ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ హతం - డోనల్డ్ ట్రంప్

ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అల్ బగ్దాదీ అమెరికా సైన్యం ఆపరేషన్‌లో హతమయ్యాడని వైట్‌హౌస్ నుంచి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
"సిరియాలో శనివారం నాడు మా సైనికులు ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ స్థావరాన్ని చుట్టుముట్టారు. దీంతో తన దగ్గరనున్న ఆత్మాహుతి కోటును పేల్చుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇస్లామిక్ స్టేట్ చరిత్ర ముగిసినట్లే.
బగ్దాదీ కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వెతుకుతోంది. నేను పదవిలోకి రాకముందు కూడా అతడిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి.
ఈ ప్రయత్నంలో సహకరించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను అభినందిస్తున్నా" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా సైన్యం బగ్దాదీని చుట్టుముట్టిన ప్రదేశం
అమెరికా సైన్యం బగ్దాదీ స్థావరాన్ని చుట్టుముట్టిన సమయంలో అతడి ముగ్గురు పిల్లలు కూడా అక్కడే ఉన్నారని ట్రంప్ తెలిపారు. బగ్దాదీతోపాటు పిల్లలు కూడా ఆత్మాహుతి పేలుడులో చనిపోయారన్నారు.
పేలుడులో బగ్దాదీ శరీరం ముక్కలు ముక్కలైపోయింది. కానీ డీఎన్ఏ పరీక్షల ఫలితాల ద్వారా బగ్దాదీ మరణాన్ని ధ్రువీకరిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఎందరినో భయపెట్టిన నేరస్తుడు బగ్దాదీ తన చివరి క్షణాల్లో మాత్రం తీవ్ర భయాందోళనల మధ్య బతికాడని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా సైన్యం చాలా ధైర్యంగా, రాత్రివేళ చేపట్టిన ఆపరేషన్‌లో బగ్దాదీని చుట్టుముట్టి, మట్టుబెట్టగలిగిందని ఆయన ప్రకటించారు.
ఈ ఆపరేషన్‌లో అమెరికా సైనికులు ఎవరూ చనిపోలేదని, బగ్దాదీ అనుచరులు మాత్రం కొందరు మరణించారని ట్రంప్ అన్నారు.
ఈ ఆపరేషన్ ద్వారా ఎంతో విలువైన సమాచారం సేకరించినట్లు కూడా ఆయన తెలిపారు.
ఆదివారం ఉదయం ఉన్నట్లుండి తన ట్విటర్ అకౌంట్లో ట్రంప్ ఓ వ్యాఖ్య చేశారు. 'చాలా పెద్ద సంఘటన ఒకటి ఇప్పుడే జరిగింది' అని ఆయన పోస్ట్ చేశారు.
గతంలో కూడా రెండు మూడు సార్లు లక్ష్యానికి సమీపంలోకి వెళ్లినప్పటికీ... బగ్దాదీ తన స్థావరాలను మార్చుకోవడం వల్ల తృటిలో తప్పించుకున్నారని ట్రంప్ తెలిపారు.
ఇటీవలే ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్‌ను మేం హతమార్చామని ట్రంప్ గుర్తుచేశారు.
ఫొటో సోర్స్, AFP
అబూ బకర్ అల్-బగ్దాదీ ఎవరు?
ఐసిస్ నాయకుడు అబూ బకర్ అల్-బగ్దాదీని ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్‌గా వర్ణిస్తారు.
2011 అక్టోబర్‌లో అమెరికా ఆయన్ను అధికారికంగా ఉగ్రవాదిగా గుర్తించింది. ఆయన్ను పట్టుకోడానికి లేదా చంపడానికి తగిన సమాచారం ఇచ్చేవారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది.
బగ్దాదీని యుద్ధభూమిలో అత్యంత వ్యవస్థీకృతంగా క్రూరంగా వ్యవహరించే వ్యూహకర్తగా భావిస్తారు.
బగ్దాదీ 1971లో ఉత్తర బగ్దాద్‌లోని సమర్రాలో జన్మించారు. ఆయన అసలు పేరు ఇబ్రహీం అవద్ అల్-బద్రి.
అమెరికా నేతృత్వంలో ఇరాక్‌పై దాడి జరిగినపుడు ఆయన ఒక మసీదులో మత పెద్దగా ఉండేవారని కొన్ని నివేదికలు చెప్పాయి.
కొంతమంది మాత్రం సద్దాం హుస్సేన్ పాలనా కాలంలోనే బగ్దాదీ ఒక మిలిటెంట్ జీహాదీగా ఉన్నారని భావిస్తున్నారు. దక్షిణ ఇరాక్‌లో అల్ ఖైదా కమాండర్లను బంధించిన బుక్కా క్యాంపులో బగ్దాదీని కూడా నాలుగేళ్లు నిర్బంధించినపుడు మిలిటెన్సీ వైపు మళ్లారని చెబుతారు.
2010లో బగ్దాదీ ఇరాక్‌లో ఐఎస్‌లో కలిసిపోయిన గ్రూపుల్లో ఒకటైన అల్ ఖైదాకు నాయకుడుగా ఆవిర్భవించారు. సిరియాలో అల్-నుస్రా ఫ్రంట్‌తో విలీనం కావడానికి ప్రయత్నించినపుడు ఆయన కీలకంగా మారారు.
అబూ బకర్ అల్ బగ్దాదీని ఇస్లామిక్ స్టేట్ చీఫ్‌గా చెబుతారు. గత ఐదేళ్లుగా ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నారు.
గతంలో కూడా బగ్దాదీ చనిపోయాడని చాలాసార్లు వార్తలు వచ్చాయి.
ఏప్రిల్‌లో ఇస్లామిక్ స్టేట్ మీడియా వింగ్ అల్-ఫుర్క్వాన్ తరఫున ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో బగ్దాదీ బతికే ఉన్నట్టు చెప్పారు.
2014 జులైలో మోసూల్లోని పవిత్ర మసీదు నుంచి ప్రసంగించినపుడు బగ్దాదీ మొదటిసారి బయట కనిపించారు.
2017 మేలో జరిగిన వైమానిక దాడుల్లో బగ్దాదీ గాయపడ్డారని 2018 ఫిబ్రవరిలో అమెరికా అధికారులు చెప్పారు.
బగ్దాదీ 2010లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్(ఐఎస్ఐ) నాయకుడు అయ్యారు.
ఇవి కూడా చదవండి.
- అబూ బకర్ అల్ బగ్దాదీ ఎవరు? ఖురాన్ బోధించే ‘భక్తుడు’ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఎలా అయ్యారు?
- ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ అంతమైనట్లేనా.. ప్రస్తుత పరిస్థితి ఏమిటి
- ఐఎస్ కిల్లర్: నేను 100 మందికి పైగా చంపాను!
- జింకని చంపుదామనుకుంటే అదే వేటగాడిని చంపేసింది
- హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
- అంతరిక్షంలో ఎక్కువ ఇబ్బంది పడేది పురుషులా.. మహిళలా?
- దీపావళి రోజున గుడ్లగూబను బలిస్తే సంపద రెట్టింపు అవుతుందా
- 346 మంది ప్రాణాలు తీసిన ఆ విమానం కూలడానికి వరుస వైఫల్యాలే కారణం
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
- బీసీసీఐ ప్రెసిడెంట్: నాడు విజయనగరం రాజ కుమారుడు.. నేడు కోల్‌కతా ‘ప్రిన్స్’.. 65 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు కెప్టెన్‌కు పగ్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)