నీళ్లు, టాయిలెట్‌ పేపర్, మొక్కజొన్న పొత్తు... బాత్రూమ్‌లో ఒక్కో దేశానిది ఒక్కో అలవాటు

  • క్రిస్టీన్ రో
  • బీబీసీ ప్రతినిధి
బాత్రూంలో జనాల వింత అలవాట్లు

ఫొటో సోర్స్, BBC/ALAMY/GETTY

ఈజిప్ట్‌కు చెందిన ప్రముఖ కమెడియన్ బాసెమ్ యూసఫ్ బ్రిటన్‌లో తన మొదటి షో చేస్తున్నప్పుడు, వేదిక పైకి ఆయన ఒక బాత్రూమ్ కమోడ్ తీసుకుని వచ్చారు.

"మా అరేబియన్లు విదేశీ పర్యటనకు వెళ్లడానికి సామాన్లు సర్దుకుంటున్నప్పుడు మూడు వస్తువులు ఎప్పుడూ మర్చిపోరు. ఒకటి పాస్‌పోర్ట్, రెండోది డబ్బు, మూడోది మేం ఎప్పుడూ మా దగ్గరే ఉంచుకునే ఈ కమోడ్" అన్నారు.

టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత శుభ్రం చేసుకునేందుకు నీటిని స్ప్రే చేసే పైపును ఆయన గాల్లో ఊపి చూపించారు. అరేబియన్ భాషలో దీనిని 'షత్తఫ్', ఇంగ్లిష్‌లో 'బమ్ గన్' అంటారని చెప్పారు.

తర్వాత పశ్చిమ దేశాలపై సెటైర్లు వేసిన యూసఫ్, "పాశ్చాత్య దేశాలు చాలా అభివృద్ధి చెందాయని అందరూ అంటారుగానీ, శరీరం వెనక భాగం విషయానికి వస్తే, ఆ దేశాలు మిగతా వాటికంటే చాలా వెనకబడి ఉన్నాయి" అన్నారు.

ప్రపంచంలో అందరూ, ముఖ్యంగా భారతీయులు ఆ విషయం అంగీకరిస్తున్నారు.

మల విసర్జన లేదా మూత్ర విసర్జనకు వెళ్లిన తర్వాత భారతీయులు నీటితో శుభ్రం చేసుకుంటారు. కానీ అమెరికా, బ్రిటన్ ప్రజలు ఆ పని చేశాక టిష్యూ పేపరు ఉపయోగిస్తారు. కడుక్కోవడానికి బదులు తుడిచేసుకుని వెళ్లిపోతారు.

ఫొటో సోర్స్, BBC/ALAMY

శానిటరీ సామ్రాజ్యవాదం

ప్రపంచంలో పశ్చిమ దేశాల ప్రజల ఈ అలవాట్లు చాలా మందికి వింతగా అనిపిస్తాయి. అయితే, శరీర శుభ్రత విషయానికి వస్తే, నీటితో కడుక్కోవడమే మంచిది. కాగితం కంటే నీరు మృదువుగా కూడా ఉంటుంది.

ఒకప్పుడు ప్రాచీన గ్రీకులు టాయిలెట్‌కు వెళ్లాక సెరామిక్ ముక్కలతో శుభ్రం చేసుకునేవారు. ఇక, మొదట అమెరికాకు వలస వెళ్లినవారు మలవిసర్జన తర్వాత గింజలు వలిచేసిన మొక్కజొన్న పొత్తుతో తుడుచుకునేవారు. ఇప్పుడు చాలా దేశాల్లో ప్రజలు మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రం చేసుకోడానికి నీటినే ఉపయోగిస్తున్నారు.

ఫ్రాన్స్ ప్రపంచానికి బిడేట్(కడుక్కునేందుకు వీలుగా ఉండే కమోడ్ లాంటిది) పరిచయం చేసింది. అయితే ఇది ఇప్పుడు ఫ్రాన్స్‌లోనే కనిపించడం లేదు. కానీ ఇటలీ, అర్జెంటీనా, మిగతా దేశాల్లో వీటిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఇక 'బమ్ గన్' వినియోగం ఫిన్‌లాండ్‌లో ఎక్కువ.

కానీ పశ్చిమ దేశాల్లో జనం ఎక్కువగా టిష్యూ పేపరే వాడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ ప్రజల ఈ అలవాటు చాలా దేశాలకు వ్యాపించింది. ప్రముఖ చరిత్రకారుడు బార్బరా పేనర్ దీనిని 'శానిటరీ సామ్రాజ్యవాదం'గా వర్ణించారు.

