అబియ్ అహ్మద్ తూర్పు ఆఫ్రికాలో శాంతిని నెలకొల్పారా?

  • 12 అక్టోబర్ 2019
అబియ్ అహ్మద్ Image copyright Getty Images

ఇథియోపియా ప్రధాన మంత్రి అబియ్ అహ్మద్‌ను ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేయడానికి ఆయన సాధించినదేమిటి?

ఎరిట్రియాతో సరిహద్దు సమస్యను పరిష్కరించి స్వదేశంతో సహా, తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో శాంతి, సయోధ్యను పెంపొందించడంలో ఆయన పాత్రను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.

ఈ పురస్కారం రాగానే అబియ్ మద్దతుదారులు ఆయన విజయాలను ప్రశంసించారు. అయితే, దేశంలో వివిధ జాతుల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు ఆయనే కారణమనే విమర్శలు వస్తున్నాయి.

Image copyright Getty Images

అతి పెద్ద సవాల్

ఉత్తర సరిహద్దు సమస్యతో ఏళ్లుగా ఘర్షణ పడుతున్న దేశానికి.. అస్థిరత, ఆర్థికాభివృద్ధిని తీవ్రంగా అడ్డుకుంటున్న ప్రాంతానికి 2018లో అబియ్ ప్రధాని అయ్యారు.

అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఎరిట్రియాతో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు.

ఈ ఒప్పందం అమలు కోసం సరిహద్దు భూభాగాలను, ముఖ్యంగా బాడ్మే పట్టణాన్ని ఎరిట్రియాకు అప్పగిస్తామని వాగ్దానం చేశారు. ఈ ప్రాంతం 1998-2000 నుంచి ఇరు దేశాల మధ్య భారీ పోరాటాలకు కేంద్రంగా ఉంది. ఈ ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇథియోపియాకు సంబంధించి ముఖ్యమైన ప్రజాస్వామ్య సంస్కరణలను తీసుకువచ్చినందుకు అలాగే, ఈ ప్రాంతంలోని సంఘర్షణలను పరిష్కరించే ప్రయత్నం చేసినందుకు అబియ్‌ ప్రశంసలందుకున్నారు.

కానీ, ఎరిట్రియాతో ఆయన చేసుకున్న శాంతి ఒప్పందం ఫలితాలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయో చూద్దాం.

Image copyright Getty Images

ఎరిట్రియాతో శాంతి కొనసాగిందా?

ఒప్పందం తర్వాత రెండు దేశాల సరిహద్దు పట్టణాల నుంచి రాకపోకలకు అనుమతి లభించింది. ప్రజలు సరిహద్దు మీదుగా స్వేచ్ఛగా వెళ్లగలిగారు. సరకు రావాణా కూడా జరుగుతోంది. గతంలో ఈ ప్రాంతాలు పూర్తిగా మూసివేశారు. సైన్యాన్ని మోహరించారు.

ఒప్పందం తర్వాత దేశంలో సంతోషం వెల్లివిరిసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ ఒప్పందం అమలు జరుగుతున్నప్పటి నుంచి ఒక విధమైన నిరాశ ఆవరించింది.

ఒప్పందంలోని అంశాలను రెండు ప్రభుత్వాలు ఎగతాళి చేస్తున్నాయి. బాడ్మే పట్టణం ఇథియోపియా నియంత్రణలోనే ఉంది. ప్రారంభంలో తెరిచిన అన్ని సరిహద్దు పోస్టులు ఇప్పుడు మూసివేశారు. ఒప్పందం అమలు సమయంలో అభివృద్ధి చెందిన సరిహద్దు పట్టణాల్లోని కొన్ని వ్యాపారాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి.

రెండు రాజధాని నగరాలైన అడిస్ అబాబా, అస్మారాల మధ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

ఎరిట్రియా సరిహద్దులో ఉన్న ఈశాన్య ప్రాంతంలోని కొందరు టిగ్రేయన్ జాతులు సరిహద్దు పోస్టులను తెరవడాన్ని వ్యతిరేకించారు.

ఈశాన్య ప్రాంతంలో రాజకీయంగా ఆధిపత్యంగా ఉన్న టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్ఎఫ్) ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉంది. ఎరిట్రియన్ అధ్యక్షుడు ఇసైయాస్ అఫ్వెర్కితో గట్టి సంబంధాలు కలిగి ఉంది.

