సినీడ్ బుర్కీ: ఫ్యాషన్ ముఖచిత్రంగా ఎదిగిన ‘లిటిల్ పర్సన్’
- బెథ్ రోజ్, ఇవా ఓంటివెరస్
- బీబీసీ ఔచ్, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్ వోగ్ మ్యాగజీన్ సెప్టెంబర్ ఎడిషన్ ముఖచిత్రంగా సినీడ్ బుర్కీ ఫొటో ప్రచురితమైంది. కానీ, ఆమె అదొక్కటే చాలని కోరుకోవడం లేదు. ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నారామె.
ఆమె ఒక రచయిత్రి, విద్యావేత్త, న్యాయవాది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ భవనాలు, దుస్తులు, జీవితం అన్నిటిపై సమాన హక్కులు ఉండాలంటారామె.
సినీడ్ ఒక మరుగుజ్జు. కానీ, అలా తనని పిలవడం ఆమెకు నచ్చదు. ఆమె గురించి ఎవరైనా చెప్పేటప్పుడు లిటిల్ పర్సన్ అంటే బాగుంటుందంటారామె.
ఆమె ఊహిస్తున్న భవిష్యత్తులో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుంది. గతకాలపు అణచివేతలు, అభివృద్ధికి దూరం చేయడాలు లేని సమాజాన్ని ఆమె కోరుకుంటున్నారు.
''అందరికీ సమాన అవకాశాలు ఉండేలా.. అందరికీ అన్నీ దక్కేలా, వివక్షలేకుండా ఈ ప్రపంచాన్ని పునర్నిర్మించాలనుకుంటున్నాను'' అంటారామె.
ఫొటో సోర్స్, Getty Images
సవాళ్లను అధిగమించి..
మెరుగైన ప్రపంచ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అందులో ఉండబోయే ప్రతి ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోవాలి.
చిన్నతనంలో తనను తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించేవారని ఆమె చెప్పారు. తన విజయం వెనుక తల్లిదండ్రుల మద్దతు, ప్రేమ ఉన్నాయంటారామె.
''మా నాన్న కూడా మరుగుజ్జే. ఒక మరుగుజ్జుగా ఆయన ఈ ప్రపంచంలో మనుగడ సాధించి, అభివృద్ధిలోకి వచ్చారు కాబట్టి అంతా సరిగ్గా జరుగుతుందని అనుకున్నాను'' అన్నారు సినీడ్.
కానీ, ఆ తరువాత ఆమెకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇది తనలాంటి వారికోసం డిజైన్ చేసిన ప్రపంచం కాదని అర్థమైంది. కుర్చీలు, దుకాణాల్లోని కౌంటర్లు, లాకర్లు, వాష్ బేసిన్లు ఏవీ తనలాంటివారికి అనుకూలంగా డిజైన్ చేసినవి కావని తెలుసుకుంది.
నా పరిమాణం ఆధారంగా ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారన్నదీ ఆమెకు సవాల్‌గా కనిపించింది. కానీ, జనం దృష్టిలో ఏర్పడిపోయిన ఆ భావనను తొలగించడాన్ని బాధ్యతగా తీసుకున్నారామె.
ఫొటో సోర్స్, Getty Images
దుస్తులే కవచంగా..
ఫ్యాషన్‌పై సినీడ్కు చిన్ననాటి నుంచే ఆసక్తి మొదలైంది. ప్రపంచంలోని డిజైన్లు తన కోసం కాదని అర్థమైంది అంటారామె.
సినీడ్ తల్లి, అక్కచెల్లెళ్లు, సోదరుడు మరుగుజ్జులు కారు. తోబుట్టువులందరిలోనూ తనే పెద్దదైనప్పటికీ వారిలా తనకు కావాల్సిన దుస్తులు దొరకలేదని ఆమె గుర్తించారు. వారికి రకరకాల డిజైన్లు, రంగుల్లో దుస్తులు దొరుకుతుంటే తనకు మాత్రం అలాంటి అవకాశం లేకుండాపోయింది.
'ఇది చాలా అన్యాయమని భావించాను''
'అప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను. నేనెంత ఎత్తున్నాన్న అంశంతో సంబంధం లేకుండా బతకగలిగే ప్రపంచం అది. అక్కడ నేనెవరన్నది నా వాదనా పటిమే చాటుతుంది'
ఆన్లైన్లో ఆమె చాలా ధైర్యంగా ఉండేవారు.. తాను మెచ్చిన వ్యక్తులతో మాట్లాడేవారు.
వోగ్స్ ముఖచిత్రంగా..
''చిన్నప్పుడు ఫ్యాషన్ రంగానికి తనలాంటివారు మినహాయింపని భావించాను, కానీ, అదే తన కెరీర్ ఎందుకు కాకూడదని 29 ఏళ్ల వయసులో అనిపించింది'' అని చెప్పారామె.
సెప్టెంబరులో వోగ్ మ్యాగజీన్ ముఖచిత్రంపై సినీడ్ ఫొటో వచ్చింది. ఒక మరుగుజ్జుకు ఆ గుర్తింపు రావడం అదే తొలిసారి.
సినీడ్ పెద్దవుతున్నకొద్దీ తనలాంటి వారు ప్రపంచంలో ఇంకెవరెవరున్నారో తెలుసుకోవాలనే తాపత్రయంతో పుస్తకాలు, పత్రికలు, ప్రకటనల్లో వెతుకుతూ ఉండేవారు. స్కూళ్లో సిబ్బంది గదుల్లోనూ చూసేవారు.. రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా అని పరిశీలించేవారు.
వోగ్ మ్యాగజీన్ ముఖచిత్రంగా వచ్చిన తరువాత ఆమెలాంటి ఎందరో మరుగుజ్జులు తాము సినీడ్ చిత్రమున్న మ్యాగజీన్ పట్టుకుని దిగిన ఫొటోలను ఆమెకు పంపించారు.
తన అడుగుజాడల్లో నడిచే మరో మరుగుజ్జు రావడానికేమీ శతాబ్దాలు పట్టదనిపిస్తోందని ఆమె అన్నారు. అంతేకాదు... ఫ్యాషన్ రంగం దృష్టి మారుతోంది.. తమలాంటివారికీ ఫ్యాషన్ ఇప్పుడు అందుబాటులోకి వస్తోందని ఆమె అర్థం చేసుకున్నారు.
ఆమె వార్డ్‌రోబ్‌లో ఇప్పుడు క్రిస్టొఫర్ కేన్, గుచీ, గివెన్చీ, స్టెల్లా మెక్కార్ట్నీ, బుర్బెర్రీ బ్రాండ్ వస్త్రాలున్నాయి. గొప్ప దుస్తులు వేసుకోవడం తన లక్ష్యమేమీ కాదని, కానీ.. అవేమీ తమకు అందుబాటులో లేనివి కావని నిరూపించడమే తన లక్ష్యమని అంటారామె.
మీరు నిజంగా సమాజాన్ని మార్చాలనుకుంటే, మొదట మీ ఆలోచనలు మార్చుకోవాలని సినీడ్ అంటారు.
ఇటీవలి కాలంలో సినీడ్ ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, చర్చిలు సందర్శిస్తూ సమ్మిళిత ప్రాతినిధ్యంపై మాట్లాడుతున్నారు.
'ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రయాణం సులభమైంది కానీ, విమానాలు, విమానాశ్రయాల్లో తనలాంటి వారికి కావాల్సిన సౌకర్యాలు లేవు'' అంటారామె.
'విమానం సీట్లో తనకు తాను కూర్చోలేకపోవడం నుంచి, టాయిలెట్ తలుపు మీద ఉన్న తాళాన్ని అందుకోలేకపోవడం, తన సామగ్రిని పైన పెట్టలేకపోవడం' వంటివన్నీ ఇబ్బందేనంటారామె.
''అనేక విమానాశ్రయాల్లో వైకల్యంతో ఉన్నవారికి సేవలందించడానికి వసతులు, సిబ్బంది ఉన్నారు.. అది మంచిదే. కానీ, అదేసమయంలో డిజైన్ విషయంలో సాధారణ వ్యక్తులకు, మరుగుజ్జులకు మధ్య అంతరాన్ని తొలగించే ప్రయత్నమూ వేగవంతం చేయాలి'' అనేది ఆమె మాట.
ఇవి కూడా చదవండి
- ‘‘ట్రంప్ మమ్మల్ని అమ్మేశాడు.. ప్రపంచం కళ్లు మూసేసుకుంది’’
- ‘రూ.46 కోట్లు ఇవ్వలేకపోతున్నారా..’: ఆర్టీసీ కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
- అబూ బకర్ అల్ బగ్దాదీ ఎవరు? ఖురాన్ బోధించే ‘భక్తుడు’ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఎలా అయ్యారు?
- "విమానం టాయిలెట్లో సీక్రెట్ కెమెరా, పైలెట్లు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు"
- స్టాకర్వేర్: భార్యలు, భాగస్వాములపై నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- గద్దలపై డేటా రోమింగ్ చార్జీలు.. క్రౌడ్ ఫండింగ్‌లో రూ. 1,11,000 సేకరించిన రష్యన్లు
- బోరు బావిలో 88 అడుగుల లోతులో బాలుడు, ‘కాపాడేందుకు మరో 12 గంటలు’ ఆపరేషన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)