కానీ, చాలా ముస్లిం దేశాల్లో మలమూత్ర విసర్జన తర్వాత నీటినే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇస్లాం విద్యలో పరిశుభ్రత విషయంలో నీటిని ఉపయోగించాలనే సూచించారు.

అయితే, మలమూత్రాలకు వెళ్లిన ముస్లింలు నీళ్లు లేకుంటే, టాయిలెట్ పేపర్ ఉపయోగించవచ్చని 2015లో టర్కీలో ఫత్వా జారీ చేశారు. ఇక జపాన్‌ టాయిలెట్లలో టాయిలెట్ పేపర్, నీళ్లు రెండూ ఉంటాయి.

ఆస్ట్రేలియా పరిశోధకురాలు జూల్ వోథ్‌మెన్ తమ దేశంలో ఉండే ముస్లింలు టాయిలెట్ పేపరుతోపాటూ నీళ్లు కూడా ఉపయోగించడం నేర్చుకున్నారని చెప్పారు. దానికోసం వారు బాత్రూంలలో బిడేట్ ఏర్పాటు చేసుకుంటారని, లేదంటే ఒక జగ్‌లో నీళ్లు తీసుకుని మలవిసర్జనకు వెళ్తారని చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/ALAMY/GETTY

విదేశాల్లో భారతీయుల అనుభవం

పశ్చిమ దేశాల్లో టాయిలెట్ పేపర్ ఉపయోగించే అలవాటుకు నవీ ముంబై వాసి ఆస్థా గర్గ్ కూడా ఇబ్బంది పడ్డారు.

ఆస్థా శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లినపుడు టాయిలెట్లో మగ్ కోసం వెతకడం మొదలెట్టారు. అది ఎక్కడా కనిపించలేదు. లోపల నీళ్లు కూడా లేవు. దాంతో, ఆమె ఒక భారతీయ రెస్టారెంటుకు వెళ్లాల్సి వచ్చింది.

"కొంతమంది భారతీయులు టాయిలెట్ వెళ్లిన తర్వాత టిష్యూ పేపర్ ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. కానీ ఎక్కువ మంది భారతీయులు ఇప్పటికీ, నీళ్లతోనే శుభ్రం చేసుకుంటారు. భారతీయ మూలాలున్న ప్రతి ఒక్కరి ఇళ్లలోని టాయిలెట్లో నీళ్లు ఉంటాయి" అని ఆస్థా చెప్పారు.

అటు, మలమూత్ర విసర్జనకు వెళ్లిన తర్వాత టాయిలెట్ పేపర్ ఉపయోగించడానికి బ్రిటన్ ప్రజలు బాగా అలవాటు పడిపోయారు అని వోథ్‌మెన్ చెప్పారు.

"ఒక ఫ్రెండ్ టాయిలెట్ పేపర్ లేకపోవడంతో 20 పౌండ్ల నోటుతో తుడుచుకున్నాడు" అని ఆయన చెప్పారు. అమెరికాలో ఇప్పుడు ఎక్కువ టాయిలెట్ పేపర్ వినియోగించడానికి కూడా ఈ అలవాటే కారణం.

టాయిలెట్ పేపర్ ఉపయోగించడం వల్ల ఇంకో సమస్య కూడా ఉంది. టాయిలెట్లో ఉక్కిరిబిక్కిరి అయినట్టు ఉంటుంది.

కాగితాన్ని కనుగొన్న చైనాలో ఎక్కువగా టాయిలెట్ పేపరే ఉపయోగిస్తుంటారు. కానీ దాని వినియోగం విపరీతంగా పెరిగింది మాత్రం అమెరికా టాయిలెట్ పేపర్ కంపెనీలు, ప్రకటనలు ఇచ్చేవారి వల్లే.

టాయిలెట్‌కు వెళ్లాక శుభ్రం చేసుకోవడమే కాదు, మలవిసర్జన ఎలా చేయాలి అనేదానిపై కూడా వివాదం ఉంది. పశ్చిమ దేశాల్లో కమోడ్ వినియోగం చాలా ఎక్కువ. దానిపై హాయిగా కూర్చుని పుస్తకాలు, పేపర్ చదువుతూ కడుపు ఖాళీ చేయచ్చు.

ఫొటో సోర్స్, BBC/Getty Images

టాయిలెట్లో ఎంటర్‌టైన్‌మెంట్

ఇక భారత్ సహా చాలా దేశాల్లో మోకాళ్లపై వంగి మల విసర్జన చేయడం ఎక్కువగా ఉంటుంది.

చైనా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డ కైసర్ కువోకు అక్కడ మామూలు టాయిలెట్ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే చైనాలో హాన్ సామ్రాజ్యం నుంచే రెండు రకాల టాయిలెట్ల వినియోగం ఉండేది.

చైనాలో, ఇప్పుడు కూడా వివిధ ప్రాంతాల్లో ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ, చైనాలో ఎక్కువగా పాత రకం టాయిలెట్లు అంటే మోకాళ్లపై వంగి కూర్చునే వాటికే ప్రాధాన్యం ఇస్తారు.

ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో మూడింట రెండు వంతుల జనాభా మోకాళ్లపై వంగి కూర్చునే టాయిలెట్లే ఉపయోగిస్తున్నారు. పరిశుభ్రత అంటే ఇష్టపడేవారు కూడా వీటికే ఓటేస్తున్నారు. ఎందుకంటే, మోకాళ్లపై వంగి కూర్చోవడం వల్ల టాయిలెట్ మన శరీరానికి తగలదు. దాంతో సూక్ష్మక్రిముల వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువ. అందుకే, బ్రిటన్‌లో చాలా మంది మహిళలు పబ్లిక్ ప్లేసుల్లో మోకాళ్లపై వంగి కూర్చునే టాయిలెట్లే ఉపయోగిస్తున్నారు.

మోకాళ్లపై వంగి కూర్చోవడం వల్ల ఆ పని కూడా చాలా సులభంగా పూర్తవుతుంది. అందుకే చైనాలో చాలా మంది వృద్ధులు మోకాళ్లపై కూర్చునే విషయంలో యువకులతో పోటీపడుతున్నారు.

మరోవైపు అమెరికా మాత్రం తనదైన దారిలో వెళ్తోంది. టాయిలెట్‌కు వెళ్లడం కూడా ఎంటర్‌టైనింగ్‌గా మార్చేసింది. ఒకరు వార్తాపత్రికతో లోపలికి వెళ్తే, ఇంకొకరు పుస్తకం చదువుతూ కూర్చుంటారు. టాయిలెట్లో చాలామంది మొబైల్లో వీడియో గేమ్ కూడా ఆడుతుంటారు.

అయితే భారతదేశంలో మలవిసర్జన సమయంలో చదవడం, రాయడం మంచిది కాదని భావిస్తారు. చైనీయులు కూడా ఇదే పాటిస్తారు.

కానీ భారత్‌లో కూడా విదేశీ సంస్కృతికి అలవాటు పడ్డ కొందరు సమయం ఆదా చేసే పేరుతో, టాయిలెట్లో ఉన్నప్పుడు పేపర్ చదవడం లాంటివి చేస్తుంటారు.

మలేసియాలో పబ్లిక్ ప్రాంతాల్లో రెండు రకాల టాయిలెట్లు ఉంటాయి. ఎవరికి ఏది నచ్చితే వాటిని ఉపయోగించవచ్చు.

ఫొటో సోర్స్, BBC/GETTY

స్నానం విషయానికి వస్తే

మలవిసర్జన తర్వాత శుభ్రతే కాదు, స్నానం కూడా ముఖ్యమైన అంశమే. పళ్లు తోముకున్న తర్వాత మలవిసర్జన, తర్వాత స్నానం చేస్తుంటారు.

పాశ్చాత్య సంస్కృతిలో ఉదయం త్వరగా స్నానం చేసే అలవాటు ఉందని లాంకెస్టర్ యూనివర్సిటీ సోషియాలజిస్ట్ ఎలిజబెత్ షోవ్ చెప్పారు.

"ప్రపంచ యుద్ధం తర్వాత ప్రకటనల జోరు పెరగడమే దీనికి కారణం. జింబాబ్వేలో లైఫ్‌బాయ్ సబ్బు, అమెరికాలో ఐవరీ సబ్బుకు విస్తృత ప్రచారం చేశారు. అప్పుడు సబ్బుల ప్రకటనలతో రేడియో, టీవీల్లో సీరియళ్లు కూడా వచ్చేవి. అందుకే ఇప్పుడు కూడా వాటిని 'సోప్ ఒపేరా' అనే అంటున్నారు. ఎందుకంటే వాటిని సబ్బుల కంపెనీలే స్పాన్సర్ చేసేవి" అని చెప్పారు.

"ఇప్పుడు ముఖం శుభ్రం చేసుకోడానికి ఫేస్-వాష్ ఉంది. శరీరంలోని మిగతా భాగాలకు బాడీ వాష్ కూడా వచ్చింది. కానీ ఈ ట్రెండ్ వచ్చింది ఇటీవలే. జనం ఎక్కువసార్లు స్నానం చేయడమే దానికి కారణం"

"బ్రిటన్‌లో రెండు తరాల ముందు అందరూ వారానికి రెండు సార్లే స్నానం చేసేవారు. అంటే, మొదట్లో నీళ్లు రోజూ వచ్చేవి కావు. నీళ్ల కొరతతో వారికి అది అలవాటైంది. నీళ్లు రోజూ రావడంతో రోజూ స్నానం చేయడం కూడా అలవాటు చేసుకున్నారు" అని బార్బరా షోవ్ చెప్పారు.

"అయినా రోజూ నీళ్లు వస్తున్నాయని, రోజూ స్నానం చేయడం కూడా సరికాదు. నీళ్ల కొరత ఉన్న మలావీ లాంటి దేశాల్లో సగం బక్కెట్ నీళ్లతో కూడా స్నానం చేయచ్చు. కానీ అక్కడి ప్రజలు రోజుకు రెండు, మూడు సార్లు స్నానం చేస్తారు. ఘనా, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఆస్ట్రేలియా ప్రజల్లో కూడా అదే అలవాటు ఉంది. అయితే స్నానం చేసిన ప్రతిసారీ, తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఆసక్తి కలిగించే ఒక విషయం ఉంది. బ్రెజిల్‌ ప్రజలు వేసవిలోనే కాదు, ఎముకలు కొరికే చలికాలంలో కూడా రోజుకు చాలాసార్లు స్నానం చేస్తుంటారు".

"ఇప్పుడు రోజూ ఉదయం స్నానం చేసే అలవాటు, మన ఉద్యోగ జీవితం వల్లే వచ్చింది. అందరూ ఉదయం పనులకు వెళ్లే ముందు నీట్‌గా తయారవుతారు. ఎందుకంటే ఇతరులకు తాము అసహ్యంగా కనిపించడం వారికి నచ్చదు. వారు దానిని అన్-ప్రొఫెషనల్‌గా భావిస్తారు" అంటారు బార్బరా.

ఫొటో సోర్స్, BBC/ALAMY/GETTY)

రోజూ స్నానం చేస్తే...

రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్న కూడా వస్తుంది.

"దానికి సమాధానమే లేదు. ఎందుకంటే వేడి నీళ్లతో మాటిమాటికీ స్నానం చేయడం వల్ల మన చర్మం, వెంట్రుకలు రఫ్‌గా అయిపోతాయి. అందుకే చాలా మంది మహిళలు రోజూ స్నానం చేసినా, తలస్నానం మాత్రం వారానికి రెండు మూడు సార్లే చేస్తుంటారు".

కొంతమంది స్నానం చేయడం వల్ల ఫ్రెష్‌గా ఉంటుందని చెబుతారు. కానీ పడుకునే ముందు స్నానం చేయడం చాలా మంచిది. దానివల్ల శరీరం విశ్రాంతి స్థితిలోకి వస్తుంది.

అయినా, పరిశుభ్రత, స్నానం, కడుక్కోవడం అనే అలవాట్లు ఆయా సంస్కృతి, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి.

పశ్చిమ దేశాల ప్రజలు భవిష్యత్తులో తమను ఎకో-ఫ్రెండ్లీ అని చెప్పుకోవడం కోసం మేం వారానికి ఒక్కసారే స్నానం చేస్తామని, నీళ్లు వృథా చేయమని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

బాత్రూం అలవాట్లు, మన సాంస్కృతిక విధానాల్లో భాగంగా ఉంటాయి. అంటే, చిన్నతనంలో మనం ఏం నేర్చుకుంటామో, ఈ అలవాట్లు వాటిపైనే ఆధారపడి ఉంటాయి.

ఈ కథనం బీబీసీ చేస్తున్న పశ్చిమ దేశాల సిరీస్‌లో భాగం. సైకాలజిస్టులు పశ్చిమ దేశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ పరిశోధనలు చేశారని 2010లో బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఒక టీమ్ చెప్పింది.

అయితే, పశ్చిమ దేశాలతో పోలిస్తే మిగతా ప్రపంచ దేశాల్లో అలవాట్లు, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. పశ్చిమ దేశాల ప్రజల అలవాట్లు చాలా విషయాల్లో కాస్త వింతగా అనిపిస్తాయి. వాటినే ఇప్పుడు ప్రామాణికం అని భావించడం సరికాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)