ఇంటర్నెట్ ఎలా పుట్టింది? రెండు కంప్యూటర్ల మధ్య బదిలీ అయిన తొలి పదం ఏంటి?

  • టిమ్ హార్ఫర్డ్
  • బీబీసీ ప్రజెంటర్, 50 థింగ్స్ దట్ మేడ్ ద మోడర్న్ ఎకానమీ రచయిత
పెంటగాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1960లో పెంటగాన్

మనస్తత్వ శాస్త్రం అభ్యసించిన, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ రాబర్ట్ టేలర్ 1960లలో వాషింగ్టన్‌ డీసీలోని పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం)లో పనిచేశారు.

అమెరికా రక్షణ మంత్రి, అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (ఆర్పా)కు చీఫ్‌ కార్యాలయం సమీపంలోనే మూడో అంతస్తులో ఆయన ఉండేవారు.

అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు 1958 ఆరంభంలో రక్షణ శాఖ పరిధిలో ఆర్పాను ఏర్పాటు చేశారు.

ఆ సంస్థ అంతరిక్ష ప్రయోగాలు కూడా ప్రారంభించింది. కానీ, తర్వాత కొన్ని నెలలకే అంతరిక్ష పరిశోధనల కోసం నాసా ఏర్పాటు చేశారు. దాంతో, ఆర్పా అంతరిక్ష ప్రయోగాలు చేయడం ఆపేయాల్సి వచ్చింది.

ఆ పరిణామంతో ఇక ఆర్పా కథ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. అది పునరుజ్జీవం పోసుకుంది, అనేక అద్భుత ఆవిష్కరణలను ప్రపంచానికి అందించడంలో కీలక పాత్ర పోషించింది.

టేలర్ చొరవతో 1966లో ఆర్పా తిరిగి క్రియాశీలంగా మారింది.

ఫొటో సోర్స్, GARDNER CAMPBELL/WIKIPEDIA

ఫొటో క్యాప్షన్,

85 ఏళ్ల వయసులో 2017 ఏప్రిల్‌లో రాబర్ట్ టేలర్ తుదిశ్వాస విడిచారు

టేలర్ కార్యాలయానికి పక్కనే మరో చిన్న గది ఉండేది. అందులో మూడు రిమోట్ యాక్సెస్ టర్మినళ్లు పక్కపక్కనే ఉండేవి. వాటికి వేర్వేరు కీబోర్డులు అమర్చి ఉండేవి.

ఒక్కో రిమోట్ టర్మినల్‌తో సుదూర ప్రాంతంలో ఉన్న వేర్వేరు మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్లకు ఆయన కమాండ్ ఇచ్చేవారు.

ఒక కంప్యూటర్ వాషింగ్టన్ డీసీకి 700 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఏర్పాటు చేశారు.

మిగతా రెండింటిలో ఒకటి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో, మరొకటి శాంటా మోనికాలోని గగనతల వ్యూహాత్మక ఆదేశాల కేంద్రంలో ఉంచారు.

ఆ కంప్యూటర్లు ఒక్కోటి ఒక గది పరిమాణం ఉండేవి. ఆ భారీ కంప్యూటర్లలో ప్రతిదానికీ వేర్వేరు లాగిన్ విధానం, ప్రోగ్రామింగ్ భాష అవసరం ఉండేది.

టేలర్ సుదూర ప్రాంతం నుంచి ఆ కంప్యూటర్లను వాడగలిగారు, కానీ అవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యేవి కాదు.

రెండు కంప్యూటర్లు సమాచారాన్ని పంచుకోవడం, ఏకకాలంలో రెండు మూడు కంప్యూటర్లను వాడి క్లిష్టమైన లెక్కలను గణించడం దాదాపు సాధ్యమయ్యేది కాదు.

ఆ సవాళ్లను ఎలాగైనా అదిగమించేందుకు మార్గాలను కనుగొనాలని టేలర్ నిర్ణయించారు. ఆర్పా చీఫ్ ఛార్లెస్ హర్జ్‌ఫెల్డ్‌ దగ్గరికి వెళ్లారు. 20 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడి తన లక్ష్యం గురించి చెప్పారు.

వెంటనే మరో ప్రశ్న వేయకుండా, "వెంటనే పని ప్రారంభించండి. మీకు అదనంగా మరో 10 లక్షల డాలర్ల బడ్జెట్ కేటాయిస్తున్నాం" అని హర్జ్‌ఫెల్డ్‌ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1969లో లారీ రాబర్ట్స్ ఆర్పానెట్ రేఖా చిత్రం

గట్టి సవాల్

టేలర్‌తో మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్త లారీ రాబర్ట్స్ కూడా చేతులు కలిపారు.

నిజానికి, అప్పటికే లారీ రాబర్ట్స్ అనేక రెండు మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్లతో చాటింగ్ చేయగలిగారు. అది సాధించేందుకు ఆయనకు చాలా కాలమే పట్టింది. అయితే, ఆ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉండేది.

దాంతో, మెరుగైన నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని, ఏ కంప్యూటర్ అయినా ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యేలా అది ఉండాలని టేలర్, రాబర్ట్స్ ఆలోచించారు.

"కంప్యూటర్‌లోని దాదాపు ముఖ్యమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లన్నీ ఆ నెట్‌వర్క్‌కు అనుసంధానం అవ్వాలి. అలాంటి నెట్‌వర్క్‌ను రూపొందించాలి" అని రాబర్ట్స్ అప్పట్లో చెప్పారు. దానిని సవాల్‌గా తీసుకుని పని ప్రారంభించారు.

అప్పట్లో కంప్యూటర్లు చాలా అరుదు, ఖరీదైనవి, సామాన్యులు కొనలేని పరిస్థితి. పైగా అవి సరిగా పనిచేసేవి కాదు. కాబట్టి, ప్రయోగాల కోసం పరిశోధకులే ఎక్కువగా వినియోగించేవారు.

అదృష్టం కొద్ది, మరొక శాస్త్రవేత్త వెస్లీ క్లార్క్ కూడా వీరితో చేతులు కలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఐఎంపీ -1 బాక్సు దగ్గర కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లియోనార్డ్ (2009లో)

క్లార్క్ మరో రకం కంప్యూటర్‌ను తయారు చేసేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. భారీ మెయిన్‌ఫ్రేమ్‌ కంప్యూటర్ల కంటే తక్కువ పరిమాణంలో, తక్కువ ఖర్చుతో కంప్యూటర్‌ను ఆయన రూపొందించారు.

ఆ మినీ కంప్యూటర్లను కొత్త నెట్‌వర్క్‌తో అనుసంధానించాలని క్లార్క్ సూచించారు.

భారీ మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్లు సమీపంలోని కంప్యూటర్లతో మాత్రమే అనుసంధానం అవుతుండేవి.

అయితే, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మినీ కంప్యూటర్లనూ అనుసంధానం చేసే నెట్‌వర్క్‌ మధ్యలో మరికొన్ని మినీ కంప్యూటర్లను వాడాలని నిర్ణయించారు. అలా ఒక దాని నుంచి ఒకదానికి డేటాను ఎంత దూరమైనా బదిలీ చేయాలన్న ఆలోచన చేశారు.

ఆ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉండే కంప్యూటర్లన్నీ ఒకేలా పనిచేస్తాయి.

'ఏ' అనే ప్రదేశంలో ఉన్న కంప్యూటర్ నుంచి పంపిన 'డీ' ప్రదేశంలో ఉన్న కంప్యూటర్‌కు సందేశం చేరాలంటే మధ్యలో బీ, సీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ద్వారా ఆ సమాచారం వెళ్తుంది. 'ఏ' నుంచి వచ్చిన సందేశాన్ని 'బీ' తీసుకుని, 'సీ'కి పంపుతుంది. ఆ సందేశాన్ని 'సీ' తీసుకుని 'డీ'కి పంపుతుంది.

అలా 'డీ' నుంచి 'ఏ'కు సమాచారం అందాలన్నా అలాగే 'సీ', 'బీ'ల ద్వారా సమాచారం బదిలీ అవుతుంది. ఒక కంప్యూటర్‌కు ప్రోగాం రాస్తే, అది అన్నింటికీ పనికొస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

బ్లాక్ బాక్సు

క్లార్క్ ఒక అద్భుత ఆలోచన చేశారు. ఆ మినీ కంప్యూటర్లకు పక్కనే ఒక చిన్న బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. ఇతర ప్రాంతాలకు పంపాల్సిన సమాచారం మొదట కంప్యూటర్ నుంచి ఆ బాక్సుకు వెళ్తుంది. ఆ బాక్సు నుంచి నెట్‌వర్క్ ద్వారా ఇతర కంప్యూటర్లకు వెళ్తుంది. పూర్తి నెట్‌వర్క్‌కు అనుసంధానమై ఉండేది ఆ బాక్సు మాత్రమే.

నిజానికి పేరుకే అది చిన్న బ్లాక్ బాక్స్. కానీ, అది కూడా భారీగా, బూడిద రంగులో ఉండేది. దానిని ఇంటర్‌ఫేస్ మెసేజ్ ప్రాసెసర్ (ఐఎంపీ) అని పిలిచేవారు.

ఓ రిఫ్రిజిరేటర్ పరిమాణంలో ఉండే ఆ బాక్సు బరువు 400 కిలోలకు పైనే ఉంటుంది. అప్పట్లో ఒక్కో బాక్సు ఖరీదు 80,000 డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీలో దాదాపు రూ. 57 లక్షలు) ఉండేది.

తక్కువ పర్యవేక్షణ, వేడి లేదా చలి, కుదుపుల కారణంగా ఆగిపోకుండా పని చేస్తాయన్న ఆలోచనతో ఆ ప్రత్యేక బాక్సులను తయారు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తొలి దశలో ఆర్పానెట్ నిర్మాణాన్ని తెలిపే రేఖా చిత్రం

అక్టోబర్ 29న

మొదట 1969 ఆరంభంలో తొలి ఐఎంపీ-0 బాక్సు నమూనాను రూపొందించారు. కానీ, అది పనిచేయలేదు.

కొన్ని నెలల ప్రయాస తర్వాత అక్టోబర్ నాటికి ఐఎంపీ 1, ఐఎంపీ 2 బ్లాక్ బాక్సులను 500 కిలోమీటర్లకు పైగా దూరంలో లాస్ ఏంజలస్‌లో ఉన్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లలో అమర్చారు.

1969 అక్టోబర్ 29న రెండు కంప్యూటర్లు వాటితో అనుసంధానమై ఉన్న ఐఎంపీ బాక్సుల ద్వారా తొలి పదాన్ని పరస్పరం బదిలీ చేసుకున్నాయి. ఆ పదం "Lo ". 'లో' అంటే అదిగో చూడు అనే అర్థం కూడా ఉంది.

నిజానికి లాగిన్ (" Login " ) పూర్తి పదాన్ని పంపాలని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, రెండు అక్షరాల తర్వాత ఆ నెట్‌వర్క్ డౌన్ అయ్యింది.

ఆ తర్వాత నెట్‌వర్క్‌ను మెరుగుపరిచారు. దానికి 'ఆర్పానెట్' అని పేరు పెట్టారు.

ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు సాగిన ప్రాజెక్టులో భాగంగా దానిని వేర్వేరు నెట్‌వర్కులను అనుసంధానం చేసే (ఇంటర్‌కనెక్టింగ్) నెట్‌వర్క్‌గా అభివృద్ధి చేశారు. దానినే సరళంగా 'ఇంటర్నెట్' అని పిలుస్తున్నారు.

ఆ తర్వాత కొన్నేళ్లలోనే ఐఎంపీ బ్లాక్ బాక్సుల స్థానంలో 'రౌటర్లు' అనే ఆధునిక పరికరాలు వచ్చాయి. దాంతో 1980ల నుంచి ఆ బాక్సులు మ్యూజియంలో వస్తువులుగా మారిపోయాయి.

రాబర్ట్స్ ఊహించినట్లుగానే కంప్యూటర్‌లోని ప్రధానమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు అన్నీ నెట్‌వర్క్‌తో అనుసంధానం అయ్యాయి.

ప్రస్తుతం ఇంటర్నెట్, కంప్యూటర్‌లు ప్రజల జీవితంలో ఎలా భాగమయ్యాయో అందరికీ తెలిసిన విషయమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)