ఐఎస్ చీఫ్ బగ్దాదీ అండర్‌వేర్‌‌ను ఆ గూఢచారి ఎందుకు దొంగిలించారు?

అబూ బకర్ అల్ బగ్దాదీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

అబూ బకర్ అల్ బగ్దాదీ

ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ అమెరికా సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో చనిపోయారు.

చనిపోయింది బగ్దాదీయే అని డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

అయితే, బగ్దాదీ డీఎన్‌ఏ శాంపిల్స్ అమెరికాకు ఎలా చేరాయి?

బగ్దాదీ అండర్‌వేర్‌ను తమ గూఢచారి దొంగిలించి తీసుకువచ్చారని, దాని ద్వారానే ఇప్పుడు మృతి చెందింది బగ్దాదీ అని తేల్చగలిగారని కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎసీడీఎఫ్) చెబుతోంది.

బగ్దాదీ ఉన్న చోటును గుర్తించడంలోనూ తమ గూఢచారి ముఖ్య పాత్ర పోషించినట్లు ఎస్‌డీఎఫ్ కమాండర్ పోలట్ క్యాన్ చెప్పారు.

అమెరికా ఆపరేషన్ సమయంలో బగ్దాదీ తనను తాను పేల్చివేసుకున్నారు.

ఈ ఆపరేషన్‌లో కుర్దు దళాల పాత్రను ట్రంప్ తక్కువ చేసి చూపారు.

బగ్దాదీ మరణం విషయం గురించి ప్రకటిస్తూ.. కుర్దులు 'ఉపయోగకరమైన' సమాచారం ఇచ్చారని, 'సైనికపరంగా అసలు వారి పాత్రేమీ' లేదని ట్రంప్ అన్నారు.

క్యాన్ మాత్రం ఎస్‌డీఎఫ్ ఈ ఆపరేషన్‌లో ముఖ్యమైన పాత్ర పోషించిందని ట్విటర్‌ వేదికపై చెప్పారు.

''అల్-బగ్దాదీ ఉన్న చోటును గుర్తించడం, ఆయన్ను చేరుకోవడం అంతా మా కృషే. బగ్దాదీ ఉన్న ప్రాంతం కోఆర్డినేట్స్‌ను మా గూఢచారే పంపారు. హెలికాప్టర్ నుంచి దిగే దళాలకు సూచనలు ఇచ్చారు. చివరి నిమిషం దాకా ఆపరేషన్‌లో పాల్గొని విజయవంతం చేశారు'' అని వివరించారు.

బగ్దాదీ జాడ గుర్తించేందుకు మే 15 నుంచి అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏతో కలిసి ఎస్‌డీఎఫ్ పనిచేస్తూ వచ్చిందని పోలట్ చెప్పారు.

ఇడ్లిబ్ ప్రావిన్సులో బగ్దాదీ దాక్కున్నట్లు తమ గూఢచారి గుర్తించారని, జారాబ్లస్‌ అనే కొత్త ప్రాంతానికి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు కనిపెట్టి చెప్పారని పోలట్ వివరించారు.

ఇస్లామిక్ స్టేట్‌తో పోరాటంలో అమెరికాకు ఎస్‌డీఎఫ్ కీలక మిత్రపక్షంగా ఉంటూ వచ్చింది.

అయితే అక్టోబర్ మొదట్లో ఉత్తర సిరియా నుంచి ట్రంప్ తమ సేనలను ఉపసంహరించుకున్నారు.

సీమాంతర దాడులకు టర్కీకి వీలు కల్పించేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఆపరేషన్ ఎలా సాగిందంటే..

ఈ ఆపరేషన్ గురించి మిత్రపక్షాలు, ప్రధాన ప్రాంతీయ శక్తులకు అమెరికా ముందస్తుగానే సమాచారం ఇచ్చింది.

ఇరాక్, టర్కీ, రష్యా, ఈశాన్య సిరియాలోని కుర్దు దళాలకు ఈ సమాచారం చేరింది.

అమెరికా కమాండోలు ఎనిమిది హెలికాప్టర్లలో ఇరాక్‌ నుంచి బయలుదేరారు. గంట 10 నిమిషాలు ప్రయాణించి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 1 గంటకు లక్ష్యాన్ని చేరుకున్నారు.

లక్ష్యాన్ని చేరుకోవాలంటే టర్కీ, సిరియా, రష్యా మిలిటరీ అధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి హెలికాప్టర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

ఈ ఆపరేషన్ సమయంలోనే యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను సైతం సిద్ధం చేశారు.

హెలికాప్టర్లను చూడగానే బగ్దాదీ అనుచరులు కాల్పులు జరిపారు. అమెరికా స్పెషల్ ఫోర్స్ వాటిని తిప్పి కొట్టింది.

హెలికాప్టర్లు రెండు ఇళ్లపై మిస్సైల్స్‌ ప్రయోగించాయి. ఫైరింగ్ 30 నిమిషాల పాటు కొనసాగింది. స్థానికులు కూడా బీబీసీకి ఇదే విషయం చెప్పారు.

హెలికాప్టర్లు ల్యాండైన మరుక్షణం లొంగిపోవాలని అమెరికా సేనలు బగ్దాదీని కోరాయి. ఇద్దరు యువకులు, 11 మంది చిన్నారులు లొంగిపోయారు. కానీ బగ్దాదీ మాత్రం ఇంటి లోపలే ఉండిపోయారు.

దాంతో బగ్దాదీ కంపౌండ్ ప్రహారీ, ఇంటి గోడలను పేల్చేసి సైనికులు లోపలికి ప్రవేశించారు. మెయిన్ డోర్‌ ద్వారా వెళ్తే బగ్దాదీ వలలో పడే అవకాశం ఉండటంతో, ఇలా చేశారు.

తన ముగ్గురు పిల్లలను తీసుకుని బగ్దాదీ ఒక సొరంగంలోకి పారిపోయారు. అమెరికా ఆర్మీ డాగ్స్ ఆయన్ను వెంబడించాయి. సొరంగం చివరికి చేరుకోగానే డాగ్స్‌ ఆయనపైకి దూకేశాయి.

కిందపడిన బగ్దాదీ తాను వేసుకున్న ఆత్మాహుతి కోటును పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ట్రంప్ వెల్లడించారు. పేలుడులో బగ్దాదీ శరీరం ముక్కలు ముక్కలైపోయింది.

డీఎన్ఏ పరీక్షల ద్వారా చనిపోయింది బగ్దాదీయే అని తేలిందని ట్రంప్ చెప్పారు. బగ్దాదీతో పాటు ఆయన ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు. బగ్దాదీ ఇద్దరు భార్యలు మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images

సిచ్యువేషన్ రూంలో కూర్చుని ట్రంప్ ఈ ఆపరేషన్‌ను వీక్షించారు.

ఈ ఆపరేషన్ మొత్తం సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. అయితే, దాడి చేపట్టిన 15 నిమిషాల్లోనే బగ్దాదీ చనిపోయారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.

"ఒక క్రూర హంతకుడు, ఎన్నో మరణాలకు కారణమైన వ్యక్తి అంతమయ్యారు. కుక్కచావు చచ్చారు. ఒక పిరికివాడిలా చనిపోయారు" అని ట్రంప్ అన్నారు.

కమాండోలతోపాటు వెళ్లిన నిపుణులు ఘటనా స్థలంలోనే బగ్దాదీ శరీరానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారని, ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను కూడా ఉపయోగించి ఆయన్ను గుర్తించారని డైలీ బీస్ట్ కథనం రాసింది.

బగ్దాదీ శరీర భాగాలు కొన్నింటినీ కూడా నిపుణులు హెలికాప్టర్లలో తమతోపాటు తీసుకువచ్చారు.

బగ్దాదీ శరీర అవశేషాలకు 'సముచిత రీతిలో' అమెరికా అధికారులు అంత్యక్రియలు చేసినట్లు ఆ దేశ సైన్యం సోమవారం ప్రకటించింది.

ఇస్లామిక్ సంప్రదాయాలకు అనుగుణంగా సముద్రంలో బగ్దాదీ అంత్యక్రియలు జరిగాయని ఓ అధికారి వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాదెన్‌ను 2011లో పాకిస్తాన్‌లో అంతమొందించిన తర్వాత కూడా అమెరికా ఇలాగే అంత్యక్రియలు నిర్వహించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)