహ వ్యవస్థాపకుడైన రోజర్ హాలామ్ ద గార్డియన్ న్యూస్‌పేపర్‌లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

ఈ గ్రూప్ కార్యకర్తలు న్యూయార్క్‌ నగరంలో వాల్ స్ట్రీట్ వరకూ ''అంతిమ యాత్ర'' నిర్వహించారు. అందులో భాగంగా.. ఈ గ్రూప్ సభ్యులు కొందరు ఈ ఆర్థిక కేంద్రంలో కనిపించే ప్రఖ్యాత రాగి ఎద్దు మీద కృత్రిమ రక్తం విసిరారు. ఈ చర్యలు కొందరు అధికారులకు ఆగ్రహం తెప్పించాయి.

ఇటువంటి నిరసనలతో కలత చెందిన చాలా మంది.. ప్రజాస్వమ్యంలో వ్యవస్థ అంతర్గతంగా మార్పు వచ్చేలా చేయాలి కానీ ఈ పద్ధతులు సరైనవి కావని అంటున్నారు.

కానీ దీనితో అమెరికా విద్యావేత్తలు విభేదిస్తున్నారు.

''అహింసాత్మక సంఘర్షణ సంప్రదాయ రాజకీయ ప్రవాహాలకు వెలుపల జరుగుతాయి. అందుకే లాబీయింగ్, ఎన్నికల్లో పాల్గొనటం, చట్టాలు చేయటం వంటి ఇతర అహింసాత్మక రాజకీయ ప్రక్రియలకన్నా చాలా భిన్నంగా ఉంటాయి'' అంటారు.

ఈ పద్ధతులకు సార్వజనీన ప్రజాదరణ లేదన్న విషయాన్ని అలానా బైర్న్ అంగీకరిస్తారు. ''ప్రజలకు కోపం తెప్పించటం అనే రిస్కు ఎప్పుడూ ఉంటుంది. కానీ.. మేం శాంతియుతంగా ఉంటూ.. రాజకీయ చట్రంలోని ప్రతి ఒక్కరితో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నంత కాలం మేం సఫలమవుతాం'' అని ఆమె పేర్కొన్నారు.

నిజానికి.. ప్రజల సందేశాన్ని ప్రభుత్వాలకు చేరవేయటానికి దోహదపడటం తమ గ్రూపు లక్ష్యమని చెప్పారు.

''మేం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదు. ప్రజల స్వరాన్ని రాజకీయవేత్తలు వినిపించుకోవటం లేదు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించటంలో ప్రజలకు సాయం చేయాలన్నది మా ఉద్దేశం'' అని ఆమె వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సుడాన్‌లో సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న ఒమర్ అల్-బషర్‌ను ఏప్రిల్‌లో పదవీచ్యుతుడ్ని చేయటంలో ప్రజాస్వామ్య నిరసనలు విజయం సాధించాయి

సామాజిక మార్పు

ప్రపంచం నలుమూలలా భారీ స్థాయి సామాజిక మార్పులు తీసుకురావటానికి అహింసాత్మక ఉద్యమాలను విస్తృతంగా ఉపయోగించారు.

''గడచిన సంవత్సరాల్లో మనం చూసిన అత్యంత ముఖ్యమైన మార్పుల్లో కొన్ని మార్పులు.. ప్రజలు కేంద్రంగా సాగిన అహింసాత్మక శాసనోల్లంఘన ప్రతిఘటనల వల్ల వచ్చాయి'' అంటారు ప్రొఫెసర్ ఇసాక్ సెవెన్సన్.

