వోడ్కా, విస్కీ, వైన్, బీర్, పచ్చి గుడ్డు సొన.. ఇవన్నీ కలిపేసి నీళ్లలా తాగేస్తాడు.. చైనాలో పెరుగుతున్న మద్యం దాహానికి ఇది సంకేతమా?

  • ఓవెన్ ఆమోస్
  • బీబీసీ ప్రతినిధి, సింగపూర్ నుంచి
లీయూ షిచావో Liu Shichao

ఫొటో సోర్స్, Liu Shichao

ఓ అర లీటర్ బీరు, ఒక డబ్బా పెప్సీ, పెద్ద గ్లాసు స్పిరిట్, పచ్చి గుడ్డు సొన... ఇవన్నీ కలిపితే ఏర్పడే ద్రావణం ఎలా ఉంటుంది? దానిని తాగుతారా?

చైనాకు చెందిన లియూ షిచావో ఆ పానీయాన్ని కొన్ని సెకన్ల వ్యవధిలోనే గటగటా తాగేస్తారు. అలా తాగుతూ ఉన్న వీడియోలను ఆయన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

ఎనిమిది సెకన్లలో ఆ పానీయాన్ని తాగుతున్న ఓ వీడియోకు ట్విట్టర్‌లో కోటీ 20 లక్షల వ్యూస్ వచ్చాయి. అనేక దేశాలలో ఆయనకు వేలాది మంది అభిమానులు అయ్యారు.

ఆ వీడియో ఒక్కటే కాదు. మరొక వీడియోలో అతను సిగరెట్ తాగుతాడు, ఆరు రకాల పానీయాలను కలిపిన ద్రావణాన్ని సెకన్లలో లాగించేస్తాడు. దానికి ట్విట్టర్‌లో 8,00,000 వ్యూస్ వచ్చాయి.

మరొక వీడియోలో, వోడ్కా, విస్కీ, రెడ్ వైన్, బీర్, గుడ్డును కలిపేసి దానిని నీళ్లలా తాగేస్తాడు. దానికి 5,00,000 వ్యూస్.

లియూ షిచావో ఎవరు? అలా తాగితే అతనికి శరీరానికి ఏమీ కాదా? చైనాలో పెరుగుతున్న మద్యం దాహానికి ఇది సంకేతమా?

అలా ప్రారంభమైంది

లియూ మూడేళ్ల క్రితం తన మొదటి వీడియోను తీశారు. అందులో 50 సెకన్ల వ్యవధిలో ఏడు బాటిళ్ల బీరు తాగేశాడు.

"కొందరు వ్యక్తులు బీర్ తాగుతున్న వీడియోను ఓరోజు చూశాను. నేను కూడా అలా చేయగలను అనిపించింది. దాంతో, నేనే ఇలా పానీయం చేసుకుని తాగడం మొదలుపెట్టాను" అని ఆయన చెప్పారు.

చైనాలో ట్రావెల్ బ్లాగర్ నుంచి చెఫ్‌ల వరకు సెలబ్రెటీలకు ఆన్‌లైన్‌లో విపరీతమైన ఫాలోవర్లు ఉంటున్నారు. అలాగే, తనకు కూడా అభిమానులు వస్తారన్న ఆలోచనతో చైనీస్ వీడియో షేరింగ్ యాప్ 'కువాయిషో'లో లియూ తన వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.

"నా వీడియోలు చాలా తక్కువ నిడివి ఉంటాయి. ఎందుకంటే, ఒక నిమిషం లోపు ఉన్న వీడియోలను మాత్రమే కువాయిషో యాప్ అనుమతిస్తుంది. కాబట్టి ఆ వ్యవధిలోనే నేను తాగడం పూర్తి చేయాలి" అని లియూ చెప్పారు.

ఫొటో సోర్స్, LIU SHICHAO

చైనా వెలుపలా ఫాలోవర్లు

కొద్ది రోజుల్లోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య 4,70,000 చేరింది. డొనేషన్ల రూపంలో నెలకు 10,000 యువాన్ల (లక్ష రూపాయలు) దాకా వచ్చాయి. అయితే, అనారోగ్యకరమైన పోస్టులు అప్‌లోడ్ చేస్తున్నాడన్న కారణంతో ఇతని ఖాతాను కువాయిషో తొలగించింది.

ఈ ఏడాది ఆగస్టులో ఇతడు కువాయిషోలో పోస్ట్ చేసిన ఒక వీడియో ట్విటర్‌లో షేర్ అయ్యింది. దాంతో, తొలిసారి చైనా వెలుపల ఆయన వైరల్ అయ్యారు.

"నేను ట్విటర్‌లో చాలా పాపులర్ అయ్యానని చాలామంది నాతో చెప్పారు. కానీ, వాళ్లు చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియదు" అని లియూ చెప్పారు.

చైనాలోని బీజింగ్ నగరానికి సమీపంలో ఉన్న హెబేయి ప్రావిన్సులో నివసించే 33 ఏళ్ల లియూ తనను తాను 'పల్లెటూరి కర్షకుడుని' అని చెప్పుకుంటారు. ఆయన ఇంగ్లిష్ రాదు. కాబట్టి, తన వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు శీర్షికలు ఇంగ్లిష్‌లో పెట్టేందుకు ట్రాన్స్‌లేషన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు.

"మాది గ్రామీణ ప్రాంతం. కాబట్టి, మొదట్లో నాకు సోషల్ మీడియా అప్లికేషన్ల గురించి తెలియదు" అని లియూ చెప్పారు.

ట్విటర్ లాంటి అనేక పాశ్చాత్య దేశాల సోషల్ మీడియా సైట్లు చైనాలో పనిచేయవు. కాబట్టి, ఆయన వీడియోను చైనా వెలుపల నుంచి ఎవరో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోతో చైనా వెలుపల అతనికి వేలాది మంది అభిమానులు అయ్యారు.

"విదేశీ అభిమానులు చాలా ఉత్సాహంగా, సరదా ఉంటారు. నా వీడియో చూసిన ఓ టర్కీ వ్యక్తి, నా చిరునామా అడిగి నాకు టర్కిష్ బీరు పంపిస్తానన్నాడు" అని లియూ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

భార్యకు కోపం

వీడియోలతో ఆయనకు ఇప్పటికీ ఆదాయం వస్తోంది. అలాగే, ఆయన ఆన్‌లైన్‌లో మాంసం అమ్ముతారు. ఒక రెస్టరెంట్ కూడా నడిపేవారు.

"నా మద్దతుదారుల్లో ఎక్క వమంది పురుషులే ఉన్నారు. వాళ్లకు కూడా తాగడం అంటే ఇష్టమని అనుకుంటున్నాను" అని ఆయన చెప్పారు.

"వేలాది మంది నన్ను అభిమానిస్తున్నారు. నా భార్య మాత్రం కోప్పడుతుంది. ఇలా తాగితే, ఆరోగ్యం చెడిపోతుందని ఆందోళన పడుతుండేది. ఎప్పుడూ ఇద్దరం తరచూ గొడవపడేవాళ్లం" అని లియూ వివరించారు.

"నేను ప్రతిరోజూ తాగేవాడిని కాదు. ఒంటరిగా ఎన్నడూ తాగను. ఉత్తర చైనా ప్రాంతంలో చాలామంది ఒంటరిగానే తాగేస్తారు. ఈ ప్రయోగాల వల్ల ఇప్పటి వరకు నేను ఎన్నడూ అనారోగ్యానికి గురికాలేదు. అయితే, అందరూ నాలా చేయాలని చెప్పడం లేదు. అందరూ తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన చెబుతున్నారు.

ఇటీవల ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. "ఆ వీడియోలో చూపిస్తున్న ప్రయోగాలను టీనేజర్లు అనుకరించకూడదు" అని ఆయన చెప్పారు.

అయితే, ఇలాంటి పానీయాలు తాగడం వల్ల అతనికి వాంతులు, వీరేచనాలతో పాటు, శ్వాస ఆగిపోవడం లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని లండన్‌కు చెందిన డాక్టర్ సారా కయాత్ అంటున్నారు. దీర్ఘకాలిక రుగ్మతలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పారు.

"అతిగా మద్యం సేవించడం వల్ల మానసిక సమస్యలు, కాలేయం, అధిక రక్త పోటు, గుండె కొట్టుకోవడంలో మార్పులు రావడంతో పాటు, కొన్ని రకాల కేన్సర్లూ వచ్చే ప్రమాదం ఉంటుంది" అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, LIU SHICHAO

ఫొటో క్యాప్షన్,

లీయూ షిచావో

చైనాలో పెరుగుతున్న మద్యపానం

చైనా ఆర్థికంగా వృద్ధి చెందుతున్న క్రమంలో, ఆల్కహాల్ సేవించడం కూడా పెరుగుతోంది.

2003లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ‌హెచ్‌వో) గణాంకాల ప్రకారం, చైనా జనాభాలో 4 శాతం మంది 'అతిగా మద్యం సేవించేవారు' ఉండేవారు. 2016 నాటికి అది 23 శాతానికి పెరిగింది.

ముఖ్యంగా చైనాలోని పురుషుల్లో మద్యానికి అలవాటు పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. 2003లో 7.5 శాతం ఉండగా, 2016 నాటికి 36 శాతానికి పెరిగింది.

చైనాలో పెరిగిపోతున్న ఈ మద్యం ట్రెండు వల్ల చాలామంది యువత చెడిపోతున్నారని, లియూ కూడా అందులో భాగమేనని మెల్‌బోర్న్‌లోని లా ట్రోబె విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ జాసన్ జియాంగ్ అన్నారు. ఆయన చైనాలో మద్యం గురించి విస్తృతంగా పత్రాలు రాశారు.

"నా దృష్టిలో లియూ అంతగా తాగడం చాలా ప్రమాదకరం. సమస్య ఏమిటంటే, ఆయన చేసే ట్వీట్లను అనేక మంది యువతీయువకులు లైకులు కొడుతున్నారు. అది చాలా మరింత ప్రమాదకరం. కొందరు ఇతర యువకులు చేసిన కొన్ని ట్వీట్లను చూశాను. వాళ్లు కూడా తాము ఎంత తాగుతామో వీడియోలలో చూపించేందుకు ఇష్టపడుతున్నారు. అంటే, లియూ ప్రభావం వారి మీద పడిందని తెలిసిపోతోంది" జియాంగ్ చెప్పారు.

"అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తొందరగా కనిపించకపోవచ్చు. కానీ, నేరాలు, రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడానికి ఆల్కహాల్ కారణమవుతోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం లియూ తన పాత వీడియోలను మళ్లీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. వాటికి అనేక దేశాల నుంచి భారీ స్పందన వస్తోంది.

"నేను చైనాలో గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరిన్ని అద్భుతమైన వీడియోలను మీతో పంచుకుంటాను. మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు" అని ఆయన ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. బీరు, బియ్యపు వైన్, స్పిరిట్, రెడ్‌బుల్, పచ్చి గుడ్డు సొన కలిపిన పానీయాన్ని 8 సెకన్లలోనే లాగించేసిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)