హినా మునావర్: ఈ పాకిస్తాన్ మహిళ గురించి ఇప్పుడు చర్చ ఎందుకు?

  • 1 నవంబర్ 2019
హినా మునావర్: Image copyright HINA MUNAWAR

హినా మునావర్ పాకిస్తాన్‌లోని తీవ్రవాద ప్రభావిత స్వాత్ జిల్లాలో ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ కమాండింగ్ అధికారిగా నియమితులైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.

ఒక మహిళగా తనకు ఈ విధులు నిర్వహించడంలో ఎలాంటి కష్టాలూ కనిపించడం లేదని హినా మునావర్ చెప్పారు.

పంజాబ్ ప్రాంతంలోని ఫైసలాబాద్‌కు చెందిన హినా మునావర్ స్వాత్‌లోని ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో తనను నియమించడం గర్వంగా ఉందన్నారు. ఆ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసేందుకు తనకు అవకాశం వచ్చిందన్నారు.

పాకిస్తాన్‌లో సీఎస్ఎస్ పరీక్ష పాసై పోలీసు సేవలకు ఎంపికైన ఏడుగురు మహిళలను ఏడాదిపాటు ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో నియమించనున్నారు. వారిలో ఇద్దరిని ఖైబర్ పఖ్తూంఖ్వాలో, నలుగురిని ఇస్లామాబాద్‌లో, ఒకరిని గిల్గిత్‌లో నియమించారు.

ఈ మహిళలు ప్రధానంగా ఏఎస్పీ ర్యాంక్ వారు. అయితే, ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో వీరిని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లేదా కమాండింగ్ ఆఫీసర్ అంటారు.

ఎంఫిల్ పూర్తి చేసిన హినా తర్వాత సీఎస్ఎస్ పరీక్ష పాస్ అయ్యారు. పోలీసు సేవలకు ప్రాధాన్యం ఇచ్చారు. పాకిస్తాన్ పోలీస్ సేవల్లో (పీపీఎస్) ఆఫీసర్‌గా నియమితులయ్యారు.

జిల్లాలో పీపీఎస్‌కు నేతృత్వం వహించే తొలి మహిళా అధికారి తనే అయినందుకు సంతోషంగా ఉందని హినా చెప్పారు.

బీబీసీతో మాట్లాడిన హినా ఒక మహిళగా, తన విధుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని తనకు అనిపించడం లేదని, తన ఇష్టప్రకారం, సంతోషంగా పోలీసు సేవల్లోకి వచ్చానని చెప్పారు.

Image copyright HINA MUNAWAR

ఫ్రాంటియర్ కాన్‌స్టేబులరీలో మహిళలే లేరు

తన బాధ్యతలు పూర్తి చేయడంతోపాటు స్వాత్‌ ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలోని పనిచేసే సైనికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నానని హినా చెప్పారు.

భద్రతా చర్యలను మరింత మెరుగుపరచడం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తానన్నారు.

ఒక ప్రశ్నకు జవాబుగా "పాకిస్తాన్‌లో మిలిటెన్సీ ప్రభావం చాలా దారుణంగా ఉంది. స్వాత్‌లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంతో మెరుగుపడింది. ముందు ముందు ఇక్కడ మరింత అభివృద్ధి జరుగుతుంది" అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

పెళ్లైన హినాకు ఒక పాప కూడా ఉంది. తన వృత్తిపరమైన బాధ్యతలను చూసుకుంటూనే, ఇల్లు, కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుందని హినా చెప్పారు. ఎలాంటి ప్రభావం పడకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఒక సవాలు లాంటిదన్నారు.

"ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ ఒక సంప్రదాయ పోలీసు దళంగా ఉంది. గిరిజన ప్రాంతాలు, శరణార్థుల మధ్య ఉన్న సరిహద్దుపై నిఘా పెట్టడం వారి ప్రధాన విధి. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి" అని ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ రిటైర్డ్ అధికారి రహ్మత్ ఖాన్ వజీర్ బీబీసీకి చెప్పారు.

Image copyright HINA MUNAWAR

మిలిటెంట్ ఘటనలతో దారుణ ప్రభావం

ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీలో మహిళలు ఉన్నత పదవుల్లోకి రావడం వల్ల దాని పనితీరు మెరుగు పడుతుందని ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళలు రికార్డులు చూసుకోవడమే కాకుండా, ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ కార్యాలయం పనితీరును కూడా మెరుగుపరచగలరు అన్నారు.

"ఎఫ్‌సీలో ఇప్పటివరకూ మహిళా సిబ్బంది లేరు. కానీ ఇప్పుడు మహిళా అధికారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పోలీస్ డ్యూటీ కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో వారు కూడా చాలా కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది" అని చెప్పారు.

స్వాత్‌ సహా ఖైబర్ పంఖ్తూంఖ్వాలోని ఎక్కువ జిల్లాలపై గత కొంతకాలంగా మిలిటెంట్ ఘటనల ప్రభావం తీవ్రంగా ఉంది.

మిలిటెంట్లకు, సైనికులకు మధ్య పోరాటం జరిగినపుడు పౌరులు, ఇతర సైనిక సిబ్బంది, అధికారులు టార్గెట్ అవుతున్నారు. ఇప్పటివరకూ, నలుగురు ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ పోలీసు అధికారులు సహా మొత్తం 360 మంది సైనికులను లక్ష్యంగా చేసుకున్నారు.

1915లో బోర్డర్ మిలిటరీ పోలీస్, సమానా రైఫిల్స్‌ను కలిపేసి ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీని ఏర్పాటు చేశారు. ఈ దళాలు ఆంగ్లేయుల కాలం నుంచీ సరిహద్దులను కాపాడే విధుల్లో ఉన్నాయి.

ఫ్రంటియర్ కాన్‌స్టేబులరీ దళాలను ప్రధానంగా ఖైబర్ పంఖ్తుంఖ్వా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల రక్షణ కోసం ఏర్పాటు చేశారు. వీరిని పాకిస్తాన్‌లోని వివిధ భాగాల్లో మోహరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు