’భారతదేశంలో బాలుడిని దత్తత తీసుకుని.. బీమా సొమ్ము కోసం చంపించారు’: బ్రిటన్ దంపతుల అప్పగింత కోసం భారత పోలీసుల ప్రయత్నం

  • 16 అక్టోబర్ 2019
ఆర్తి ధీర్
చిత్రం శీర్షిక ఆర్తి ధీర్ (ఫొటోలో ఉన్న మహిళ), ఆమె సహచరుడు కావల్ రాయ్‌జాదాలు.. తాము దత్తత తీసుకున్న 11 ఏళ్ల గోపాల్ సెజానీని చంపించామన్న ఆరోపణలను తిరస్కరిస్తున్నారు

లండన్‌లో నివసిస్తున్న ఒక దంపతుల జంట.. తాము దత్తత తీసుకున్న కొడుకుని బీమా డబ్బుల కోసం హత్య చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటోంది. వారిని అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.

ఆర్తి ధీర్ (55), ఆమె సహచరుడు కావల్ రాయ్‌జాదా (30)లు పశ్చిమ లండన్‌లో నివసిస్తున్నారు. వారు తమ దత్తపుత్రుడు, 11 ఏళ్ల వయసున్న గోపాల్ సెజానీని 2017లో బీమా సొమ్ము కోసం చంపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణలను ఈ దంపతులు తిరస్కరిస్తున్నారు.

వీరిని భారతదేశంలో విచారణకు అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞప్తులను బ్రిటన్ ఇప్పటివరకూ మానవ హక్కుల ప్రాతిపదిక మీద తిరస్కరిస్తూ వచ్చింది.

అయితే.. ఈ నిర్ణయం మీద అప్పీలు చేయటానికి భారత ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది.

లండన్‌లోని హాన్వెల్‌లో నివసిస్తున్న ఈ భార్యాభర్తలు.. 2015లో ఒక అనాథను దత్తత తీసుకోవటం కోసం గుజరాత్‌లోని కెషోద్ పట్టణానికి వచ్చారు.

కోర్టు పత్రాల ప్రకారం.. ఈ దంపతులు తాము ఒక చిన్నారిని దత్తత తీసుకుంటామని, తమతో లండన్‌ తీసుకువెళ్లి పెంచుకుంటామని స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటన జారీ చేశారు.

ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన గోపాల్‌ను వారు కలిశారు. అతడు తన అక్క, ఆమె భర్త హర్‌సుఖ్ కర్దానీల దగ్గర నివసిస్తుండేవాడు.

Image copyright GUJURAT POLICE
చిత్రం శీర్షిక జంట హత్యల కేసులో ఆర్తి ధీర్ సహచరుడు కావల్ రాయ్‌జాదా కూడా నిందితుడు

అతడి సంరక్షుకులుగా ఉన్న అక్క, బావలు.. అతడిని దత్తత ఇవ్వటానికి అంగీకరించారు. బ్రిటన్‌లో తమ చిన్నారికి మెరుగైన జీవితం లభిస్తుందని ఆశించారు. దత్తతకు అవసరమైన పత్రాలను సిద్ధం చేయటం మొదలుపెట్టారు.

అయితే.. తమకు పిల్లలు లేని ధీర్, రాయ్‌జాదాల పన్నాగం వేరే ఉందని భారత పోలీసులు అంటున్నారు.

గోపాల్ పేరు మీద ధీర్ ఒక జీవిత బీమా పాలసీ తీసుకున్నారని అధికారులు చెప్తున్నారు. ఆ పాలసీ విలువ 1,50,000 పౌండ్లు (దాదాపు 1.37 కోట్ల రూపాయలు). ఈ బీమా పాలసీ సొమ్మును.. పదేళ్ల తర్వాత కానీ, ఈ లోగా ఆ బాలుడు చనిపోతే కానీ చెల్లిస్తారు.

పత్రాల ప్రకారం.. ఆమె ఒక్కో ప్రీమియం 15,000 పౌండ్లు (సుమారు రూ. 1.37 లక్షలు) చొప్పున రెండు వాయిదాలు చెల్లించారు.

''కొన్ని రోజుల తర్వాత అతడి పేరు మీద ఆమె ఒక బీమా పాలసీ తీసుకుంది'' అని గుజరాత్‌లోని జునాగఢ్ పోలీస్ సూపరింటెండెంట్ సౌరబ్ సింగ్ బీబీసీకి చెప్పారు.

''అది భారీ మొత్తం. ఆమె రెండు ప్రీమియంలు చెల్లించింది. గోపాల్ చనిపోయినట్లయితే.. బీమా చేసిన మొత్తానికి పది రెట్లు తనకు చెల్లిస్తారని ఆమెకు బాగా తెలుసు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

Image copyright HANIF KHOKHAR/BBC
చిత్రం శీర్షిక గోపాల్ సెజానీని మోటార్‌సైకిల్ మీద వచ్చిన దుండగులు హత్య చేశారు

బాలుడిని దత్తత తీసుకుంటామని చెప్పిన ఆ దంపతులు లండన్‌కు తిరిగి వెళ్లారు. కానీ.. గోపాల్‌ను తమ వెంట తీసుకెళ్లలేదు. అతడికి వీసా పత్రాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆ బాలుడు గుజరాత్‌లోనే ఉండిపోయాడు.

2017 ఫిబ్రవరి 8వ తేదీన ఇద్దరు పురుషులు అతడిని మోటార్‌సైకిల్ మీద అపహరించుకువెళ్లారు. అతడిని కత్తులతో పొడిచి గుజరాత్‌లోని ఒక రోడ్డు పక్కన పడేశారు.

ఆ బాలుడిని రక్షించటానికి ప్రయత్నించిన అతడి బావ కార్దానీ మీద కూడా దాడిచేశారు. బాలుడు, అతడి బావ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

అంతకుముందు కూడా ఆ బాలుడిని చంపటానికి రెండుసార్లు విఫల యత్నాలు జరిగాయని భారత అధికారులు చెప్తున్నారు.

అయితే.. ఈ బాలుడి పేరు మీద తీసుకున్న బీమా పాలసీ సొమ్మును అతడిని దత్తత తీసుకున్న లండన్ దంపతులకు ఇంతరవకూ చెల్లించలేదు.

Image copyright HANIF KHOKHAR/BBC
చిత్రం శీర్షిక గోపాల్ బావ హర్‌సుఖ్ కర్దానీ కూడా హత్యకు గురయ్యారు

కోర్టు విచారణ

కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు. బాలుడిని దత్తత తీసుకున్న బ్రిటన్‌ దంపతులకు అతడు స్నేహితుడని.. అతడు లండన్‌లో విద్యార్థిగా ఉన్నపుడు వారితో కలిసి ఉన్నాడని పోలీసులు చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి అతడితో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

ధీర్, రాయ్‌జాదాల మీద భారతదేశంలో అపహరణ, హత్యలకు కుట్ర సహా ఆరు అభియోగాలు నమోదయ్యాయి. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వారిని 2017 జూన్‌లో బ్రిటన్‌లో అరెస్ట్ చేశారు.

అయితే.. వారిని భారతదేశానికి అప్పగించటానికి వెస్ట్‌ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఒకరు మానవ హక్కుల ప్రాతిపదిక మీద తిరస్కరించారు.

అయితే.. సీనియర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎమ్మా ఆర్బత్నాట్.. ధీర్, రాయ్‌జాదాలు ఉమ్మడిగా ఇతరులతో కలిసి ఈ నేరాలు చేశారనేందుకు ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని, వారిని భారతదేశానికి అప్పగించటాన్ని సమర్థించేందుకు తగినన్ని సాక్ష్యాలు ఉన్నాయని తన తీర్పులో పేర్కొన్నారు.

కానీ.. గుజరాత్‌లో జంట హత్యలకు శిక్ష పెరోల్ లేకుండా జీవిత ఖైదు అయినందున.. నిందితులైన ఈ దంపతులను భారతదేశానికి అప్పగించటం వారి మానవ హక్కులకు విరుద్ధమని ఆమె స్పష్టంచేశారు.

Image copyright HANIF KHOKHAR/BBC
చిత్రం శీర్షిక నిందితులను భారతదేశంలో విచారణకు రప్పించాలని పోలీస్ సూపరింటెండెంట్ సౌరబ్ సింగ్ కోరుతున్నారు

వారిని భారతదేశానికి అప్పగించినట్లయితే.. ఈ దంపతులకు ''తగ్గించటానికి వీలులేని శిక్ష'' విధించే అవకాశముందని.. దానిని సమీక్షించే పరిస్థితి లేకపోవటం ''అమానవీయం'' అవుతుందని జడ్జి అభిప్రాయపడ్డారు.

ఈ తీర్పు మీద అప్పీలు చేసుకోవటానికి భారత అధికారులకు అవకాశం ఇచ్చారు. ఈ అప్పీలు మీద వచ్చే ఏడాది విచారించే అవకాశముంది.

ఈ కేసులో అత్యంత సానుభూతి పరిస్థితుల్లో సైతం విడుదలకు ఏమాత్రం అవకాశం లేనందున కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌ నేరస్థుల అప్పగింత బృందం మాజీ అధిపతి నిక్ వామోస్ పేర్కొన్నారు.

ఈ కేసులో భారతదేశానికి వెళ్లి విచారణ ఎదుర్కోవటానికి ఎందుకు నిరాకరిస్తున్నారని లండన్‌లోని ఈ దంపతుల నివాసం వెలుపల ధీర్‌ను ప్రశ్నించటానికి బీబీసీ ప్రయత్నించింది. ఆమె స్పందించటానికి నిరాకరించారు.

తమపై ఆరోపణలను ధీర్, రాయ్‌జాదా తిరస్కరించారు. కోర్టు పత్రాల ప్రకారం.. తాము నేరం చేశామనటానికి ప్రాథమిక ఆధారం లేదని వారు పేర్కొన్నారు.

అప్పీలు పెండింగ్‌లో ఉండటంతో ఈ దంపతులు బెయిల్ మీద విడుదలై ఉన్నారు.

''మేం మా శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాం. ఇది భారతదేశంలో జరిగిన తీవ్రమైన నేరం'' అని పోలీస్ సూపరింటెండెంట్ సింగ్ చెప్పారు.

''భారతదేశపు కోర్టులో భారతీయ చట్టాల ప్రకారం విచారణను ఎదుర్కోవటానికి నిందితులను ఇక్కడికి రప్పించాలని మేం కోరుతున్నాం. ఇందుకోసం బ్రిటన్ కోర్టుకు సహకరించటానికి మేం మా శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాం'' అని ఆయన పేర్కొన్నారు.

ఒకవేళ భారతదేశం అప్పీలు వీగిపోయినట్లయితే.. హత్యకు ఒప్పందం బ్రిటన్‌లో జరిగిందనేందుకు సాక్ష్యం ఉన్నట్లయితే.. ఈ దంపతులను బ్రిటన్ కోర్టులో విచారించే అవకాశం ఉందని చీఫ్ మెజిస్ట్రేట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్‌, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...

కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య

ట్రంప్‌కు 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...

ఛత్తీస్‌గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం