పాకిస్తాన్‌కు ఎఫ్ఏ‌టీఎఫ్ 4 నెలల డెడ్‌లైన్... తీరు మార్చుకోకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకతప్పదని హెచ్చరిక

  • 18 అక్టోబర్ 2019
ఇమ్రాన్ Image copyright Getty Images

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏ‌టీఎఫ్) బ్లాక్‌లిస్ట్ నుంచి పాకిస్తాన్ తాత్కాలికంగా తప్పించుకుంది. 2020 ఫిబ్రవరి నాటికి పాకిస్తాన్ తన ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ పూర్తి చేయాలని, అంతవరకు ఆ దేశం గ్రే లిస్ట్‌లో ఉంటుందని ఎఫ్ఏటీఎఫ్ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో పాకిస్తాన్ పనితీరు సంతృప్తిగా లేనందున గ్రే లిస్ట్‌ నుంచి బయటపడలేదని, తన నియమిత కార్యాచరణ పూర్తిచేయకుంటే 2020 ఫిబ్రవరిలో బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం ఖాయమని ఎఫ్ఏటీఎఫ్ ప్రతినిధులు చెప్పినట్లుగా ఏఎన్ఐ వెల్లడించింది.

తదుపరి ప్లీనరీ నాటికి పాకిస్తాన్ తన వైపు నుంచి అన్ని చర్యలు తీసుకోకుంటే చర్యలు తప్పవని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది.

ఎఫ్ఏటీఎఫ్ తన సభ్య దేశాలను అక్కడి ఆర్థిక సంస్థలు పాకిస్తాన్‌తో ఒప్పందాలు చేసుకోకుండా, లావాదేవీలు నెరపకుండా నియంత్రించాలని కోరొచ్చు.

'ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో ఉన్న 27 అంశాల్లో అయిదింటిపై మాత్రమే పాకిస్తాన్ దృష్టి పెట్టింది, మిగతా కార్యాచరణ అపరిష్కృతంగా ఉంది'' అని ఎఫ్ఏటీఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఎఫ్ఏటీఎఫ్ విడుదల చేసిన ప్రకటనలో వాడిన భాష గతంలో ఆ సంస్థ ఇరాన్ విషయంలో వాడిన భాషను పోలి ఉందని ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది. ఇరాన్ ఇప్పటికే ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్టులో ఉంది.

Image copyright Getty Images

మారకపోతే ఇరాన్, ఉత్తరకొరియా సరసన పాకిస్తాన్

పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ 2018 జూన్‌లో గ్రే లిస్టులో పెట్టింది. 27 అంశాలతో కూడిన ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణను పూర్తి చేయాలంటూ 15 నెలల గడువు ఇచ్చింది. గడువులోగా కార్యాచరణ పూర్తి చేయకుంటే ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలతో కలిసి బ్లాక్‌లిస్టులో ఉండాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఆ గడువు సెప్టెంబరుతో పూర్తి కావడంతో ఇప్పుడు సమీక్షించారు. 27 అంశాల్లో అయిదు మాత్రమే పూర్తి కావడంతో మరో నాలుగు నెలల గడువు ఇచ్చారు. అప్పటికీ పాకిస్తాన్ కార్యాచరణ పూర్తిచేయకపోతే బ్లాక్ లిస్టులో చేరడం ఖాయమని ఎఫ్ఏటీఎఫ్ చెబుతోంది.

అంతర్జాతీయ భద్రత కోసం నేర, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా నిరోధించే లక్ష్యంతో ఎఫ్ఏటీఎఫ్ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 206 దేశాల ప్రతినిధులతో ప్లీనరీ నిర్వహిస్తోంది. అక్టోబరు 13 నుంచి 18 వరకు ఈ సమావేశాలుంటాయి.

ప్రస్తుతం గ్రే లిస్టులో ఉన్న పాకిస్తాన్ తరఫున ఆ దేశ ఆర్థిక మంత్రి హమాద్ అజార్ నేతృత్వంలోని బృందం ఈ సమావేశాలలో పాల్గొంది.

ప్రస్తుత ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశాలకు పాకిస్తాన్ చిరకాల మిత్రదేశం చైనాయే అధ్యక్షత వహిస్తోంది.

ఎఫ్ఏటీఎఫ్ - ఏమిటీ సంస్థ?

ఎఫ్ఏటీఎఫ్ ఒక అంతర్జాతీయ సంస్థ, దీనిని జీ7 దేశాల చొరవతో 1989లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మనీ ల్యాండరింగ్‌ను ఎదుర్కోడానికి ఇది విధానాలు రూపొందిస్తుంది.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉండేలా ఇది విధానాలు రూపొందిస్తుంది. వాటిని అమలు చేసే దిశగా పనిచేస్తుంది. 2001లో ఇది తీవ్రవాదం, వారికి నిధులు అందించడాన్ని కూడా తన విధానాల్లో చేర్చింది.

భారత్, అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా సహా ఎఫ్ఏటీఎఫ్‌లో మొత్తం 38 సభ్య దేశాలు ఉన్నాయి.

పాకిస్తాన్‌తో పాటు ఈ సంస్థ గ్రే లిస్టులో సెర్బియా, శ్రీలంక, సిరియా, ట్రినిడాడ్, ట్యునీషియా, యెమెన్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)