అభిజిత్ బెనర్జీ: ముంబయిలో జన్మించిన ఆర్థికవేత్తకు నోబెల్ బహుమతి.. కాంగ్రెస్ ప్రకటించిన ‘కనీస ఆదాయ పథకం’ ఆయన ఆలోచనే

  • 14 అక్టోబర్ 2019
అభిజిత్ బెనర్జీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక అభిజిత్ బెనర్జీ

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఈ ఏడాది భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో, మరొక ఆర్థిక వేత్త మైఖేల్ క్రెమెర్‌లు ఎంపికయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం వారు చేసిన కృషికి గాను ఈ బహుమతి ప్రకటించినట్లు నోబెల్ కమిటీ ట్వీట్ చేసింది.

బహుమతి మొత్తం 90 లక్షల స్వీడిష్ క్రోనాల(సుమారు రూ.6.5 కోట్లు)ను వీరు ముగ్గురికి కలిపి అందజేస్తారు.

ప్రపంచంలో పేదరికాన్ని తగ్గించేందుకు గత ఇరవయ్యేళ్లలో జరిగిన కృషిలో వీరు ముగ్గురు కీలక పాత్ర పోషించారని కమిటీ తెలిపింది.

ముంబయిలో 1961లో జన్మించిన అభిజిత్ వినాయక్ బెనర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం, జేఎన్‌యూ, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేశారు.

ప్రస్తుతం మసాచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనమిక్స్‌లో 'ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్'గా పనిచేస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆర్థిక శాస్త్రంలో 2019 నోబెల్ బహుమతి విజేతలు

హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 1988లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆయన 2003లో అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్టన్ లాబ్(జే-పాల్) నెలకొల్పారు. ఆర్థికవేత్తలయిన ఎస్తేర్ డఫ్లో, సెంథిల్ మురళీధరన్‌లతో కలిసి ఆయన దీన్ని ఏర్పాటు చేశారు.

ఆర్థిక అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక మ్యాగజీన్స్, జర్నల్స్‌లో వ్యాసాలు రాసిన ఆయన పలు పుస్తకాలు కూడా రాశారు. అభిజిత్ బెనర్జీ 2011లో రాసిన ‘పూర్ ఎకనమిక్స్’ పుస్తకం గోల్డ్‌మన్ శాక్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకుంది.

ఇది కాకుండా ‘వొలాటిలిటీ అండ్ గ్రోత్’, ‘అండర్ స్టాండింగ్ పావర్టీ’ వంటి పుస్తకాలూ రాశారు.

‘2015 తరువాత అభివృద్ధి అజెండా’కు సంబంధించి ఐరాస సెక్రటరీ జనరల్ హైలెవల్ ప్యానల్‌లోనూ సేవలందించారు.

అభిజిత్ బెనర్జీ చేసిన ఓ అధ్యయనం భారత్‌లోని దివ్యాంగ చిన్నారుల స్కూల్ విద్య వ్యవస్థ మెరుగైందని తేల్చింది. సుమారు 50 లక్షల మంది దివ్యాంగ విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని ఆ అధ్యయనం చెప్పింది.

Image copyright PATRICK KOVARIK/gettyimages

అత్యంత పిన్న వయస్కురాలు

అభిజిత్‌ కలిసి ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకుంటున్న ఎస్తేర్ డఫ్తో ఈ పురస్కారం గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు.

ఫ్రాన్స్‌కు చెందిన ఆమె ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న రెండో మహిళగానూ ఘనత సాధించారు.

ఫ్రాన్స్‌కు చెందిన ఆమె ప్రస్తుతం మసాచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్నారు.

Image copyright Nobelprize.org

మరో విజేత క్రెమెర్ 1964లో జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

మేం చెప్పిన ‘కనీస ఆదాయ పథకం’ ఆయన సలహాయే: కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. 2019 ఎన్నికలకు ముందు తాము ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పథకం(న్యూతమ్ ఆయ్ యోజన-ఎన్‌వైఏవై) వెనుక అభిజిత్ బెనర్జీ ఆలోచనలు ఉన్నాయని.. ఈ పథకం విషయంలో ఆయన తమ ముఖ్య కన్సల్టెంట్ అని ఆ ట్వీట్‌లో తెలిపింది.

దిల్లీ స్కూళ్లను ఆదర్శవంతంగా మార్చిందీ ఆయనే..

కాగా భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపికవడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. కలకత్తాలోని సౌత్ పాయింట్ స్కూల్, ప్రెసిడెన్సీ కాలేజీల్లో ఆయన చదువుకున్నారని మమత గుర్తు చేశారు.

దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు ఆయన అభివృద్ధి చేసిన నమూనాల ఫలితమేనని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

కేజ్రీవాల్ ట్వీట్‌కు స్పందించిన అభిజిత్ ‘జై హింద్’ అని ట్వీట్ చేశారు. మమత ట్వీట్‌కు ‘థాంక్యూ దీదీ’ అంటూ స్పందించారు.

జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోభాల్ వంటివారు అభిజిత్‌ను అభినందిస్తూ ఆయన దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పూర్వవిద్యార్థి అంటూ గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం