జగ్మీత్ సింగ్: కెనెడాలో ఒక సిక్కు 'కింగ్‌ మేకర్' ఎలా అయ్యారు?

కెనెడాలో ఒక సిక్కు 'కింగ్‌ మేకర్' ఎలా అయ్యాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కెనెడా 'న్యూ డెమాక్రటిక్ పార్టీ' చీఫ్ జగ్మీత్ సింగ్

కెనెడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మరోసారి ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఈసారీ ఆయన మెజారిటీ అందుకోలేకపోయారు.

మళ్లీ ప్రధాని అయ్యేందుకు జస్టిన్ ట్రూడోకు వేరే పార్టీల మద్దతు అవసరం. దాంతో, ఆయన ఇప్పుడు జగ్మీత్ సింగ్ వైపు చూస్తున్నారు.

జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీకి 24 సీట్లు వచ్చాయి. ఆయన పార్టీకి 15.9 శాతం ఓట్లు వచ్చాయి.

లిబరల్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కఠినంగా నిలిచాయి. అయితే సోమవారం అర్థరాత్రి ఆ పార్టీ నేతలకు ఉపశమనం లభించింది.

338 స్థానాలు ఉన్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకి 157 సీట్లు వచ్చాయి. అయితే మెజారిటీకి ఆయన 20 స్థానాలు కావాలి.

భారత సంతతి నేత జగ్మీత్ సింగ్ మంగళవారం 'కింగ్ మేకర్' పాత్రపై తన వైఖరి ఏంటో స్పష్టం చేశారు. "ఇది మైనారిటీ ప్రభుత్వం, అంటే ఇప్పుడు మేం కలిసి పనిచేయాలనే విషయాన్ని ట్రూడో అంగీకరిస్తారనే నేను ఆశిస్తున్నాను" అన్నారు.

కెనెడాలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడేలా ఉండడంతో ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ తమ పార్టీ డిమాండ్లను ముందే చెప్పారు.

వీటిలో, జాతీయ ఫార్మాకేర్ పథకానికి మద్దతు, హౌసింగ్‌లో పెట్టుబడులు, విద్యార్థుల రుణ సమస్య పరిష్కరించడం, మొబైల్, ఇంటర్నెట్ బిల్లులు తగ్గించడం, క్లైమెట్ యాక్షన్, కెనెడాలో సంపన్న ప్రజలపై పన్నులు పెంచడం లాంటివి ఉన్నాయి.

ఫొటో క్యాప్షన్,

కెనడా ఎన్నికల ఫలితాలు

జగ్మీత్ సింగ్ ఎవరు?

లిబరల్ పార్టీకి ఇప్పుడు న్యూ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ జగ్మీత్ సింగ్ చాలా కీలకం అయ్యారు. అయితే ఎన్డీపీ ఈసారీ 39 సీట్ల నుంచి 24కు పడిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో జగ్మీత్ సింగ్ పాత్ర చాలా కీలకం కావచ్చు.

2013లో అమృత్‌సర్ రావాలనుకున్న జగ్మీత్ సింగ్‌కు భారత్ వీసా ఇవ్వలేదు.

జగ్మీత్ కెనెడాలో సౌత్ ఓంటోరియో నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పార్టీ జెండా పంజాబ్‌, బర్నాలా జిల్లాలోని ఠిక్రివాల్ గ్రామానికి సంబంధించినది. ఆయన కుటుంబం 1993లో కెనెడా షిఫ్ట్ అయ్యింది.

భారత్‌లో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి జగ్మీత్ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడుతుంటారు. జగ్మీత్ వాటిని ప్రభుత్వం చేయించిన అల్లర్లని చెబుతారు.

2013లో భారత ప్రభుత్వం వీసా ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో "నేను 1984లో అల్లర్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాను. అందుకే భారత ప్రభుత్వం నన్ను చూసి భయపడుతోంది. 1984 అల్లర్లు రెండు సమాజాల మధ్య జరిగినవి కావు, అవి ప్రభుత్వ ప్రాయెజిత మారణహోమం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

కెనెడాలో సిక్కుల హవా

విస్తీర్ణం విషయంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన కెనెడాలో భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ముఖ్యంగా ఇక్కడ సిక్కుల జనాభా ఎక్కువ. జస్టిన్ ట్రూడో తన మొదటి పదవీకాలంలో క్యాబినెట్ ఏర్పాటు చేసినపుడు నలుగురు సిక్కులకు చోటివ్వడాన్ని గమనిస్తే, ఆ దేశంలో సిక్కులకు ఉన్న ప్రాధాన్యం ఏంటో అర్థమవుతుంది.

సిక్కులపట్ల ఆయనకు ఉన్న ఉదారత వల్లే కెనడా ప్రధానిని సరదాగా జస్టిస్ 'సింగ్' ట్రుడో అంటుంటారు.

"నేను ఎంత మంది సిక్కులకు క్యాబినెట్‌లో చోటిచ్చానో, అంతమంది భారత్ క్యాబినెట్‌లో కూడా లేరు" అని 2015లో జస్టిస్ ట్రుడో చెప్పారు.

కెనెడా హౌస్ ఆఫ్ కామన్స్ కోసం 2015లో జరిగిన ఎన్నికల్లో భారత సంతతి వారు 19 మంది ఎన్నికయ్యారు. అందులో 17 మంది ట్రుడో లిబరల్ పార్టీ సభ్యులే. దీనిని బట్టి కెనెడాలో భారతీయుల ప్రభావం ఎంతో చెప్పచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

వేర్పాటువాదులపై సానుభూతి

అయితే 2018 మొదట్లో జస్టిన్ ట్రుడో కుటుంబంతో సహా భారత్ వచ్చినపుడు ఆ పర్యటనను వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన ఏడు రోజుల పర్యటనలో విదేశీ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది.

కెనెడాలో ఖలిస్థాన్ తిరుగుబాటుదారుల బృందాలు చురుకుగా ఉన్నాయని, అలాంటి గ్రూపులపై జస్టిన్ ట్రూడోకు సానుభూతి ఉందని మీడియా చెప్పింది. ఉత్తర అమెరికాలో స్వతంత్ర ఖలిస్థాన్ కోసం మద్దతు పెరగడం కూడా కెనెడా, భారత ప్రభుత్వాల మధ్య గత కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు పెరిగాయని విదేశీ మీడియా తెలిపింది.

సిక్కు జాతీయవాదం ఖలిస్థాన్ పేరుతో ఒక స్వతంత్ర దేశం కోసం ప్రపంచమంతా ఉద్యమం నడిచింది. కెనెడాలో దాదాపు ఐదు లక్షల మంది సిక్కులు ఉన్నారు.

సిక్కు వేర్పాటువాదులపై ఉన్న సానుభూతి వల్లే ట్రుడో పర్యటన పట్ల భారత్ ఉదాసీనంగా వ్యవరించిందని చెబుతారు. అయితే భారత్ ఆ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. బీజేపీ నేత శేషాద్రి చారి బీబీసీతో "ఖలిస్తాన్ వాదులకు వ్యతిరేకం అని కెనెడా ప్రభుత్వం స్పష్టం చేసింది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters

కెనెడాలో ఎంతమంది సిక్కులున్నారు

అయితే, కెనెడాలో సిక్కుల జనాభా ఎంతకు చేరింది. కెనెడాలో ఏ ప్రభుత్వం వచ్చినా, సిక్కులకు అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తోంది.

ప్రస్తుతం కెనెడా జనాభాలో మతం, జాతి ఆధారంగా చూస్తే చాలా వైవిధ్యం ఉంది. జనాభా లెక్కల ప్రకారం 2016లో కెనెడా మొత్తం జనాభాలో మైనారిటీలు 22.3 శాతం ఉన్నారు.

కానీ, 1981లో కెనెడా మొత్తం జనాభాలో మైనారిటీలు 4.7 శాతమే ఉండేవారు. ఈ రిపోర్ట్ ప్రకారం 2036 నాటికి కెనెడా మొత్తం జనాభాలో మైనారిటీలు 33 శాతానికి చేరుతారు.

ప్రవాసుల కోసం కెనెడా చాలా మెరుగైన దేశం. ఎందుకంటే ఆ దేశం ప్రవాసులు కూడా అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితులను కల్పిస్తుంది. దాంతో అక్కడ చాలామంది అత్యున్నత స్థానాల వరకూ వెళ్లగలుగుతున్నారు అని 'వాషింగ్టన్ పోస్ట్‌ కాన్ఫరెన్స్ బోర్డ్ ఆఫ్ కెనెడా' సీనియర్ రీసెర్చ్ మేనేజర్ కరీమ్ ఈల్-అసల్ న్నారు.

ఫొటో సోర్స్, Getty Images

సిక్కు కెనెడా ఎప్పుడు, ఎలా వెళ్లాడు

1897లో మహారాణి విక్టోరియా బ్రిటిష్ భారత సైనికుల ఒక దళాన్ని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్‌లో పాల్గొనడానికి లండన్ ఆహ్వానించారు.

అప్పుడు ఒక అశ్వికదళం భారత మహారాణితోపాటు బ్రిటిష్ కొలంబియా వెళ్తోంది. ఆ సైనికుల్లో రిసాలేదార్ మేజర్ కేసర్ సింగ్ ఒకరు. అలా, రిసాలేదార్ కెనెడాకు షిఫ్ట్ అయిన మొదటి సిక్కు అయ్యారు.

కేసర్ సింగ్‌తోపాటు మరి కొంతమంది సైనికులు కెనెడాలో ఉండాలని నిర్ణయించుకున్నారు. వారు బ్రిటిష్ కొలంబియానే తన ఇల్లుగా అనుకున్నారు. మిగతా సైనికులు భారత్ తిరిగొచ్చి దానిని ఇక్కడివారికి ఒక కథలా చెప్పారు.

భారత్ చేరుకున్న సైనికులు బ్రిటిష్ ప్రభుత్వం తమను అక్కడ స్థిరపడాలని కోరిందని అన్నారు. ఇష్టం ఉన్న వారు అక్కడికి వెళ్లచ్చు అని చెప్పారు. అక్కడి నుంచే, సిక్కులు కెనెడా వెళ్లే పరంపర మొదలైంది. తర్వాత కొన్నేళ్లకే 5 వేల మంది భారతీయులు బ్రిటిష్ కొలంబియాకు చేరుకున్నారు. వారిలో 90 శాతం మంది సిక్కులే.

అయితే సిక్కులు కెనెడాలో స్థిరపడడం, వారి జనాభా పెరగడం అంత సులభంగా జరిగిపోలేదు. సిక్కులు వచ్చి తమ దేశంలోని ఉద్యోగాల్లో చేరడం కెనెడాలోని తెల్లవారికి నచ్చలేదు. భారతీయులపై వ్యతిరేకత కూడా మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images

కష్టపడి పైకొచ్చారు

కెనెడాలో ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న విలియమ్ మెకెంజీ కూడా "హిందువులకు ఈ దేశంలో వాతావరణం నచ్చడం లేదు" అని వేళాకోళం కూడా చేశారు.

1907 ప్రారంభంలో భారతీయులకు వ్యతిరేకంగా కెనెడాలో జాత్యహంకార దాడులు మొదలయ్యాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు భారత్ నుంచి ప్రవాసులు రావడంపై నిషేధం విధించడానికి చట్టం కూడా చేశారు.

కెనెడా వచ్చేటపుడు భారతీయుల దగ్గర 200 డాలర్లు ఉండాలని మొదట ఒక నిబంధన కూడా పెట్టారు. అయితే యూరోపియన్లకు మాత్రం ఆ మొత్తం 25 డాలర్లే.

కానీ అప్పటికే భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. వారిలో ఎక్కువ మంది సిక్కులే. ఎన్ని కష్టాలు ఎదురైనా వారు తమ కలలను వదులుకోడానికి సిద్ధంగా లేరు.

కష్టపడి పనిచేసిన సిక్కులు కెనెడాలో తమను తాము నిరూపించుకున్నారు. ఒక బలమైన సమాజ సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నారు. చాలా గురుద్వారాలు కూడా నిర్మించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

సిక్కులు ఘర్షణ

సిక్కులను బలవంతంగా కెనెడా నుంచి భారత్ కూడా పంపించారు. సిక్కులు, హిందువులు, ముస్లింలతో నిండిన కోమాగోటా మారు అనే నౌక 1914లో కోల్‌కతాలోని బజ్ బజ్ ఘాట్ చేరుకుంది.

వారిలో కనీసం 19 మంది చనిపోయారు. భారతీయులతో నిండిన ఈ నౌకను కెనెడాలోకి రానీయలేదు. నౌకలో ఉన్న భారతీయుల గురించి రెండు నెలల వరకూ ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ రోజు జరిగిన ఆ ఘటనకు ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో 2016లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో క్షమాపణ కూడా అడిగారు.

90వ దశకంలో కెనెడాలో లిబరల్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం సిక్కులకు కూడా చరిత్రాత్మకం అయ్యింది. కెనెడాలో సమాఖ్య ప్రభుత్వం ప్రవాస నియమాలను మార్చింది. వైవిధ్యాన్ని స్వీకరించడానికి తలుపులు తెరిచింది.

దాని ప్రభావంతో భారత సంతతి జనాభా వేగంగా పెరిగింది. భారత్‌లోని చాలా ప్రాంతాలవారు కెనెడా రావడం మొదలైంది. భారతీయలు కెనెడా వెళ్లడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ప్రస్తుతం కెనెడా సమాఖ్య ప్రభుత్వం పగ్గాలు కెనెడాలోని భారతీయుల చేతుల్లోనే ఉన్నాయి. ఆ దేశంలో అత్యంత పాపులర్ అయిన మూడో భాష పంజాబీనే. కెనెడా మొత్తం జనాభాలో 1.3 శాతం మందికి పంజాబీ అర్థమవుతుంది, మాట్లాడగలరు కూడా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)