గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు

  • 16 అక్టోబర్ 2019
పిక్సెల్-4 Image copyright Google
చిత్రం శీర్షిక తొలిసారిగా రెండు కెమేరాలతో వస్తున్న గూగుల్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్-4

భారతదేశంలో తమ తాజా ఫోన్ పిక్సెల్-4ను విడుదల చేయకూడదని గూగుల్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భారత టెక్ ప్రియులు నిరుత్సాహానికి లోనయ్యారు.

పిక్సెల్-4లోని మోషన్ సెన్స్ ఫీచర్ రాడార్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకుంటుందని, భారతదేశంలో అందుకు అనుమతి లేదని టెక్నాలజీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేషనల్ సాఫ్ట్‌వేర్ (ఓఎస్) ఆధిపత్యం చలాయిస్తోంది.

పిక్సెల్-4లోని మోషన్ సెన్సింగ్ సోలీ రాడార్ చిప్ ప్రత్యేకత ఏమిటంటే, అది మనం చేసే సైగలను గుర్తించగలుగుతుంది. అంటే, ఫోన్‌ను టచ్ చేయకుండానే చేతులు అటూ ఇటూ కదిలిస్తూ పాటలు మార్చుకోవడం, స్క్రీన్ స్వయిప్ చేయడం వంటివి చేయొచ్చన్నమాట.

Image copyright Google
చిత్రం శీర్షిక కెమేరా టెక్నాలజీలో పిక్సెల్-4 పెద్ద ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు

అంతేకాకుండా, ఈ చిప్ సహాయంతో అది 180 డిగ్రీల కోణంలో కూడా కదలికలను గుర్తిస్తుంది. మనం దూరంగా వెళ్ళగానే స్క్రీన్ ఆఫ్ అయిపోవడం, మళ్ళీ దగ్గరకు రాగానే ఆన్ కావడం వంటి ప్రత్యేకతలు ఈ చిప్ వల్ల సాధ్యమయ్యాయి. దీనివల్ల ఫోన్‌ను పదే పదే చార్జ్ చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

"ఇవన్నీ చాలా ఆసక్తికరమైన ఫీచర్లే. కానీ, రాడార్-తరహా సాధనాలను ఉపయోగించడాన్ని నిషేధించిన భారతదేశంలో ఈ ఫోన్ పని చేయకపోవచ్చు. పిక్సెల్-4లో ఉపయోగించే రాడార్ చిప్ చాలా చిన్నది. అయినప్పటికీ దానికి అనుమతి లేదు. లేదనే అనుకుంటున్నా" టెక్ జర్నలిస్ట్ మాలా భార్గవ బీబీసీతో అన్నారు.

దాంతో, టెక్నాలజీ ప్రియులు సహజంగానే నిరుత్సాహానికి గురయ్యారు.

"ప్రాజెక్ట్ సోలీకి ఉన్న పరిమితులను దృష్టిలో పెట్టుకుని గూగుల్ అందుకు ప్రత్యామ్నాయం ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత్ వంటి దేశాల్లో సోలీ లేకుండానో లేక దాన్ని డిజేబుల్ చేస్తూనో ఈ కొత్త ఫోను విడుదల చేసే ఆలోచన చేసి ఉండాల్సింది" అని టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది.

మరో మొబైల్ ఫోన్ టెక్ వెబ్ సైట్ కూడా, "సోలీ వంటి ఫీచర్లు అన్ని దేశాల్లో పని చేయవని గుర్తించకపోవడం గూగుల్ వైఫల్యమే. హార్డ్ వేర్ విషయంలో అది ఎంత బలహీనమో దీనివల్ల మరోసారి నిరూపితమైంది" అని విశ్లేషించింది.

Image copyright Google
చిత్రం శీర్షిక మానవ నేత్రానికి చీకట్లో కనిపించని దృశ్యాన్ని 12 రెట్ల దూరం నుంచి స్పష్టంగా తీయగలగడం పిక్సెల్-4 ప్రత్యేకత

"గూగుల్ పిక్సెల్ ఫోన్లలోని ప్రత్యేక సాంకేతిక ఆకర్షణల మూలంగా వాటి కోసం టెక్ ప్రియులు ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తుంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని చాలా మంది ఇష్టపడతారు. రెండో కారణం, అత్యాధునిక టెక్నాలజీ. మూడో ముఖ్యమైన విషయం... ఫోటో టేకింగ్‌ను సమూలంగా మార్చేయగల కెమేరా" అని భార్గవ అన్నారు.

గూగుల్ పిక్సెల్ -4 కెమేరాతో ఆస్ట్రోఫోటోగ్రఫీ ఇమేజెస్ తీసుకోవచ్చు. మామూలుగా ఇలాంటి ఫోటోలు కావాలంటే ప్రొఫెషనల్ కెమేరాలు ఉపయోగించాల్సి ఉంటుంది. పిక్సెల్-4తో అది ఫోన్‌తోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు