అమెరికా: జింకని చంపుదామనుకున్న వేటగాడిని అదే చంపేసింది

జింక

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఓ వేటగాడు జింక దాడిలో మృతిచెందాడు. అంతకు కొద్ది సేపటి ముందు ఆ వేటగాడు అదే జింకని చంపడానికి ప్రయత్నించాడు.

66 ఏళ్ల థామస్ అలెగ్జాండర్ ఓజార్క్ పర్వతాల సమీపంలో వేటకు వెళ్లాడు.

తన ఎదురుగా కనిపించిన జింకని తుపాకితో కాల్చాడు. అది పూర్తిగా నేలపై పడిపోవడాన్ని కళ్లారా చూశాడు.

దీంతో అది చనిపోయిందని భావించిన థామస్.. దాని కళేబరాన్ని లాక్కుని రావడానికి దగ్గరకు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా పైకి లేచిన జింక, అతడిపై దాడిచేసింది.

ఎలాగో అతి కష్టం మీద సమీపంలోనే ఉన్న తన భార్యను పిలిచాడు థామస్. ఆమె అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో వారు వచ్చి థామస్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ, అతడు అప్పటికే ప్రాణాలు వదిలాడు.

"థామస్ అలెగ్జాండర్ మరణం చాలా వింతగా ఉంది. నా 20 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఇలాంటి దాడిని ఇంతకుముందెన్నడూ చూడలేదు" అని అర్కాన్సాస్ గేమ్ అండ్ ఫిష్ కమిషన్‌కు చెందిన కీత్ స్టీఫెన్స్ స్థానిక మీడియాతో అన్నారు.

"అది నేలపై ఎంతసేపు పడి ఉందో నాకు తెలియదు. జింక చనిపోయిందని నిర్థారించుకోవడానికే థామస్ దాని దగ్గరకు వెళ్లాడు. కానీ అది చనిపోలేదు. తిరిగి దాడి చేసింది" అని స్పీఫెన్స్ తెలిపారు.

"ఎయిర్ అంబులెన్స్‌లో అతడిని ఆస్పత్రికి తరలించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించారు. కానీ అతడిని హెలీకాప్టర్‌లోకి ఎక్కించేలోపే మరణించాడు. దీంతో ఎయిర్ అంబులెన్స్ ఉపయోగించలేదు" అని స్టీఫెన్స్ బీబీసీతో చెప్పారు.

"థామస్ మరణానికి కారణం ఏంటనేది పోస్ట్ మార్టమ్ తరవాతే స్పష్టంగా తేలుతుంది, కానీ అతడి శరీరంపై చాలా భాగాల్లో తీవ్ర గాయాలున్నాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి" అని ఆయన అన్నారు.

గాయపడిన జింక కోసం కూడా కమిషన్ బృందం వెతుకుతోంది.

ఈ వీడియో చూశారా!

వీడియో క్యాప్షన్,

చిరుత నుంచి జింక ఎలా తప్పించుకుందో చూడండి!

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)