శాంతి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, ఇసైయాస్.. టీపీఎల్ఎఫ్‌ను తీవ్రంగా విమర్శించారు.

ఇథియోపియన్ ప్రభుత్వం మిలటరీ దళాలను సరిహద్దు ప్రాంతం నుంచి తొలగించాలనుకున్నప్పుడు స్థానిక టిగ్రే జాతులు తీవ్రంగా వ్యతిరేకించాయి. సరిహద్దులను మూసివేశాయి. పొరుగుదేశంతో సమస్యలొస్తాయని భయపడి ఇలా చేశాయి.

శాంతి ప్రక్రియ నెమ్మదిగా జరగడానికి ఎరిట్రియన్ అధ్యక్షుడు ఇసైయాస్ వైఖరే కారణమని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

ఆఫ్రికా ఖండంలో అత్యంత అణచివేత ఉన్న దేశాలలో ఒకటిగా పరిగణించే తన దేశంలో సంస్కరణలు తీసుకురావడానికి ఆయన ముందుకు రాలేదని విమర్శకులు అంటున్నారు.

Image copyright Getty Images

ప్రజాస్వామ్య సంస్కరణలు ఎలా ఉన్నాయి?

అబియ్ అహ్మద్ అధికారంలోకి రాగానే, వేల మంది ప్రతిపక్ష కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేశారు. అత్యయిక స్థితి పరిస్థితులను తొలగించారు. రాజకీయ పార్టీలపై నిషేధం ఎత్తివేశారు.

ఒక మహిళను తొలిసారిగా దేశ అధ్యక్షురాలిని చేశారు. కేబినెట్‌లో సగం సీట్లను మహిళలకు కేటాయించారు. 2020లో బహుళ పార్టీ వ్యవస్థతో ఎన్నికలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ప్రకటించారు.

అంతర్గత జాతి ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయా?

ఇథియోపియాలో అనేక జాతుల మధ్య ఉద్రిక్తతలు ఎల్లప్పుడూ తీవ్రమైన అంశాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, పాలక ప్రభుత్వం దీన్ని పక్కకు పెట్టింది.

2018లో అబియ్ అధికారంలోకి రాగానే, అనేక రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చారు.

కొన్ని ప్రాంతాలలో, ఇది బహిరంగ సంఘర్షణకు దారితీసింది. అస్థిరత నెలకొన్న ప్రాంతాలలో సుమారు 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

గత ఏడాది నవంబర్‌లో రెఫ్యూజీస్ ఇంటర్నేషనల్ ఒక నివేదిక ఇచ్చింది. ఇంకా సురక్షితం కాని ప్రాంతాలకు నిరాశ్రయులు వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఆవాసం కోల్పోయిన పౌరులను రక్షించడానికి తగిన ప్రయత్నాలు చేయడం లేదని ఆ నివేదికలో పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక దక్షిణ సూడాన్ అధ్యక్షుడు సాల్వా కీర్, తిరుగుబాటు నేత రిక్ మాచర్ మధ్య జరిగిన శాంతి చర్చలలో అబియ్ చురుకుగా పాల్గొన్నారు.

శాంతి దూతగా అబియ్ పాత్ర ఏమిటి?

అబియ్ స్వల్ప పాలనకాలంలోనే తన ప్రాంతంలో శాంతి దూతగా కీలకపాత్ర పోషించారు.

ఖార్టూమ్, ఇతర ప్రాంతాలలో నిరసనలపై ప్రతిపక్షాలతో విస్తృతమైన చర్చలు జరిపి సుడాన్‌లో సైనిక పాలనను తీసుకురావడంలో కృషి చేశారు.

అంతేకాకుండా, ఏళ్లుగా ఎరిట్రియా, జిబౌటీల మధ్య నెలకొన్న రాజకీయ విద్వేషాలకు ముగింపు పలికి, దౌత్య సంబంధాలను సాధారణస్థాయికి తీసుకురావడానికి సహాయపడ్డారు.

కెన్యా, సోమాలియా దేశాల మధ్య నెలకొన్న సముద్ర సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు.

దక్షిణ సూడాన్ అధ్యక్షుడు సాల్వా కీర్, తిరుగుబాటు నేత రిక్ మాచర్ మధ్య జరిగిన శాంతి చర్చలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.

గత ఏడాది జూన్‌లో అడిస్ అబాబాలో ఇద్దరి మధ్య సమావేశం ఏర్పాటుకు చొరవచూపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు