బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కాల్పుల్లో భారత జవాన్ మృతి

  • 17 అక్టోబర్ 2019
Image copyright Getty Images
చిత్రం శీర్షిక బంగ్లాదేశ్‌తో నదీ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ బలగాలు

బంగ్లాదేశ్ సరిహద్దు రక్షక దళాల (బీజీబీ) కాల్పుల్లో భారత జవాన్ మరణించినట్లు సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) ధ్రువీకరించింది.

బీఎస్ఎఫ్ కథనం ప్రకారం.. గురువారం (17.10.2019) ఉదయం ముగ్గురు మత్స్యకారులు భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పద్మ నదిలో చేపల వేటకు వెళ్లారు. వారిలో ఇద్దరు తిరిగొచ్చి కాక్మరిచార్ వద్ద బీఎస్‌ఎఫ్ పోస్టులో ఉన్న అధికారులను కలిసి.. చేపల వేటకు వెళ్లిన తమ ముగ్గురిని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ పట్టుకున్నారని, ఒకరిని వారి అదుపులోనే ఉంచుకుని తమ ఇద్దరినీ విడిచిపెట్టారని చెప్పారు.

దీంతో ఉదయం 10.30 గంటల సమయంలో కాక్మరిచార్ అవుట్ పోస్ట్ కమాండర్ మరో అయిదుగురు జవాన్లతో కలిసి బీఎస్‌ఎఫ్ బోటులో వెళ్లి పద్మ నదిలోని జల సరిహద్దు వద్ద గస్తీలో ఉన్న బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్‌ను సంప్రదించారు.

ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించినా భారత మత్స్యకారుడిని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ విడిచిపెట్టలేదు, సరికదా, బీఎస్ఎఫ్ అధికారి, జవాన్లను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు.

దీంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నట్లు గ్రహించిన బీఎస్ఎఫ్ బృందం వెంటనే వెనక్కు వచ్చేయడానికి ప్రయత్నించింది. ఈలోగా బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కాల్పులు జరపడంతో బీఎస్ఎఫ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ విజయ్‌భాన్ సింగ్, మరో కానిస్టేబుల్‌ గాయపడ్డారు.

Image copyright TWITTER/@BSF_India
చిత్రం శీర్షిక మృతిచెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ విజయ్‌భాన్ సింగ్

విజయ్‌భాన్ సింగ్‌కు తలకు బుల్లెట్ గాయం కాగా, కానిస్టేబుల్‌ కుడి చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

వెంటనే వారిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా తలకు బుల్లెట్ గాయమైన విజయ్‌భాన్ సింగ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.

గాయపడిన కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి మెరుగైన వైద్యం కోసం తరలించారు.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ అధికారులకు సమాచారం అందించినట్లు బీఎస్‌ఎఫ్ వెల్లడించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బంగ్లాదేశ్‌తో నదీ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ బలగాలు

కాగా బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఫిరదౌస్ మహమ్మద్ 'బీబీసీ బంగ్లా'తో మాట్లాడుతూ బీఎస్ఎఫ్ దళాలు సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌లోకి వచ్చాయని, వారే తొలుత కాల్పులు జరపగా తాము తిరిగి కాల్పులు జరిపామని తెలిపారు.

బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు చనిపోయినట్లు తమకు సమాచారం ఇచ్చారని, కానీ.. తమకున్న సమాచారం మేరకు అలాంటిదేమీ లేదని, దర్యాప్తు చేస్తున్నామని ఫిరదౌస్ మహమ్మద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు