ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో టాలీవుడ్... కొత్తగా చేర్చిన పదాల్లో ఫేక్‌ న్యూస్, సింపుల్స్, నోమోఫోబియా

  • 21 అక్టోబర్ 2019
బాహుబలి Image copyright Baahubali/Facebook

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో కొత్తగా చేర్చిన ఒక పదం, దాని అర్థవివరణ ఇది:

Tollywood, n.2: The Telugu-language film industry, based in Hyderabad, Telangana.

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఈ ఏడాది అక్టోబర్‌లో కొత్తగా చేర్చిన 203 పదాల్లో టాలీవుడ్ ఒకటి.

దీనికి తెలుగు సినీ పరిశ్రమ అర్థం ఒకటి కాగా.. మరో అర్థంగా బెంగాలీ సినీ పరిశ్రమ పేరును కూడా చేర్చారు.

కొత్తగా చేర్చిన పదాల్లో జెడి, చిల్లాక్స్, ఫేక్ న్యూస్, నోమోఫోబియా, సింపుల్స్, వాటెవ్స్ వంటివి ఉన్నాయి.

కొత్త పదాలతో పాటు పాత పదాలకు కొత్త అర్థాలను కూడా చేర్చారు. ఇలా మొత్తం 650 పైగా కొత్త ఎంట్రీలు ఆక్స్‌ఫర్డ్‌లో చేరాయి.

Image copyright Getty Images

వాటిలో కొన్ని పదాలు, అర్థాలు ఇవీ...

చిల్లాక్స్ (chillax): శాంతించి విశ్రాంతి తీసుకోవటం, తేలికగా తీసుకోవటం, సంతోషించటం

ఫేక్ న్యూస్ (fake news): బూటకం, కట్టుకథలు, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించే సమాచారాన్ని అందించే వార్తలు, లేదంటే ఆ రకంగా చేస్తున్నాయని అభివర్ణించిన, ఆరోపించిన వార్తలు.

జెడి (simples): ఇది స్టార్ వార్స్ సినిమాల్లో ఒక కల్పిత గ్రహాంతరవాసి పేరు.

క్రిప్టోకరెన్సీ (cryptocurrency): లాంఛనప్రాయం కాని ప్రత్యామ్నాయ నగదు, అరుదైన.

నోమోఫోబియా (nomophobia): మొబైల్ ఫోన్ లేదా మొబైల్ ఫోన్ సర్వీసులు అందుబాటులో లేనపుడు కలిగే ఆందోళన.

Image copyright BGL GROUP/GETTY IMAGES
చిత్రం శీర్షిక కల్పిత పాత్రలైన సింపుల్స్ (ఎడమ), జెడి (కుడి) కూడా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు సంపాదించుకున్నాయి

O: ఇంగ్లిష్ అక్షరమాలలోని 'ఓ'ను ఆలింగనానికి చిహ్నంగా.. ఏదైనా లేఖ, గ్రీటింగ్స్ కార్డు లేదా లైక్ చివర్లో ఉపయోగిస్తారు. ఈ అర్థంలో మరో ఇంగ్లిష్ అక్షరం ఎక్స్‌తో కలిపి మాత్రమే వాడతారు. ఉదాహరణ: xox, xoxo.

సింపుల్స్ (simples): ఇది నిజానికి 'కంపేర్ ద మార్కెట్' ప్రకటనల్లో కనిపించే మీర్‌క్యాట్ పాత్ర పేరు. ఒక సమస్యను పరిష్కరించటం చాలా సులభమని చెప్పటానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారని ఆక్స్‌ఫర్డ్ అర్థం చెప్తోంది.

వాటెవ్ / వాటెవ్స్ (whatev / whatevs): ఏదైనా ప్రకటన లేదా ప్రశ్నను పట్టించుకోవటానికి, స్పందించటానికి విముఖతను వ్యక్తంచేయటానికి ఉపయోగించే పదం.

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో కొత్తగా చేర్చిన పదాలను ఈ లింక్‌లో చూడొచ్చు.

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని ప్రతి ఏటా నాలుగు సార్లు నవీకరిస్తారు. ఈ క్రమంలో కొన్ని కొత్త పదాలను, పాత పదాలకు కొత్త అర్థాలను చేరుస్తుంటారు. మళ్లీ 2019 డిసెంబర్‌లో ఈ డిక్షనరీని నవీకరిస్తారు.

ఇంగ్లిష్‌లో తెలుగు పదాలు...

ఇంగ్లిష్‌లో కొన్ని తెలుగు పదాలు కూడా ఉన్నాయి. వాటిలో Bandicoot (పందికొక్కు), Pitta (పిట్ట) వంటి వాటితో పాటు.. Aiyo (అయ్యో) Congee (గంజి), Godown (గిడ్డంగి), Sambal (సాంబారు), Teak (టేకు) వంటి అనేక పదాలకు తెలుగు, ద్రవిడ మూలాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)