మహిళల నాయకత్వంలో ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉంటుంది? :#100WOMEN

  • 21 అక్టోబర్ 2019
బీబీసీ 100 వుమెన్

బీబీసీ '100 వుమెన్' సిరీస్ ఏటా స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన 100 మంది మహిళల గాథలను ప్రపంచవ్యాప్తంగా పాఠకులు, వీక్షకుల ముందుకు తెస్తోంది. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న మహిళల కథలను వినిపిస్తోంది.

2013లో మొదలైన ఈ సిరీస్ ఇప్పుడు ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

మేకప్ ఆంట్రప్రెన్యూయర్ బాబీ బ్రౌన్, ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్, బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్, అథ్లెట్ సిమోన్ బైల్స్, సూపర్ మోడల్ అలెక్ వెక్, మ్యుజీషియన్ అలీసియా కీస్, ఒలింపిక్ చాంపియన్ బాక్సర్ నికోలా ఆడమ్స్- ఇలా వేర్వేరు రంగాలకు చెందిన మహిళలు గత ఆరేళ్లలో 'బీబీసీ 100 వుమెన్‌'కు ఎంపికయ్యారు.

'2019 బీబీసీ 100 వుమన్ సిరీస్'కు ఇతివృత్తం- 'ద ఫిమేల్ ఫ్యూచర్'.

ఫ్యూచరిజం - పురుషాధిపత్యం సాగుతున్న ఈ ప్రపంచం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా తీర్చిదిద్దాలన్నదే ఫ్యూచరిజం.

ఈసారి మేం ఎంచుకున్న ప్రశ్న: ఒక వేళ మహిళలు సారథ్యం వహిస్తే ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?

బీబీసీ 100 వుమెన్-2019 సీజన్‌లో ప్రధానమైనవి రెండు ఫ్యూచర్ సదస్సులు. వీటిలో మొదటిది అక్టోబర్ 17న లండన్‌లో జరిగింది. రెండో సదస్సు అక్టోబర్ 22న దిల్లీలో జరగనుంది.

సైన్స్, కళలు, మీడియా, సినిమా, విద్య, ఫ్యాషన్, మతం, అంతరిక్షం, లింగ సమానత్వం వంటి రంగాల్లో కృషి చేస్తూ.. ఆయా రంగాల భవిష్యత్తును అంచనా వేయగల, మార్చగల సామర్థ్యమున్న కొందరు మహిళలను ఈ సదస్సులో మీరు కలుసుకోవచ్చు.

పర్యావరణ మార్పులతో భూతాపం పెరిగిపోతున్న తరుణంలో అంతరిక్ష అన్వేషణ ఎలా మారబోతుందో బెంగళూరుకు చెందిన ఓ ఇంజినీర్ వివరిస్తారు.

స్మార్ట్‌ఫోన్లు, 5జీ.. ఇలా రోజురోజుకు మారుతున్న సాంకేతికతతో పాఠశాలలు ఎలా మారబోతున్నాయనే విషయాన్ని ఇరాన్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త చెబుతారు.

3-డీ ప్రింటింగ్‌తో ఫ్యాషన్ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను ఓ ఇజ్రాయెల్ డిజైనర్ వివరిస్తారు.

2030లో వివిధ రంగాలు ఎలా ఉండబోతున్నాయన్నది వీరంతా అంచనా వేస్తారు.

ఈ సదస్సుకు హాజరయ్యేవారు వక్తలను ప్రశ్నలు అడగొచ్చు. వివిధ అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొనవచ్చు. వర్చువల్ రియాలిటీ అనుభవాలనూ ఆస్వాదించవచ్చు.

భవిష్యత్తులో సవాలు విసిరే, ఆందోళన కలిగించే, స్ఫూర్తినిచ్చే విషయాలు ఏంటన్నవి ఈ సదస్సులో తెలుసుకోవచ్చు.

దిల్లీ సదస్సు

ఎప్పుడు: అక్టోబర్ 22, 2019

ఎక్కడ: గోదావరి ఆడిటోరియం, ఆంధ్రా అసోసియేషన్, 24-25 లోధి ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, న్యూ దిల్లీ - 110003

సదస్సులో రెండు సెషన్లు ఉంటాయి. ఉదయం సెషన్ తొమ్మిది గంటలకు మొదలై ఒంటిగంటకు ముగుస్తుంది. పగటి సెషన్ రెండు గంటలకు మొదలై సాయంత్రం 5:45కి ముగుస్తుంది.

*కార్యక్రమం

ఉదయం సెషన్:

అరణ్య జోహార్ - కవిత్వం, సమానత్వం, భవిష్యత్తు

రాయా బిద్శహరీ (విద్య) - భవిష్యత్తు పాఠశాలలు

సారా మార్టిన్స్ డ సిల్వా (సంతాన సామర్థ్యం) - పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గుదల సమస్యను పరిష్కరించగలమా?

సుస్మితా మొహంతీ (అంతరిక్షం, సైన్స్) - 21వ శతాబ్దపు అంతరిక్ష పోరాటం

మెర్లిన్ వారింగ్, శుభలక్ష్మీ నంది (వేతనంలేని పని)లతో సంభాషణ : వేతనం లేకుండా మహిళలు చేసే పని ఆధారంగా విలువకడితే దేశ ఆర్థికవ్యవస్థ ఎలా ఉంటుంది?

దనిత్ పెలెగ్ (ఫ్యాషన్): 3-డీ ప్రింటింగ్‌తో ఫ్యాషన్ రంగంలోని సాంకేతికతలో వచ్చే మార్పులు

మధ్యాహ్నం సెషన్:

నటాషా నోయెల్ - బాడీ పాజిటివిటీ

పావ్లో విలారియల్ (జస్టిస్, డేటా ఈక్వాలిటీ) : ప్రపంచవ్యాప్తంగా న్యాయవ్యవస్థలు అల్గారిథమ్‌ల వల్ల ఎలా మారనున్నాయి?

గినా జుర్లో (మతం) - చిన్నారులే ప్రపంచాన్ని నడిపిస్తారా? : మతం భవిష్యత్తు

ప్రగతి సింగ్ (సెక్సువాలిటీ, జెండర్ ఐడెంటిటీ) - సెక్స్‌ను దాటి: ప్రేమ, కుటుంబం, సాన్నిహిత్యం ఎలా మారబోతున్నాయి?

హైఫా సదిరీ (వాణిజ్యం, ఆంథ్రప్రెన్యూర్‌షిప్) - ఉత్తర ఆఫ్రికా నుంచి యువత వలసలను వర్చువల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపగలదా?

వాసు పీర్మలానీ (పర్యావరణం) - పర్యావరణ పరిరక్షణ కోసం మహిళలు వేసే ఒక్క అడుగు-మానవాళి వేసే భారీ అడుగు

నందితా దాస్ - సినిమాలు, తెల్ల రంగు చర్మంపై మోజు: సినిమాల్లో మహిళలను చూపిస్తున్న తీరు

*ఈ కార్యక్రమంలో మార్పులు ఉండొచ్చు. వాటికి సంబంధించిన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఈ పేజీలో పోస్ట్ చేస్తాం.

ముఖ్యమైన కథనాలు