'పప్పు' చేసిన అద్భుతం... అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో జంటకు నోబెల్

  • 16 అక్టోబర్ 2019
'పప్పు' అద్భుతం చేసింది Image copyright BRYCE VICKMARK/MIT/AFP/GETTY IMAGES

అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్‌కు పేదరిక నిర్మూలన దిశగా కృషి చేసినందుకు ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ప్రకటించారు. ఇంతకు ముందు అమర్త్య సేన్‌కు కూడా పేదరిక నిర్మూలన దిశగా పనిచేసినందుకు నోబెల్‌ అందుకున్నారు.

"నోబెల్ కమిటీ ఈసారి అత్యంత సమర్థులను ఎంపిక చేసింది" అని అమర్త్య సేన్ కూడా అన్నారు.

ఇంతకీ, ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ బహుమతికి ఎంపికైన ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు చేసిన అద్భుతం ఏంటో మీకు తెలుసా?

"ప్రజలు పేదరికం గురించి చాలా మాట్లాడుకుంటారు. ఎప్పుడూ పెద్ద, పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతారు. ఉదాహరణకు, పేదరికానికి ప్రధాన కారణం ఏంటి? విదేశీ నిధులతో పేదరికాన్ని తొలగించలేరా? ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పాత్ర ఎలా ఉండాలి? అంటారు. ఇలాంటి పెద్ద చర్చల్లో పేదరికం చిక్కుకుపోతుంది. ఇక్కడ మనం ఆ పేదరికాన్ని పరిష్కరించే అంశాలను ముక్కలుగా విడగొట్టాలి" అని అభిజిత్ బెనర్జీ చెప్పారు.

అంటే దానర్థం... విద్య, ఆహారం, టీకాలు వేయడం లాంటి పనులపై దృష్టి పెట్టాలి. పేదలకు కాస్త సాయం అందిస్తే ఇలాంటి కార్యక్రమాల సక్సెస్ రేట్ పెరుగుతుంది. పేదరిక నిర్మూలన కోసం పెద్ద పెద్ద చర్చలు జరపడం కాదు, ఆ దిశగా వేల, లక్షల చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది.

నోబెల్ కమిటీ వెబ్‌సైట్‌లో ఒక గ్రాఫిక్ ప్రచురించారు. అందులో ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు 'పప్పు' లాంటి ఒక మామూలు వస్తువును ప్రోత్సాహకంగా ఉపయోగించి, టీకాలు వేసే ఒక ప్రాజెక్టును ఎలా విజయవంతం చేయగలిగారో చూపించారు.

Image copyright टJOHAN JARNESTAD/ROYAL SWEDISH ACADEMY
చిత్రం శీర్షిక ఆర్థికవేత్తల ప్రయోగం ఫలితం

ఇది 'పప్పు' చేసిన అద్భుతం

"పూర్తిగా టీకాలు వేయించిన పిల్లల సంఖ్య రాజస్థాన్‌లో చాలా తక్కువగా ఉంది. మేం దానిపై రీసెర్చ్ చేసినపుడు అక్కడ పూర్తిగా ఇమ్యూనైజ్డ్ పిల్లల సంఖ్య 5 శాతానికి దగ్గరగా ఉన్నట్టు తేలింది. ఇమ్యునైజేషన్ సిబ్బంది ప్రజల వరకూ చేరుకోలేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిసింది" అని ఎస్తేర్ డఫ్లో చెప్పారు.

దాంతో ప్రజలే చాలాదూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకూ నడిచివెళ్లేవారు. టీకాలు వేయించడానికి వారికి రోజంతా గడిచిపోయేది. అంటే దానర్థం, వారు ఒక రోజు కూలి నష్టపోయారు. వాళ్లు చాలాసార్లు టీకాలు వేయించుకోకుండానే తిరిగి వెళ్లిపోయేవారు. కారణం, ఒక్కోసారి టీకాలు అయిపోతే, మరోసారి సిబ్బంది వెళ్లిపోయేవారు. లేదంటే అక్కడ పెద్ద పెద్ద క్యూలు కనిపించేవి. దాంతో పిల్లలకు టీకాలు వేయించాలనే విషయాన్ని వారు పక్కన పెట్టేశారు.

అలాంటి పరిస్థితుల్లో, ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు ఒక ప్రయోగం చేయాలని భావించారు. దానికి సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థ సాయం తీసుకున్నారు. టీకాలు వేయించే స్థాయిని పెంచాలనుకున్నారు. దానికోసం వాళ్లు లాటరీ ద్వారా 120 గ్రామాలను ఎంపిక చేశారు. ఆ గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించారు.

Image copyright Getty Images

టీకా వేయించుకుంటే కిలో పప్పు

మొదటి కేటగిరీలో ఉన్న గ్రామాల్లో ఉన్న పేదలకు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టీకాలు వేయించుకోమని చెప్పారు.

రెండో కేటగిరీ గ్రామాల్లో టీకాలు వేసే మొబైల్ క్లినిక్స్ ప్రజల ఇళ్ల దగ్గరికే వెళ్లేలా ప్లాన్ చేశారు.

మూడో కేటగిరీ గ్రామాల్లో టీకాలు వేసే మొబైల్ క్లినిక్‌లు ప్రజల దగ్గరికే వచ్చాయి. దానితోపాటు టీకా వేయించుకున్న వారికి ప్రోత్సాహకంగా ఒక కిలో పప్పు కూడా ఇచ్చేవారు.

ఈ ప్రయోగం ఫలితాన్ని మీరు గ్రాఫిక్‌లో స్పష్టంగా చూడచ్చు. ఏయే గ్రామాల్లో పప్పును టీకాలకు ప్రోత్సాహకంగా ఇచ్చారో, అక్కడ పూర్తిగా ఇమ్యునైజ్ అయిన పిల్లల సంఖ్య 39 శాతానికి చేరుకుంది. పప్పు ఇవ్వని గ్రామాల్లో అది సగానికంటే తక్కువగా కనిపించింది.

ఇలా పేదలకు చిన్న చిన్న ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం పేదరిక నిర్మూలనకు అద్భుతంగా పనిచేస్తాయని ఆర్థిక వేత్తలు చెప్పారు. టీకాలు వేయించడం వల్ల వేలమంది పిల్లలు ఆరోగ్య సేవలకు భారంగా మారరని, వారు ఆరోగ్యంగా ఉండడం వల్ల ప్రభుత్వానికి భారీ ఆదా కూడా అవుతుందని వీరు పక్కాగా నిరూపించారు.

ఇది ప్రజల అవసరాలు, సమస్యలను అర్థం చేసుకుని ఆర్థికవేత్తలు చేసిన అద్భుతం. 'పప్పు' లాంటి ఒక మామూలు వస్తువుతో వీరు పేదరిక నిర్మూలన దిశగా చాలా పెద్ద వ్యత్యాసం తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)