సిరియా కుర్దులు: ‘ట్రంప్ మమ్మల్ని అమ్మేశాడు... ప్రపంచం కళ్లు మూసేసుకుంది’’

  • జియార్ గోల్
  • బీబీసీ పర్షియన్, ఉత్తర సిరియా
సిరియా కుర్దులు

ఫొటో సోర్స్, AFP

మేం ఖమిష్లీ బయలుదేరాం. అది సిరియాలోని ఉత్తర ప్రాంతంలో అతి పెద్ద కుర్దు నగరం. దారిలో అమెరికా మిలటరీ కాన్వాయ్ కనిపించింది. వాటికి ఆకాశంలో యుద్ధ విమానాలు రక్షణగా ఉన్నాయి. ఆ సైనిక దళాలు ఇరాక్ సరిహద్దు వైపుగా కుర్దు ప్రాంతం నుంచి వెళ్లిపోతున్నాయి.

సిరియాలో నేను మొదటిసారి ఒక అమెరికా వ్యక్తిని చూసింది 2016లో. అతడు అమెరికా సైనికుడు. ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో పోరాటంలో కుర్దులకు సాయం చేయటానికి ఆ సైనికులను పంపించారు. వారు వస్తుంటే స్థానికులు చాలా ఆతృతగా చూసేవారు.

కానీ.. ఇప్పుడు పరిస్థితి దానికి వ్యతిరేకం. స్థానికుల కళ్లలో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మేం టర్కీ సరిహద్దు దాటి కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే వచ్చాం. ఆకాశంలో ఒక యుద్ధ విమానం చక్కర్లు కొట్టింది. ఆ విమానం నుంచి తెల్లటి పొగ టర్కీ గగనతలంలో ఒక చిన్న తోకలా ఏర్పడింది.

మాకు రక్షణగా వచ్చిన గార్డుల్లో ఒకరు నిట్టూర్చారు. ''ట్రంప్ బి నమూసే'' అన్నారు కుర్దిష్ భాషలో. అంటే.. ''ట్రంప్‌కి నీతి లేదు'' అని అర్థం.

కుర్దులు భయపడటానికి అనేక కారణాలున్నాయి. ఒకవైపు పొరుగున ఉన్న టర్కీతో.. మరోవైపు సిరియా ప్రభుత్వ దళాలతో వారు తలపడుతున్నారు.

ఇప్పుడు అమెరికా సైన్యం ఈ ప్రాంతాన్ని వీడి వెళ్తోంది. ఇక తాము నివసించే ప్రాంతంలోని పర్వతాలు మినహా తమకు సాయపడే స్నేహితులెవరూ లేరని కుర్దులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

''ట్రంప్ మమ్మల్ని అమ్మేశాడు''

ఖమీష్లీలోకి మేం అడుగుపెట్టినప్పటి నుంచీ.. సాధారణ పౌరులు మమ్మల్ని ఒకటే ప్రశ్న అడిగారు: ''ట్రంప్ మమ్మల్ని ఎందుకు అమ్మేశాడు?''

ఇది సంప్రదాయ సమాజం. తాము నీతికి కట్టుబడి ఉండటం పట్ల వీరు చాలా గర్వంగా ఉంటారు. ఇప్పుడు తమను నట్టేట ఎందుకు వదిలేశారన్నది వీరికి అర్థం కావటం లేదు.

''అమెరికా మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది.. ట్రంప్ మమ్మల్ని అమ్మేశాడు.. మాకు నమ్మకద్రోహం చేశారు'' - మాకు పదే పదే వినిపించిన మాటలు ఇవి.

ఐఎస్‌ మీద యుద్ధంలో నేలకొరిగిన పురుషులు, మహిళల ఫొటోలు.. నగరంలోని కూడళ్లు, విద్యుత్ స్తంభాల మీద అలంకరించి ఉన్నాయి.

ఈ చిన్న ప్రాంతంలో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఐఎస్ తొలిసారి 2014లో కుర్దుల మీద దాడి చేసినప్పటి నుంచీ ఇదే పరిస్థితి.

ఫొటో సోర్స్, AFP

కానీ ఇప్పుడు.. టర్కీ, దాని మిత్ర పక్షాలు ఈ నెల మొదట్లో ప్రారంభించిన సీమాంతర దాడుల్లో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేస్తున్నారు.

ఆ అంత్యక్రియల్లో చాలా మంది తమ కన్నీళ్లు దాచేసుకుంటారు. నృత్యం చేస్తూ, నినాదాలు చేస్తూ శవపేటికలను స్మశానానికి మోసుకెళ్తారు.

అలాంటి ఒక కుర్దు వైపీజీ సైనికుడి అంత్యక్రియల దగ్గర.. అరవై ఏళ్లు పైబడిన ఒక పొడవాటి వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ''ఎర్దొగాన్‌కి కుర్దులంటే ఇష్టం లేదు. మేం వెళ్లిపోవాలన్నది ఆయన కోరిక'' అని చెప్పాడు. టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్దొగాన్.. వైపీజీ సభ్యులను ఉగ్రవాదులుగా పరిగణిస్తారు.

ఐఎస్‌తో పోరాటంలో 11,000 మంది కుర్దు స్త్రీ, పురుషులు చనిపోయారు. ''ఆ పోరాటం మా ఒక్కరిది మాత్రమే కాదు. మేం మొత్తం మానవాళి తరఫున పోరాడాం. అంతర్జాతీయ సమాజం ఏమైపోయింది? ఎర్దొగాన్‌ను ఎందుకు ఆపరు?'' అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images

''ఉపయోగం ఏముంది?''

ఒక బేకరీలో రెట్టెలు పేర్చి ఉన్నాయి. సరిహద్దులో పోరాడుతున్న ఫైటర్ల కోసం వాటిని సిద్ధం చేశారు. బహోజ్ పిండి కోస్తున్నాడు. అమెరికన్లు, యూరోపియన్ల గురించి నా అభిప్రాయం ఏమిటని నన్ను అడిగాడు. అతడి వయసు పదహారేళ్లు.

''ఎర్దొగాన్ మమ్మల్ని ఊచకోత కోయకుండా వాళ్లు ఆపుతారని మీరు భావిస్తున్నారా?'' అంతకన్నా వయసులో కొంచెం పెద్దవాడైన మరో బాలుడు పెద్దగా అడిగాడు.

''ట్రంప్ మమ్మల్ని అమ్మేశాడు. మా ప్రాణాల కన్నా చమురే వాళ్లకి చాలా ముఖ్యం'' అని అరిచాడు.

ఆ పిల్లల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. టర్కీకి అనుకూలమైన ఇస్లామిక్ మిలీషియాలు ఇక్కడికి చేరుకుంటే.. ముందు తమనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటారని వారికి తెలుసు.

టర్కీ మద్దతున్న మిలీషియాలు ''అల్లాహు అక్బర్'' అని నినదిస్తూ.. ఇలాంటి బాలురిని చేతులు కట్టేసి తుపాకులతో కాల్చివేస్తున్నట్లు చూపించే వీడియోలు ఇప్పటికే బయటకు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, AFP

గాయపడ్డ వైపీజీ ఫైటర్లకు ఒక ఆస్పత్రిలో చికిత్స చేస్తున్న డాక్టర్ రోజ్దా.. ఒక ఆపరేషన్ థియేటర్ నుంచి మరొక ఆపరేషన్ థియేటర్‌కు పరుగులు పెడుతున్నారు.

మూడు పదుల వయసున్న ఆ మహిళ ఆ ఆస్పత్రి డైరెక్టర్ కూడా.

''వీడియో చిత్రీకరించటం వల్ల ఉపయోగం ఏముంది? మీ సమయం వృథా చేసుకోవద్దు. మా విషయంలో ప్రపంచం కళ్లు మూసుకుంది'' అన్నారామె.

అక్కడ నేను కలిసిన పేషెంట్లలో ఒకరు జియాన్. ఆమె వయసు 23 ఏళ్లు. శూన్యంలోకి చూస్తూ బెడ్ మీద కూర్చుని ఉన్నారు. ఆమె తలకు ఆపరేషన్ చేసి కట్టుకట్టి ఉంది. ఆమె పుర్రె దెబ్బతింది. ఒక చేయి, రెండు కాళ్లకూ గాయాలయ్యాయి.

''కోబేన్, మాన్బిజ్, రక్కాల్లో నేను ఐఎస్‌తో పోరాడుతూ గాయపడకుండా బయటపడ్డాను. కానీ.. టర్కీ వాళ్లు నన్ను దాదాపు చంపేశారు'' అంటూ నిర్వేదంగా నవ్వారామె.

సరిహద్దులోని రస్ అల్-ఐన్ పట్టణం మీద టర్కీ దాడిచేసినపుడు జియాన్ అక్కడే ఉన్నారు. ఆమె దళం మీద టర్కీ బాంబుల వర్షం కురిపించింది.

''టర్కీ మద్దతున్న ఆ దొంగలను మేం బలంగా ఎదుర్కొన్నాం. కానీ.. టర్కీ మందుగుండు ముందు మేం నిలువలేకపోయాం. నా స్నేహితులు చాలా మంది చనిపోయారు'' అని ఆమె నాకు వివరించారు.

ఫొటో సోర్స్, AFP

''వాళ్లు మా కోసం వస్తున్నారు''

మేం సిరియా నుంచి బయటకు ప్రయాణమైనపుడు దారిలో కినో గాబ్రియెల్ కలిశారు. కుర్దుల సారథ్యంలోని మిలీషియాల కూటమి ఎస్‌డీఎఫ్ అధికార ప్రతినిధి ఆయన.

ఎస్‌డీఎఫ్‌లో భాగస్వామి అయిన క్రిస్టియన్ సిరియాక్ మిలటరీ కౌన్సిల్ వ్యవస్థాపకుడు కూడా. ఆయన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ మీద విమర్శలు చేయలేదు. అమెరికా తన మనసు మార్చుకుని ఎస్‌డీఎఫ్‌కు మద్దతు ఇవ్వటానికి తిరిగి వస్తుందన్నది ఆయన ఆశ.

''టర్కీ మద్దతున్న ఆ జిహాదీలు దాడి చేస్తూ వస్తున్నది కేవలం మా భూమి కోసం మాత్రమే కాదు.. వాళ్లు మమ్మల్ని మతద్రోహులుగా పరిగణిస్తారు. వాళ్లు మా కోసం వస్తున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ ఉత్తర్వులతో ఖమిష్లీ నుంచి గత వారం అమెరికా బలగాలు వెనుదిరిగిన తర్వాత.. ఒక ఫొటో పరిస్థితికి అద్దంపడుతోందని కుర్దులు చెప్తున్నారు. అక్కడి నుంచి వెళ్లేటపుడు సైనిక వాహనంలో కూర్చున్న అమెరికా సైనికుడి భుజం మీద వైపీజే (కుర్దు మహిళా సాయుధ దళం) చిహ్నం ధరించివున్న ఫొటో అది. వాళ్లు హడావుడిగా వెళ్లిపోతున్నారన్న విషయాన్ని అది చాటుతోంది.

''అమెరికా సైనికుల పరిస్థితి కూడా మాలాంటిదే. ఈ రాజకీయ నిర్ణయంతో వారు దిగ్భ్రాంతికి, అసంతృప్తికి గురయ్యారు. కానీ అది వారి తప్పు కాదు. వారి త్యాగాలను కూడా మేం గౌరవిస్తాం'' అని చెప్పారు గాబ్రియెల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)