బగ్దాదీ హతమయ్యాడు... ఇప్పుడు ఐఎస్ పరిస్థితి ఏంటి?

  • 30 అక్టోబర్ 2019
Image copyright AFP

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అత్యంత హింసాత్మక జిహాదీ గ్రూప్. కొద్దిమంది తిరుగుబాటుదారుల ముఠాగా మొదలై 'అబూ బకర్ అల్ బగ్దాదీ' నేతృత్వంలో ప్రపంచంలోనే అతి భయానక ఉగ్రవాద సంస్థగా మారింది.

ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్ని ఖండాలకూ విస్తరించింది. ఇప్పుడా సంస్థ ప్రధాన నాయకుడు బగ్దాదీ హతమయ్యాడు. ఇంతటితో ఐఎస్ అంతమైనట్లేనా? లేక ఇంకేదైనా రూపమెత్తుతుందా? ఏం జరగబోతోంది?

ఐఎస్ వారసత్వానికి సంబంధించి ఇలాంటి రోజొకటి వస్తుందని ఐఎస్ నాయకత్వం అంచనా వేసి అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించుకుని ఉండవచ్చు.

బగ్దాదీ వంటి నేతను కోల్పోయినంత మాత్రాన ఐఎస్ నిలకడకు నష్టం రాదని, యథాపూర్వస్థితికి రాగలదన్న సంకేతాలను ఆ సంస్థ తన అనుచరులకు పంపాలనుకుంటోంది.

ఐఎస్‌లోని సీనియర్లతో ఉన్న షురా కమిటీ దృష్టిలో ఐఎస్ చీఫ్ స్థానం కోసం ఇప్పటికే కొందరు ఉండొచ్చు.

Image copyright Reuters

ఐఎస్‌ పట్ల అణుమాత్రం కూడా సందేహం లేని వీర విధేయత, వ్యూహాత్మక ప్రణాళికలు రచించడంలో తిరుగులేని సామర్థ్యం, మతాచారాలు పాటించడంలో నిబద్ధత, కొంత యుద్ధానుభవం, కఠిన శిక్షలు అమలుచేసిన చరిత్ర వంటివన్నీ ఈ స్థానానికి ప్రాథమిక అర్హతలు.

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సైన్యం, ఆయన నిఘా వ్యవస్థల్లో కీలకంగా వ్యవహరించిన బాతిస్ట్స్ అనే అతి ఛాందసవాదులతో ఏర్పడిన ముఠాయే ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్).

ఈ బాతిస్ట్‌లు ఐఎస్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిఘా తెలివితేటలు, పదునైన వ్యూహ రచనా సామర్థ్యం వంటివన్నీ అందించారు. ఇరాక్ గురించి వీరి కంటే బాగా తెలిసినవారు ఉండరు. ఇక జిహాదిస్టులు మతోన్మాదాన్ని, స్వచ్ఛంద ఆత్మాహుతి దళాలను ఐఎస్‌కు తీసుకొచ్చారు.

ఈ రెండు వర్గాలతోనూ మంచి సంబంధాలున్న వ్యక్తికే బగ్దాది వారసత్వం దక్కుతుంది.

Image copyright Getty Images

బగ్దాది రెండుసార్లు మాత్రమే వీడియోల్లో కనిపించినప్పటికీ తనను తాను ఒక మత పెద్దలా చూపించుకోగలిగారు.

బగ్దాదీ మృతి వల్ల కలిగిన లోటు కచ్చితంగా కొంతకాలం పాటు ఐఎస్‌‌ను వెంటాడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉండే జిహాదీలు బగ్దాదీని 'కాలిఫ్ ఇబ్రహిం'గా కొలుస్తూ అతని పేరిట ప్రతిజ్ఞ చేసి విధేయత చాటుకుంటారు.

ఐఎస్ వీడియోల్లో బగ్దాదీ రెండు సార్లు మాత్రమే కనిపించినప్పటికీ ఇస్లాం మతానికి పెద్దదిక్కుగా తనను తాను ఆవిష్కరించుకునేలా చేసుకోగలిగారు.

మహమ్మద్ ప్రవక్త ఖురైషి తెగ ప్రత్యక్ష సంతతికి చెందినవాడిగా బగ్దాది తనను తాను అభివర్ణించుకున్నారు.

మోసుల్‌లోని విఖ్యాత మసీదు నుంచి ఆయన ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ప్రకటించారు. అనంతరం దాన్ని పేల్చివేయాలని ఆదేశించడం వేరే విషయం.

బగ్దాదీ ఒక సీరియల్ రేపిస్ట్. ఐఎస్‌ బందీగా పట్టుకున్న అమెరికాకు చెందిన మానవహక్కుల కార్యకర్త కైలా ముల్లర్, యాజిది మహిళలు, బాలికలను సెక్స్ బానిసలుగా మార్చాడు. ఐఎస్‌లోని తన అనుచరులు ఎవరినీ సెక్స్ కోసం వాడుకున్నట్లుగా లేదు.

ప్రతీకార దాడులు

బగ్దాదీ మరణం తరువాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే ఐఎస్ ఇరాక్, సిరియాల్లో దాడులకు పాల్పడే సూచనలున్నాయి.

ఐఎస్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఆత్మాహుతి దళాలు సులభంగా అందుబాటులో ఉన్నది అక్కడే కాబట్టి దాడులకు ఈ దేశాలనే ఎంచుకునే అవకాశముంది.

ఐఎస్ తన చిట్టచివరి భూభాగం బాఘుజ్(సిరియాలో ఉంది)ను కోల్పోయిన తరువాత కూడా దాడులను కొనసాగించేందుకు ప్రతిన పూనింది.

ఐరోపా, అమెరికా, ఉత్తర ఆఫ్రికా, గల్ఫ్, ఆసియా దేశాలూ ఐఎస్ లక్ష్యాల్లో ఉన్నాయి.

బగ్దాదీ హతమైన నేపథ్యంలో ఫ్రాన్స్ తన పౌరులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఫ్రాన్స్ చాలాకాలంగా ఐఎస్ లక్ష్యంగా ఉండడంతో ఆ దేశం ముందుజాగ్రత్తగా తన ప్రజలను హెచ్చరించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బగ్దాదీ అంతమైంది ఇక్కడే

మనుగడ, పునర్నిర్మాణం

ఎన్నిసార్లు దెబ్బతిన్నా మళ్లీ కోలుకునే విషయంలో ఐఎస్ ట్రాక్ రికార్డ్ బలంగా ఉంది.

బగ్దాదీ మార్గదర్శకత్వం, అమెరికా నిర్బంధ శిబిరాల్లోని జిహాదిస్టులతో ఆయన ఏర్పరుచుకున్న సంబంధాల సహాయంతో ఐఎస్ అల్ ఖైదా అవశేషాల నుంచి బలపడుతూ వచ్చింది.

2016లో అల్ ఖైదా నుంచి విడిపోయిన ఐఎస్ అనంతరం మరింత బలపడుతూ వచ్చింది.

ఐఎస్ అనుసరించే పైశాచిక హింసాత్మక విధానాలు వంటి అంశాల విషయంలో అల్ ఖైదా విభేదించడంతో ఐఎస్ బయటకొచ్చింది.

ముస్లింలలో అధిక సంఖ్యాకుల అభిప్రాయాలకు అల్ ఖైదా విలువనిచ్చేది. ఐఎస్ వాటన్నిటినీ తోసిరాజంటూ పైశాచికత్వాన్ని ప్రదర్శించింది.

జిహాదీ పోరాటానికి నప్పనివారు, మానసిక రోగులు, చిన్నారులతో లైంగిక వాంఛలు తీర్చుకునే పైశాచిక కాముకులు.. ఐఎస్ పాల్పడే హింసాత్మక చర్యలను చూసి ఆకర్షితులైనవారు.. ఇలా ఎవరిని పడితే వారిని నియమించుకుంది ఐఎస్.

ఐఎస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. సిరియాలో ఐఎస్‌ను అంతం చేయడం, బగ్దాదీని హతమార్చడంతో ఆ నెట్‌వర్కేమీ ఒక్క రాత్రిలో అంతం కాదు.

తనకు బాగా పట్టున్న ఇరాక్, సిరియాలోనే కాకుండా అఫ్గానిస్తాన్, లిబియా, పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ ఆసియా, ఫిలిప్పీన్స్, ఆగ్నేయ ఆసియాలోనూ ఐఎస్‌కు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)