ఆయన స్వీడన్‌లోని ఉప్సలా యూనివర్సిటీలో పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రీసెర్చ్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

ప్రభుత్వాలను మార్చటానికి, స్వయం నిర్ణయాధికారం సాధించటానికి, విదేశీ ఆక్రమణకు వ్యతిరేకంగా, లింగ సమానత్వం, జాతి వివక్షలకు సంబంధించిన వివిధ అంశాల కోసం, మానవ హక్కుల కోసం, పర్యావరణం కోసం అహింసాత్మక ఉద్యమాలను విస్తృతంగా ఉపయోగించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అహింస అనేది బలవంతుల ఆయుధం అని గాంధీ అభివర్ణించారు

అహింస ప్రబోధకులు

సహాయ నిరాకరణ ఉద్యమాలను ఉపయోగించటంలో ఆద్యులైన మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలను చాలా గొప్పవారిగా పరిగణిస్తారు.

అహింసా పోరాటాన్ని ''సత్యాగ్రహం'' అని గాంధీ అభివర్ణించారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. ఏ అహింసాయుత సంఘర్షణ అయినా దాని లక్ష్యం ప్రత్యర్థిలో పరివర్తన తీసుకు రావటం.. ఆ వ్యక్తి ఆలోచనను, హృదయాన్ని గెలుచుకోవటం.

సత్యాగ్రహం అనేది బలహీనుల ఆయుధం కాదు అనే విషయంలో గాంధీ దృఢంగా ఉండేవారు. ''సత్యాగ్రహం అనేది బలవంతుల ఆయుధం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అహింసనే పాటించాలని చెప్తుంది. అది ఎల్లప్పుడూ సత్యం కోసం పట్టుపడుతుంది.''

ఆయన పద్ధతుల మీద తొలుత చాలా మందికి సందేహాలుండేవి. అనేక నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, అధికార యంత్రాంగానికి సహాయ నిరాకరణ వంటి పద్ధతుల్లో సుదీర్ఘ పోరాటం తర్వాత.. ఆయన పద్ధతులు సమర్థవంతమైనవని నిరూపితమయ్యాయి. భారతదేశం మీద వలస ఆక్రమణ ముగిసింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు వేలాది మంది యాజిదీ ప్రజలను హత్యచేశారు, అత్యాచారాలు చేశారు, బానిసలుగా చేసుకున్నారు

అత్యంత సమర్థవంతం

అహింసాత్మక నిరసనలు నిర్దిష్ట పరిస్థితుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ ఇసాక్ సెవన్సన్ చెప్తున్నారు.

''అహింసా ఉద్యమాలు.. సాధారణంగా సమాజంలో విస్తృత పునాదిని, ప్రజల్లో అత్యధిక వర్గాలను ఆమోదింపజేయగలిగితే.. సాధించగల లక్ష్యాలు ఉన్నట్లయితే, వ్యూహాత్మకంగా వినూత్నంగా ఉన్నట్లయితే, అహింసను కొనసాగించినట్లయితే.. అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి'' అని ఆయన పేర్కొన్నారు.

విపరీతమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో సైతం ప్రజలు అహింసాత్మక నిరసనలు ఉపయోగించారని ఆయన ఉటంకిస్తున్నారు.

''సిరియాలో ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్)కు వ్యతిరేకంగా పౌర ప్రతిఘటన వివిధ రూపాలు తీసుకుంది. అందులో (అరుదుగానే అయినా) ప్రజా నిరసనలు, సహాయ నిరాకరణలతో పాటు 'రోజువారీ ప్రతిఘటన' అని చెప్పగల వివిధ చర్యలు కూడా ఉన్నాయి'' అని చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తెల్లజాతి వ్యక్తి కోసం తాను సీటు ఖాళీ చేయటానికి నిరాకరించిన రోసా పార్క్స్‌ను అరెస్ట్ చేసిన ఉదంతం 381 రోజుల పాటు బస్సులను బహిష్కరించిన ఉద్యమాన్ని రగిల్చింది

ప్రజాశ్రేయస్సు

కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ముఖ్యంగా తీవ్ర అన్యాయాలను పరిష్కరించటానికి సాయం చేసే పౌర శాసనోల్లంఘన అనేది న్యాయమైనదే కాకుండా ప్రశంసార్హమైనది కూడా అవుతుందని ఇతర పరిశోధకులు అంటున్నారు.

''పౌర శాసనోల్లంఘన అనేది.. పైరసీ వీడియోను డౌన్‌లోడ్ చేయటం లాగా ప్రైవేటు, వ్యక్తిగత చట్టవిరుద్ధ ప్రవర్తన కానీ కాదు'' అని వార్విక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కింబర్లీ బ్రౌన్‌లీ పేర్కొన్నారు.

''అందుకు ఒక నిర్వచిత ప్రజాశ్రేయస్సు ఉండాలి - చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామని అధికారవ్యవస్థలకు ముందుగా చెప్పాల్సి ఉంటుంది. ఆ చర్యలకు దిగింది తామేనని సొంతం చేసుకోగలగాలి'' అని చెప్పారు.

పౌర శాసనోల్లంఘన అనేది చివరి ప్రయత్నం కావాలని.. అది విజయవంతం కావాలంటే నిర్వాహకులు ప్రజలను కదిలించగలగాలని వివరించారు.

కానీ.. ఒక ఉద్యమాన్ని ప్రారంభించటానికి ప్రజలను సమీకరించాల్సిన అవసరం అన్ని వేళలా ఉండదు.

''ఒక తెల్లజాతి ప్రయాణికుడి కోసం తన సీటు నుంచి లేచివెళ్లటానికి నిరాకరించిన రోసా పార్క్స్.. ఆ ఒక్క చిన్న ప్రతిఘటనతో ఒక భారీ ఉద్యమాన్ని రగిల్చారు'' అని బ్రౌన్‌లీ ఉటంకించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక టిబెట్ బౌద్ధ సన్యాసులు 60 ఏళ్లుగా చేస్తున్న శాతియుత నిరసనలు.. చైనా పాలకులను ఏమాత్రం కదిలించలేదు

సందేశం మీద కేంద్రీకరణ

కొన్ని ప్రముఖ శాంతియుత నిరసనలు చివరికి విఫలమయ్యాయి కూడా. టిబెట్ బౌద్ధులు తమ సాంస్కృతిక, మత, రాజకీయ స్వాతంత్ర్యం కోసం 60 ఏళ్లకు పైగా సాగించిన అహింసా ఉద్యమం.. వారి లక్ష్యానికి ఏమాత్రం చేరువకు తీసుకుపోలేదు.

అందుకు విరుద్ధంగా అమెరికా సహా చాలా దేశాలు సాయుధ తిరుగుబాటుకు దిగటం ద్వారా తమ స్వాతంత్ర్యాలు సముపార్జించాయి.

దేశాల్లో అంతర్గతంగా కూడా ఆయుధ బలంతో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న విప్లవాల ఉదాహరణలూ ఉన్నాయి.

అయితే.. సాయుధ ప్రతిఘటనలు విఫలమైన ఉదాహరణలు మరింత ఎక్కువగానూ ఉన్నాయి.

అయినా.. అహింసా ఉద్యమానికి ఒక పెద్ద సానుకూలత ఉందని బ్రౌన్‌లీ అంటారు.

''హింసా ఉద్యమాల్లో ఉండే ప్రధాన ప్రతికూలత.. అది సందేశాన్ని విరూపం చేస్తుంది. అహింసా ఉద్యమాల్లో.. సందేశం మీద దృష్టి కేంద్రీకరించటం కొనసాగించవచ్చు. అందువల్ల అది విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయి'' అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలోంచి బయటపడ్డ రాయల్‌ వశిష్ట బోటు.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు

ఇన్ఫోసిస్: సీఈఓ, సీఎఫ్ఓ‌లపై వచ్చిన ఆరోపణలపై విచారణను ప్రారంభించిన ఐటీ సంస్థ

#100Women: మహిళలుచదువుకుంటే ప్రపంచానికే మేలు - అరణ్య జోహర్

ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ

చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ

భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్

ప్యాంటు విప్పి, కాలిపర్స్ తీసి స్కానర్‌లో పెట్టాలి.. వికలాంగ ఉద్యమకారులకు విమానాశ్రయంలో అవమానం

కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?