ఏడేళ్ల వయసులో నాపై జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్ల వయసులో ఎందుకు బయటపెట్టానంటే...

  • 13 అక్టోబర్ 2019
బాలికలపై అత్యాచారం, వేధింపులు

60 ఏళ్ల కిందట దాదాపు ఏడేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానని ఘనాలోని ప్రముఖ జర్నలిస్ట్, బీబీసీ కాలమిస్ట్, ఆ దేశ మాజీ మంత్రి ఎలిజబెత్ ఓహేన్ ఇటీవల ఒక దినపత్రికలో రాశారు.

ఇంతకాలం తర్వాత ఎందుకు బహిరంగంగా ఆ ఘటన గురించి చెప్పాల్సి వచ్చిందో ఆమె వివరించారు.

నాపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటి ప్రపంచానికి చెబితే దాని ప్రభావం ఎలా ఉంటుందనేదాని గురించి ఆలోచించడం లేదు.

గత బుధవారం, ఘనాలోని అత్యధిక సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రిక 'డైలీ గ్రాఫిక్' కోసం నేను రాసే వీక్లీ కాలమ్‌లో ఆ ఘటన గురించి చెప్పాను.

ప్రస్తుతం నా వయసు 74 ఏళ్లు, 67 ఏళ్ల కిందట జరిగిన ఒక ఘటనను మీకు వివరిస్తాను.

నీ గుండెలోతుల్లో ఉన్న బరువును ఇప్పుడు ఎందుకు దించుకుంటున్నావని నాకున్న సన్నిహిత మిత్రుల్లో ఒకరు అడిగారు.

నేను చెప్పే కథ చదవడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. అందువల్లే 67 ఏళ్లు ఈ కథను నాలోనే దాచుకున్నాను. ఇప్పుడే ఎందుకు మీకు చెబుతున్నాను? ప్రపంచానికి చెప్పకుండా నాతో పాటు ఈ కథను సమాధిలోకి ఎందుకు తీసుకెళ్లడం లేదు?

అందుకు కారణాలు వివరించే ప్రయత్నం చేస్తాను.

ఇదీ.. నా కథ

నా నుంచి ఇలాంటి వార్త వస్తుందని ప్రజలు ఏమాత్రం ఊహించి ఉండరు. నా గుండెలోని భారాన్ని వారిపై మోపుతానని ఎప్పుడూ అనుకొని ఉండరు.

కానీ, నా కథ చెప్పడం వల్ల ఎక్కడో ఒక చోట ఒక్క మహిళ అయినా ఇలాంటి బాధల నుంచి బయటపడుతుందనే ఆశతో ఈ కథ చెప్పే బాధ్యత నాపై ఉందని చాలా ఏళ్ల కిందటే అనుకున్నాను.

బహుశా నేను మొదట నా కథ చెప్పాలి, తరువాత నేను ఎందుకు ఆ కథ చెప్పానో వివరించాలి.

1952లోకి వెళ్తే, అప్పుడు నాకు ఏడేళ్లు ఉంటాయి. నానమ్మతో కలిసి మా ఊళ్లో ఉంటున్నాను. ఒక రోజు, మా పక్కింట్లోనే ఉండే మా బంధువు ఒకరు నన్ను తన గదిలోకి లాగి లైంగిక వేధింపులకు గురి చేశాడు.

అప్పుడు నాకు ఏం జరిగిందో చెప్పడానికి భాష ఇబ్బందిగా ఉంది. ఆ సమయంలో, అతను ఏం చేశాడో అప్పుడు నాకు తెలియదు. అతను చేసిన పనికి నా దగ్గర పేరే లేదు. నొప్పికి గురైన నా శరీర భాగాల పేర్లు కూడా నాకు తెలియదు.

తన కఠినమైన వేళ్లను నా యోనిలోకి జొప్పించి గోర్లను విరగొట్టాడని మాత్రం తెలుసు.

అతను ఏం చేశాడో అప్పుడు తెలియకపోవచ్చు కానీ, ఇప్పుడు తెలుసు. ఏం జరిగిందో చెప్పడానికి సామాజిక నిబంధనలు నన్ను అనుమతించవు. అందుకే నేను లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పలేకపోయాను.

నాన్నమ్మ నా ఆరోగ్యం కుదుటపడేలా చేసింది. కానీ, నాకు ఏం జరిగిందో ఆమెకు చెప్పలేదు. ఈ సంఘటన జరిగిన రోజు ఉదయం నాకు స్నానం చేయిస్తున్నప్పుడు, నా యోని నుంచి చీము కారుతున్నట్లు ఆమె గమనించారు. నాకు ఇన్ఫెక్షన్ సోకిందని అనుకున్నారు.

ఏదైనా జరిగిందా అని ఆమె నన్ను అడగలేదు, ఇన్ఫెక్షన్ తగ్గేలా నాకు సపర్యలు చేసింది.

చాలా ఏళ్ల తరువాత నేను పెద్దయ్యాక, ఆ సంఘటనను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నాకు తెలిసిందేమిటంటే నాపై అత్యాచారం జరిగింది.

నాకు 11 ఏళ్లు ఉన్నప్పుడు మళ్లీ అదే అనుభవం ఎదురైంది. అదే హింస, ఈసారి కూడా అతడే.

రెండోసారి జరిగినప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ ఘటనను నేను చెప్పగలను. కానీ, అదో పెద్ద భారంగా, మానసిక గాయంగా అనిపించింది.

జర్నలిస్టుగా, రచయితగా, ప్రభుత్వ అధికారిగా నా జీవితంలో సరైనదని భావించినదాన్నే నేను చేశాను.

ఇప్పుడు నా వయసు 74 ఏళ్లు, నేను ఈ రోజు మరణిస్తే, ఘనాలో చేపట్టిన కొన్ని పథకాలకు సంబంధించి నన్ను స్మరించుకుంటారేమో.

వాస్తవానికి నేను నిండు జీవితాన్ని గడిపాను. ఇంత నిండైన జీవితం గడిపాకా ఎప్పుడో జరిగిన అత్యంత దారుణమైన విషయాన్ని ఇప్పుడెందుకు బయటపెట్టడం అని కొందరు అడిగారు.

మన సమాజంలో పిల్లలపై జరిగే లైంగిక వేధింపులను జీవితంలో ఒక భాగంగా అంగీకరిస్తున్నట్లు నేను భావిస్తున్నాను. ముఖ్యంగా యువకుల నుంచి చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఇది మనం మాట్లాడటానికి కూడా నిరాకరిస్తున్నాం.

ఈ విషయాన్ని పరిష్కరించడానికి ఇటీవల ప్రయత్నాలు జరిగాయి. చిన్నారులపై లైంగిక హింస జరిగినప్పుడు కొంతమంది ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, కేసు ఉపసంహరించుకోవాలని వారిపై ఒత్తిడి వస్తుంది. ఇలాంటివి ఇంటి వద్దే పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.

వేధింపులకు గురిచేసిన వారిని మీరు విచారించడానికి ప్రయత్నిస్తే మీ కుటుంబం బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల, ఇలాంటి కేసుల్లో కొన్ని మాత్రమే కోర్టు వరకు వస్తున్నాయి. వాటిలో కొన్నే విజయవంతంగా విచారణకు వస్తున్నాయి.

Image copyright Getty Images

స్వలింగ సంపర్కులపై ఆగ్రహిస్తారు.. పిల్లలను హింసించేవారి మాటేమిటి?

ఇలాంటి విషయాల గురించి మాట్లాడకపోతే ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నాను.

సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడటానికి అయిష్టత చూపే ప్రజలు స్వలింగ సంపర్కంపై ఆగ్రహిస్తుంటారు.

ఎల్‌జీబీటీక్యూ ప్రజలను ఉపేక్షించకూడదని ఘనాలో చాలా మందిలో ఏకాభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తుంది. దేశ జనాభాలో 3 శాతం మంది మాత్రమే స్వలింగ సంపర్కాన్ని అంగీకరించారని 'ప్యూ రీసెర్చ్' సర్వేలో తేలింది.

మన సమాజంలో ఎల్‌జీబీటీక్యూ ప్రజలను ఆమోదించడంపై బలమైన ప్రతిఘటన ఎదురవుతోంది.

ప్రాథమిక పాఠశాలల్లో లైంగిక విద్యను బోధించడం దేశ సంస్కృతికి వ్యతిరేకమని ఇక్కడి మత సంఘాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో అవి ఐక్యంగా ఉన్నాయి. కానీ, స్వలింగ సంపర్కం అనేది మన సమాజంలోకి వెనక డోర్ నుంచి వచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఇటీవల స్కూల్ పాఠ్యాంశాల్లో సమగ్ర లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై చివరకు దేశాధ్యక్షుడు జోక్యం చేసుకొని ప్రకటన చేయాల్సి వచ్చింది.

అప్పుడు సంతోషంగా నా సమాధిలోకి వెళతా..

నా కథకు మితిమీరిన స్పందన వచ్చింది. ఈ కథను చదివి అందరూ అసౌకర్యంగా ఫీలవుతారు. వాస్తవానికి ఈ కథే అసౌక్యంగా ఉంటుంది. చెప్పడం కూడా ఇబ్బందే. చదివినవాళ్లు అసౌకర్యంగా భావిస్తారని నాకు తెలుసు. అందుకే పెద్దగా ఆశ్చర్యపోలేదు.

నా కథను ధైర్యంగా చెప్పడానికి 67 ఏళ్లు పట్టింది.

ఇలాంటి మలినాలను బహిరంగ ప్రదేశంలో పోయడం అన్యాయమని కొందరు అన్నారు. దానిపై నేను మాట్లాడదలుచుకోలేదు.

చాలా మంది, ముఖ్యంగా మహిళలు ఈ కథ చదివి నాకు కృతజ్ఞతలు చెప్పారు. లైంగికంగా వేధించే వారితో వ్యవహరించే ధైర్యాన్ని ఈ కథ ఇచ్చిందని అన్నారు.

నా కథ, లైంగికత గురించి బహిరంగంగా మాట్లాడే అవకాశాలను పెంపొందిస్తే, లైంగిక హింసను ఎదుర్కొనేందుకు పిల్లలను సన్నద్ధం చేస్తే.. ఒక మహిళగా నేను చాలా సంతోషంగా నా సమాధిలోకి వెళతాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)