సిరియా నుంచి ఉపసంహరించుకున్న సేనలను ఇరాక్‌కు పంపుతాం: అమెరికా రక్షణ మంత్రి

  • 21 అక్టోబర్ 2019
అమెరికా సేనలు Image copyright EPA

ఉత్తర సిరియా నుంచి ఉపసంహరించుకుంటున్న తమ దేశ బలగాలన్నింటినీ పశ్చిమ ఇరాక్‌లో మోహరిస్తామని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ చెప్పారు.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తిరిగి‌ పుంజుకోకుండా చేసేందుకు దాదాపు వెయ్యి మంది సైనికులను అక్కడికి తరలించేందుకు ప్రణాళికలు వేసినట్లు ఎస్పెర్ తెలిపారు.

అంతకుముందు సిరియా నుంచి ఉపసంహరించుకున్న సైనికులను స్వదేశానికి తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఉత్తర సిరియాలోని రస్ అల్-ఎయిన్ పట్టణం నుంచి తమ ఫైటర్లందరినీ వెనక్కి రప్పించుకున్నట్లు కుర్దుల నేతృత్వంలోని ఓ దళం ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత వారం ఎర్డోగాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత.. సిరియాలోని ఈశాన్య ప్రాంతం నుంచి డజన్ల సంఖ్యలో అమెరికా సైనిక బలగాలను అర్ధంతరంగా ఉపసంహరించుకున్నారు.

సిరియా నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రకటన వచ్చిన అనంతరం, టర్కీ అక్టోబర్ 9న సైనిక చర్య మొదలుపెట్టింది.

తమతో సరిహద్దులున్న సిరియా ప్రాంతం నుంచి కుర్దు బలగాలను వెనక్కి తరిమివేసి.. అక్కడ 'సేఫ్ జోన్‌'ను ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ చర్యకు దిగినట్లు టర్కీ చెప్తోంది.

సరిహద్దు వెంబడి 440 కి.మీ.ల పొడవున, 30 కి.మీ.ల లోపలికి దీన్ని ఏర్పాటు చేయాలని టర్కీ యోచిస్తోంది. దాదాపు 20 లక్షల మంది సిరియా శరణార్థులకు ఆ ప్రాంతంలో పునరావాసం కల్పించాలన్నది ప్రణాళిక.

Image copyright Getty Images

అయితే, ఆ శరణార్థుల్లో చాలా మంది కుర్దులు కాదు. టర్కీ తాను అనుకుంటున్నట్లు చేస్తే... స్థానిక కుర్దుల జాతి నిర్మూలన జరిగే ప్రమాదం ఉందని చాలా మంది విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

సైనిక చర్య సమయంలో టర్కీ, దాని మిలీషియాలు యుద్ధ నేరాలకు పాల్పడుతుండవచ్చని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

యుద్ధ నేరాలు, ఉల్లంఘనలకు సంబంధించి 'గట్టి ఆధారాలు' తాము సేకరించిట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది.

ఈ ఆరోపణలపై విచారణ జరపాలని ఐక్యరాజ్య సమితి టర్కీకి సూచించింది.

టర్కీ అనుబంధ బలగాలు ఫాస్ఫరస్ రసాయనిక ఆయుధాన్ని వాడినట్లు కూడా వార్తలు వచ్చాయి.

కుర్దు బలగాలకు, టర్కీకి మధ్య కాల్పుల విరమణ అంగీకారం కోసం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మధ్యవర్తిత్వం వహించారు.

దీని ప్రకారం తల్ అబ్యద్ నుంచి రస్ అల్-అయిన్ వరకూ 120 కి.మీ. విస్తీర్ణంలోని ప్రాంతం నుంచి తమ ఫైటర్లను ఉపసంహరించుకునేందుకు కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్) సమ్మతించింది.

Image copyright AFP

కాల్పుల విరమణను టర్కీ ఉల్లంఘిస్తోందని.. పౌరులను, గాయపడ్డవారిని తరలించేందుకు అనుమతించడం లేదని ఇదివరకు ఎస్‌డీఎఫ్ ఆరోపణలు చేసింది.

అయితే, కుర్దు దళాలే ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని, తల్ అబ్యద్ సమీపంలో వాళ్లు చేసిన దాడుల్లో తమ సైనికుడు ఒకరు మరణించారని టర్కీ తెలిపింది.

ప్రతిపాదిత 'సేఫ్ జోన్' నుంచి వెనక్కివెళ్లకపోతే 'తలలు చిదిమేస్తామ'ని కుర్దు ఫైటర్ల‌ను టర్కీ అధ్యక్షుడు తాయిప్ ఎర్డోగాన్ శనివారం హెచ్చరించారు.

రస్ అల్-అయిన్ నుంచి 50కు పైగా వాహనాలు వెళ్లిపోవడం చూసినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ రిపోర్టర్ ఒకరు తెలిపారు. వీటిలో అంబులెన్స్‌లు కూడా ఉన్నట్లు తెలిపారు.

పదుల సంఖ్యలో కుర్దు ఫైటర్లు కూడా వెనక్కివెళ్లిపోయారు.

Image copyright DAVID WALKER

అమెరికా సైనికులు స్వదేశానికి తీసుకువస్తున్నట్లు చేసిన ఓ ట్వీట్‌ను డోనల్డ్ ట్రంప్ డిలీట్ చేశారు.

ఇరాక్‌లో పునరుజ్జీవం పోసుకునేందుకు ఐఎస్ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు అమెరికా బలగాలను వినియోగిస్తామని ఎస్పెర్ చెప్పారు.

అయితే, ఈ ప్రణాళికలు మారే అవకాశాలు కూడా ఉన్నాయని అమెరికా రక్షణ శాఖలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

Image copyright AFP

ఉత్తర సిరియాలో టర్కీ సైనిక చర్య మొదలైనప్పటి నుంచి 1.6 లక్షల నుంచి 3 లక్షల మంది వరకూ పౌరులు అక్కడి నుంచి వలస వెళ్లిపోయినట్లు కథనాలు వచ్చాయి.

సైనిక చర్యలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల సంఖ్య 86కు చేరుకుందని సిరియన్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ శుక్రవారం తెలిపింది.

సిరియాలో ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి ఎస్‌డీఎఫ్ పోరాడింది. అయితే, ఇప్పుడు మిత్ర పక్షమైన ఎస్‌డీఎఫ్‌ను డోనల్డ్ ట్రంప్ పట్టించుకోవడం లేదని ఆయన సొంత పార్టీ సీనియర్ నాయకులు సైతం విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు