అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు అలెక్సీ లియోనోవ్ కన్నుమూత.. ఆ నడకలో జరిగిన ప్రమాదం ఏంటంటే..

  • 12 అక్టోబర్ 2019
అలెక్సీ లియోనోవ్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక అమెరికా-సోవియట్ సంయుక్త మిషన్‌లో పాల్గొన్న లియోనోవ్ అక్కడ కూడా బొమ్మలు వేశారు

అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడిగా చరిత్ర సృష్టించిన సోవియట్ యూనియన్ వ్యోమగామి అలెక్సీ లియోనోవ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు.

ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. మాస్కోలోని బర్డెన్కో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

లియోనోవ్ 1965లో ఒక అంతరిక్ష నౌకకు 16 అడుగుల వైరుతో అనుసంధానమై.. 12 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించాడు.

''అదసలేమీ అర్థంకాదు. ఎంత అద్భుతంగా ఉంటుందో.. మన చుట్టూ ఉన్నదంతా ఎంత భారీగా ఎంత గొప్పగా ఉంటుందో.. అక్కడికెళితేగానీ అనుభవంలోకి రాదు'' అని ఆయన 2014లో బీబీసీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కానీ.. ఆ తొలి అంతరిక్ష నడక ఓ ప్రమాదంతో ముగిసింది. ఆయన ధరించిన స్పేస్‌సూట్ ఉబ్బిపోవటంతో.. తిరిగి అంతరిక్ష నౌకలోకి రావటానికి లియోనోవ్ చాలా కష్టపడాల్సి వచ్చింది.

అంతరిక్షంలో ఆధిపత్యం కోసం అమెరికా - సోవియట్ రష్యాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న కాలంలో.. లియోనోవ్ విశ్వంలో నడవటం ఓ గొప్ప విజయంగా కీర్తిగడించింది.

కానీ.. ఆయన ఆకాంక్షలు ఆ అంతరిక్ష నడక దగ్గరే ఆగిపోలేదు. అమెరికా - సోవియట్ యూనియన్‌లు 1975లో సంయుక్తంగా ప్రారంభించిన మొట్టమొదటి మిషన్ సోయజ్-అపోలోకి ఆయన కమాండర్ అయ్యారు.

లియోనోవ్ మరణం మొత్తం ''భూగోళానికి తీరని లోటు'' అంటూ రష్యా అంతరిక్ష యాత్రికుడు ఒలెగ్ కొనోనెన్కో విచారం వ్యక్తంచేశారు. ఆయన అద్భుతమైన సాహసికుడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాళులర్పించారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక లియోనోవ్ (ఎడమ) అమెరికా - సోవియట్‌లు 1975లో సంయుక్తంగా చేపట్టిన మొట్టమొదటి మిషన్ సోయజ్-అపోలోకి కమాండర్‌గా వ్యవహరించారు

''నియంత్రణ లేకుండా తేలుతూ...''

లియోనోవ్ సైబీరియాలో జన్మించారు. ఆయన తండ్రి స్టాలిన్ పాలనలో అణచివేత బాధితుడు. ఆయన కుటుంబం 1948లో పశ్చిమ రష్యాలోని కాలినన్‌గ్రాడ్‌కు వలస వెళ్లింది.

వైమానిక దళ పైలట్‌గా చేరిన లియోనోవ్‌ 1960లో వ్యోమగామి శిక్షణకు ఎంపికయ్యారు. అంతరిక్షంలో విహరించిన మొదటి మానవుడు యూరీ గగారిన్‌తో కలిసి ఆయన శిక్షణ పొందారు. వారిద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు.

అంతరిక్షంలో తన నడక గురించి లియోనోవ్ అనేక ఇంటర్వ్యూల్లో వివరించారు.

''అక్కడంతా చాలా నిశబ్దంగా ఉంది. నా గుండె చప్పుడు కూడా నాకు వినిపించేంత నిశబ్దంగా ఉండేది. నా చుట్టూ నక్షత్రాలున్నాయి. నేను ఎటువంటి నియంత్రణ లేకుండా తేలుతున్నాను. ఆ క్షణాన్ని ఎన్నడూ మరచిపోను. ఎంతో బాధ్యత ఉందన్న భావన కూడా నాకు కలిగింది. కానీ.. నా జీవితంలో అత్యంత కష్టమైన క్షణాలు రాబోతున్నాయని అప్పుడు నాకు తెలియదు. ఆ క్షణాలు.. నేను క్యాప్సూల్‌లోకి తిరిగి వెళ్లటం'' అని ఆయన అబ్జర్వర్ పత్రికతో చెప్పారు.

ఆయన ధరించిన స్పేస్‌సూట్ అంతరిక్షంలోని శూన్యంలో ఉబ్బిపోవటం మొదలైంది. దానిలో వస్త్రం ప్రమాదకరంగా గట్టిపడటం మొదలైంది.

ఆయన చేతులు గ్లవ్స్ నుంచి జారిపోయాయి. కాళ్లు బూట్ల నుంచి బయటకువచ్చాయి. అంతరిక్షనౌక ఎయిర్‌లాక్ ద్వారా లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ఇంకా దుస్థితి ఏమిటంటే.. ఆ అంతరిక్ష నౌక భూమి నీడలోకి వెళ్లిపోతోంది. మరో ఐదు నిమిషాల్లో చిమ్మచీకట్లో కూరుకుపోతానని లియోనోవ్‌కు అర్థమైంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లియోనోవ్ 1965లో ఒకసారి, 1975లో రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లారు

దీంతో ఎలాగోలా కష్టపడి తన స్పేస్‌సూట్ నుంచి కొంత ఆక్సిజన్‌ను విడుదల చేయగలిగారు. ఎన్నో తిప్పలుపడి అంతరిక్షనౌకలోని కాప్స్యూల్‌లోకి తొలుత తలను పంపించి.. ఇరుక్కుంటూ చేరగలిగారు. ఈ క్రమంలో ఆయన ఆరు కిలోలు కోల్పోయాడు.

లియోనోవ్, ఆయన పైలట్ పావెల్ బెల్యాయేవ్‌లను తిరిగి వచ్చిన తర్వాత హీరోలుగా కీర్తించారు. కానీ.. వారి నౌక ఉరల్ పర్వతాల్లో కూలిపోయింది. తమను రక్షించే వారి కోసం వారు మూడు రోజులు వేచి చూడాల్సి వచ్చింది.

ఓ దశాబ్దం తర్వాత.. సోవియట్ రష్యా - అమెరికాల మధ్య ఉద్రిక్తతలు సడలిన కాలంలో అమెరికా, సోవియట్ రష్యాల అంతరిక్ష నౌకలు అపోలో 18, సోయజ్ 19లను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన ఇద్దరు సోవియట్ వ్యోమగాముల్లో లియోనోవ్ కూడా ఒకరు.

సోవియట్ అత్యున్నత పతకం 'హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్'ను ఆయన రెండు సార్లు అందుకున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అలెక్సీ లియోనోవ్ 1965 నాటి స్పేస్ మిషన్‌ ఉదంతం మీద 2017లో ‘ద స్పేస్‌వాకర్’ పేరుతో రష్యాలో సినిమా రూపొందించారు

భారరహిత స్థితిలో కళ

వ్యోమగామిగా అందరికీ తెలిసిన లియోనోవ్ కళారంగంలోనూ జీవితాంతం ప్రశంసలు పొందుతూనే ఉన్నారు.

ఆయన చిత్రకళను సొంతంగా నేర్చుకున్నారు. భార రహిత స్థితిలోనూ బొమ్మలు వేయటం అలవాటు చేసుకున్నారు. 1965లో అంతరిక్షంలో నడిచేటపుడే ఆయన తొలి అంతరిక్ష కళాఖండాన్ని సృష్టించారు.

ఆ వర్ణచిత్రం చిన్నదే అయినా.. వోష్కోద్-2 అంతరిక్ష నౌక నుంచి చూస్తే అద్భుతంగా కనిపించే సూర్యోదయాన్ని ఆయన చిత్రీకరించారు.

రంగు పెన్సిళ్లతో వేసిన ఆ చిత్రాన్ని.. వ్యోమగాముల మీద లండన్ సైన్స్ మ్యూజియం 2015లో నిర్వహించిన ఓ భారీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

''అది కాస్త పీడకలగా అనిపించవచ్చు... కానీ ఆయన అక్కడ కాలాన్ని నిలిపివేయాలని.. ఆ క్షణాన్ని ఇతరులతో పంచుకోవాలని కోరుకున్నారు'' అంటారు ఆ ఎగ్జిబిషన్ క్యురేటర్ నటాలియా సిద్లినా.

లియోనోవ్ చిత్ర కళలో ప్రధానంగా అంతరక్షింలో ఆయన అనుభవాలే అంశాలుగా ఉంటాయి. 1965లో తన అంతరిక్ష నడక మీద గీసిన స్వీయ చిత్రం, తన సహచర వ్యోమగాముల చిత్రాలు, నాటి సోవియట్ యూనియన్‌ ప్రకృతి చిత్రాలు కూడా ఆయన కళాఖండాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)