ఐఎంఎఫ్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే ఏమిటి? ఇది ఎందుకంత ముఖ్యం? దీని మీద విమర్శలేమిటి?

ఐఎంఎఫ్

ఫొటో సోర్స్, Image copyrightGETTY IMAGES/AFP

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తీసుకునే అన్ని రకాల నిర్ణయాలు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మీద ప్రభావం చూపుతాయి.

కానీ.. అసలు ఈ ఐఎంఎఫ్ ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యమైనది? దీని మీద విమర్శలు ఏమిటి?

ఏమిటీ ఐఎంఎఫ్?

ఐఎంఎఫ్ ఒక అంతర్జాతీయ సంస్థ. అందులో 189 దేశాలకు సభ్యత్వం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా ఉంచటానికి ఈ దేశాలన్నీ కలిసి పనిచేస్తాయి.

ఇందులో చేరటానికి ఏ దేశమైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం.. తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారం అందించటం, కోటా సబ్‌స్క్రిప్షన్ కింద కొంత నగదు చెల్లించటం వంటి కొన్ని నియమాలను పాటించాలి. ఆ దేశం ఎంత ధనిక దేశమైతే అది చెల్లించాల్సిన సబ్‌స్క్రిప్షన్ కోటా అంత ఎక్కువగా ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించటానికి, దానికి మద్దతు ఇవ్వటానికి ఐఎంఎఫ్ మూడు ముఖ్యమైన పనులు చేస్తుంది:

ఆర్థిక, ద్రవ్య సంఘటనలను నిరంతరం పరిశీలించటం. వాణిజ్య యుద్ధాలు, బ్రెగ్జిట్ అనిశ్చితి వంటి పరిణామాలు ఇటువంటివే. దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరు ఎలా ఉంది, వాటికి రాగల ప్రమాదాలు ఏమిటి అనేది పర్యవేక్షిస్తుంది.

  • సభ్య దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను ఎలా మెరుగుపరచుకోవాలనే అంశం మీద సలహాలు ఇవ్వటం
  • ఇబ్బందుల్లో ఉన్న దేశాలకు స్వల్ప కాలిక రుణాలు, సహాయం అందించటం

ఈ రుణాలను ప్రధానంగా కోటా సబ్‌స్క్రిప్షన్ నిధుల నుంచి అందిస్తుంది. 2018లో అర్జెంటీనా ఐఎంఎఫ్ చరిత్రలోనే అతి పెద్ద రుణం - 5,700 కోట్ల డాలర్లు - అందుకుంది.

ఐఎంఎఫ్ తన సభ్య దేశాలకు మొత్తంగా 1 లక్ష కోట్ల డాలర్లు రుణం ఇవ్వగలదు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ సమావేశాల్లో ఏం చర్చిస్తారు?

ఐఎంఎఫ్ సమావేశాల్లో బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు, సంస్థల యజమానులు.. అప్పటికి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సమస్యలు, అంశాల మీద చర్చిస్తారు.

అనంతరం సభ్య దేశాలు తమ ప్రణాళికల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు చేపడతాయి.

ఈ ఏడాది ఐఎంఎఫ్ చర్చించే అంశాల్లో.. వాణిజ్య ఉద్రిక్తతలు, బలహీనమైన ఆర్థికాభివృద్ధి, తయారీ రంగంలో మాంద్యం, సంస్థల అప్పులు.. పెద్ద అంశాలుగా ఉంటాయని అంచనా.

సాధించిన ప్రధాన విజయాలేమిటి?

ఐఎంఎఫ్‌ను తరచుగా 'చివరి ప్రయత్నంలో రుణదాత' అని అభివర్ణిస్తుంటారు. సంక్షోభాల సమయాల్లో ఆయా దేశాలు ఆర్థిక సహాయం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయిస్తాయి.

ఈ సంస్థ సాధించిన విజయాలను కొలవటం కష్టమని.. ఎందుకంటే ఇతర ప్రత్యామ్నాయాల కన్నా ఈ సంస్థ విధానాలు మరింత చెడ్డవా కాదా అన్నది మనకు తెలియదని.. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన బెంజమిన్ ఫ్రీడ్‌మాన్ వంటి ఆర్థికవేత్తలు చెప్తారు.

అయితే.. 1980ల ఆరంభంలో అప్పులు చెల్లించలేనని ప్రకటించిన మెక్సికోకు మద్దతు ఇవ్వటంలో ఐఎంఎఫ్ పాత్రను కొంత మంది ప్రశంసించారు.

2002లో కూడా.. బ్రెజిల్ రుణాలు తిరిగి చెల్లించలేక ఖాయిదాపడే పరిస్థితిని తప్పించుకోవటానికి ఐఎంఎఫ్ నుంచి అప్పులు తీసుకుంది. ఆ అప్పులతో ఆర్థికవ్యవస్థను వేగవంతంగా కోలుకునేలా చేయటంతో పాటు.. తన అప్పులు మొత్తాన్నీ గడవు కన్నా రెండేళ్ల ముందే చెల్లించగలిగింది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన విమర్శలు ఏమిటి?

ఐఎంఎఫ్ తను రుణాలు ఇచ్చే దేశాల మీద విధించే షరతులు.. 'కఠినంగా' ఉన్నాయని కొన్నిసార్లు అభివర్ణిస్తుంటారు.

గతంలో.. ప్రభుత్వం అప్పులు తీసుకోవటాన్ని తగ్గించటం, కార్పొరేట్ పన్నులను తగ్గించటం, విదేశీ పెట్టుబడులకు తమ ఆర్థిక వ్యవస్థలను తెరవటం వంటి షరతులు ఉన్నాయి.

2009లో యూరోజోన్ ఆర్థిక సంక్షోభం గ్రీస్‌లో మొదలైంది. చాలా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ కూడా ఆ దేశానిదే.

ఆ పరిస్థితి నుంచి గట్టెక్కటానికి ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకున్న తర్వాత.. గ్రీస్ పలు మార్పులు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం అప్పులు తీసుకోవటాన్ని తగ్గించటానికి ఉద్దేశించిన పొదుపు చర్యలు.. చాలా తీవ్రంగా ఉన్నాయని.. అవి దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని దెబ్బతీశాయని విమర్శకులు చెప్తారు.

గ్రీస్‌లో 2013లో ఏకంగా 27 శాతానికి పెరిగిన నిరుద్యోగిత రేటు.. ఇప్పటికీ చాలా ఎక్కువగా 17 శాతంగా కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

క్రిస్టాలినా జార్జీవా (ఎడమ) ఇటీవల క్రిస్టీన్ లగార్డే నుంచి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు

ఈ సంస్థకు సారథ్యం వహించేది ఎవరు?

ఆర్థికవేత్త క్రిస్టాలినా జార్జీవా ఇటీవలే ఐఎంఎఫ్ అత్యున్నత పదవి అయిన మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఆమె ఇంతకుముందు ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. క్రిస్టాలినాకు ముందు క్రిస్టీన్ లగార్డే ఐఎంఎఫ్ ఎండీగా ఉన్నారు.

ఐఎంఎఫ్‌కు సారథ్యం వహిస్తున్న తొలి బల్గేరియా వాసి క్రిస్టాలినా. యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్య దేశాల్లో అతి పేద దేశాల్లో ఒకటి బల్గేరియా.

ఐఎంఎఫ్‌ను స్థాపించినప్పటి నుంచీ యూరప్‌కు చెందిన వ్యక్తి దీనికి ఇన్‌చార్జ్‌గా పనిచేయటం.. అమెరికా జాతీయుడు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడవటం సంప్రదాయంగా వస్తోంది.

కొత్త పాత్రలో వార్షిక సదస్సుకు హాజరుకాబోతున్న క్రిస్టాలినా.. బ్రెగ్జిట్ ఏ రూపం తీసుకున్నా కూడా అది బ్రిటన్‌కూ, ఈయూకూ బాధాకరంగా మారుతుందని హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images

అసలు దీనిని ఎందుకు స్థాపించారు?

1944లో అమెరికాలో జరిగిన బ్రెటన్ వూడ్స్ సదస్సుతో ఐఎంఎఫ్‌ను నెలకొల్పారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన ఆ సదస్సుకు బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్ సహా 44 దేశాలు హాజరయ్యాయి.

యుద్ధం ముగుస్తుందన్న అంచనాల నేపథ్యంలో అందుకు అవసరమైన ఆర్థిక ఏర్పాట్ల గురించి ఆ భేటీలో చర్చించారు. సుస్థిరమైన మారకం రేట్ల వ్యవస్థను ఎలా నెలకొల్పటం, దెబ్బతిన్న యూరప్ దేశాలను ఎలా పునర్నిర్మించటం తదితర అంశాలు అందులో ఉన్నాయి.

ఈ లక్ష్యాలను సాధించటానికి ఆ తర్వాత రెండు సంస్థలను నెలకొల్పారు: అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్.

కొత్తగా స్థాపితమైన ఐఎంఎఫ్ సభ్యదేశాలు.. 1970ల ఆరంభం వరకూ కొనసాగే నిర్దిష్ట మారకం రేట్ల వ్యవస్థకు ఆమోదం తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)