నాసా: అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా వ్యోమగాముల స్పేస్ వాక్

  • 19 అక్టోబర్ 2019
నాసా మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మెయిర్ Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక నాసా మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మెయిర్

నాసా మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మెయిర్ లు ఒకేసారి స్పేస్‌వాక్‌ను పూర్తి చేసి కొత్త చరిత్రను సృష్టించారు. అంతరిక్ష చరిత్రకు సంబంధించి ఇద్దరు మహిళలు ఒకేసారి స్పేస్ వాక్ చేయడం ఇదే తొలిసారి.

ఈ ఇద్దరు విద్యుత్ నియంత్రణ యూనిట్‌కు మరమ్మత్తు చేయడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బయట ఏడు గంటలపాటు గడిపారు.

క్రిస్టీనా కోచ్ ఇప్పటికే నాలుగు సార్లు స్పేస్ వాక్ చేయగా, జెస్సికా మెయిర్‌కు ఇదే తొలిసారి. అంతరిక్షంలో నడిచిన 15 వ మహిళగా జెస్సికా నిలిచారని నాసా వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీడియో కాల్ చేసి వారిని అభినందించారు. ''మీరు చాలా ధైర్యవంతులు, తెలివైన మహిళలు'' అని వారు స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు ట్రంప్ ప్రశంసించారు.

Image copyright NASA
చిత్రం శీర్షిక స్పేస్ వాక్‌తో చరిత్ర సృష్టించిన నాసా మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మెయిర్

ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయిన క్రిస్టీనా కోచ్, మెరైన్ బయాలజీలో డాక్టరేట్ పొందిన జెస్సికా శుక్రవారం నాసా స్పేస్‌యూనిట్స్‌ నుంచి భారత కాలమానం ప్రకారం గం 5.08 లకు బయట అడుగు పెట్టారు. బ్యాటరీ ఛార్జ్-డిశ్చార్జ్ యూనిట్ (బీసీడీయూ)ను ఏర్పాటు చేసేందుకు పోర్ట్ 6 ట్రస్ స్ట్రక్చర్ అనే ప్రదేశానికి వెళ్లారు. పనిచేయని భాగాలను తమతో పాటు తిరిగి ఐఎస్ఎస్‌కు తీసుకెళ్లారు.

ఈ ఘటన 'చారిత్రాత్మకం కంటే ఎక్కువ' అని డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ట్వీట్ చేశారు.

'ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్‌'లో భాగంగా అన్నే మెక్‌క్లైన్‌తో కలిసి క్రిస్టీనా కోచ్ ''ఎక్స్‌ట్రా-వెహికల్ యాక్టివిటీ'' (ఈవీఏ) లో పాల్గొంటారని మార్చిలో నాసా ప్రకటించింది.

అయితే, మెక్‌క్లెయిన్‌కు సరిపోయే స్పేస్ సూట్ అందుబాటులో లేకపోవడంతో ఆమె స్పేస్‌వాక్‌లో పాల్గొనలేకపోయారు.

అంతరిక్షంలో నడిచిన తొలి మహిళగా రష్మాకు చెందిన స్వెత్లానా సవిట్సికయా రికార్డు సృష్టించారు.

యుఎస్ఎస్ఆర్ అంతరిక్ష కేంద్రం సలియుట్- 7 నుంచి 1984 జులై 25న బయటకు వచ్చిన ఆమె దాదాపు మూడు గంటల 35 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు.

అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి సోవియట్ వ్యోమగామి అలెక్సీ లియోనోవ్. ఆయన ఇటీవల మరణించారు.

చంద్రునిపైకి వెళ్లే వ్యోమగాములు ధరించే సరి కొత్త స్పేస్‌సూట్ నమూనాను మంగళవారం నాసా ఆవిష్కరించింది.

ఈ సూట్‌ను ఎక్స్‌ప్లోరేషన్ ఎక్స్‌ట్రావెహిక్యులర్ మొబిలిటీ యూనిట్‌గా పిలుస్తారు. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగించే స్పేస్‌సూట్ లాగానే కనిపిస్తోంది.

అయితే, చంద్రుడి మీద కదలటానికి అనువుగా సౌకర్యవంతంగా ఉండేలా దీనిని మెరుగుపరచినట్లు నాసా పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)