కశ్మీర్‌లో ఈయూ ఎంపీల పర్యటనపై స్థానికులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  • 29 అక్టోబర్ 2019
కశ్మీర్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందం మంగళవారం (అక్టోబర్ 29న) కశ్మీర్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో స్థానికుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్త బయటకు రాగానే కొందరు మసీదుల్లోని లౌడ్ స్పీకర్ల ద్వారా మంగళవారం ఉదయం అంగళ్లు నడవవని ప్రకటించారు. 'కశ్మీర్ పరిస్థితులను బయటి ప్రపంచానికి తప్పుగా చూపిస్తున్న తీరు'కు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కశ్మీర్‌లో పరిస్థితుల గురించి పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మోదీ ప్రభుత్వానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల పర్యటన ఉపయోగపడుతుంది.

కానీ, ఈ పర్యటన ద్వారా కశ్మీర్‌పై అమెరికన్లు, యూరోపియన్లు, ఐరాస సంస్థల దృష్టి పెట్టడం మరింత పెరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీకి చెందిన నేతలు కూడా ఈ పర్యటనపై అసంతృప్తితో ఉన్నారు.

Image copyright Getty Images

మరోవైపు ఈ పర్యటనతో తమకు సంబంధం లేదని యూరోపియన్ యూనియన్‌ ప్రకటించింది. ఎంపీలు కశ్మీర్‌లో వ్యక్తిగతంగానే పర్యటిస్తున్నారని స్పష్టం చేసింది.

కశ్మీర్ భారత్ అంతర్గత విషయమన్న వాదనలకు ఈ పర్యటన ద్వారా నష్టం కలుగుతుందని కొందరు విమర్శిస్తున్నారు.

అలాంటి పరిస్థితే ఉంటే, ప్రభుత్వ కనుసన్నల్లోనే సాగే ఈ పర్యటనను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని భారత్ అనుకునేది కాదని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్‌లోని న్యాయశాస్త్ర ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్ అన్నారు.

ఈయూ ఎంపీలు గతంలోనూ కశ్మీర్‌లో పర్యటించారు. అప్పుడు హింసాత్మక ఘటనల బాధితులను, అధికారులను వాళ్లు కలిశారు.

2004లో కశ్మీర్‌లో పర్యటించిన ఈయూ ప్రతినిధుల బృందం, ''కశ్మీర్ ఒక అందమైన కారాగారం'' అని వర్ణించింది.

2007లో ఈయూ ఎంపీ ఎమ్మా నికోల్సన్ కశ్మీర్‌లో మానవ హక్కుల పరిస్థితిని విమర్శిస్తూ నివేదికను రూపొందించారు. ఆ మరుసటి ఏడాది ఈయూ ఎంపీ రిచర్డ్ హోవిట్ కూడా కశ్మీర్‌లో వేర్పాటు వాదులు, రాజకీయ నాయకులను కలిశారు.

Image copyright twitter/SitaramYechury

కశ్మీర్‌లో పర్యటించేందుకు ప్రయత్నించిన భారత ఎంపీలను శ్రీనగర్ విమానాశ్రయంలోనే అడ్డుకుని ప్రభుత్వం తిప్పి పంపింది.

కశ్మీర్‌కు చెందిన ఎంపీ గులాం నబీ ఆజాద్ ఇక్కడికి వచ్చేందుకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పైగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న షరతుపైనే ఆయన్ను కశ్మీర్‌లోకి అనుమతించారు. కశ్మీర్‌లో తన బంధువులందరినీ కలవలేకపోయానని గులాం నబీ ఆజాద్ అన్నారు.

యశ్వంత్ సిన్హా, సీతారాం ఏచూరి, రాహుల్ గాంధీ వంటి నాయకులకు కశ్మీర్‌లో పర్యటించేందుకు ప్రయత్నించి, విఫలమయ్యారు.

భారత ప్రభుత్వం సొంత ఎంపీలను అడ్డుకుని, ఈయూ ఎంపీలను ఆహ్వానించడం విడ్డూరంగా ఉందని ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాజీ వైస్ ఛాన్సెలర్ సాదిక్ వాహిద్ అన్నారు.

ఈయూ ఎంపీలను ఆహ్వానించడం 'ఇబ్బందులను కొని తెచ్చుకోవడమే' అని మానవహక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్ అభిప్రాయపడ్డారు.

''దిల్లీలోని ఈయూ దేశాల దౌత్య కార్యాలయాలు రెండున్నర నెలలుగా కశ్మీర్‌లో పర్యటన కోసం అనుమతి కోరుతున్నాయి. బయటివారి జోక్యం అనవసరమని భారత్ నిరాకరిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈయూలోని తన మిత్రులను మోదీ ఆహ్వానించారు. అమెరికన్లు, ఐరాస, మిగతా యూరోపియన్ దేశాలు కశ్మీర్‌లో స్వేచ్ఛగా పర్యటించాలనుకుంటే ఇప్పుడు ఎలా ఆపుతారు?'' అని ఖుర్రం బీబీసీతో అన్నారు.

28 మందితో కూడిన ఈయూ ఎంపీల బృందం శ్రీనగర్‌లోని భారత సైన్యం 15-కోర్ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సైనికాధికారులతో సమావేశమవుతోంది.

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనల కారణంగా ఏర్పడుతున్న భద్రతా సమస్యల గురించి అధికారులు ఈ బృందానికి వివరిస్తారు.

''మిలిటెంట్లకు పాకిస్తాన్ అందిస్తున్న సాయం, స్థానిక ప్రజలను రెచ్చగొడుతున్న తీరు, కశ్మీర్‌ షట్‌డౌన్ కోసం ఆ దేశం చేస్తున్న కృషిని వాళ్లకు వివరిస్తాం’’ అని గవర్నర్ కార్యాలయంలోని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Image copyright Getty Images

కశ్మీర్‌లో ప్రస్తుతం 10, 12 తరగతుల పరీక్షలు సాగుతున్నాయి. 90 వేల మంది విద్యార్థులు మంగళవారం నుంచి ఈ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి 12.30కి మార్చినట్లు సోమవారమే ప్రకటించారు.

రోడ్ల మీద ట్రాఫిక్ కనిపించేందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొంత మంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

కశ్మీర్‌లో ఆగస్టు 5 నుంచి కార్యకలాపాలు స్తంభించిపోయాయి. రోజూ ఉదయం కొన్ని గంటలపాటు మాత్రమే వ్యాపారాలు నడుస్తున్నాయి. మంగళవారం అవి కూడా నడవలేదు.

అక్టోబర్ 31న జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారబోతోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)