కాస్మటిక్ సర్జరీ ఫెయిల్... 97 లక్షల పరిహారం చెల్లించకుండా డాక్టర్ పరార్
- క్లేరీ డైమండ్, లూసీ ఆడమ్స్
- బీబీసీ డిస్‌క్లోజర్

ఫొటో సోర్స్, catherine roan
క్యాథరీన్ రోన్ ముక్కు పెద్దదిగా ఉండడంతో సరిచేయించుకోవాలనుకున్నారు. అందుకోసం ఆమె చేయించుకున్న తొలి ఆపరేషన్... ఆ తరువాత చేయించుకున్న మూడు ఆపరేషన్లు ఆమె ముఖాన్ని పూర్తిగా మార్చేశాయి.
ఇప్పుడామె కారు యాక్సిడెంట్లో ముఖమంతా చితికిపోయిన మనిషిలా కనిపిస్తున్నారని డాక్టర్లే అంటున్నారు.
బ్రిటన్‌లోని ప్రముఖ కాస్మటిక్ సర్జరీల సంస్థ 'ట్రాన్స్‌ఫార్మ్'లో 41 ఏళ్ల క్యాథరీన్ తన ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. రినోప్లాస్టీ అనే ఆ సర్జరీని ఇటలీ నుంచి వచ్చే డాక్టర్ ఆంటోనియో ఒటావియానీ చేస్తారని ఆస్పత్రి ఆమెకు చెప్పింది.
ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లే డాక్టర్ ఆంటోనియో ఆమె ముక్కుకు సర్జరీ చేశారు. కానీ, ఆ ఇటలీ డాక్టర్ చేసిన సర్జరీ ఫెయిలైంది.
ఆ తరువాత నాలుగేళ్లలో ఆయన మూడు సార్లు ఆమె ముక్కుకు సర్జరీ చేశారు.
ఫొటో సోర్స్, Rebecca Macphail
మిగతా డాక్టర్లూ చేతులెత్తేశారు
''అలా చేసిన ప్రతి సర్జరీ నాకు నిరాశే మిగిల్చింది. ఎంతో నొప్పి, బాధ కలిగించింది'' అని క్యాథరీన్ బీబీసీతో చెప్పారు.
'నాలుగో సర్జరీ తరువాత ప్లాస్టర్లు తొలగించిన తరువాత అద్దంలో నా ముఖం చూసుకున్నాను. అంతకుముందు కంటే ఏమాత్రం బాగులేదిప్పుడు. ఒక వైపు చర్మం వేలాడుతోంది. ఆపరేషన్ తేడా చేసిందని అర్థమైంది''
నాలుగో ఆపరేషన్ తరువాత కూడా ఆమె ముక్కు సరికాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ ఆంటోనియోకు ఆ ఫొటోలు పంపించారు.
ఆయన మళ్లీ శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమయ్యారు కానీ క్యాథరీన్‌కే ఆయనపై నమ్మకంపోయి వేరే డాక్టరు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కానీ, చాలామంది వైద్యులు ఆమె పరిస్థితి చూసి తాము జోక్యం చేసుకోలేమంటూ ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు.
చివరకు ఓ సర్జన్ అందుకు అంగీకరించి ఆమె పక్కటెముకల నుంచి కొంత భాగం తీసి ముక్కును సరిచేశారు.
ఫొటో సోర్స్, ANTONIO OTTAVIANI
న్యాయం దక్కినా పరిహారం దక్కలేదు
తనకు జరిగిన నష్టంపై క్యాథరీన్ కోర్టును ఆశ్రయించారు. వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల ఆమెకు నష్టం కలిగినట్లు కోర్టు నిర్ధారించింది. అయితే, కేసు గెలిచినప్పటికీ పరిహారంగా రావాల్సిన లక్ష పౌండ్లలో(సుమారు రూ.97 లక్షలు) ఆమెకు 1 శాతమే దక్కింది.
డాక్టర్ ఆంటోనియో న్యాయస్థానంలో హాజరుకాలేదు. అయితే, ఇటలీలో ఉన్న ఆయన ఆస్తులను క్యాథరీన్ తీసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులిచ్చింది. కానీ, క్యాథరీన్‌కు అది సాధ్యం కాలేదు.
డాక్టర్ ఆంటోనియో చేసిన ఆపరేషన్లు విఫలమై ఆరుగురు మహిళలు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
మరో కేసులోనూ లక్ష పౌండ్ల పరిహారం చెల్లించాలంటూ ఆంటోనియోను కోర్టు ఆదేశించింది. కానీ, వారికీ ఏమీ దక్కలేదు.
6 వేల మందికి ఆపరేషన్లు చేస్తే ఆరుగురికి విఫలమవడం పెద్ద విషయం కాదన్న డాక్టర్ ఆంటోనియోతో బీబీసీ మాట్లాడగా, ''నన్ను మీరు ఇంటర్వ్యూ చేయడానికి కుదరదు. ట్రాన్స్‌ఫార్మ్ సంస్థ కోరినప్పుడంతా నేను అందుబాటులో ఉన్నాను. క్యాథరీన్ రోన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించి ఆమెకు శస్త్రచికిత్సలు చేశాను' అన్నారు.
మిగతా కొందరికి చేసిన శస్త్రచికిత్సలు విఫలం కావడంపై ఆయన మాట్లాడుతూ తాను 6 వేల మందికి శస్త్రచికిత్సలు చేస్తే అందులో ఆరుగురికి విఫలం కావడమనేది పెద్ద విషయం కాదన్నారు. ఇది యావరేజ్ కంటే చాలా తక్కువని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రోగులు వివరాలు గోప్యంగా ఉంచాలన్న నిబంధన ప్రకారం తాను వారి గురించి మాట్లాడలేనన్నారు.
తాను పరిహారంగా చెల్లించాల్సిన డబ్బు విషయం మాట్లాడడానికీ ఆయన నిరాకరించారు.
డాక్టర్ ఆంటోనియో ఇప్పటికీ లండన్‌లోని ఓ క్లినిక్‌కు వచ్చి ఆపరేషన్లు చేస్తున్నట్లు 'బీబీసీ డిస్‌క్లోజర్' పరిశీలనలో తేలింది.
ఫొటో సోర్స్, Getty Images
ఎందుకిలా?
కాస్మటిక్ సర్జరీలు చేయిస్తున్న ట్రాన్స్‌ఫార్మ్ సంస్థ విదేశీ వైద్యులను రప్పిస్తుండడంతో వారు ఆపరేషన్ చేసిన తరువాత తిరిగి తమ దేశానికి వెళ్లిపోతున్నారు. దీంతో రోగులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైనా వెంటనే సరిచేసే అవకాశం లేకుండా పోతోందని 'బీబీసీ డిస్‌క్లోజర్' పరిశీలనలో తేలింది. ఈ సంస్థలో ఏటా కొన్ని వేల మంది సర్జరీలు చేయించుకుంటున్నారు.
కాస్మటిక్ సర్జరీల విషయంలో నిబంధనలు బలహీనంగా ఉండడంతో బాధితులకు రక్షణ దొరకడం లేదని, తీవ్రంగా నష్టపోతున్నారని 'రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్' ప్రతినిధులు బీబీసీతో చెప్పారు.
ఇంగ్లండ్, స్కాట్లాండ్‌లో కాస్మటిక్ సర్జరీలు చేయాలంటే 'జనరల్ మెడికల్ కౌన్సిల్'లో వైద్యుడిగా నమోదు చేయించుకుంటే చాలు. అందులో నిపుణులుగా నిరూపించుకునేందుకు ఎలాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిన అవసరమే లేదు.
2013లో ఇలాంటి కాస్మటిక్ సర్జరీలకు సంబంధించి సమీక్ష జరిగి కొన్ని సిఫారసులు చేశారు. కానీ, అవేమీ అమలు కావడం లేదని నిపుణులు చెబుతున్నారు.
రోగులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్కాట్లాండ్ ప్రభుత్వాధికారులు బీబీసీతో చెప్పారు.
కాస్మటిక్ సర్జరీలు చేసేవారికి అర్హత, ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను తీసుకురావడంలో బ్రిటన్ ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు.
ఇవి కూడా చదవండి:
- ‘టార్జాన్’ భార్యను పొడిచి చంపిన కొడుకు.. అతడిని కాల్చిచంపిన పోలీసులు
- ‘’బాలుడిని దత్తత తీసుకుని.. బీమా సొమ్ము కోసం చంపించారు’’
- అర్థరాత్రి ఓ మహిళ ఇంటికి వెళ్ళి కాల్పులు జరిపిన పోలీసు అధికారిపై మర్డర్ కేసు
- భర్త, అత్తమామలు సహా ఆరుగురిని ‘విషమిచ్చి చంపిన ఆదర్శ కోడలు’
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)